ఆశ్చర్యంగా చూస్తూ విజిలేశాడు జి.కె.
"ఒక్క ఎయిర్ టిక్కెట్టుకి పదివేలా? ఓకే! నాదేం పోతుంది! నాక్కావలసింది డబ్బు! అది ఢిల్లీ వెళ్ళకుండానే వస్తుందంటే మరీ సంతోషం! టైము కలిసొస్తుంది" అన్నాడు.
డబ్బూ, టిక్కెట్టు చేతులు మారాయి.
అప్పుడు జి.కే.కి తెలియదు, తను అతి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటమే కాకుండా తనకు పదివేలు దక్షిణలాగా కూడా దక్కింది.
ఆ ఫ్లయిట్ లో వెళ్ళడానికి రాజేందర్ టిక్కెట్ ని దౌర్జన్యంగా స్వంతం చేసుకున్న పొలిటీషియన్ రావుగారికి కూడా తెలియదు, తను చావుని కొనితెచ్చుకుంటున్నానని.
అలా ఒకరి అదృష్టాలు మరొకరికి బదిలీ అయ్యాయి.
ఎయిర్ టిక్కెట్టుని ఆప్యాయంగా జేబులో పెట్టుకుని, బయటికి వచ్చి టాక్సీ ఎక్కాడు రాజేందర్.
"ఎయిర్ పోర్ట్!" అన్నాడు అర్జెంటుగా.
అప్పటికి ఏడు ముప్పావు అయింది.
ఇంకో అరగంటలో బయలుదేరుతుంది విమానం.
* * * *
బ్యాంకు నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు రెడ్డి. హుషారుగా ఉన్నాడతను. తన కర్తవ్యం త్రికరణశుద్ధిగా నిర్వర్తించగలిగినప్పుడు కలిగే సంతృప్తీ, సంతోషం అతనికి కలిగాయి.
నేరం చేసినవాడెవడో కనిపెట్టాడమే కష్టం! కనిపెట్టాక వాణ్ణి పట్టుకోవడం సులభమే!
సీట్లో కూర్చుని, ఫాన్ గాలికి కొంత సేద దీరాక, టెలిఫోన్ రింగ్ చేయడానికి చెయ్యి ముందుకు చాపాడు.
ఆలోగా రింగ్ అయింది ఫోన్. రిసీవర్ ఎత్తి "హలో!" అన్నాడు రెడ్డి.
"నేను మినిస్టర్ గారి పి.ఎ.ని." అన్నాడు లైన్లో అవతల ఉన్న వ్యక్తి. "నేను దేవదూతని" అన్నట్లు ధ్వనించే గొంతుతో.
"గుడ్ ఆఫ్టర్ నూన్! చెప్పండి!"
"రావుగారి కొడుకుని లాకప్ లో పెట్టారట?"
నుదురు చిట్లించాడు రెడ్డి "ఎవరూ?"
వివరాలు చెప్పాడు పి.ఎ.
"ఆ బద్మాష్ గాడా!" అన్నాడు రెడ్డి తేలిగ్గా "వాడు తెల్లవారుఝామున ఒక అమ్మాయితో మోటుగా ప్రవర్తించాడు."
"అయితే?" అన్నాడు పి.ఎ. చిరాగ్గా. "అతను రావుగారి కొడుకు. రావుగారికి మా మినిష్టరుగారి దగ్గర ఉన్న ఇన్ ఫ్లుయన్సు నీకు తెలియదు. ఆయన చేతిలో పదివేల ఓట్లు ఉన్నాయ్."
"అయితే?" అన్నాడు రెడ్డి తొణక్కుండా. "వాడు రౌడీలా ప్రవర్తించాడు. వాడు ఎవడైనా సరే, ఐ జస్ డోంట్ కేర్? చార్జీషీటు ఫైలయిపోతోంది."
"ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలిసే మాట్లాడుతున్నావా?"
రెడ్డి సమాధానం చెప్పకుండా రిసీవర్ ని క్రేడిల్ మీద ఉంచేశాడు.
కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయి మళ్ళీ ఫోన్ వైపు చెయ్యి జాపాడు. బ్యాంకు రాబరీ చేసిన శతృఘ్నని గాలించడానికి ప్రయత్నాలు మొదలెడుతూ.
మళ్ళీ రింగ్ అయింది ఫోన్. ఈసారి అది రెడ్డిపై ఆఫీసర్ దగ్గర నుంచి.
రెడ్డి 'హలో' అని గూడా అనకముందే మెషిన్ గన్ పేలుతున్నట్లు ఠపఠప వినబడటం మొదలెట్టాయి తిట్లు. "అరే రెడ్డీ! రెడ్డికే బచ్చే! మినిష్టర్ సాబ్ మనిషిని బొక్కలో తోసినవ్ రా బేవకూఫ్! అరే ఉల్లూకే పఠ్ఠే! వదుల్రా వాడిని!"
ఆయన తెలుగువాడే. అయినా ఆయన తెలుగులో ఉర్దూనే ఎక్కువ వినబడుతుంది. చాలా యాసగా మాట్లాడతాడు.
బాస్ నోటివెంట బూతులు వస్తున్నా సహనంగా విన్నాడు రెడ్డి. ఆయన మోటుగా మాట్లాడుతాడు గానీ, తనంటే చాలా అభిమానం అని తెలుసు రెడ్డికి.
బాస్ అవినీతితో అడ్జస్ట్ అయిపోగలడు, తను కాలేడు. అందుకనే అడుగడుగునా అడ్డంకులు తనకి.
"అరే మార్నింగ్ షోకే ఔలాద్! వాణ్ణి వొదిలెయ్ బే హౌలే."
"సారీ సర్!"
"సారీనా? ఈసారి నిన్ను దేముడు కూడా బచాయించలేడురా! ఫౌరన్ ఛార్జ్ హాండ్ ఓవర్ చేసి రేప్రొద్దుగాలకల్లా కొత్త ప్లేస్ లో జాయిన్ కానీకి తయారుగుండు! ఆర్డర్ వస్తది పది నిమిషాల్లో!"
కొద్ది క్షణాలపాటు మౌనంగా ఉండిపోయాడు రెడ్డి "చాలా అర్జెంట్ కేస్ డీల్ చేస్తున్నా బాస్! బ్యాంక్ రాబరీ..."
"తేరీ బ్యాంక్ రాబరీకి గోలీమారో!" అన్నాడు బాస్ కోపంగా. "అరే గవార్ కే బచ్చే! డ్యూటీ డ్యూటీ అంటూ ఎందుకు సస్తావ్ రా? ఆ కొత్త ఊళ్లోనన్నా బతకడం నేర్చుకోనీకి ఖోషిష్ చెయ్యరా! ఎల్లు!"
"సోలాంగ్ బాస్! థాంక్స్ ఫర్ ఎవ్విరిథింగ్!" అన్నాడు రెడ్డి. ఇదివరకు ఎన్నోసార్లు తను ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటే, బాస్ అండగా నిలబడి తనని సేవ్ చెయ్యడం గుర్తొచ్చింది. ఈసారి ట్రాన్స్ ఫర్ ఆపడం ఈయన తరం కూడా కాలేదన్న మాట!
సో దటీస్ దట్!