Previous Page Next Page 
హైజాక్ పేజి 10

"నా లెక్క ఉండే మనిషెవ్వరూ అక్కడ నీకు దొరకర్రా!" ఎల్లరా!" అన్నాడు బాస్ కోపంగా అని కాసేపు ఆగి, "ఎల్లు బిడ్డా!" అని ఆర్ద్రంగా అన్నాడు. మళ్ళీ ఆయన గొంతు అతి సన్నగా కంపిస్తున్నట్లు అనిపించింది రెడ్డికి. రిసీవర్ పెట్టేశాడు.
తర్వాత, తను బ్యాంకు దోపిడీ కేసులో సేకరించిన వివరాలన్నీ నోట్ రాసి, సంతకం పెట్టి, లేచి నిలబడ్డాడు.
ఇంటికి రాగానే అతని భార్య ఆదుర్దాగా అడిగింది "ఏమిటలా ఉన్నారు?"
నిస్పృహగా నవ్వాడు రెడ్డి "ట్రాన్స్ ఫర్!"
వెంటనే అతనిమీద విరుచుకు పడింది ఆమె.
"ఇది మనకు మామూలేగా! పోలీసాఫీసర్లందరికీ వచ్చే మామూళ్ళు వేరు! మనకి వచ్చే మామూళ్ళు ఇవి! రోజులనిబట్టి మనమూ పోవాలిగాని...ఛీ ఛీ! తెలివితేటలు ఉండి ఏం లాభం - లోకజ్ఞానం లేకపోయాక!" అంది.
రెడ్డి శతృఘ్నని అరెస్టు చేసే అవకాశం అలా చెయ్యిజారిపోయింది.
అప్పుడు మొదలయింది అసలు కథ!

                                                        *    *    *    *

రాత్రి ఎనిమిది గంటలవుతోంది.
ఢిల్లీ వెళ్ళే ఎయిర్ బస్ విమానం ఎయిర్ పోర్ట్ టెర్మినల్ బిల్డింగుకి ఎదురుగా 'బే'లో నిలబడి ఉంది. రెండు గంటల పది నిమిషాల ప్రయాణం తరువాత అది ఢిల్లీ చేరుకోవాలి - షెడ్యూలు టైం ప్రకారం.
ప్లేన్ బయలుదేరడానికి గంట ముందు నుంచి ఎయిర్ పోర్టులో వివిధ శాఖలు యాక్టివేట్ అయి, చకచక పనులు మొదలెట్టేస్తాయి. ప్రయాణం భోజనాల సమయంలో అయితే విమానంలోనే డిన్నర్ సర్వ్ చేస్తారు. లేకపోతే స్నాక్స్, బిస్కెట్సూ, వేఫర్సూ, శాండ్ విచెస్, కాఫీ, టీలు సర్వ్ చేస్తారు.
కేటరింగు డిపార్టుమెంట్ వాళ్ళు ప్లాస్టిక్ ట్రేలలో ఆహారపదార్థాలు సర్ది షెల్ఫులలాంటి వాటిలో పేరుస్తున్నారు. ఆ షెల్ఫులకి కింద చక్రాలు ఉంటాయి.
ఆ ఆహార పదార్థాల చేత ఆకర్షింపబడిన పక్షులు రెండు, బొమ్మ విమానాలలాగా ఆకాశంలో అక్కడక్కడే వృత్తాకారంలో చక్కర్లు కొడుతున్నాయి.
కొద్దిదూరంలో కేటరింగు వాన్ నిలబడి ఉంది. షెల్ఫులు ఉన్న చోటినుంచి వాన్ దాకా ఏటవాలుగా ఇనప వంతెన లాంటిది ఉంది. షెల్ఫులని దాని మీదనుంచి తోసుకుంటూ తీసుకెళ్ళి వాన్ లోకి ఎక్కించారు. వాన్ కదిలి నెమ్మదిగా ఎయిర్ బస్ కి కుడివైపున ఆగింది. విమానంలో ఒక డోరు తెరుచుకుంది. కేటరింగ్ వాను చక్రాలు పైభాగాన ఉన్న లిఫ్టు వ్యాను కేబిన్ ని మొత్తం ఎత్తి ఆ తలుపు లెవెలులో నిలిపింది. డిన్నర్లు ఉన్న షెల్ఫులని వానులోనుంచి తోసుకుంటూ విమానంలోకి తీసుకెళ్ళారు.
విమానం రెండు అంతస్థులుగా ఉంటుందని చెప్పొచ్చు. కిందభాగంలో లగేజ్ పెడతారు. ఆపైన పాస్నేజర్ల కేబిను. విమానం ముక్కు దగ్గర పైలట్లు కూర్చునే కాక్ పిట్ ఉంటుంది.
తమ టిక్కెట్లు కౌంటర్లో ఇచ్చారు శతృఘ్న, ఇక్బాల్, విక్టర్. వాటిని తీసుకుని సీటు నెంబర్లు ఉన్న బోర్డింగ్ పాసెస్ ఇచ్చాడు కౌంటర్లో కూర్చున్న అతను. మరొకతను వాళ్ళ సామాన్లని తూకంవేసి, లగేజ్ టోకెన్ ఇచ్చాడు. (విమానంలో మనిషికి ఇరవైకిలోల బరువును మించిన సామాను తీసుకెళితే, ఎక్స్ ట్రా ఛార్జ్ చెల్లింపవలసి వస్తుంది.)
సూట్ కేసులని ఒక కన్వేయర్ బెల్టుమీదికి ఎక్కించారు. బెల్టు జరుగుతూ ఉంటే సామాన్లు లగేజ్ వాన్ దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ వాటిని తెల్లటి, పెద్ద మెటల్ బాక్సులలో సర్దారు. ఆ బాక్సులు ఒక ట్రక్కులాంటి దానిమీదికి ఎక్కించబడ్డాయి. ఆ ట్రక్కు కూడా లిప్టులాంటిదే. అది లగేజ్ బాక్సులని తీసుకెళ్ళి విమానం లెవెలుకి ఎత్తింది. విమానం తలుపు తెరిచి, లగేజ్ వున్న బాక్సులని లోపలికి తోశారు. ఒక ప్రీమియర్ పద్మిని కారుని తీసుకొచ్చి విమానంలో ఎక్కించింది మరో ట్రక్కు.
(కార్లని కూడా విమానంలో రవాణా చెయ్యవచ్చు. దాదాపు నూటముప్ఫయ్ టన్నుల బరువుని తీసుకెళ్ళగలదు ఎయిర్ బస్ విమానం.)
సెక్యూరిటీ చెక్ లోకి నడిచారు ముగ్గురూ. రూల్సు ప్రకారం, విమానంలో ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా చెక్ చెయ్యాలి.
మొగ పాసెంజర్లని ఒక మొగ పోలీసూ, ఆడ పాసెంజర్లని ఒక ఆడ పోలీసూ చెక్ చేస్తున్నారు.
ఊపిరి బిగపట్టాడు శతృఘ్న.
ఇదే విషమ పరీక్ష తనకు? ఈ ఒక్క అడ్డంకీ దాటితే....
ప్రయాణీకులు చిన్న బ్రీఫ్ కేసులాంటి హాండ్ లగేజ్ ని తమతో బాటే ఉంచుకోవచ్చు.
శతృఘ్న చేతిలో ఉన్న హాండ్ బ్యాగుని అందుకుని మెటల్ డిటెక్టర్ లో పెట్టాడు ఒకతను. బ్యాగుని ఓపెన్ చెయ్యకుండానే, లోపలి వస్తువులు కనబడుతాయి అందులో.
హ్యాండ్ బ్యాగు మెటల్ డిటెక్టర్ ని దాటి రాగానే, దానికి తగిలించి వున్న గుండ్రటి కార్డుమీద "చెక్ డ్" అని స్టాంప్ వేశారు.
ఈలోగా, శతృఘ్నని భుజాల దగ్గరనుంచి హిప్స్ దాకా యాంత్రికంగా తడిమి చూశాడు పోలీసు.
ఆ స్క్రీన్ లోంచి లాంజ్ లోకి వచ్చి, తన హాండ్ బ్యాగు అందుకుని, దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు శతృఘ్న.
అతను సాక్సులో జొనిపి, రబ్బరు బాండుతో కాలికి బిగించుకున్న రివాల్వర్ ని సెక్యూరిటీ అధికారులు కనిపెట్టలేదు.
ఇప్పుడింక అడ్వెంచరు మొదలవుతుంది. ఎంత థ్రిల్లు!
ఇక్బాల్ 'విక్టర్' వివేకానంద్ కూడా సెక్యూరిటీ చెక్ లోనుంచి లాంజ్ లోకి వచ్చారు.

 Previous Page Next Page