Previous Page Next Page 
హైజాక్ పేజి 8

"చిన్నపని పడింది భాయ్! ఢిల్లీకి ఒక ఎయిర్ టిక్కెట్ కావాలి"
"జరూర్ సాబ్! ఏ రోజుకి?"
"ఇవాళే! సాయంత్రం ఫ్లయిట్ కి!"
"ఈ రోజు ఫ్లయిట్ కా!" అన్నాడు దావూద్ ఆశ్చర్యంగా.
"అవును! అత్యవసరం"
"మీరే వెళ్తుండ్రా?"
"కాదు! మాకు తెలిసిన ఒకామె వెళుతున్నారు."
కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు దావూద్. ఇబ్బందికరమైన నిశ్శబ్దం, తర్వాత అన్నాడు. "గట్లనే సాబ్! మా కోడలు ఈ రోజు ఢిల్లీ పోయెడిది ఉంది. తనని జర్నీ కేన్సిల్ చేస్కోమని చెప్త! తొందరేమి లేదులెండి! ఆ టిక్కెట్ మీకు పంపుత పోరగానితో!"
"థాంక్స్ దావూద్! టిక్కెట్ ఎంత?"
"ఎంత మాట సాబ్! మీతాన పైసలు తీస్కుంటానా?"
"కాదు. చెప్పు."
"ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు." అన్నాడు దావూద్ సంకోచంగా.
ఆ ఫ్లయిట్ లో వెళ్ళకపోవడం తన కోడలి అదృష్టం అని దావూద్ కి తెలియదు ఆ క్షణంలో.
ఫోన్ డిస్ కనెక్ట్ చేసి సుజాతవైపు తిరిగాడు రెడ్డి, 'ఇవాళ ఈవినింగ్ ఫ్లయిట్ కి టిక్కెట్టు దొరికింది. రెండు గంటల ప్రయాణం. పదిన్నరకల్లా ఢిల్లీ చేరిపోతారు.
అదృష్టవంతులు మీరు!" అన్నాడు నవ్వుతూ.
సుజాత మొహంలోకి పెళ్ళి కళ వచ్చేసింది. "థాంక్స్! థాంక్యూ సోమచ్!" అంది ఎగ్జయిటెడ్ గా.
ఆ ఫ్లయిట్ లో ఎక్కడమే దురదృష్టమనీ, దావూద్ కోడలుకి పట్టవలసిన ఆ దురదృష్టం విచిత్రంగా తనకు ట్రాన్స్ ఫర్ అయిందనీ సుజాతకి తెలియదు.
....అప్పట్లో!
టైం ఐదు దాటింది. ఇంకా మూడు గంటల వ్యవధి ఉంది ఫ్లయిట్ కి.


                                                       *    *    *    *

ఏడవుతుండగా దావూద్ ఆఫీసులోకి సుడిగాలిలా వచ్చాడు రాజేందర్. ఎత్తుగా, బలంగా ఉన్నాడతను. బాగా తెలుపు. ఖరీదయిన బట్టలేగాని ప్రయాణం చేసి వచ్చినట్టు నలిగి ఉన్నాయి. చేతిలో సూట్ కేసు.
"ఆదాబ్ దావూద్ భాయ్! ఏదీ నా టిక్కెట్టు?" అన్నాడు కర్చీఫ్ తో మొహం తుడుచుకుంటూ.
ఇబ్బందిగా చూశాడు దావూద్. "మాఫ్ కర్నా రాజేందర్! మీ టిక్కెట్ రావ్ సాబ్ కి ఇచ్చేసినా!"
"ఏ రావు సాబ్?"
"లీడరు సాబ్!"
"వాడా?" అన్నాడు రాజేందర్, లీడర్ల మీద ప్రజలకు ఉండే గౌరవాన్ని ప్రదర్శిస్తూ, "వాడికెందుకిచ్చావ్?"
"ఔమరి! మీరు నిన్ననే వచ్చి టికెట్ కలెక్ట్ చేసుకుంటానని చెబితిరి! ఇవ్వాళ్టిదాకా రాకుంటే నేనేమనుకోవాల? అయినా టికెట్ మీ కోసం ఉంచేవాడినే సాబ్! ఈ లోపల రావ్ సాబ్ అర్జెంటుగా ఢిల్లీ బోవాలని టిక్కెట్టుకోసం దేవులాట మొదలెట్టిండు. చివరికి అది మన తాన దొరికె! ఏమీ అనుకోకుండ్రి రాజేందర్ సాబ్!"
"అనుకోవడమేమిటి? నా టిక్కెట్ నాకు కావాలి. నేను రేపొద్దుటిలోగా ఢిల్లీ చేరుకొని కంపెనీ బోర్డు మీటింగుకి చేరుకోకపోతే నా కంపెనీ నా చేతిలోనుంచి జారిపోతుంది. నిన్నే వచ్చి టిక్కెట్ కలెక్టు చేసుకునేవాడినేగానీ విజయవాడలో హెల్డ్ అప్ అయిపోయి ఇప్పుడే వస్తున్నాను దావూద్! నాకు టిక్కెట్ అత్యవసరం! ఎలాగైనా అరేంజ్ చెయ్! ఈ రావుగాడు ఢిల్లీ వెళ్ళి చేసేదేముంది? తలలు మార్చి తలలు పెట్టడం, పైరవీలు చెయ్యడం తప్ప! నా ఢిల్లీ ట్రిప్పు యమర్జెంటు?"
"మాఫ్ కర్నా రాజేందర్ జీ! ఖుదా హఫిజ్!" అన్నాడు దావూద్, ఇంక వెళ్ళమని సూచిస్తూ.
జరుగుతున్న దానిని నమ్మలేనట్లు చూస్తూ కాసేపు అచేతనంగా నిలబడిపోయాడు రాజేందర్.
ఆ తర్వాత అతని నోట్లోనుంచి ప్రవాహంలా వెలువడిన అశ్లీల పదాలు విని ఉలిక్కిపడి భయంగా చూసింది రిసెప్షనిస్టు.
అడ్డంగా ఉన్న మోడాని బూటు కాలితో కసిగా తన్ని పెద్ద పెద్ద అడుగులతో బయటికి నడిచాడు రాజేందర్.
అప్పుడే స్ప్రింగ్ డోర్ తెరచుకుని లోపలికి రాబోతున్న మనిషిని చూసుకోకుండా బలంగా డాష్ కొట్టాడు.
ఓహ్ సారీ!" అని క్షమార్పణ చెప్పి, అతని మొహంలోకి చూశాడు రాజేందర్. "అరె! జి.కే! నువ్వా బాస్! ఏమిటి గిరాకీ?"
"గిరాకీనా! రాత్రి ఫ్లయిట్ లో ఢిల్లీ వెళుతున్నా! ఒక్కపూట పనికి పదివేలు రాలతాయి!"
"పదివేలా?" అన్నాడు రాజేందర్. అతని బుర్ర చకచక ఆలోచించింది.
"పదివేలా? ఆ పదివేలూ నేనిచ్చేసాను బాస్! నీ టిక్కెట్టు నాకిచ్చెయ్! నేను రేపొద్దుటికి ఢిల్లీలో ఉండకపోతే నా బిజినెస్ మునిగిపోతుంది."

 Previous Page Next Page