Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 9


    "బాంబే వెళ్ళింది! స్పెషల్ డెసర్ట్ తీసుకురావడానికి"


    "డెసర్టా? ఇక్కడ మనం చెయ్యలేమా?"


    "మనం చేస్తే గొప్పేముందిరా కొంగువేలూ! బాంబేకి స్పెషల్ హెలికాప్టర్ లో వెళ్లి స్పెషల్ హోటల్ అయిన చైనీస్ గార్డెన్ నుంచి స్పెషల్ గా డెసర్టు చేయించి తెస్తేనే కదా గొప్ప. చైనా గార్డెన్ ఓనర్ లేడూ... నెల్సన్ వాంగ్... ఇదివరకు ఈ హైదరాబాద్ లోనే బ్లూడైమండ్ రెస్టారెంట్ లో కుక్ గా పనిచేసేవాడురా! తర్వాత బాంబే వెళ్ళాడు. ఫైవ్ స్టార్ హోటల్సులో పనిచేశాడు. ఆ తర్వాత తనే ఓ చిన్న హోటలు పెట్టాడు. పేరు చైనీస్ గార్డెన్. ఇవాళ బాంబేకి ఏ విఐపీ వచ్చినా చైనీస్ గార్డెన్ లో తిండి తినకుండా తిరిగి వెళితే తిక్కవెధవ కింద జమకడతారు. ధైర్యం చెయ్యండ్రా. ఎన్నాళ్ళీ బానిస బతుకు! ధైర్యేసాహసే హోటల్ అన్నారు. అందరూ వెళ్ళిపోయి తలా ఓ చైనీస్ గార్డెన్ లాంటి హోటల్ పెట్టుకోండి"


    "మరి నువ్వు తాజ్ మహల్ ని తలదన్నే హోటల్ పెడతావా అన్నా!"


    "ఏంట్రా! ఏంట్రా!" అన్నాడు బాలూ చిరాకుపడిపోతూ. "నేను హోటల్ పెట్టడమేమిట్రా! మీరు హోటళ్ళు పెడితే నేను వచ్చి ఉంటా తింటా!"


    "నువ్వెప్పుడొచ్చినా ఫ్రీ రూమూ, భోజనం" అన్నాడొక వంటవాడు అప్పుడే తను హోటలు పెట్టేసినట్లుగా.


    "ఫ్రీగా ఎందుకోయ్! ప్రొడ్యూసర్లు పెట్టుకుంటారు ఖర్చు."


    "అంటే?"


    "అంటే... బాలూ సూపర్ హీరోగా వచ్చి మీ హోటళ్ళలో ఉంటాడోయ్. ఓ ఫ్లోరంతా నా కోసమే బుక్ చేయించాలి."


    "బాంబే వెళ్ళిపో బాస్! ఇక్కడ నీ టాలెంటుకి గుర్తింపు లేదు" అన్నాడొక కుర్ర వంటవాడు.


    "రేయ్ సరిగ్గా చూసి చెప్పు! నా కళ్ళు రాజ్ కపూర్ కళ్ళలా లేవూ?"


    "నీ కళ్ళు పిల్లికళ్ళని అందరూ అంటారన్నా!"


    "నీ తలకాయ్! పిల్లికళ్ళు కాదు. నీలికళ్ళు. రాజ్ కపూర్ పోలికలు కనబడతాయ్. కళ్ళు పెట్టుకు చూడవోయ్!"


    ఇంతలో ఆకాశంలో చప్పుడు వినబడింది. హెలికాప్టర్ రెక్కల చప్పుడు.


    "రేయ్! నవ్వుల దెయ్యం వచ్చేస్తోందిరోయ్! గప్ చుప్! బాంబే నుండి డెసర్ట్ వస్తోందని ఐశ్వర్యకి కూడా తెలీదు. వాళ్ళ అమ్మ అది తెప్పిస్తోంది. నవ్వుల దెయ్యం ఇంకో హెలికాప్టర్ లో వెళ్ళి తెస్తోంది. సర్ ప్రయిజ్ ఐటెమ్. నెల్సన్ వాంగ్ ఐశ్వర్య కోసమే కనిపెట్టాడట ఆ స్వీటు. పేరు కూడా ఐశ్వర్య పేరే పెట్టాడు 'శ్రీ'అంతే! అదిగో వచ్చేస్తోంది! నువుల దెయ్యం ఇంకో హెలికాప్టర్ లో. వారెవా! హెలికాప్టర్లు దోమల్లాగా తిరుగుతున్నాయి కదండీ! కార్లు కుక్కల్లాగా తిరుగుతున్నాయ్. డబ్బుతో పులిసిపోయి ఉన్నారు. ఫ్రెంచి విప్లవం లాంటిది వచ్చి వీళ్ళందరినీ హెలికాప్టర్ రెక్కల మధ్య ఉంచి తలలు నరికేయిస్తే...వచ్చేసిందిరోయ్!"


    ఇంకో హెలికాప్టర్ వచ్చి హెలిపాడ్ మీద దిగింది.


    నాలుగే నాలుగు అంగల్లో అక్కడికి చేరుకున్నాడు బాలూ. యూనిఫారం సరిచేసుకుంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు.


    అతని వెనకే నిలబడ్డాడు కాశీ!


    హెలికాప్టర్ లో నుంచి దిగింది ఓ అమ్మాయి. ఛామనఛాయ. చాలా పొడుగు. చాలా అందంగా ఉంది. మొహంలో, కళ్ళలో, పెదిమల మీద... ముక్కు చిట్లించడంలో, మాటలో ప్రతి కదలికలో కూడా నవ్వు కనబడుతోంది. నవ్వు - ఉత్సాహం - ఫ్రెండ్లీనెస్.


    లక్కీ అనబడే లక్ష్మి ఈమే అయి ఉంటుందని ఊహించాడు కాశీ.


    "హాయ్ బాలూ!" అంది లక్కీ ఫ్రెండ్లీగా.


    "గుడ్ మార్నింగ్ మేడమ్!"


    "శ్రీ వచ్చి వెళ్లిందా?"


    "నోట్లు వెదజల్లబడ్డాయి మేడమ్!"


    "ఏమిటి రియాక్షన్!"


    "నిజాం జమానాలో మహారాజా కిషన్ పెర్ షాద్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే వెండి, బంగారు నాణాలు వెదజల్లుతుండేవాడుట మేడమ్. ఆయన దగ్గర వంటవాడుగా పనిచేసేవాడు మా తాత. ఇన్నాళ్ళకి మళ్ళీ అలాంటి దృశ్యం చూశాను అంటున్నాడు మా తాత వయస్సున్న కుక్ మీర్జాబేగ్. అతను నైజాం సర్కార్ కోఠీలో కొన్నాళ్ళు..." అతన్ని కట్ చేస్తూ...


    "ఈ ప్యాకేజ్ భద్రంగా లోపల పెట్టించు. జాగ్రత్త. వెరీ ఇంపార్టెంట్!" అంది 'నవ్వుల దెయ్యం' అనబడే లక్కీ.


    "అందులో ఏముంది మేడమ్?" అన్నాడు బాలూ, అంతా తెలిసినా కూడా. అతను హీరో అవ్వాలనుకుంటున్నాడు. వంటవాడయ్యాడు. కానీ నిజం చెప్పాలంటే అతను గొప్ప విలేఖరి అయి ఉండేవాడు. వార్తలు గ్రహించడంలో అతనికి మంచి "ముక్కు" ఉంది.


    ఆ ప్యాకెట్లలో ఉన్నది స్పెషల్ స్వీటు. పేరు 'శ్రీ'. తనకి తెలీదా?


    "చెప్పను" అంది లక్కీ చిలిపిగా నవ్వుతూ. "సాయంత్రందాకా సస్పెన్స్!" అంది మళ్ళీ హెలికాప్టర్ లో కూర్చుంటూ.


    క్షణాల్లో ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆ 'ఛోపర్'.


    బాలూ కళ్ళు గాజు కళ్ళలా అయిపోయాయి. అదోలా చూశాడు ప్యాకెట్ల వైపు. ఇదేనా నెల్సన్ వాంగ్ ఐశ్వర్య కోసం చేసిన కొత్త వంటకం. దీని రంగెలా ఉంటుంది? రుచి ఎలా ఉంటుంది? తను ఎక్స్ పర్ట్ కుక్! తనని మించినవాడా ఈ వాంగ్!

 Previous Page Next Page