ఒక్కసారి దీన్ని రుచి చూస్తే -
చడీచప్పుడు కాకుండా ఓ పాకెట్ తీసి తన ప్యాకెట్ లో పెట్టుకున్నాడు బాలూ. లెఖ్ఖ చూస్తుంది ఐశ్వర్య. చూసినా చూడొచ్చు. లెఖ్ఖ తక్కువ అవుతుంది. కానీ తన దగ్గర రెడీగా ఓ తప్పుడు లెఖ్ఖ ఉంది. తప్పించుకోవచ్చు. కోతి ఎత్తుకెళ్ళిందని చెప్పేస్తాడు. బస్!
"కాశీ! పద నా రూంలోకి వెళ్దాం" అన్నాడు బాలూ. అక్కడికి దగ్గరలోనే వర్కర్లకోసం కట్టిన టెంపరరీ క్వార్టర్స్ ఉన్నాయి.
ఇద్దరూ గదిలోకి వెళ్ళారు.
వెళ్ళీవెళ్ళగానే స్వీట్ పాకెట్ ఓపెన్ చేశాడు బాలూ. మైసూర్ పాక్ సైజులో ఉంది స్వీటు. దివ్యలోకపు పరిమళం ఏదో వస్తున్నట్లుగా అనిపిస్తోంది అది ఓపెన్ చెయ్యగానే. "లక్నోటైపు స్వీటు ఏదో మార్చి చేశాడు. నవాబుల వంటకాల ఫార్ములా ఏదో దొరికి ఉంటుంది. ఒక్కొక్క పీస్ వెయ్యి రూపాయలకి తక్కువ పెట్టి ఉండడు" అన్నాడు బాలూ. ఆ స్వీట్ ని అపురూపమైన వజ్రాన్ని చూస్తున్నట్లు అన్నివైపులా తిప్పి చూస్తూ.
"వాళ్ళు మనకు పెట్టరు కాబట్టి మనంతట మనమే తీసుకు తినాలి. సెల్ఫ్ సర్వీస్. దంచినమ్మకు బొక్కిందే కూలీ!" అని మళ్ళీ చెప్పి స్వీటుని రెండుగా చేసి ఒకటి కాశీకి అందించబోయాడు బాలూ.
"నాకు వద్దు" అన్నాడు కాశీ.
"ఏం?"
"పరులసొమ్ము పాముతో సమానం" అతని మాట పూర్తికాకముందే మళ్ళీ హెలికాప్టర్ చప్పుడు వినబడింది. క్షణాల్లో లాండ్ అయిపోయింది హెలికాప్టర్. వెంటనే 'బాలూ' అని వినబడింది ఓ ఆడగొంతు.
"బాబోయ్! ఐశ్వర్య! ఇప్పుడెలా?" అన్నాడు బాలూ భయంగా దిక్కులు చూస్తూ.
"బాలూ!" మరింత పెద్దగా ఐశ్వర్య గొంతు.
చటుక్కున కాశీ బుగ్గలు అదిమిపట్టాడు బాలూ. కాశీ నోరు తెరుచుకుంది. స్వీటు అతని నోట్లో కుక్కి "మింగెయ్! మూడు నిమిషాల తర్వాత బయటికిరా" అని "ఎస్ మేడమ్!" అంటూ పరిగెత్తాడు బాలూ.
అతన్ని ఎగాదిగా చూసింది ఐశ్వర్య.
"ఏం చేస్తున్నావ్?"
"మసాలా గ్రైండ్ చేస్తున్నాను మేడమ్!"
"బాలూ!"
"మేడమ్!"
"నీ దృష్టిలో బెస్ట్ స్వీట్ ఏమిటి?"
"మేడమ్! ఫ్రాంక్ గా చెప్పాలంటే బొరుగుల ఉండలు అని ఉంటాయి. చిన్నప్పుడు తినేవాళ్ళం..."
ఐశ్వర్య కళ్ళు మిలమిల మెరిశాయి.
"ఎస్! వైనాట్! మీరు తినే చెత్త చాలా ఉంటుంది కదా! బొరుగుల ఉండలు. వేరుసెనగ ఉండలు. ఇంకేమిటీ?"
"పప్పు ఉండలు, పుగ్గాలు, పులి బొంగరాలు..." అని గబగబ లిస్టు చదివేశాడు బాలూ.
"అవును! అవన్నీ కూడా చేయించి, పార్టీలో ఓ పక్కన చిన్న బజార్ లాగా పెడతాం. పానీపురీ, భేల్ పురీ... మంచి ఐడియా! కాశీ ఏడీ?"
తక్షణం చెప్పాడు బాలూ. అతను అప్పటికే ఆలోచించి పెట్టుకుని ఉన్నాడు.
"కోతిని పట్టుకోవడానికి వెళ్ళాడు మేడమ్"
"కోతా?"
"పండుకోతి! జామ పళ్ళన్నీ కోసిపారేసింది మేడమ్!"
"జామ పళ్ళా!"
"అవును మేడమ్"
"కాశీని రమ్మను"
"కాశీ!" అని పెద్దగా కేకపెట్టాడు బాలూ.
సమాధానం లేదు.
"కాశీ!" అన్నాడు బాలూ మళ్ళీ.
చిన్నగా మూలుగు వినబడింది. కాశీ మూలుగు వినగానే వెంటనే అటు పరిగెత్తాడు బాలూ.
అక్కడ కాశీ కిందపడిపోయి ఉన్నాడు. అతని నోటినుంచి నురగ వస్తోంది.
"కాశీ.. కాశీ.. ఏమయింది? పాము కరిచిందా?" అన్నాడు బాలూ ఆదుర్దాగా.
తల అడ్డంగా ఊపాడు కాశీ. కడుపువైపు చూపించాడు కాశీ.
"మేడమ్! కాశీ చచ్చిపోతున్నాడు" అన్నాడు బాలూ భయంగా.
"హెలికాప్టర్ లోకి ఎక్కించు" అంది ఐశ్వర్య.