ఇద్దరూ తల ఎత్తి చూశారు.
కిచకిచలాడుతూ ఒక కోతి కనిపించింది.
ఛంగున లేచి నిలబడ్డాడు బాలూ.
"ఛేయ్! ఛేయ్! ఏయ్ కోతీ! పద! పద!"
కోతి "దిగిరాను దిగిరాను దివినుండి భువికి" అన్నట్లుగా చూసి ఒక జాంపండు తెంపి కొద్దిగా కొరికి ఆ పండుని గుండు పగిలేలా బాలూ వైపు గురిచూసి కొట్టింది.
"ఇదిగో పళ్ళు తెంపకు! మేడం చూసిందంటే మక్కెలిరుగుతాయ్! నీ మక్కెలే కాదు. ఈ కాశీగాడి మక్కెలు కూడా! అయ్యో మాట వినవేం! కాయలు తెంపకు!" అన్నాడు బాలూ.
కాయలు తెంపడమే తన జీవిత ధ్యేయం అన్నట్లుగా చకచక తెంపేస్తోంది కోతి.
"ఓర్నాయనోయ్! కాశీ అవన్నీ మూటకట్టు. లెఖ్ఖ చూపించకపోతే తిక్కరేగిపోతుంది దొరసానికి. నేనీ కోతి పని పడతా!" అని చెట్టెక్కడం మొదలెట్టాడు బాలూ. అతనికి చెట్టెక్కడం కూడా వచ్చు. సినిమాల్లో ఏ కోతి చేష్ట చెయ్యాల్సి వస్తుందో అని ఇప్పట్నుంచే అన్నీ నేర్చుకుని ఉన్నాడతను. స్టంటు సీన్లకు పనికి వస్తుందని చెట్లెక్కడం, చెట్లు దూకడం, కొండల మీద నుంచి దూకినట్లు ఊహించుకుంటూ బండల మీద నుంచి గెంతడం... ఒకటేమిటి!
కోతి పక్క చెట్టు మీదికి లంఘించింది. బాలూ చెట్టుదిగి చెట్టు ఎక్కేలోపల ఆ చెట్టుకాయలలో ముప్పాతిక మూడొంతులు నాశనం చేసేసింది.
"కాశీ! కాయలు మూటకట్టు! దీన్ని నేను కిష్కింధ దాకా తరిమికొడతా!" అని చెట్టుదిగి పక్క చెట్టు ఎక్కేలోపలే ఆ చెట్టు పని పట్టేసి ఇంకో చెట్టు మీదికి ఎక్కింది కోతి. బాగా యాక్టివ్ గా ఉంది అది.
పది నిముషాల తర్వాత కోతిచేష్టలలో తనకు తానే సాటి అనీ చివరికి బాలూ కూడా తనకి సాటిరాడని రుజువు చేసేసింది కోతి. రొప్పుతున్న బాలూవైపు "పోరా పుల్లాయ్!" అన్నట్లు చూసి నడుం గోక్కుని రెండు గెంతులేసి కిచెన్ లోకి దూరిపోయింది.
"ఓసినీ తల్లిసిగదరగ!" అని రయ్ మని కిచెన్ లోకి పరిగెత్తాడు బాలూ. కిచెన్ లోకి ఎంటర్ అవుతూనే మూల ఉన్న కర్ర తీసుకున్నాడు.
బాలూకి భయపడని కోతి కర్రకి భయపడింది. ఒక్కసారి కోపంగా పళ్ళు ఇకిలించి చూసి తుర్రుమంది.
ఆదుర్దాగా కిచెన్ అంతా చూశాడు బాలూ. బురదలో తిరిగి వచ్చింది కోతి. ఎక్కడ చూసినా దాని కాళ్ళ గుర్తులే!
"కోతి దేన్లో చేతులు పెట్టలేదు గదా!" అన్నాడు బాలూ.
లేదన్నట్లు తల ఊపారు అక్కడ ఉన్న మిగతా వంటవాళ్ళు. గ్యాస్ స్టవ్ ల మీద వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. వంటవాళ్ళ మొహాలు స్టవ్ లకంటే నల్లగా మాడిపోయి ఉన్నాయి. కడుపుల్లో జఠరాగ్ని స్టవ్ మంటల కంటే ఎక్కువగా ప్రజ్వరిల్లుతోంది.
"చూశావా! ఇదీ మన గతి!" అన్నాడు బాలూ కాశీతో.
"రైతు కూలీ ఏడాదిపాటు ఎండలో ఎండి వానలో తడిసి బియ్యం పండిస్తాడు. కానీ గంజిలోకి మెతుకు ఉండదు. ఇక్కడా అంతే! ఘుమఘుమలాడే వంటకాలు తయారు చెయ్యడం మా వంతు! కానీ రెండో కప్పు కాఫీ ఇవ్వరు. భోజనం కూడా పెట్టరు. ఇక్కడే వర్కర్లకోసం ఓ క్యాంటీన్ ఉంది. దాన్లో చౌకరకం తిండి చౌగ్గా పెడతారు. టీ...కిచిడీ... లేదా పులిహోర, సాంబారుసాదం నీళ్ళమజ్జిగ ఏదైనాసరే రెండు రూపాయలు.. వేలకోట్ల ఆస్తి ఉంది. కాకికి చెయ్యి విదిలించదు. ఆ క్యాంటీన్ కూడా ఈవిడ ధర్మం కాదు. శ్రీరామచంద్ర మూర్తిగారి చలవ!"
"శ్రీరామచంద్రమూర్తిగారెవరు?" అన్నాడు కాశీ.
"తొందరపడకు! అన్నీ తెలుస్తాయ్! అని మిగతా వంట వాళ్ళవైపు తిరిగి "భాయి యోం! తలా అరకప్పు కాఫీ తాగెయ్యండి. శ్రేష్ఠమైన టర్కిష్ కాఫీ. ఎక్సెలెంట్ క్వాలిటీ! క్వాంటిటీ తగ్గితే తప్పుడు లెక్కలు చెప్పడానికి ఈ పాపాల భైరవుడు సర్వదా సిద్ధం!" అన్నాడు హాస్యగాడిలా.
అతనికి మిగతా వర్కర్ల సపోర్టు బాగా ఉన్నట్లుంది. వాళ్ళ మధ్య అరమరికలు ఉన్నట్లుగా లేదు. అందరికీ కామన్ ఎనిమీ ఐశ్వర్య రాజ్యశ్రీనే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
ఆమెకి ఒక్కపైసా నష్టం కలిగించి తాము ఒక్కపైసా లాభం సంపాదించినా కసి తీర్చుకున్నట్లే ఉంటుందన్న భావన వాళ్ళ కళ్ళలో కనబడింది.
కానీ దొరలు తాగే టర్కిష్ కాఫీ తాగడమే!
జాంపండు కూతురికి ఇచ్చినందుకే మల్లయ్యకి ఉద్వాసన చెప్పింది.
టర్కిష్ కాఫీ తాగితే?
"తాగండ్రా. తప్పుడు లెఖ్ఖలు తయారుగా ఉన్నాయ్. ఏం భయం లేదు. దంచినమ్మకి బొక్కిందే కూలీ" అన్నాడు బాలూ.
"నవ్వుల దెయ్యం వస్తుందన్నావుగా" అన్నాడు ఓ వంటవాడు.
బాలూ టైం చూసుకుని "ఇంకో పది నిముషాల్లో దిగుతుంది. ఈలోగా కానియ్యండి" అన్నాడు.
కాఫీలు సర్వ్ చెయ్యబడ్డాయి.
"నవ్వుల దెయ్యం ఎక్కడికెళ్ళిందీ?" అన్నాడొక కుక్. టర్కిష్ కాఫీని సాసర్లో పోసుకుని ఊదుకుంటూ తాగుతూ.