Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 9


    గోడకి వంకె తగిలించి వుంది. దానికి రెండు హాంగర్లు. వాటికి జీన్సూ, షర్టులూ తగిలించి వున్నాయి.


    "దిస్ లిటిల్ ఫెలో ఈజ్ లివింగ్ కంఫర్టబుల్లీ" అనుకున్నాడు కృష్ణాజీ చిత్రంగా చూస్తూ.


    గోడల నిండా అతికించి ఉన్న పోస్టర్లు కనబడ్డాయి కృష్ణాజీకి.


    అమితాబ్ బచ్చన్ పోస్టరు ఒకటి వుంది. సూపర్ మాన్ పోస్టరు, రాబిన్ హుడ్, రెజ్లర్ ధారాసింగ్, కండలు తిరిగి కనబడుతున్న మిస్టర్ యూనివర్స్ పోస్టర్లూ కనబడుతున్నాయి.


    వాటితో బాటుగా పుష్టిగా ఉన్న వక్షంతో ఉన్న ఒక ఫారిన్ అందగత్తె తాలూకు బస్ట్ సైజు పోస్టరు కూడా ప్రామినెంట్ గా కనబడుతోంది.


    ఆ బస్ట్ కి ఎవరో రంగు పెన్సిళ్ళతో 'ఉండాల్సిన చోట' మరింత మెరుగులు దిద్దినట్లుగా కూడా కనబడుతోంది.


    "లిటిల్ రాస్కెల్!" అని నవ్వుకున్నాడు కృష్ణాజీ.


    ఇంకొక మూలగా కనబడుతున్నాయి ఎక్సర్ సైజు చేసే పరికరాలు...డంబ్ బెల్స్, బుల్ వర్కర్ అవీ...ఇవీ!


    ఆ మూలనే అతికించి ఉంది ఆంజనేయస్వామి బొమ్మ ఒకటి. దాని కిందగా గోడకి ఉన్న కన్నాలలో కాలిపోయిన అగరొత్తులు కనబడుతున్నాయి.


    అయిదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు రాజా.


    "నేను రెడీ!"


    కృష్ణాజీ చేతులు ముందుకు జాచి, రాజా ఒంటిని తడిమి చూశాడు.


    ఏదో గట్టిగా తగిలింది.


    తీసి చూశాడు.


    నవ్వాడు రాజా.


    "వెపన్స్ ఏమన్నా పెట్టుకుని ఉంటాననా? అలాంటిదేమీ లేదు!"


    ఒకసారి రాజావేపు నిశితంగా చూశాడు కృష్ణాజీ.


    తర్వాత హఠాత్తుగా ఏదో స్ఫురించినట్లు అన్నాడు.


    "నీ బెల్టు తియ్!"


    "ఎందుకు?"


    "చెబుతా!"


    "ఛీప్ లెదర్ బెల్టు! మీకేం పనికి వస్తుంది?"


    "మాటలు వద్దు. బెల్టు తియ్?"


    తప్పదన్నట్లు బెల్టు తీశాడు రాజా. అయినా చివరి ప్రయత్నంగా ఒక్కమాట అని చూశాడు.


    "మీకంతా ఉత్త అనుమానం!" అన్నాడు హేళనగా నవ్వుతూ.


    అదేం పట్టించుకోకుండా బెల్టుని పరిశీలనగా చూశాడు కృష్ణాజీ. తర్వాత బకిల్ దగ్గర పట్టుకుని ఒడుపుగా లాగాడు.


    తోలుతో చేసిన ఒరలో నుంచి బయటికి వచ్చినట్లు వచ్చింది పల్చగా బెల్టు షేపులోనే ఉన్న కత్తి.

    
    చాలా షార్ప్ గా ఉంది అది.


    బెల్టుని చుట్టేసి, తన మోటార్ సైకిల్ కి ఉన్న సైడ్ బాక్సులో పడేశాడు కృష్ణాజీ.


    గట్టిగా అన్నాడు రాజా -


    "ఆ బెల్టు నన్ను నేను రక్షించుకోవడానికి."


    "ఇప్పుడు నీకు వచ్చే డేంజరేమీ లేదు" అన్నాడు కృష్ణాజీ.


    "పోలీసు లాకప్ డెత్స్ గురించి నాకు బాగా తెలుసు."


    కళ్ళు చిట్లించి రాజావేపు చూశాడు కృష్ణాజీ.


    "నీకు అంత భయంగా ఉంటే నీకు ఒక లాయర్ ని అరేంజ్ చేస్తారులే!"


    "నాకెందుకు లాయరు? నాకు క్రిమినల్ లా అంతా కంఠతా వచ్చు."


    నవ్వాపుకున్నాడు కృష్ణాజీ.


    అమ్మో! అదరగండంలాగా ఉన్నాడు వీడు.


    "ఎన్నిసార్లు రిమాండులో ఉన్నావ్?"


    "నన్ను రిమాండ్ లో పెట్టడం ఎవరివల్లా కాదు సార్."


    నదురూ బెదురూ లేకుండా మాట్లాడుతున్న పన్నెండేళ్ళ కుర్రాడు రాజాని చూస్తుంటే కృష్ణాజీకి మెచ్చుకోవాలో, కోపం తెచ్చుకోవాలో అర్థం కాలేదు.


    ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ పిల్లాడికి.


    ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకొక్క డిగ్రీ పెరిగితే, దాన్నే 'పొగరు' అంటారేమో.


    ఇందాక మీటింగు జరిగిన షామియానా దగ్గర స్టాండు వేసి ఉంది కృష్ణాజీ మోటారు సైకిలు.


    "రాయల్ ఎన్ ఫీల్డు బులెట్ అంటే ఏ వన్ మోటార్ సైకిల్ సర్! మోటారు సైకిలు పాతదయినా తళతళలాడేటట్లు మెయిన్ టెయిన్ చేస్తున్నారే!" అన్నాడు రాజా.


    "కూర్చో!" అన్నాడు రాజాతో.


    రాజా కూర్చున్న తర్వాత అప్పుడే స్ఫురించినట్లు బేడీలు తీశాడు కృష్ణాజీ. రాజా కుడిచేతికీ, మోటారు సైకిలు పక్కన ఉన్న హుక్ కీ కలిపి సంకెళ్ళు వేశాడు.


    "లాక్ సరిగా పడిందా సర్?" అన్నాడు రాజా వ్యంగ్యంగా.


    కృష్ణాజీ మాట్లాడకుండా గేర్ మార్చాడు.


    మోటార్ సైకిలు ముందుకు పరిగెత్తింది.


    రాజా నాన్ స్టాపుగా మోటార్ సైకిళ్ళ గురించి ఏదేదో చెబుతూనే ఉన్నాడు. తను నెక్ట్స్ ఇయర్ బ్రహ్మాండమైన 'బండి" ఒకటి కొంటానన్నాడు. 350 సిసి కి తక్కువ పవర్ వున్న 'బళ్ళు' ప్రెగ్నెంటు ఆడవాళ్ళు నడపాల్సినవి తప్ప మొగాళ్ళు నడపాల్సినవి కావన్నాడు. రాయల్ ఎన్ ఫీల్డు బులెట్ మంచిదనీ, ఇప్పుడొస్తున్న మోటార్ సైకిళ్ళు ఉత్తుత్తి బొమ్మల్లాంటివనీ అన్నాడు. కృష్ణాజీ ఎన్నాళ్ళకోసారి బులెట్ ని సర్వీసింగ్ చేయిస్తాడో వాకబు చేశాడు.

 Previous Page Next Page