కరుగ్గా అన్నాడు ఆ పోలీసు ఆఫీసర్.
"రేయ్! నీ సంగతి నాకు తెలుసురా! నువ్వు కేడీలకి కేడీవి! పట్టుమని పదేళ్ళు లేవుగానీ, ఊళ్ళో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లో నువ్వొకడివి! నీలాంటి వాళ్ళని పట్టుకోవడం కోసమేరా, ఇన్ని రకాల వేషాలు వేసేది నేను!"
క్షణంలో మారిపోయిన పరిస్థితి చూసి ఏమాత్రం చలించలేదు రాజా. స్థిరంగా నిలబడి అన్నాడు -
"మీరు పోలీసు ఆఫీసరని నాకు ముందే తెలుసు."
ఆశ్చర్యంగా రాజావైపు చూశాడా పోలీసు ఆఫీసర్.
"నేను పోలీసు ఆఫీసర్ ని అని ముందే తెలుసా? ఎలాగ?"
అపహాస్యంగా అన్నాడు రాజా.
"మీరు ఎంత చిరుగుల దుప్పటి కప్పుకుని వణుకుతూ కూర్చున్నా మీ ఎక్సర్ సైజు బాడీ తెల్సిపోవడం లేదా? మీరు కృష్ణాజీ! "టైగర్ కృష్ణాజీ" అని పిలుస్తారు మిమ్మల్ని అందరూ!"
రాజా వైపు అంచనా వేస్తున్నట్లు చూశాడు కృష్ణాజీ.
"మరి నేను పోలీసు ఆఫీసర్ ని అని తెలిశాక కూడా పారిపోకుండా ఇక్కడే వుండిపోయావా?"
"దానికో చిన్న కారణం వుంది."
"ఏమిటది?"
"ఒక పోలీసు ఆఫీసర్ చెయ్యి దేహీ అంటూ కింద కావడం, ఒక పిక్ పాకెట్ గాడి చెయ్యి దాత లెవెల్లో పైన వుండడం. ఎప్పుడో గానీ జరగదు. చిన్నప్పుడే నాకీ అవకాశం వచ్చేసింది. నేను ఈ అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు."
చటుక్కున తలెత్తి సూటిగా రాజా మొహంలోకి చూశాడు కృష్ణాజీ.
అప్పుడు మొదటిసారిగా అతను గమనించాడు....
రాజా మొహంలో కనబడుతున్న బ్రహ్మ వర్చస్సుని!
ఏ తల్లి కన్నబిడ్డడు ఇతను?
ఇంత అందం, ఇంత ధైర్యం, ఇంత తెగింపు, ఇంత సంస్కారం, ఇంత మంచితనం ఒక్కడిలోనే ఎలా చోటుచేసుకున్నాయి?
ఈ కొద్దిసేపటిలోనే -
తను రాజాలో ఉన్న ఎక్స్ ట్రార్డినరీ క్వాలిటీస్ అన్నిటినీ గమనించాడు.
ఇతనికి ఉన్నంత హస్తలాఘవం మెజీషియన్స్ కి కూడా ఉండదు నిజంగానే!
అంతమంది పోలీసుల మధ్య ఉన్న మినిస్టర్ విజయకుమారి హాండ్ బ్యాగ్ ని ఎంత లాఘవంగా కొట్టేశాడు.
పోనీ ఆ కొట్టేసిన డబ్బుని తను సొంతానికి ఉంచుకున్నాడా అంటే అదీ లేదు.
ఒక్క నోటు మాత్రం తను వుంచుకుని, మిగతా డబ్బంతా ఇక్కడిక్కడే అందరికీ పంచిపెట్టేశాడు.
చిరుగుల దుప్పటి కప్పుకు కూర్చున్న తనెవరో కనిపెట్టేశాడు.
తను పోలీసు ఆఫీసర్ ని అని కనిపెట్టినా కూడా పారిపోలేదు.
తనకి దానమిచ్చే ముచ్చట తీర్చుకోవడం కోసం ఇక్కడే ఉండిపోయాడు కూడా!
కారణజన్ముడంటే, ఇలాంటి వాడు కాక, మరెవరవుతారు? లేచి, ఖడక్ గా నిలబడ్డాడు కృష్ణాజీ. లేస్తూనే, రాజా జేబులో ఉన్న రివాల్వర్ తీసేసుకున్నాడు.
తీక్షణంగా ఒకసారి రాజావేపు చూసి, "కమాన్! నాతోరా!" అన్నాడు.
రాజా పోలీసులకి పట్టుబడడం అదే మొదటిసారి.
పోలీసుల చేతిలో పడితే ఏమవుతుందో అక్కడున్న చాలామందికి ప్రత్యక్షంగా అనుభవమే.
అక్కడున్న వాళ్ళలో ఆడవాళ్ళు శోకాలు పెట్టడం మొదలెట్టారు.
పొడుగ్గా, దిట్టంగా వున్న ఒక నల్లటి మనిషి వచ్చి దభేలుమని కృష్ణాజీ కాళ్ళమీద పడిపోయాడు.
"సార్! వాడు చిన్న పోరగాడు. వాణ్ణేం చెయ్యకండి. నన్ను తీసుకెళ్ళండి సార్! నేను నేరం ఒప్పేసుకుంటా!"
ఎవరో గుండెని గుప్పెట్లో పట్టుకు నొక్కేసినట్లయ్యింది కృష్ణాజీకి.
ఎవరో నేరం చేస్తే, ఇంకెవరో వచ్చి లొంగిపోవడం ఇది పోలీసు స్టేషన్లలో మామూలే.
డబ్బు కోసమో, మరెందుకోసమో...ఇలాంటి కేసులు చాలా తరచుగానే జరుగుతుంటాయి.
అయినా, ఎప్పటికప్పుడు విషాదంగానే అనిపిస్తుంది తనకి. పోలీసు డిపార్ట్ మెంటులో చేరినా తన గుండె రాయిగా మారలేదు ఇంతవరకూ.
నిట్టూర్చి అన్నాడు కృష్ణాజీ.
"పద!"
"ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి రావాలి" అన్నాడు రాజా.
"ఏం పని?"
"కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి."
"సరే! తొందరగా రా!"
అక్కడే వున్న తన గుడిసెలోకి గబగబా వెళ్ళాడు రాజా.
అతని వెనకే వెళ్ళి, గుడిసెలోకి తొంగి చూశాడు కృష్ణాజీ.
పేరుకి గుడిసే అయినా, లోపల నాపరాళ్ళతో కచ్చా ఫ్లోరింగ్ చేసి వుంది. మట్టి గోడలకి శుభ్రంగా సున్నం వేసి వుంది.
ఒక వైపున చిన్న బల్ల. దానిమీద ఆరంగుళాల ఎత్తే వున్న మినీ సైజు టీ.వీ. చిన్న ట్రాన్సిస్టర్ రేడియో వున్నాయి.