కృష్ణాజీకి కూడా మోటార్ సైకిళ్ళంటే చిన్నప్పటి నుంచి ఫాసినేషన్ ఉంది. అందుకని ఆసక్తిగా వింటున్నాడు రాజా మాటలు.
పైగా అతను అంత శ్రద్ధగా వినడానికి ఇంకో యాంగిల్ కూడా ఉంది.
రాజా చేత అలా వాగిస్తుంటే, ఆ వాగుడులోనే అనుకోకుండా అతని పర్సనాలిటీ తాలూకు సెన్సిటివ్ విషయాలు కొన్ని బయటపడిపోవచ్చు.
కృష్ణాజీ ఇంట్రెస్టుగా వింటున్నాడని తెలిసి ఇంకా పుంజుకున్నాడు రాజా.
తను కొనబోయేది ఒక 'డ్రీం మెషిన్ ట' తన స్పీడుకి బుల్లెట్ కూడా లాభం లేదుట చెప్పాడు.
ఫారిన్ బైక్ ఏదన్నా కొంటాడట తను.
అని, ఫారిన్ మోటార్ సైకిళ్ళ లిస్టు గబగబా చదివేశాడు రాజా. "విన్సెంట్, ఇండియన్, ఓరియెంట్, ఎక్సెల్ సియర్, మిలిటెయిర్, మాచ్ లెస్, క్రోహర్, ఏరియల్, ఏ.జె.ఎస్, గిలెరా, పాంథర్, వెలోసెట్, బ్లాక్ షాడో, రాపైడ్.
ఇవి దొరక్కపోతే ట్రయంఫ్ గానీ హార్లే డేవిడ్ సన్స్, ఫారిన్ హోండా, సుజుకీ, యమహా, కావసాకీ, బి.ఎమ్.డబ్ల్యు, బిమోటా, మోటో గుజ్జీ, లెవర్ డా గానీ కొంటాడట.
వీటిల్లో చాలా బైక్స్ గంటకు రెండొందల కిలోమీటర్ల స్పీడుతో వెళ్తాయట!
కృష్ణాజీ ఊ కొడుతుంటే, ఇంకా ఉత్సాహంగా డిటెయిల్స్ లోకి వెళ్ళిపోయాడు రాజా.
"ఇప్పుడు ప్రపంచంలో ఉన్న బైక్స్ లో టాప్ ఐదే ఉన్నాయ్ సార్! కావసాకీ నింజా జడ్ ఎక్స్ 11 దీన్నే 'కిల్లర్' అని ముద్దుగా పిలుస్తారు. ప్రపంచంలో దీన్ని మించి స్పీడుగా పోయే మోటార్ సైకిలు ఇంకోటి లేదు. గంటకు రెండొందల ఎనభై రెండు కిలోమీటర్ల స్పీడుతో పరిగెడుతుంది ఇది! సార్! ఇది అసలు మోటార్ సైకిలు కాదు సార్. పాపం ఏదో శాపం వల్ల నేలమీదే పరిగెత్తే విమానం అన్నమాట. లేకపోతే దాని పవర్ కి అది ఆకాశంలో ఎగరాల్సింది సార్! ఎక్కి కూర్చున్న వాడికి సత్తా లేకపోతే గాల్లోకి ఎగరేస్తుంది. కాస్ట్ ఏడు వేల ఐదొందల తొంభై అమెరికన్ డాలర్లు సర్! అంటే ఇండియన్ కరెన్సీలో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై అయిదు."
జాగ్రత్తగా వింటున్నాడు కృష్ణాజీ.
మొదటి క్లూ దొరికింది.
వీడికి అమెరికన్ డాలర్ ఎక్చ్సేంజి రేటూ, డాలర్ బ్లాక్ మార్కెట్ రేటూ కూడా తెలుసు.
అంటే వీడి డీలింగ్స్ చాలా పెద్ద బ్రాకెట్ లోనే ఉన్నాయి.
స్మగ్లింగా?
హవాలా రాకెట్టా?
వీణ్ణి ఇలాగే ఇంకాసేపు వాగనిస్తే ఇంకా విశేషాలు బయట పడవచ్చు.
ఎదుటివాడిని మాట్లాడనివ్వడం, అందులో నుంచే కావలసిన సమాచారాన్ని రాబట్టుకోవడం. అదీ తన టెక్నిక్.
చెబుతూనే ఉన్నాడు రాజా.
"ఇంక నెంబర్ టూ యమహా ఎఫ్.జెడ్.ఆర్.-1000 సర్! దీనికి నిక్ నేమ్ ది బ్యూటీ అండ్ ది బీస్ట్! మంచి పవర్ ఫుల్ జెనిసిస్ ఇంజన్ సర్! ఈ మోడలు ఎన్ని రేసుల్లో గెల్చిందో చెప్పలేం! దీని బ్రేకులెంత పర్ ఫెక్టు అంటే సార్, వంద కిలోమీటర్ల స్పీడులో వెళ్తున్నా సరే! బ్రేకు వేసీ వెయ్యగానే సడెన్ గా ఆగిపోతుంది! ఎక్స్ పీరియన్స్ లేనివాడైతే ఫిరంగి గుండులా ఎగిరిపోతాడు బ్రేక్ వెయ్యగానే! దీని కాస్ట్ ఏడువేల తొమ్మిది వందల నలభై తొమ్మిది అమెరికన్ డాలర్లు సర్! అంటే ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై అయిదు రూపాయలు.
లిస్టులో నెక్స్ ట్ సుజూకీ జి.ఎస్.ఎక్స్.-ఆర్ 1100 సర్! ఇది మహా హార్డ్ గా వుంటుంది. కానీ ఎంత పవరో చెప్పలేం! దీని కాస్ట్ కూడా దాదాపు అదే రేంజ్ లో వుంటుంది. రాంబో టైపు మొగాళ్ళు రైడ్ చెయ్యాల్సిన బైక్.
ఆ తర్వాత హోండా సి.బి.ఆర్-1000. ఇది నూట నలభై కిలోమీటర్ల స్పీడుతో వెళ్తున్నప్పుడు కూడా నేలమీద పడిపోయిందా అన్నంతగా పక్కకి వంచెయ్యచ్చు. టర్నింగ్స్ లో భలే గ్రిప్పు వుంటుంది సర్! కాస్ట్ అండ్ రేంజ్.
ఇకపోతే ప్రపంచంలో అన్నిటికంటే కాస్ట్ లియెస్ట్ బైక్ ఏదో తెల్సా సార్! బి.ఎమ్.డబ్ల్యూ.కె-1. జర్మన్ మోటార్ సైకిల్! ఒకసారి కొంటే ఇంక మనం పోయేదాకా సర్వీస్ చేస్తూనే వుంటుంది. 'ఖడ్గ మృగం' అని ముద్దుగా పిలుస్తారు దీన్ని! ఇంతకన్నా బరువైన బైక్ కూడా ఇంకోటి వుండదు. ఖరీదు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై అమెరికన్ డాలర్లు. అంటే మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల ఏభై రూపాయలు.
ఇలాంటి సూపర్ బైక్ ఒకటి కొనుక్కుని, కంప్లీట్ లెదర్ రేసింగ్ బట్టలు తొడుక్కుని, రైడింగ్ బూట్లు వేసుకుని, ముప్పయ్ వేల రూపాయల ఖరీదు చేసే బెల్ ఆల్ట్రా హెల్మెట్ పెట్టుకుని, నక్క చర్మంతో చేసిన గ్లోవ్స్ తొడుక్కుని రైడ్ చేస్తుంటే... సార్...సార్... మీ పోలీస్ స్టేషన్ ఇక్కడే...దాటేసి వెళ్ళిపోతున్నారు."
విని కూడా, ఏమీ మాట్లాడకుండా ముందుకు పోనిచ్చాడు కృష్ణాజీ.
హఠాత్తుగా అనుమానం వచ్చినట్లు అన్నాడు రాజా.
"ఊరి బయటకు తీసుకెళ్ళి ఫేక్ ఎన్ కౌంటర్ చేసి నన్ను చంపేస్తారా?"
"షటప్! నీ ఇంపార్టెన్స్ గురించి నువ్వే అతిగా అంచనా వేసుకోకు" అన్నాడు కృష్ణాజీ చిరాగ్గా అని, హఠాత్తుగా ఏదో గుర్తువచ్చినట్లు సడెన్ బ్రేకు వేశాడు.
ఇందాక "పోలీస్ స్టేషన్ ఇక్కడే!" అన్నప్పుడు రాజా తన కుడిచేతిని చూపించాడు.
అంటే....
చటుక్కున వెనక్కి తిరిగిచూశాడు కృష్ణాజీ.