Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 9

పెదిమ విరిచింది సులక్షణ. "అతను ఐ.ఏ.ఎస్.కి సెలెక్ట్ అయ్యాట్ట! బట్ ఐయామ్ నాట్ ఇంప్రెస్స్ డ్! ఈ రోజుల్లో ఐ.ఏ.ఎస్.లో ఛార్మ్ లేదండి! చాకుల్లాంటి కుర్రాళ్ళందరూ కార్పొరేట్ సెక్టార్ కి వచ్చేసి మల్టీ నేషనల్ కంపెనీల్లో చేరిపోతున్నారు మీలాగా! చేసుకుంటే మీలాంటి వాళ్ళనే చేసుకోవాలి!"
జుగుప్స కలిగింది రవిచంద్రకి. అంటే పెళ్ళి కూడా ఒక వ్యాపారమా? లాభనష్టాల బేరీజా?
"నాలో అన్నీ ఉన్నాయి!" అంది సులక్షణ సగర్వంగా. "నేను చాలా బాగుంటాను. అది నాకు తెలుసు. గ్రాడ్యుయేట్ ని. చీఫ్ ఇంజినీరుగారి ఒక్కగానొక్క కూతుర్ని. పదిలక్షల రెడీ కాష్ కీ, పదెకరాల పొలానికీ, చాలా ఫ్లాట్లకీ, ఈ బంగళాకీ వారసురాలిని. నాలో లేనిది ఒక్కటే - ఫాల్స్ మోడెస్టీ - అతి వినయంతో ఆత్మవంచన చేసుకోవడం."
"నీలో లేనిది ఇంకోటి కూడా ఉంది!" అనుకున్నాడు రవిచంద్ర విరాగ్గా. "ఆడపిల్లకు అన్నీ ఉన్నా, అన్నిటికన్నా అలంకారంగా ఉండవలసిన నునుసిగ్గు! అదిలేదు నీలో!"
"ఆలోచించుకోండి రవిచంద్రా! నాకు మీకంటే మంచి భర్త దొరకడు. మీకు కూడా నాకంటే మంచి భార్య దొరుకుతుందనుకోను. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా వుంటాం మనం. మీకు ఓకే అంటే, ఒకే మనసూ, ఇద్దరు మనుషులా కలిసిపోవచ్చు! ఏమంటారు?"
"నేనేమీ అనను. అన్నీ మీరే అంటున్నారు. నేను మామూలు మనిషిని - నన్నిలా బతికెయ్యనివ్వండి."
"అతి వినయం ధూర్తలక్షణం! బాగా ఆలోచించుకోండి" అని పమిట ఒకసారి పూర్తిగా తీసేసి, మళ్ళీ వేసుకుని వెళ్ళిపోయింది సులక్షణ.
తెరిపిన పడ్డట్టు ఫీలయ్యాడు రవి. తనకి మంచి ఉద్యోగం వచ్చినట్లు రేడియోలో చెప్పారా ఏమిటి? లేకపోతే అప్పుడే వీళ్ళందరికీ ఎలా తెలిసిపోయింది? తను ఎవరికీ చెప్పినట్లు గుర్తులేదే!
గబగబ షేవ్ చేసేసుకుని, గీజర్ తిప్పి, వెచ్చటి నీళ్ళతో షవర్ బాత్ చేశాడు రవి. స్నానం చేస్తుంటే అనిపించింది అతనికి. ఈ బంగళాలో, ఈ మేడ మీద, ఇంత చక్కటి రూము, ఇంత తక్కువ అద్దెకు దొరికింది కాబట్టి తటపటాయిస్తున్నాడు గానీ, లేకపోతే విదిలించికొట్టి చెప్పి ఉండేవాడు సులక్షణకి - పమిట సరిగ్గా వేసుకుని బయటికి నడు అని!
తను ఆ మాట అంటే సులక్షణ ఊరుకుంటుందా? 'రూము ఖాళీ చేసి నువ్వే బయటికి నడు' అంటుంది. బరితెగించిన పిల్ల తను.
ఈ రూము ఖాళీ చేస్తే ఇంత చక్కటి రూము మళ్ళీ దొరకదు తనకి. సుఖానికలవాటు పడ్డ ప్రాణం ఇప్పుడు ప్రయాసపడమంటే పడుతుందా?
ఉన్నవాటిల్లోకెల్లా మంచి బట్టలేసుకుని బయలుదేరాడు రవిచంద్ర.
ప్రేమ్ నగర్ అపార్ట్మెంట్స్ ముందు ఆగాడు.
చాకొలెట్ కేకు ముక్కలు ఒకదాని మీద ఒకటి నోరూరేలా పేర్చినట్లు కనబడుతోంది ఆ ప్రేమ్ నగర్ అపార్ట్ మెంట్స్ కాంప్లెక్సు.
కొద్ది సెకెండ్ల సేపు బయటనుంచి దాన్ని చూసి తర్వాత నిదానంగా లోపలికి వెళ్ళాడతను.

                                       * * * *
కారిడార్ లో కాపువేసి ఉన్నట్లు నిలబడి ఉన్నాడు జయరాజ్. ఒకళ్ళిద్దరు ఆడపిల్లలు అతన్ని చూసి దూరం నుంచే దూరంగా జరిగి గోడకి ఆనుకుని నడుస్తూ వెళ్ళిపోయారు. ఆ అపార్టుమెంట్సులో ఉంటున్న ఎవరికీ కూడా అతని మీద మంచి ఇంప్రెషన్ లేదు.
కొద్దిసేపటి తర్వాత పదహారో నెంబరు అపార్ట్ మెంటులోనుంచి బయటికి వచ్చింది భానురేఖ.
వాచ్ చూసుకున్నాడు జయరాజ్.
మధ్యాహ్నం రెండవుతోంది. ప్రతిరోజూ ఆ టైంకి ఆ అమ్మాయి అపార్ట్ మెంటులో నుంచి బయటికి వచ్చి లిఫ్టు ఎక్కుతుందని కనిపెట్టాడు అతను.
ఆ అపార్ట్ మెంట్స్ తాలూకు లిఫ్టు ఆపరేటర్ ఇంకేదో మంచి ఉద్యోగం దొరికిందని వెళ్ళిపోయాడు. ఆటోమాటిక్ గా నడుస్తోంది ఆ లిఫ్టు ఇప్పుడు. లిఫ్టు ద్వారం దగ్గర "లిఫ్టు ఆపరేటర్ వాంటెడ్" అని నోటీసు అంటించి ఉంది.
మధ్యాహ్నం పూట సాధారణంగా ఆ లిఫ్టు బిజీగా ఉండదు. అప్పుడు తను ఒక్కతే దాన్లో ఎక్కుతుంది భానురేఖ. దాన్లో పైకీ క్రిందికీ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
లిఫ్టు జుయ్ మని పైకి వెళ్ళిపోతున్నా, నైస్ గా కిందికి జారిపోతున్నా చెప్పలేనంత థ్రిల్ కలుగుతుంది. అదొక ఆటలా అయిపొయింది తనకి. తనొక్కతీ, ఇంకెవరితో సంబంధం లేకుండా, ఒంటరిగా ఆడుకోగల ఆట! ఎవరితో మాట్లాడక్కర్లేదు! మాట్లాడి ఫూలయి పోనక్కర్లేదు! ఆ ఆట చాలా నచ్చింది భానురేఖకి.
చేతులో ఉన్న పుస్తకాలు ఒకసారి సర్దుకున్నాడు జయరాజ్.
"హలో భానూ!"
"హలో అంకుల్!" అనేసి వెళ్లి లిఫ్టు ఎక్కింది భాను. బటన్ పుష్ చేసింది.
ఆరో అంతస్తుకి వెళ్లి ఆగింది లిఫ్టు.
మళ్ళీ వెంటనే బటన్ నొక్కింది భానురేఖ. లిఫ్టు గ్రవుండ్ ఫ్లోర్ కి దిగి వచ్చేసింది.
మళ్ళీ నొక్కింది బటన్.
లిఫ్టు నాన్ స్టాప్ గా ఆరో అంతస్తుకి వెళ్ళింది. మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి...
తన ఆటలో పూర్తిగా మునిగిపోయింది భానూ.
ఓపిగ్గా కాచుకుని ఉన్నాడు జయరాజ్ అవకాశం కోసం.
అదే సమయంలో ఆ కాంప్లెక్స్ లో ప్రవేశించాడు రవిచంద్ర. అక్కడ వరసగా డెకొలామ్ ప్లాంక్స్ మీద రాసివున్న పేర్లను యధాలాపంగా చదివాడు.
కానీ లాభమేమిటి? తనకు ఆ అమ్మాయి పేరుగానీ, వాళ్ళ నాన్నగారి పేరుగానీ తెలియవు. ఎలా కనుక్కోవడం? ఒక్కొక్కటిగా అన్ని ఫ్లోర్ లూ తిరిగి చూస్తే? ఆ అమ్మాయి తనకి కనబడితే కనబడొచ్చు. లేదా తనే అందరి కళ్ళలోపడి, వీడెవడో దొంగ అన్న ఇంప్రెషన్ కలిగి జనం తన మీదపడి చితక్కొట్టెయ్యొచ్చు.
ఆలోచిస్తూ నిలబడ్డాడు అతను.

 Previous Page Next Page