Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 10

లిఫ్టులో -
ఈసారి వరసమార్చింది భానురేఖ. నాన్ స్టాప్ గా అంతస్తులు దాటేస్తూ గ్రవుండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ కీ, టాప్ ఫ్లోర్ నుంచి గ్రవుండ్ ఫ్లోర్ కి వెళ్ళడం మానేసి, ప్రతి అంతస్తులో ఆగి, తలుపులు తెరిచి చూసి, మళ్ళీ పైకి వెళ్ళిపోతోంది.
అప్పుడు బయటనుంచి గ్రవుండ్ ఫ్లోర్ లోకి ప్రవేశించాడు మధుకర్ కాలే. అతను ఆ అపార్ట్ మెంట్సులోనే ఉంటాడు. కోటు హేంగర్ కి షర్టూ పాంటూ తగిలించినంత సన్నగా ఉంటాడతను. అతనిలో ప్రత్యేకత ఏమిటంటే నాన్ స్టాప్ గా గంటల తరబడి మాట్లాడ గలగడం. అంత బలహీనమైన పర్సనాలిటీకి అంత లంగ్ పవర్ ఉండడం ఆశ్చర్యమే!
అతను కాసేపి లిఫ్టు దగ్గర నిలబడ్డాడు బెల్లు కొట్టకుండా. ఏ పనైనా చేసేముందు అతి జాగ్రత్తగా ఆరా తీసి, కూపీ లాగి, తర్వాత చేసే మనిషిలా కనబడ్డాడు అతను రవిచంద్రకి. అతని ప్రతి కదలికలోనూ సీక్రెసీ కనబడుతుంది. కానీ ఆ జాగ్రత్త అంతా మాటల్లోకి వచ్చేసరికి అజాగ్రత్తగా మారుతుంది.
ఇండికేటర్ లో ఎర్రటి నెంబర్లు ప్రకాశవంతంగా వెలుగుతూ, ఆరిపోతూ, లిఫ్టు ఒక్కొక్క అంతస్తులో ఆగి, పైకి ఎక్కుతోందని సూచిస్తున్నాయి.
గ్రవుండ్ ఫ్లోర్ లోకి వచ్చి ఆగింది లిఫ్టు. తలుపులు తెరుచుకున్నాయి. మధుకర్ కాలే లిఫ్టులో ఎక్కలేదు.
భానురేఖని చూసి, పక్కకి జరిగి నిలబడ్డాడు. ఈ అమ్మాయి లిఫ్టులో ఎందుకు కిందికొచ్చిందో, ఇప్పుడు ఎక్కడికి వెళుతుందో తెలుసుకో దలుచుకున్నాడతను - తనకు సహజమైన కుతూహలంతో. లేకపోతే అతనికి కడుపు ఉబ్బిపోయేటట్లుంది. కానీ భానురేఖ దిగనే లేదు. ఒక్క క్షణం తర్వాత లిఫ్టు తలుపులు మళ్ళీ మూసుకున్నాయి. ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయాడు మధుకర్.
అదే సమయంలో రవిచంద్ర కూడా అటువైపు చూశాడు. మూసుకుపోతున్న లిఫ్టు తలుపులలోంచి మబ్బుల్లోని చంద్రుడిలా భానురేఖ మొహం కనబడింది, ఒక్క సెకెండు పాటు. వెంటనే తలుపులు మూసుకుపోయాయి.
ఒక్కసారిగా సంతోషం ముంచుకొచ్చింది రవిచంద్రకి.
గబగబ మెట్లెక్కడం మొదలెట్టాడు. అతను ఫస్ట్ ఫ్లోర్ చేరుకునేసరికి అప్పుడే కదిలి సెకెండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోతుంది లిఫ్టు. అతను థర్డ్ ఫ్లోర్ కి వచ్చేసరికి అది ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళిపోయింది. చకచక మెట్లెక్కేస్తున్నాడు రవిచంద్ర.
ఫోర్త్ ఫ్లోర్ లో అతని కాళ్ళు ఆగిపోయాయి. ఆవారాగా కనబడుతున్న ఒక కుర్రాడు లిఫ్టులోకి ఎక్కాడు. అయిష్టంగా ఆ కుర్రాణ్ణి చూస్తోంది భానురేఖ.
సందిగ్ధంగా వాళ్ళిద్దరినీ చూస్తూ నిలబడిపోయాడు రవిచంద్ర.
జయరాజ్ లిఫ్టు తలుపులు క్లోజ్ చేసేశాడు. లిఫ్టు పైకి వెళ్ళిపోయింది.
మళ్ళీ పరుగులాంటి నడకతో మెట్లెక్కడం మొదలెట్టాడు రవిచంద్ర.
అతను అయిదో అంతస్తు ఎక్కేసరికి లిఫ్టు అప్పటికే ఆరో అంతస్తులో ఆగి వున్నట్లు ఇండికేటర్ లో కనబడుతోంది.
గబగబ ఆరో అంతస్తుకి వెళ్ళాడు. అతనికి రొప్పు వస్తోంది.
లిఫ్టు అక్కడే ఆగి ఉంది. కానీ తలుపులు ఇంకా మూసుకునే ఉన్నాయి.
లిఫ్టులో నుంచి ఎవరూ దిగినట్లు కూడా కనబడటం లేదు!
రవిచంద్ర కనుబొమ్మలు ముడిపడ్డాయ్. అతని మనసు కీడు శంకించింది.
లిఫ్టు - మూసుకున్న తలుపులు - లోపల అమాయకురాలైన అమ్మాయి - ఆవారా లాంటి అబ్బాయి.
ఇంక ఊరుకోదలుచుకోలేదు రవిచంద్ర. రెండు అంగల్లో లిఫ్టుని చేరుకున్నాడు. అడ్డంగా ఉన్న ఇనప గ్రిల్ ని దబదబ కొట్టాడు.
లోపల నుంచి ఆ అమ్మాయి ఆర్తనాదం చేస్తున్నట్లు భ్రాంతి!
భ్రాంతా? నిజంగానే వినబడుతోందా?
మళ్ళీ గ్రిల్ ని గట్టిగా కొట్టాడు రవిచంద్ర.
లిఫ్టు లోపల -
"లిఫ్టు మళ్ళీ కిందికి తీసుకువెళ్ళండి అంకుల్! నేనింక ఫ్లాట్ కి వెళ్ళిపోవాలి" అంది భానురేఖ జయరాజ్ తో.
"పోదువుగాని! కొత్తరకం కామిక్సు తెచ్చాను. చదవవా?" అంటూ జయరాజ్ తన చేతిలో ఉన్న పుస్తకాలు ఆమెకి చూపించాడు. సెక్సు ఫోటోలు వున్న పుస్తకాలు అవి!
అర్థంకానట్లు అయోమయంగా వాటిని కాసేపు చూసింది భానురేఖ. "ఛీ! ఇవేంటి అసహ్యంగా ఇలా వున్నాయ్? ఏం బాగా లేవు!" అంది వెగటుగా మొహం పెడుతూ.
అదోలా నవ్వాడు జయరాజ్. "నీకు తెలియదు! ఇవే చాలా బాగుంటాయ్!"
"నేను వెళ్ళిపోతాను అంకుల్!"
"ఈ రెండో పుస్తకం కూడా చూస్తే డబుల్ డెక్కర్ చాక్ లెట్ ఇస్తా!"
"వద్దంకుల్! నే వెళ్ళిపోతా!"
"ఏమిటి వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని ఒకటే గోల! నాక్కోపం వస్తే గట్టిగా కొడతాను. మొన్న పొట్లాటలో ఒకణ్ణి కొడితే ముందు పళ్ళు మూడూ రాలిపోయాయ్!
బెదిరిపోతూ చూసింది భానురేఖ. "వద్దంకుల్! నాకు ఆకలేస్తోంది! వెళ్ళి అన్నం తినాలి!"

 Previous Page Next Page