Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 8

"ఇంగ్లీషు పుస్తకం తియ్యి"
తీసింది.
"చదువు"
పైకి చదవడం మొదలెట్టింది భాను.
"అక్కడ ఆపు! హోమోజీనిటీ అంటే ఏమిటి?"
ఆయన నవ్వాడు. "ఇప్పుడర్ధమయిందా? సిక్స్ త్ క్లాస్ పుస్తకాలయితే తను తలక్రిందులుగా ఒప్పచెప్పెయ్యగలడు, అర్థరాత్రిపూటలేపి అడిగినా సరే!
టీచరు అందించిన పుస్తకం తెరిచి చదవడం మొదలెట్టింది భానురేఖ, ఈసారి చాలా ధైర్యంగా.
నవ్వాపుకోవడానికి సతమతమయిపోతోంది పింకీ. ఇంత పెద్ద అమ్మాయి అంత చిన్నక్లాసు పుస్తకాలు చదవడం జోక్ లాగా కనబడుతోంది తనకి.
తెరలు తెరలుగా వస్తున్న పింకీ నవ్వు వింటుంటే పొరలు పొరలుగా ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్సు పెరిగిపోతోంది భానురేఖతో. మళ్ళీ మాటమాటకూ తడబడటం మొదలెట్టింది.
మాటిమాటికీ నవ్వుతోంది పింకీ.
"చూడు! చిన్నపిల్ల కూడా నవ్వుతోంది! జాగ్రత్తగా చదవాలి మరి! తప్పులు రాకూడదు!" అన్నాడు టీచరు గోపాలకృష్ణ హితబోధచేస్తూ. మనసుమీద మరో దెబ్బపడింది భానూకి.
సాటి మనుషుల నోటివెంబడి వచ్చిన ప్రతి మాటా ఒక డోసు టానిక్ లా పనిచేసి మనోశక్తి పుంజుకోవలసిన అవసరం భానూది. కానీ చెవినబడ్డ 'ప్రతిమాటా ఒక ఆశనిపాతంలా తోస్తూ, బతుకుమీద ఆశని పాతిపెట్టేస్తూంటే కృంగిపోతోంది ఆ అమ్మాయి.
పాఠాలు చెప్పేటప్పుడు క్లాసులోని మొద్దుపిల్లలని గుర్తుపెట్టుకోవాలి టీచరు. వాళ్ళకి కూడా అర్థమయ్యేస్థాయికి తను దిగివచ్చి పాఠం చెప్పాలి.
అలాగే మానసికంగా ఎదగని భానురేఖకి అర్థమయ్యేలా మాట్లాడాలంటే ఆమె లెవెలుకి తాము దిగిరావాలని ఈ మనుషులకి ఎవరు పాఠం నేర్పిస్తారు? ఫ్రాయిడ్ గనక ఇంకా బతికి ఉంటే సుతిమెత్తటి ఆ అమ్మాయి మనసునీ, అతి సున్నితమైన ఆమె మానసిక పరిస్థితినీ అర్థం చేసుకోలేని ఈలోకం మొత్తానికి సైక్రియాట్రిక్ ట్రీట్ మెంటు ఇవ్వాలని తెగేసి చెప్పివుండేవాడేమో!
తర్వాత భాను చేత లెఖ్ఖలు చేయించాడు టీచరు. సైన్సూ సోషలూ చదివించి అన్నిట్లోనూ పూర్ గా ఉందని తేల్చి బాగా 'తోమాలని' నిశ్చయించుకున్నాడు.

                                                                * * * *

వాష్ బేసిన్ ముందు నిలబడి షేవ్ చేసుకుంటున్న రవిచంద్ర ఆలోచనలో పడ్డాడు.
ఎంత బాగుంది ఆ అమ్మాయి! ఎక్కడుంటుందో తెలుసుకున్నాడు గానీ పేరేమిటో అడగలేదు తను. ప్రేమ్ నగర్ అపార్ట్ మెంట్స్ లో ఉంటుందా? అవి డీలక్స్ లగ్జరీ అపార్ట్ మెంట్స్, తనకి తెలుసు.
ఇప్పటికిప్పుడెళ్ళిపోయి, ఆ అమ్మాయిని 'నీ పేరేమిటి?' అని అడిగితే?
'ఎందుకు అంకుల్?' అంటుందేమో! ఎందుకలా  మాట్లాడుతోంది ఆ అమ్మాయి? మతి స్థిమితం లేకనేనా? విధి ఒక్కొక్కరి పట్ల చాలా క్రూరంగా ఉండగలదు!
లేకపోతే...
మనిషి ఎదిగింది గానీ మనసు ఎదగలేదా? ఏ చైల్డ్ ఇన్ ఏ ఉమెన్స్ బాడీలాగా?
ట్రీట్ మెంటు ఏమన్నా ఇప్పిస్తున్నారా తల్లిదండ్రులు? ఎక్కడ? డాక్టరెవరు?
"హలో!" అంది ఒక అమ్మాయి గొంతు.
తిరిగి చూశాడు రవి.
గది గుమ్మానికి వయ్యారంగా అనుకుని నిలబడి ఉంది సులక్షణ. ఇంటి ఓనరుగారి అమ్మాయి.
"అద్దంలోని మీ ప్రతిబింబంతో మీరే ప్రేమలో పడిపోయారేమిటి? ఆశ్చర్యమేమీ లేదులెండి! ఎవరైనా పడిపోతారు మీతో ప్రేమలో! నవమన్మథులు కదా!"
"ఈ అమ్మాయికి సిగ్గు తక్కువ!" అనుకున్నాడు రవిచంద్ర, పైకి చిరునవ్వుతో "హలో!" అంటూ.
"లోపలికి రావచ్చా?"
"బై ఆల్ మీన్స్! రండి! ఇది మీ ఇల్లు! నేను మీ ఇంట్లో రూంలో అద్దెకుంటున్నాను అంతే!"
"మా ఇల్లు నాకు నచ్చలేదు! నేను మీ గుండెల్లో గూడు కట్టుకుని వుండిపోదామనుకుంటున్నాను."
"ఖాళీ ఉండొద్దూ?"
"ఇప్పటికే ఎవరన్నా ఉంటున్నారా ఏం?"
"అదికాదు అర్థం! నా గుండెనిండా గుబుళ్ళూ, దిగుళ్ళూ - వీటికే చోటు చాలడం లేదు. ఇంక మీరు కూడా ఎక్కడ ఉంటారు?"
"నేను అడుగుపెట్టానంటే మీ దిగుళ్ళన్నిటినీ తలో దిక్కుకీ తరిమేస్తాను! అయినా మీకు దిగుళ్ళేమిటండీ బాబూ! ఎం.బీ.ఏ. చదివారు. ఏ వన్ జాబ్ సంపాదించారు. రేపు సలక్షణంగా ఎ సులక్షణనో పెళ్ళిచేసుకుంటారు! అవునా?" అంది ఓరగా చూస్తూ. ఆమె పమిట జారిపోయి వుంది. పరుగులెడుతున్న పరువం పొగరుగా ఛాలెంజ్ చేస్తున్నట్లు కనబడుతోంది.
మొహం తిప్పుకున్నాడు రవిచంద్ర.
"ఇవాళ నాకు పెళ్ళిచూపులు!" అంది సులక్షణ.
"బెస్ట్ ఆఫ్ లక్!"

 Previous Page Next Page