రాజేశ్వరికి యిదంతా ఎందుకొచ్చిందో, దీని పర్యవసానం ఏమిటోనన్న బెంగ లోలోపల వుంది. ఇండియా వెళ్ళి వచ్చిం దగ్గిరనించి చూద్దాం. భర్త తలపెట్టిన పనేదో బాగానే వుండేట్టుంది అనిపించసాగింది. సరే ఆయనన్నట్టు డబ్బు కాస్త ఖర్చవుతుంది. ఆయన సరదా తీరనీ అనుకుని మనసు సమాధానపడింది.
జనవరి 1వ తేది కొత్త సంవత్సరంనాడు గ్రామదత్తత, యింటి గృహప్రవేశం రెండూ ఒకేసారి జరిగేట్టు ఏర్పాట్లు చేసుకున్నారు కేశవరావు. అన్నట్టుగానే మూడు నెలల తరువాత అమెరికా వదిలి ఆరునెలల టెంపరరీ వీసామీద ఇండియా వచ్చారు. అంతకు నెల ముందే అవసరమైన సామానులు అన్నీ షిప్పులో వేశాడు. కొన్ని వైద్యపరికరాలు, మందులు, చిన్న చిన్న సర్జరీలకి కావాల్సిన ఎక్విప్ మెంట్లు, వగైరాలన్నీ ప్యాక్ చేసి షిప్ లో పంపారు.
కేశవరావు వచ్చేసరికి ఇంటిపని తొంభైశాతం పూర్తయింది. ఫినిషింగ్ టచస్ యిస్తున్నారు. మెహతా, సునీత - రాజేశ్వరిని వెంటబెట్టుకురాకుండా ఆవిడ అన్నగారింట్లో వదిలేశారు. ఆఖరి క్షణం నీకు న్యూ ఇయర్ సర్ ప్రైజ్ గిఫ్ట్ గా ఇస్తాను ఆ ఇల్లు అన్నాడాయన. నిజంగా మెహతా, సునీతల పనితనం శ్రద్ధ ఆ ఇంటి రూపురేఖలు ఎలా మార్చేశాయో చూసిన కేశవరావుగారే అదే పాత ఇల్లు అంటే నమ్మలేకపోయారు.
ఆఖరి పదిరోజులు రాత్రింబవళ్ళు లైట్లు పెట్టుకుని పనిచేశారు అంతా. కేశవరావు అక్కడే ఉండిపోయి చివరిక్షణాలలో పనులు అన్నీ దగ్గరుండి చేయించాడు. వంటలకి షెడ్ -పనివారికి టెంపరరీ బాత్ రూము- ఇంటి వరండాలో మడత మంచాలో పడక - యుద్ధప్రాతిపదికన పనులు జరిగాయి. యింటి పని కేశవరావు చూసుకుంటే దత్తత కోసం వూరిని అలంకరించడానికి రంగా పూనుకున్నాడు.
ఊరిలో కుర్రకారుని కూలీలని అందరినీ కలిపి ఊరు శుభ్రం చేయించి ముఖ్యమంత్రి రాకకోసం అట్టహాసంగా ఆర్చీలు, బానర్లు, కటౌట్లు, తోరణాలు...యింటిముందు సభకి షామియానాలు, లైట్ల ఏర్పాట్లు అన్నీ చూసుకున్నాడు.
గృహప్రవేశం ముహూర్తం ఉదయం పదిన్నరకి, గ్రామ దత్తత ముహూర్తం పన్నెండున్నరకి. ఆ వేళకి ముఖ్యమంత్రి, వూరిలో పెద్దలు, డిస్ట్రిక్ కలెక్టరు, పోలీసు సూపర్నెంటు, హైదరాబాదు నుంచి పంచాయితీ రాజ్ మంత్రి, ఆ వూరి ఎమ్మెల్యే- చీఫ్ సెక్రటరీ... హైదరాబాదులో తనకి తెల్సిన బంధువులు, మిత్రులకి అందరికీ గృహప్రవేశం, ఆహ్వానం, దత్తతు అయ్యాక లంచ్ ఏర్పాట్లకి హైదరాబాదు నుంచి పిలిచి ఏర్పాట్లు చేయించారు.
ఊరు మొత్తం అందరికీ లడ్డూలు పంచే ఏర్పాట్లు చేశారు. గత పదిరోజుల నుంచి అన్నిరకాల ఏర్పాట్లుతో కేశవరావు తలమునకలైపోయారు. ఆఖరి క్షణం వరకు రాజేశ్వరిని రావద్దన్నారు అతను.
గత రాత్రి రైలులో బయలుదేరి స్టేషన్ నుంచి టాక్సీలో అన్నావదినలతో తొమ్మిదిన్నరకల్లా వచ్చింది రాజేశ్వరి. ఊరు ఊరంతా పండగ సంబరంలా ఎక్కడ చూసినా మామిడి తోరణాలు, రంగు కాగితాలు, ఆర్చీలు ఆవిడకి స్వాగతం చెప్పాయి.
పదిన్నరకి శాస్త్రోక్తంగా గుమ్మడికాయ, కొబ్బరికాయ గుమ్మానికి కొట్టి బ్రాహ్మాణులు మంత్రాల మధ్య దేముని పటం, కలశం పట్టుకుని రాజేశ్వరి, కేశవరావులు కుడికాలు పెట్టి గృహప్రవేశం చేశారు. గుమ్మంలో అడుగుపెట్టకముందే బయటినించే యిల్లు ఎలా మారిపోయిందో సంభ్రమాశ్చర్యానందాలతో చూసింది రాజేశ్వరి. "ఏమిటి యిది ఆ యిల్లే..." అంది.
"లోపల చూశాక అందువుగాని. ఆశ్చర్యం, ఆనందం దాచుకో-" కేశవరావు సంబరంగా అన్నాడు. మండువాలో పూజాకార్యక్రమం జరిపించాడు పౌరోహితుడు. దేముని గదిలో మందిరంలో దేవతా విగ్రహాలు ప్రతిష్ఠ చేయించాడు. యింట్లో అడుగుపెట్టిన దగ్గిరనుంచి రాజేశ్వరికి ఆశ్చర్యానందాలతో తబ్బిబ్బు అయిపోయింది. పూజ మీద మనసు నిలువలేదు. యాంత్రికంగా పౌరోహితుడు చెప్పింది చేస్తున్నా ఆవిడ దృష్టి అంతా యింటిని పరికించడంలోనే వుంది. పూజ అయిందనిపించి పీటల మీద లేచాక ఆరాటంగా యిల్లంతా కలియ తిరిగింది రాజేశ్వరి.
"ఆర్ యూ సేటిస్ ఫైడ్ మేడమ్..." రాజేశ్వరి మొహంలో సంతోషము గమనించి మెహతా అన్నాడు. రాజేశ్వరి నోట మాటరానట్టు ఆనందంగా తల ఆడించింది.
"ఓ ఫెంటాస్టిక్. మార్వలెస్...నేనెప్పుడూ అనుకోలేదు. ఈ ఇంటిని ఇంత బాగా చెయ్యొచ్చని. రియల్లీ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్... థాంక్స్ ఎలాట్. ఐ మస్ట్ కంగ్రాచ్యులేట్ యూ..." మనస్పూర్తిగా మెచ్చుకుంది రాజేశ్వరి.
"ఇంత కష్టపడి ఇండియా వచ్చి, డబ్బు ఖర్చుపెట్టి చేయిస్తే నాకేం లేవా. కంగ్రాచ్యులేషన్స్..." కేశవరావు నవ్వుతూ అన్నాడు. కేశవరావు కళ్ళు చెమ్మగిల్లాయి. నిజంగా మీరు సాధించారు. అనుకున్నది చేసి చూపారు.
"అప్పుడే. అనుకున్నదానిలో ఇది ఆరంభం మాత్రమే..."
"లేదు. మీరు సాధిస్తారు. ఈ యిల్లు చూశాక నాకు నమ్మకం కలిగింది. మన అమెరికాలో యింటి స్టాండర్డ్ లాగే ఉంది. అబ్బ ఎంత కళాత్మకంగా తీర్చిదిద్దారు. డ్రాయింగ్ రూమ్ మెరిసేనేల, అమర్చిన ఎలక్ట్రికల్ ఫైటింగ్స్, గోడలని అలంకరించిన తంజావూరు చిత్రాలు, ఓ పక్క ఓ పెద్ద పెయింటింగ్. ఇన్ డోర్ ప్లేంట్స్ బెడ్ రూములో పాతకాలం నాటి పెద్ద పందిరిమంచంని ఎంత అందంగా మంచిపరుపులు, కుషన్స్ లో అమర్చారు.
తాతగారి నాటి నగిషీల సందుకు పెట్టిన పాలిష్ ఎంతబాగా కనపడేట్టు అమర్చారు. మామగారి టైములో బట్టల బీరువా, బెస్ట్ ఆఫ్ డ్రాయర్స్. అన్నీ పాలిష్ చేసి విక్టోరియస్ టైపు ఫర్నిచర్ మాదిరి చేశారు. మండువాలోగిలిలో గుజరాతి ఎత్తు తక్కువ ఫర్నిచర్. టి.వి. అవి అమర్చి ఫామిలీ సిటింగ్ ప్లేస్ చేసిన తీరు, మెమోలు అమర్చిన తీరు- అన్నింటికంటే అమెరికా స్టాండర్డ్ కి తగినట్లున్న బాత్ రూములు - పొగచూరిన మసిబారిన గోడలతో ఉండే వంటగది వింత మోడర్న్ గా మారింది...మండువా మధ్యలో తను చెప్పాలని మర్చిన తులసికోట-పాత గంగాళం, గాబులు పాలిష్ చేయించి ఇన్ డోర్ ప్లేంట్లు అమర్చారు. మంచి కర్టన్లు- ఇంట్లో అమర్చిన తివాచీలు, జంబుకానాలు ఎటు చూసినా కళాత్మకంగా తీర్చిదిద్దారు.
ఆ పాత యింటిని ఇంత అద్భుతంగా మార్చవచ్చని, యిది చూడందే ఎవరూ నమ్మరని అన్పించింది రాజేశ్వరికి. ఇంటి విషయంలో ఆమె అనుమానం తీరిపోయింది. వసతి కారణంగా తనిక్కడ ఉండలేమోననే భయం తీరింది. "హా... డబ్బుంటే తిమ్మిని బమ్మి చేయడం అంతే యిదేనేమోననిపిస్తుంది నాకు" అంది రాజేశ్వరి అన్నీ చూసివచ్చి.
"డబ్బున్నా టేస్ట్ వుండాలి రాజేశ్వరిగారు. మీ వారికి టేస్ట్ వుంది కాబట్టే ఆయనకి ఏం కావాలో చెప్పారు" మెహతా నవ్వుతూ అన్నాడు.
"చెప్పింది నేనయినా అది చేసి చూపింది మీరు. మరోసారి మీకు నా కృతజ్ఞతలు" కేశవరావు మనస్పూర్తిగా సునీత, మెహతా లని అభినందించారు.
"పన్నెండయింది - ముఖ్యామంత్రిగారు వచ్చే వేళయింది. అందరూ బయటకు పదండి. స్వాగతం చెప్పాలి. మనం ఆయనకీ అప్పటికే బయట వేసిన షామియానాల్లో జనం వున్నారు. కలెక్టరు, డి.ఎస్.పి., ఎమ్మెల్యే అందరూ బయటనుంచుని ముఖ్యమంత్రికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా వున్నారు.
సరిగ్గా పన్నెండు పది నిమిషాలకి ముఖ్యమంత్రి దంపతుల కారు, వెంట మంది మార్భలంతో అరడజను కార్లు వచ్చాయి. కేశవరావు ఎదురువెళ్ళి చేతులు కలిపి ముఖ్యమంత్రి దంపతులని ఆహ్వానించి సభకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చూపు ఇంటిమీద పడింది. బయటనించే ఎంతో చక్కగా కన్పించిన యిల్లు చూసి తల పంకించారు. "సార్ లోపలికి రండి... ఇప్పుడే గృహప్రవేశం తంతు పూర్తయింది. మీరు ఒకసారి లోపలికి అడుగుపెడితే ... కేశవరావు నవ్వుతూ "ష్యూర్ తప్పకుండా అంటూ లోపలికి అడుగుపెట్టి అతనూ సంభ్రమాశ్చర్యాలకి లోనయి ఫెంటాస్టిక్, యూ డిడ్ యూ గుడ్ జాబ్ సార్ - పాత పెంకుటింటిని యింత అద్భుతంగా తీర్చిదిద్దారు. మీ అమెరికా స్టాండర్డ్ కి తగినట్టు మార్చేశారు" ఇల్లంతా కలయతిరిగి ప్రతిదీ చూసి మెచ్చుకున్నారు ముఖ్యమంత్రి.