"ఆ... రంగా, నీవు ఈ ఇల్లు వారం పదిరోజుల్లో ఖాళీ చేయాల్సి వుంటుంది. పని ప్రారంభించడానికి. ఈ వూర్లో నీకు వుండడానికి అద్దెకేమన్నా యిల్లు..."
"ఈ వూర్లో అద్దెలకి ఎక్కడ వుంటాయి మామయ్యా" దిగులుగా అన్నాడు.
"మీ ఇల్లు వుండాలి గదా, ఏమయింది. దాన్లోకి మారవచ్చు గదా ప్రస్తుతానికి."
"ఆ ఇల్లు యిల్లులా ఎక్కడుంది మామయ్యా. అమ్మా, నాన్న మేమంతా ఇక్కడికి రాగానే ఆ ఇంట్లో రైతు వుంటానంటే ఉండమన్నాం. అమ్మా, నాన్న పోయాక ఆ పడిపోతున్న కొంప అన్నయ్య అమ్మడానికి చూస్తే యిక్కడెవరుకొనేవారు. అది అలాగే వుంది. మీ పొలం చూస్తే నర్సింలు దాంట్లో వుంటున్నాడు."
"ప్రస్తుతానికి అది ఖాళీ చేయించి నీవు మారు దాన్లోకి. వాడికి కావాలంటే పొలంలో పాక వేసుకోమను...నీకేదన్నా ఏర్పాటు చేస్తాలే. ఆ జాగాలోనే ఓ రెండు గదుల యిల్లు కట్టిద్దాం. ఈ పని పూర్తి అవగానే నీవక్కడ వుండవచ్చు.
అప్పటికి రంగ మొహంలో కాస్త కళ వచ్చింది. ఏదో వీధిన పడకుండా వుండేందుకు కొంప కట్టిస్తానంటున్నాడు అని మనసులో సంతోషపడ్డాడు" మరి పొలం అది..."
"చూద్దాం... చూద్దాం... అన్నీ ఒకేసారి ఆలోచించవద్దు...ముందు మేం ఇక్కడికి వచ్చాక మిగతా సంగతులు. ఆ...నేనిలా యిక్కడికి వుండటానికి వస్తున్నట్టు వూర్లోవారికి ఎవరికన్నా తెలుసా... అసలు మనకు తెల్సిన వాళ్ళెవరన్నా మిగిలారా యీ వూర్లో... వూర్లో పెద్దవాళ్ళు ఎవరున్నారు. ఈ వూరి పంచాయితీ ప్రెసిడెంటు ఎవరు. వూరి విశేషాలు కాస్త చెప్పు."
"మీకు తెల్సిన కుటుంబాలు ఎవరూ లేరనుకుంటాను. ఒక్క పూజారిగారి కుటుంబం వుంది. మాధవయ్యగారు పండు ముసలి. మీతో చదివిన హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారి అబ్బాయి చిన్న అబ్బాయి డాక్టరయి చాలారోజులు ఈ వూర్లోనే ప్రాక్టీసు పెట్టి డబ్బులు సరిగా రాక ఏదో కంపెనీలో ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాడు. వూర్లో పెద్దలంటే ఎమ్మెల్యే బుచ్చిరెడ్డి, పంచాయితీ ప్రెసిడెంటు అంజినాయుడు, హెడ్ మాస్టర్ సాంబశివరావు, మునసబు రమణారావు , కరణం గోపాలయ్య లాంటివాళ్ళు నలుగురైదుగురు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడే కనిపిస్తారు. మిగతా టైము హైదరాబాదులోనే వుంటారు. బి.డి.వి ఆఫీసుంది. పక్కవూర్లో మూడు కిలోమీటర్లు దూరంలో పేరుకి ఓ గవర్నమెంటు ఆస్పత్రి వుంది. సగం రోజులు డాక్టరుండడు. ఓ చిన్నసైజు లైబ్రరీ వుంది. కాని ఈ టీ.వీ.లు వచ్చాక లైబ్రరీలకు ఎవరెడుతున్నారు. అక్కడ ఓ టీ.వీ. వుంది. సాయంత్రం కాసేపు కూలి నాలి చేసుకునే రైతులు చూస్తారు. అక్కడికి వెళ్లి నిత్యావసరాలకి ఓ మాదిరి మార్కెట్ వుంది.
నాలుగైదు చిన్నచిన్న పాకా హోటళ్ళున్నాయి. బస్సు స్టాండు ఉంది. ఉదయం ఓ రెండు బస్సులు, మధ్యాహ్నం ఓ రెండు బస్సులు యిటు అటు వచ్చి పోతుంటాయి. ఓ చిన్న పాక సినిమాహాలు వుంది. ఏదో కరెంటు వచ్చి టీ.వీ.లు వచ్చాయి గాని లేకపోతే యిక్కడ అసలు తోచదు మామయ్యా."
"ఏమిటో మామ పల్లెలు పల్లెలుగానే వుండిపోతున్నాయి. పల్లెలు ఖాళీ అయి సిటీలో విపరీతంగా జనాభా పెరిగిపోతుంది. ఇదే అమెరికాలో అయితే జనం సిటీలో వుండటానికిష్టపడరు. ఊరికి, గోలకి దూరంగా ప్రశాంత వాతావరణంలో వుందామనుకుంటారు" కేశవరావు అన్నాడు.
"సరే, అక్కడ పల్లెలు ఎలా వుంటాయి. ఇక్కడ ఎలా ఉన్నాయో చూశాంగా. అక్కడంటే మంచి రోడ్లు, అందరికీ కార్లుంతాటా గనుక ముప్పై నలభై మైళ్ళు సిటీ పొలిమేరల్లో వుండటానికి ఇష్టపడతారు. అక్కడలా రోడ్లు, నీళ్ళు, చదువు, ఆస్పత్రి, పని దొరికేచోటు వుంటే ఇక్కడా వుంటారు" రాజేశ్వరి అంది.
"అదే నేను చెప్పేది. జనం అన్నీ గవర్నమెంటు చెయ్యాలనుకోకుండా తమ చేతనయిన సాయం చేస్తే పల్లెలు అభివృద్ధి పొందుతాయనేగా ముఖ్యమంత్రి చెప్పింది. మనలా కొందరొస్తే సదుపాయాలూ క్రమంగా అవే సమకూరుతాయి. జనం ఉన్నచోట వ్యాపారులు వస్తారు. నలుగురు కల్సి రోడ్లు, వైద్యం,విద్య అన్నీ ప్రయివేటు వ్యక్తులే సదుపాయాలూ సమకూర్చుకోవచ్చు. అందుకేగా ప్రతి ధనవంతుడు తలో గ్రామాన్ని దత్తత తీసుకోమని చెప్పింది."
"ఇదీ రంగా ఈయన వరస. ఆ ముఖ్యమంత్రి మాటలు ఈయన తలకి బాగా పట్టాయి. ఒక్క పల్లెని మార్చినా జీవితం ధన్యం అయిపోతుందంటూ మొదలుపెట్టారు" రాజేశ్వరి హాస్యంగా అంది.
"పోనీలే అత్తయ్యా! మామయ్యని చూసి అలాంటివారు మరికొందరు ముందుకి వస్తే ఈ పల్లెలు బాగుపడతాయేమో. అదే జరిగితే మనకంతకంటే కావల్సింది ఏముంది"
"రంగా! చూడు. ఈ వూరు నావూరయినా దీనికి నేను కొత్తే. ఇక్కడ నాకు అన్నింట్లో నీవు నాకు తోడుగా ఉండాలి. నా కల ఫలించాలంటే నీతోడు నాకు కావాలి. పొలం సంగతులు, వూర్లో రాజకీయాలు, అన్నీ నాకు కొత్తే. నీవే నన్ను ముందుకు నడిపించాలి."
"అంతకంటేనా మామయ్యా. నాకు తిండి, నీడ యిచ్చినవాళ్ళు మీరు. ఇన్నాళ్ళకి నా కృతజ్ఞత చూపుకునే అవకాశం వచ్చింది. నీవు ముందుండు, నేను అన్నీ చూసుకుంటాను." రంగకి కృతజ్ఞతతో కళ్ళు చెమర్చాయి. కేశవరావు నవ్వి మేనల్లుడి భుజం తట్టాడు.
హైదరాబాదు తిరిగివచ్చి మెహతా యిచ్చిన ప్లాను, ఎస్టిమేటు అన్నీ పరిశీలించి పని ఆరంభించడానికి సిగ్నల్ యిచ్చాడు కేశవరావు. పదిహేనో తారీఖు పని ఆరంభించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదులో వారం రోజులు వుండి ముఖ్యమంత్రిని కల్సి గ్రామం దత్తతు తీసుకునే ఏర్పాట్లు, ఆ గ్రామం వివరాలు అన్నీ మాట్లాడారు. ఇల్లు పూర్తవగానే వచ్చి కలుస్తానని చెప్పాడు కేశవరావు. మెహతాకి మళ్ళీ మూడు నెలల్లో వస్తానని కొత్త సంవత్సరంకి తయారవ్వాలని చెప్పి తిరిగి అమెరికా బయలుదేరారు ఇద్దరూ.
ఇన్నాళ్ళు ఇండియాలో వుండి చేసేదేంలేదని అమెరికాలోవారు చేసుకోవాల్సిన ఏర్పాట్లున్నాయి. టెంపరరీ వీసా తీసుకోవాలి. అక్కడ పరిస్థితులు ఓ ఏడాది చూసి వుండగలరో లేదో నిర్ణయించుకునే వరకు తమ సిటిజన్ షిప్ కాన్సిల్ చేయించదలచలేదు. టెంపరరీ వీసా మీద కొన్నిసార్లు వచ్చి పోవచ్చు. ఓ ఏడాదిపాటు చూసాకే ఏదో నిర్ణయం తీసుకోవచ్చు అని నిర్ణయించుకున్నారు.
అమెరికాలో యిల్లు, సామానులు అలాగే వదిలేసి నా పిల్లలు ఎవరో ఒకరు వచ్చి అప్పుడప్పుడు క్లీన్ చేయించాలి. కూతురు దగ్గరుంది కనక ఆపని కూతురికి అప్పచెప్పాలి. తన పేషెంట్లని తన అసిస్టెంట్లు చూస్తారని అప్పగింతలు పెట్టాలి. ఇండియా తీసుకొచ్చే సామాను ప్యాక్ చేయించి షిప్ లో పంపాలి. గార్డెన్ మెయిన్ టైన్ చేయడానికి మనిషిని చూడాలి. డాలర్లు ఇండియాలో బ్యాంక్ ఎకౌంట్ కి మార్పించాలి.
"ఏమిటో వుండగలమో లేదో తెలియకుండా ఓ పది, పదిహేను లక్షలు ఖర్చుపెట్టడం... ఆ పాత ఇంటిమీద అంత ఇన్వెస్ట్ మెంట్" సణిగింది రాజేశ్వరి మెహతా ఇచ్చిన ఎస్టిమేషన్ చూసి.
"అవుతుంది మరి. అన్ని సదుపాయాలూ కావాలంటే. మన స్టాండర్డ్ తగినట్టు వుండాలంటే ఆమాత్రం ఖర్చవదా. ఆయన సంపాదనకి పది పదిహేను లక్షలు అంటే చికెన్ ఫీజ్ అనుకుంటారు.
"మన దగ్గిరున్న డబ్బులో ఇది ఏమాత్రం రాజీ. మనం ఎవరికి పెట్టాలి గనక. పిల్లలిద్దరూ వాళ్ళే బోలెడు సంపాదించుకుంటున్నారు. ఇద్దరికీ చెరో ఇల్లు యిస్తాం రాజీ... ఒక లిమిట్ తరువాత డబ్బుకి విలువ వుండదు. అన్ని సదుపాయాలు, సుఖాలు అమర్చుకున్నాక లక్షలు ఏం చేస్తాం... నోట్లు తినం గదా..."
"బాగుంది వేదాంతం... ఈ డబ్బు కోసమేగా ఈ దేశం వచ్చింది."
"అవును... డబ్బు కోసమే వచ్చాం - అది మనల్ని శాసించే స్థాయి దాటి డబ్బుని మనం శాసించే స్థాయికి వచ్చాక డబ్బుకి విలువ పడిపోతుంది."