Previous Page Next Page 
జన్మభూమి పేజి 10

    "ఈ క్రెడిట్ వీరిద్దరికీ దక్కుతుంది సార్." అంటూ మెహతా, సునీతలని పరిచయం చేశాడు కేశవరావు.
    "ఓ ఐయామ్ గ్లాడ్ టూ మీట్ యూ... మా హైదరాబాదు ఇంటికంటే ఇదే బాగుంది... ఇది చూస్తుంటే ఇకమీదట పల్లెటూర్లలో పెంకుటిళ్ళకి గిరాకీ పెరిగిపోతూందనిపిస్తుంది. ఎనీ హౌ మిస్టర్ మెహతా, హైదరాబాదులో ఒకసారి నన్ను కలవండి. మా యింటికి కాస్త మార్పులు, చేర్పులు చేయాలనిపిస్తుంది ఇది చూస్తుంటే- భార్య కూడా మెచ్చుకోలుగా అన్నీ చూడడం గమనించి ముఖ్యమంత్రి నవ్వుతూ అన్నాడు.
    డాక్టర్... మీ మొదటి విజయం ఇది. మొదటిమెట్టు ఎక్కేశారు. పదండి. రెండో మెట్టు ఎక్కుదురుగాని నవ్వుతూ అని కేశవరావు చెయ్యి పట్టుకుని సభాప్రాంగణానికి నడిపించుకు తీసుకువెళ్ళారు ముఖ్యమంత్రి.
    వూరువూరంతా చిన్నా పెద్దా అంతా అక్కడ గుమిగూడారు. సరిగ్గా పన్నెండున్నరకి పౌరోహితుల వేద పఠనం, సన్నాయి మోగుతూండగా = శాస్త్రోక్తంగా, చట్టపరంగా ముఖ్యమంత్రి చేత గ్రామం కేశవరావుకి దత్తత చేయించారు. పూజా తంతు ముగియగానే ముఖ్యమంత్రి ఉపన్యాసం మొదలైంది.
    "ఈరోజు ఈ వూరి ప్రజలందరికీ శుభదినం - ఈ గ్రామానికి ఈరోజునించి మంచిరోజులు ఆరంభమవుతున్నాయి అనడానికి నిదర్శనమే ఈ దత్తత కార్యక్రమము. దత్తత అంటే యిన్నాళ్ళు సంతతి లేనివారికి తమ సంతానంలో ఒకరిని 'దత్తత' ఇవ్వడం మాత్రం మనకు తెలుసు- అంటే ఆరోజునించి ఆ పిల్ల, పిల్లవానికి ఆ తల్లితండ్రులు యింటిపేరు, ఆస్థిపాస్తులు సంక్రమిస్తాయి. వారికి బిడ్డ మీద, బిడ్డకి ఆ తల్లిదండ్రుల మీద అన్ని అధికారాలు లభిస్తాయి- అలాగే మా ప్రభుత్వం ఈనాడు ఈ గ్రామాన్ని డాక్టర్ కేశవరావుగారికి దత్తత ఇచ్చింది. అంటే ఈ గ్రామాన్ని ఈరోజు నుంచి ఆయన కన్నబిడ్డలా చూసుకుంటారు. గ్రామం నుంచి చెడ్డల భారాన్ని వహిస్తారు. బిడ్డని పెంచి పోషించినట్లు గ్రామాన్ని ప్రగతివైపు నడిపించడానికి ఆయన ముందుకు వచ్చారు. ఈ వూరి ప్రజలని ఆయన కన్నబిడ్డలుగా భావించి మీ మంచిచెడ్డలు ఎత్తిచూపే మార్గదర్శకులు అవుతారు. ఈ గ్రామాన్ని మేం ఆయనకి ఎందుకు దత్తత ఇచ్చాం? నలుగురు బిడ్డలున్న సామాన్య తల్లిదండ్రులు తమ బిడ్డల్లో ఒక బిడ్డ అయినా సుఖంగా, సిరిసంపదల మధ్య సుఖపడుతుందని ధనవంతులకిస్తారు.
    అలాగ్ బీదదేశం అయిన భారతదేశంలో ఒక గ్రామమైనా బాగుపడుతుందన్న ఆశతో మేము సిరిసంపదలున్నవారు ముందుకు వచ్చి తమ తమ గ్రామాల పురోభివృద్ధికి సహకరించాలని ఆ విధంగా వారి డబ్బు సద్వినియోగవడమేకాక, ఒక మంచి పని చేసి తాము పుట్టిన 'జన్మభూమి' రుణం కొంతయినా తీర్చుకోగలిగామన్న సంతృప్తి వారికి దక్కుతుందని మాకనిపించి 'జన్మభూమి' కార్యక్రమంలో ఇలాంటి దత్తత కార్యక్రమంలో డబ్బున్న అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపు ఇచ్చింది రాష్ట్రప్రభుత్వం- క్రితంసారి ప్రవాస భారతీయులని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించాలి అన్న నా సూచనకి చాలామంది ప్రవాస భారతీయులు తమ డబ్బు తమ రాష్ట్రంలో అనేక కర్మాగారాల్లో పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పుడు నేనన్నమాటలు డాక్టర్ కేశవరావుగారిని ప్రభావితం చేసి ఆయన్ని ఆలోచింపచేసి ఇలాంటి మంచి పనికి నాంది పలికారు.
    డాక్టర్ కేశవరావుగారు అమెరికాలో గొప్ప డాక్టర్. మన ఆంధ్రరాష్ట్రం నుంచి వెళ్ళి పెద్ద చదువులు చదివి డాక్టరుగా రెండు చేతులా సంపాదించి మనదేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన భారతీయులకి ఆయన ఒకరవ్వడం మనరాష్ట్రానికి గర్వకారణం - అలాంటి గొప్ప డాక్టరు అమెరికా దేశంలో వుండే సుఖభోగాలను వదులుకుని ఇలాంటి కుగ్రామంలో వుండేందుకు వచ్చారంటే ఆయనకి 'జన్మభూమి' పట్ల వున్న ప్రేమాభిమానాలు ఎలాంటివో అర్థం అవుతుంది. ఆయన తను పుట్టిపెరిగిన వూరి పురోభివృద్ధి కోసం ఎంతో త్యాగం చేసి వచ్చిన వ్యక్తిగా మనందరి గౌరవాభిమానాలు ఆయన అందుకున్నారు. అలాంటి డాక్టర్ గారికి ఈ ఊరిని అప్పచెప్పాను. వారి చేతుల్లో ఈ గ్రామం క్షేమంగా వుంటుందన్న విశ్వాసం నాకుండబట్టే ఈ గ్రామం వారికి దత్తత యిచ్చానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మీరు చేపట్టే మంచి పనులకి మా ప్రభుత్వం అన్ని విషయాలలో చేయూతనిస్తుందని యిందు మూలంగా తెలియచేస్తున్నాను.  
    ఆయన ఏ పథకాలు చేపట్టినా, ఏ కార్యక్రమాలు చేపట్టినా 'జన్మభూమి' కింద ప్రభుత్వం తనవంతు ఆర్ధికసాయం అందిస్తుంది. ఆయన ఇక్కడ స్థిరపడి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆయనకి తోచిన ఉచిత రీతిలో గ్రామాభివృద్ధికి పాటుపడతారని రాత పూర్వకంగా మాకు రాసి యిచ్చారు. అంటే 'లా' ప్రకారం ఈ గ్రామం మంచిచెడ్డల బాధ్యత ఆయనదే. వారికి ఈ వూరి ప్రజలందరూ అన్నివిధాల సహాయ సహకారాలు అందించాలని ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.
    ఈనాడు కేశవరావుగారిని చూసి మరింతమంది ముందుకొచ్చి ఆర్థికంగా వున్నవారంతా యిలా తలో గ్రామాన్ని దత్తత చేసుకుని గ్రామ పురోభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తున్నాను. గ్రామాభివృద్దే దేశాభివృద్ధి- పల్లె సీమలే భాగ్య సీమలు - పల్లెలు వృద్ధి చెందందే దేశాభివృద్ధి సాధ్యపడదు అని గాంధీమహాత్ముడు ఏనాడో చెప్పారు. అలాంటి శుభతరుణం నేడు ఆసన్నమైంది మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో.
    ఇది ఉదాహరణగా తీసుకుని భవిష్యత్తులో అనేకులు ముందుకు వస్తారన్న ఆశ నాకు వుంది. పునాది ఈనాడు పడింది. భవంతి త్వరలో లేచి మనరాష్ట్రం దేశంలో ప్రప్రధమంగా నిలుస్తుందన్న విశ్వాసం నాకు కలుగుతుంది. ఈ రాష్ట్రాభివృద్ధికి నాయకుడిగా నేను అహోరాత్రులు కష్టపడేందుకు సిద్ధంగా వున్నాను. ప్రజల సహకారం వుంటే ఏదైనా సాధించగలం అని మీరంతా నిరూపించాలి. రాష్ట్రాభివృద్ధికోసం బియ్యం, కరెంటు, సబ్సిడీలు తగ్గించాల్సి వచ్చింది. మధ్యపాన నిషేధం అమలుజరగడం విజయవంతంకాక మధ్యం దొంగ రవాణా మొదలై ఏరులైపారుతూ వుంటే ప్రభుత్వం నిషేదాజ్ఞ తీసేయాల్సి వచ్చింది. దేశం మొత్తం మధ్యపాననిషేధం అమలుపరిస్తే తప్ప ఏ ఒక్క రాష్ట్రం వల్ల అవదని మాకు అర్ధమయింది.  
    గ్రామ సమస్యలు, రైతుల సమస్యలు, బీదల పురోభివృద్ధికే నేను అంకితుడై వున్నానని మరోసారి మీ అందరికీ మనవి చేస్తూ డాక్టర్ కేశవరావుగారు ఏంచేసినా మీమంచికోసమే చేస్తారు. వారిని నమ్మి మీ సహాయసహకారాలు అందించండని మనవిచేస్తూ శలవు తీసుకుంటున్నాను. "జై జన్మభూమి"
    ముఖ్యమంత్రి చాలా ఆవేశంగా, ఉత్తేజంగా ప్రసంగం పూర్తిచేశారు. జనం చప్పట్ల మధ్య చేతులెత్తి తమ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రికి జై జై నినాధాలు చేశారు.
    సభ ముగిశాక షామియానాలలో మధ్యాహ్నభోజనం ఏర్పాటుచేశారు. ఊర్లో పిల్లలకి, పెద్దలకి, రంగా, స్నేహితులు కల్సి మిఠాయిలు పంచారు. పండగ వాతావరణం మధ్య ముఖ్యమంత్రి, అధికారులు లంచ్ చేశారు. "మీ ఇల్లు చూస్తుంటే మా పల్లెలో ఉన్న ఆ యిల్లు బాగుచేయించుకుని హాయిగా విశ్రాంతిగా, ప్రశాంతంగా గడపాలని వుంది" ముఖ్యమంత్రి భోజనం చేస్తూ అన్నారు.
    "నో సార్. మీరామాట యిప్పుడు తలచకూడదు. ఈ రాష్ట్రాన్ని బాగుచేసేవరకు 'విశ్రాంతి' అన్న పదం మీ నోట, మీ ఆలోచనలో రాకూడదు. నా వయసు వచ్చాక మీరాలోచించాల్సినమాట అది" కేశవరావు నవ్వుతూ జవాబిచ్చారు.
    భోజనాలయ్యాక ముఖ్యమంత్రి, అధికారులు అందరూ వెళ్ళాక గత పదిరోజులుగా ఏర్పాట్లతో అలసిపోయిన కేశవరావుకి వళ్ళెరగనంత నిద్ర ముంచుకు వచ్చింది. "వెళ్ళి కాసేపు పడుకోండి మామయ్యా" అన్నాడు రంగా.
    "నీవూ రెస్ట్ తీసుకో రంగా. పాపం నీవు మాకోసం చాలా కష్టపడ్డావు." అంటూనే ఆగలేక బెడ్ రూములోకి వెళ్ళారు.
    "అత్తయ్యా, ఈ ఇంటిని చూస్తుంటే గత ముప్పైఏళ్ళుగా మేం వున్న ఇల్లేనా అనిపిస్తుంది. డబ్బు ఎంత పనిచేయగలదో బాగా అర్ధమయింది."

 Previous Page Next Page