"నీ సలహా నాకేమి అక్కరలేదు. బయట అమ్మే అవసరం అంతకన్నాలేదు. రోజూ కాసిని నేనే తింటాను. చేసుకున్న అమ్మకి చేసుకున్నంత బొక్కి నమ్మకి బొక్కినంత. నాకేంటి?" అని చెప్పేసి "నూట పదకొండు... నూట పన్నెండు... నూట పదమూడు..." అంటూ మళ్ళీ లెక్కబెట్టసాగింది బామ్మగారు.
బామ్మగారి శ్రమంతా వృథా అయింది. సుందర సుకుమారి మాత్రం కాస్తంత కూడ చలించలేదు. ఆ తతంగం బామ్మగారికి విసుగుపుట్టింది. అలా లాభంలేదనుకుని యథాపాలంగా మాటలు చెబుతున్నట్టుగా మనవరాలితో ఏవేవో మాటలు చెప్పటం మొదలుపెట్టి వంటలు...పిండివంటల్లోకి దిగింది.
"మా కాలంలో ఇన్నిరకాల పిండి వంటలు ఎరగం. ఇంట్లో చేసుకునేది...పండుగలు పబ్బాలు వచ్చేది... పెళ్ళిళ్ళయ్యేది... ఏ శుభకార్యాలన్నా జరగని పిండి వంటలు మాత్రం కొన్నే ఉండేవి గారెలు... బూరెలు... పూర్ణం బూరెలు...బొబ్బట్లు... అరిశెలు...లడ్లు... కజ్జికాయలు... ఇలా కొన్ని మాత్రమే ఉండేవి. అయితే మాత్రమేమి ఆ కాలంలో అన్నీ వెన్నకాచిన నేతితో చేసేవారు. ఘుమఘుమ లాడిపోతూ ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేది.
అరెశెలు చేశారంటే రెండు అరచేతులంత వెడల్పు ఉండాల్సిందే. అరిశెలు చేస్తుంటే "చలిమిడి కావాలంటూ" పిల్లల పేచీ. చలిమిడి అంటే మామూలు చలిమిడా! పాకం బాగా ముదురుగా రానివ్వాలి. బియ్యప్పిండిలో వేయించి విసిరిన మినప్పిండి కాస్త కలపాలి. చారెడు నువ్వులు చేర్చాలి. నేతితో వేయించిన కొబ్బరి ముక్కలు దోసెడు పొయ్యాలి. మధ్య మధ్య పంటికిందకి వచ్చేలా కాసిని జీడి పలుకులో... బాదంపప్పులో చేర్చాలి. ఆ తర్వాత చెంచాడు ఏలకుపొడి చేర్చాలి. గిన్నెడు నెయ్యి ఎత్తిపొయ్యాలి. అదీ చలిమిడంటే అలాంటి చలిమిడి తింటే జన్మలో మర్చిపోరు. ఈ కాలం వాళ్ళు చేస్తున్నారు బెల్లానికి బెల్లం... పిండికి పిండి "చలిమిడి" అని దానికి పేరు. పచ్చిపిండి తిన్నట్టు ఛస్తుంది.
తీపి పిండి వంటలంటే ఎన్నో రకాలు చేర్చాలి. గారెలకి ఏమీ అక్కరలేదు. తగిన ఉప్పు చేరిస్తే చాలు. నేతితో ఎర్రగా కరకర లాడుతూ కాల్చే గారెలు ఒక రకమయిన రుచిగా వుంటే... మెత్తగా దూదుల్లా చేసే గారెలు మరొక రకం. అవి పళ్ళు లేనివాళ్ళకి పనికొస్తాయ్...అటు ఆవడలకి పనికొస్తాయ్. ఒక్కొక్కగారె అరచేతి మందాన... అరచేతి వెడల్పు ఉండాల్సిందే.
గారెలకి పక్కనె బూరెలు. తోపులో ముంచి విరక్కుండా బూరెలు చేయటం ఒక పెద్ద ఆర్ట్. బూరెల రుచే వేరు. ఆ రుచికి మరింత రుచి కావాలంటే బూరెకి వేలెడు లోతు కన్నంపెట్టి నిండా నెయ్యిపోసి తినాల్సిందే. బొబ్బట్టయితే ఏకంగా మాటలే చెబుతుంది. "నేతిలో నన్ను ముంచి తినకపోతే తెల్లారి నీ భరతం పడతాను" అని హెచ్చరిస్తుంది. నెయ్యి వేసుకొని తినకపోతే కడుపునొప్పి ఖాయం...
కామా...ఫుల్ స్టాప్ లు లేకుండా బామ్మగారు అలా పిండివంటల తాలూకా రూప లావణ్య గుణగణాలు ఎత్తి మాట్లాడుతుంటే సుందర సుకుమారికి అప్పటికప్పుడే దీక్షకి తిలోదకాలిచ్చి బొబ్బట్లు చేయించుకుని తిందాం అనిపించింది. కాని కళ్ళముందు ముగ్గురు ప్రాణస్నేహితురాళ్ళు సాహసయాత్ర కనబడుతున్నాయ్. "ఈ కాస్తకే దిగజారిపోతే ఎట్లా? వందనా వాళ్ళు నన్ను చూసి నవ్విపోరు. తిండి విషయంలో ఎవరెన్ని అన్నా...ఎవరెంత నవ్వినా నేనేమీ పట్టించుకోను. ఐ డోంట్ కేర్. నా పొట్ట...నా తిండి...నా ఇష్టం. అరిగినమ్మ తింటుంది కాని అరగనమ్మ ఏం తింటుంది? ఆకలి లేనమ్మ అప్పనంగా వచ్చినా తిన్లేదు.
పదకొండున్నరకల్లా వందనా వాళ్ళు వస్తామన్నారు. ఈ లోపల బామ్మ నా ఎదురుకుండా పొయ్యి వెలిగించి నవకాయ పిండివంటలు చేసినా సరే నేను పట్టించుకోను. ఇంకా తొమ్మిదికూడ అయి చావలేదు. ఎప్పటికి పదకొండున్నర అయ్యేను? ఎప్పటికి వాళ్ళు వొచ్చేను...?" సుందర సుకుమారి అనుకుంది.
బామ్మగారు తొమ్మిదిన్నరదాక పిండివంటల మాటలతో టైమ్ వృథా చేశారు గాని మనవరాలి మనసుని మాత్రం మళ్ళించలేకపోయారు.
"స్నానం చేసి ఇంక వంట మొదలుపెట్టాలి. ఈ పూట నాలుగు రకాల పదార్థాలు చేద్దామనుకొంటున్నాను. నిన్న ప్రొద్దుననగా శాస్త్రిగారు నాలుగు కొబ్బరి చిప్పలు ఇచ్చారు. రెండు కొబ్బరి చిప్పలు తురిమి కొబ్బరి పెరుగుపచ్చడి చేస్తాను. మిగతా రెండు కొబ్బరి చిప్పలు తిరిమి కొబ్బరి పరమాన్నం చేస్తాను. అరటికాయలు కొని నాల్గురోజులు అయింది. ఇంకా వుంచితే పండిపోతాయ్. ఘాటుగా ఆవబెట్టి అరటికాయ కూర చేస్తాను. నాలుగు ఉల్లిగడ్డలేసి కాస్త పచ్చిపులుసు కాస్తే సరిపోతుంది. వీలైతే కొత్తిమీర వేసి వంకాయ బండపచ్చడి చేస్తాను" అంటూ ఆపూట వంట లిస్ట్ చదివింది బామ్మగారు.
బామ్మగారు చెప్పే వంటలన్నీ కూడ సుందర సుకుమారికి మహా ఇష్టమైనవి. ఇంట్లో అన్నీ వున్నాయిగాని వంకాయలు...కొత్తిమీరాకు లేదు. ఇవి ఎక్కడ్నించి వచ్చినట్టు?" వంకాయలు...కొత్తిమీర ఎక్కడివి?" సుందర సుకుమారి ఒళ్ళు మంటతో అడిగింది.