Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 8


    ఇంగువ కట్టిన గుడ్డ... ఉల్లిపాయల బుట్ట... పురిటి కంపు... ఒక పట్టాన వదలవంటారు పెద్దలు. ఉల్లికాడలతో చేసిన ఉల్లి పచ్చడి యొక్క ఘాటైన వాసన సుందర సుకుమారి ముక్కుల్లోంచి దూరి నోట్లో నీళ్ళూరేలా చేశాయ్.


    "బామ్మా! పచ్చట్లో అన్నీ సరిపోయాయా?" పెదవిదాక వచ్చిన ఆ మాటని బలవంతాన మింగేసింది సుందర సుకుమారి.


    బామ్మగారు ఇడ్లీని...పచ్చళ్ళని...కారప్పొడిని వర్ణిస్తూ...వర్ణిస్తూ... ఊరిస్తూ...ఊరిస్తూ తింది. అయినా సుందర సుకుమారి చలించలేదు. వందనాదేవి నిన్నటిరోజు గట్టిగ ముందే చెప్పింది. "కాస్త లూజ్ చూపించావంటే మీ బామ్మ నీమాట వినదు. ఆ తర్వాత మన ప్రయాణం అబద్ధము... ఇంట్లో ముప్పూటల ప్రసాదం తినటానికి సిద్ధము అంతే" అంటూ బెదిరింపుగ చెప్పబట్టి సుందర సుకుమారి గట్టిగానే ఉండగలిగింది.


    ఆ తర్వాత బామ్మగారు బ్రహ్మాండమైన ఫిల్టర్ కాఫీ తెచ్చుకుని మనవరాలి పక్కనే కూర్చొని వేడిని ఊదుకొంటూ తాగింది. కాఫీ వాసన ముక్కుల్లోకి పోతుంటే కడుపులోని కాకులన్నీ కావ్...కావ్ మన్నాయ్. కాఫీ తాగేసి తాగుతూ వూరుకోవచ్చు గదా...అలా ఊరుకోకుండా "ఇవాళెందుకో కాఫీ మా చెడ్డ రుచిగా వుంది" అంది.


    "ఎందుకుండదు? మా చెడ్డ రుచిగానే ఉంటుంది. రుచిగా వుంది ఎందుకా? నేను తాగలేదుగా... అందుకు అది కాఫీయా! కాలకూటవిషమా. యాక్...థూ" అంది సుందర సుకుమారి.


    బామ్మగారు ఆశ్చర్యపోయింది.


    "అదికాదు తల్లీ! నేనెందుకు చెబుతున్నానంటే...


    బామ్మ మాటలు పూర్తికాకముందే సుందర సుకుమారి అందుకుంది. "నువ్వెందుకయినా చెప్పు బామ్మా! ఎలా అయినా చెప్పు. నేను మాత్రం తిండి తిననుగాక తినను" అంది.


    ఇహ లాభంలేదనుకున్న బామ్మగారు అక్కడ్నించి లేచివెళ్ళింది."ఏంటబ్బా! బామ్మ అకస్మాత్తుగా లేచి వెళ్ళింది. నా దీక్షని పట్టించుకోవడం లేదా, నా సత్యాగ్రహం ఆమెకు ఆగ్రహం అయిందా? ఒహో! ఎంతకష్టం వచ్చింది. వందన మరో ఉపాయం చూస్తే పోయేదానికి నా ప్రాణానికి ఈ పథకం చెప్పింది. బామ్మ నా విషయం పట్టించుకొనే పనవుతుంది గాని పట్టించుకోకపోతే ఏం పనవుతుంది? నిరాహారదీక్షంటే బామ్మకి నవ్వులాటగ ఉన్నట్టుంది...


    సుందర సుకుమారి అలా ఆలోచిస్తూ ఉండగానే రెండు డబ్బాలు తెచ్చి అక్కడ పెట్టింది. ఆ తర్వాత మరో రెండు డబ్బాలు తీసుకొచ్చింది బామ్మగారు. పేపరు పళ్ళెము కూడ తెచ్చుకుంది. డబ్బాల ముందు కూర్చొని డబ్బా మూత తీసింది.


    ఆ డబ్బాలేమితో సుందర సుకుమారికి తెలుసు. చేసిన పిండివంటలు ఆ డబ్బాల్లోనే దాస్తుంది బామ్మ. ఇప్పుడు వాటిని ఇక్కడికి ఎందుకు తెచ్చిందో అర్థంకాలేదు. ఒకసారి అటు చూసి మొహం తిప్పేసుకొంది.


    బామ్మగారు డబ్బాలోంచి కజ్జికాయలు తీసి పేపరుమీద పెట్టింది. ఉఫ్...ఉఫ్ మని దులిపింది. "వెధవ చీమలు! నలకలంతీసి ఉంటాయ్. వీటికున్న చూపు... బుర్ర మనుషులకి లేవ్. ఈ డబ్బాలో కజ్జికాయలు పెట్టినట్టు ఈ చీమలకి ఎలా తెలిసిందో? వీటికి ముక్కెక్కడ ఉంటుందో తెలీదుగాని వాసనలు మాత్రం బానే పసిగడతాయ్..." అని పైకి మాట్లాడుతూ ఉత్తిత్తిగ కజ్జికాయలని దులిపి మళ్ళీ డబ్బాలో పెట్టేసింది.


    ఈ తఫా లడ్లున్న డబ్బా మూత తెరిచింది. అవి ఆషామాషీ లడ్లు కాదు. పన్నీరు...పచ్చకర్పూరము చేర్చి చేసిన లడ్లు. ఆ లడ్లు మైలు దూరానికి మధురమైన వాసనలు విరజిమ్ముతున్నాయ్. డబ్బాలోంచి లడ్లన్నీ తీసి బైటపెట్టడం పది నిమిషాలసేపు చేసింది. "కజ్జికాయలకి చీమలు పట్టాయిగాని లడ్లకి పట్టలేదు. ఈ డబ్బా మూత గట్టిగానే వుంది. ఏమాత్రం పసిగట్టినా బుల్లి బడవలు ఊరుకుంటాయా? ఎంచక్కా తినిపోతాయ్" స్వగతంగా అంది.


    ఈ తఫా మరో డబ్బా తీసింది. ఆ డబ్బాలో ఉన్నవి చేగోడీలు పావలా అంత సైజులో మహా ఆర్ట్ గా వున్నాయ్. ఒకటి...రెండు...మూడు అంటు లెక్కబెట్టసాగింది బామ్మగారు. నాలుగో డబ్బాలో వున్నది చెక్క పకోడీలు. ఇంకా దాని మూత తెరవబడలేదు.


    సుందర సుకుమారి కోసం బామ్మగారు ఎప్పుడూ రెండు కారాలు... రెండు తీపి వస్తువులు చేసి వుంచుతుంది. ఇవికాక ఆ ఇంట్లో పొద్దున్న టిఫిను... మధ్యాహ్నం టిఫిను మామూలే.


    బామ్మగారు కావాలని చేస్తున్న పని సుందర సుకుమారికి బాగానే అర్థం అయింది. ఆ పింది వంటల తాలూకా వాసనలు ముక్కులో దూరి పొట్టలో గడబిడ చేస్తున్నాయ్. ఒళ్ళు మండిపోయింది. ఆ ఒళ్ళు మంటతో కావాలాని వ్యంగ్యంగా అంది. "చేగోడీలు లెక్కబెడుతున్నావ్! పావలాకి రెండు చొప్పున అమ్ముతావా బామ్మా!"


    "నూట నాలుగు...నూట అయిదు... నూట ఆరు... మూట ఏడు... నూట ఎనిమిది... నూట తొమ్మిది... నూట పది... గుర్తుంటుందిలే! నూటపదని లెక్కబెట్టాను కదా! ఊ... ఇప్పుడు చెప్పు ఇందాక ఏమిటి అడిగావ్?" మామూలుగా అడిగింది బామ్మగారు.


    "చేగోడీలు అమ్మటానికా లెక్కబెడుతున్నావ్ బామ్మా!" అని అడిగాను.


    "ఆ అమ్మటానికే కొంటావా చెప్పు పావలాకి మూడు మాత్రమే" వస్తున్న నవ్వును దాచుకుంటూ అడిగింది బామ్మగారు.


    "నేను నిరాహార దీక్ష... సత్యాగ్రహం లాంటివి చేస్తున్నాను. ఇప్పుడు కొనటం... తినటం లాంటివేవీ చెయ్యను. బైట అమ్మితే బోలెడు మంది కొంటారు."

 Previous Page Next Page