Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 10


    "తినే పదార్థాలకి రుచి పెడితే చాలదా! రుచిగా వుంటే చాలు తినేస్తాం కదా! ఈ దేముడికి మరీ తెలివితేటలు ఎక్కువ. వాటికి ఘుమఘుమ వాసనలు కూడా సృష్టించాడు. కడుపుమాడితే గాని తెలిసిరాదు దేముడికి! ఒకసారి ఆయనకి కూడ కడుపులో ఎలకలు పరుగెత్తాలి...కాకులు కావ్ కావ్ మనాలి" ఆకలి తాలూకా కోపంతో అనుకుంది సుందర సుకుమారి.


    బామ్మగారు చెప్పినవే కాకుండా మరో రెండు రకాల వంటలు తయారుచేసినది. వండిన పదార్థాలన్నింటిని బెడ్ రూమ్ లోకి చేర్చింది. సుందర సుకుమారి అడక్కపోయినా చెప్పింది. "ఏం చేస్తాను? ఈ పూటకి ఇక్కడే భోంచేస్తాను" అని.


    మామూలుగ ఉన్నప్పుడయితే సుందర సుకుమారి ఈపాటికి ఉదయం టిఫెన్ కానిచ్చి...కాఫీ తాగి తొమ్మిదిగంటలకి డబ్బాలో పిండివంటలు తిని...పది గంటలకి ఏవైనా పళ్ళుంటే నోట్లో వేస్కొని పదకొండున్నరకల్లా భోజనానికి హాజరవుతుంది. భోజనం విషయంలో అరనిమిషం ఆలశ్యమయినా చాలు కడుపులో పేగులు ఆవురావురుమంటూ అరుస్తాయ్.


    సుందర సుకుమారి బింకంగా కూర్చుందిగాని మొహంలో ఆకలి తాలూకా బాధ చక్కగా కనిపిస్తున్నది.


    "పిల్లదాని మనసు బాధపెడుతున్నానేమో!" ఒకటికి పదిసార్లు బామ్మగారు లోలోపల అనుకుంది.


    అప్పటికి పదకొండు దాటింది.


    "లాభంలేదు. సుందరి గట్టి పట్టుదలమీదే వుంది. దాని మనసు మారుతుందేమోనని ఎదురుగుండా కూర్చొని పొద్దున్నే ఇడ్లీ తిన్నాను. పాపిష్టిదాన్ని! నేను పస్తుంటే పోయేదికదా! నేనేమో తిన్నాను అదేమో తిన్లేదు. అరగంట ఆలశ్యమయితే ఇల్లుపీకి పందిరి వేస్తుంది. అలాంటి తన మనవరాలు ఎంత నిబ్బరంగా...ఎంత పట్టుదలతో కూర్చుందో!" ఆశ్చర్యపోయింది బామ్మగారు.

    
    "సుందరితోపాటు తను పచ్చిమంచినీళ్ళు ముట్టుకోకుండా ఉంటుంది. అంతవరకు బానేవుంది. అప్పటికి కూడా సుందరి కరక్కపోతే...? ఎవరికి నష్టం? తనకే. సుందరి ఏమీ తినకపోతే ఆ బాధ తనకి కాదా!" బామ్మగారు ఆలోచిస్తున్నది.


    గడియారంవైపు చూసిన సుందరి అనుకొంది. "మహా అయితే ఒంటిగంట. అంతవరకు చూస్తాను. ఫ్రెండ్స్ వచ్చారా సరేసరి. లేకపోతే భోజనం చేసేస్తాను. ఈ పథకం కాకపోతే మరో పథకం. బామ్మని ఒప్పించడానికి కడుపు మాడ్చుకోవాలా!"


    పదకొండున్నర కావొస్తుండగా__


    "మనవరాలి కోరిక ఒప్పుకుంటే సరిపోతుంది" అన్న అభిప్రాయానికి కొద్దికొద్దిగ వచ్చింది బామ్మగారు.


    "వీళ్ళు వచ్చేటట్టులేరు బామ్మ మనసు కష్టపెట్టడం ఎందుకు? నా పొట్ట మాడ్చుకోవడం ఎందుకు?" అనుకుంది సుందర సుకుమారి.


    అటు బామ్మగారు పట్టు సడలిస్తున్నవేళ... ఇటు సుందర సుకుమారి పట్టు విడుస్తున్న వేళ ఠంగ్ న పదకొండున్నర కొట్టింది గోడ గడియారం.


    సరీగ్గా అప్పుడే ముగ్గురు మిత్రురాళ్ళు ఇంట్లో ప్రవేశించారు.


                                          4


    "సుందరి!" నెమ్మదిగా పిలిచింది రాణి.


    "సుకుమారి!" ప్రమద కాస్త గొంతు హెచ్చించి పిలిచింది.


    "ఓ సుందర సుకుమారి!" మరికాస్త గట్టిగ పిలిచింది వందనాదేవి.


    "నేను ఇక్కడే ఉన్నాను, చూసుకోనక్కరలేదా! ఏమిటా అరుపులు? బెడ్రూమ్ బైటనే నిలబడి అరవకపోతే లోపలికి రావచ్చు కదా!" సుందర సుకుమారి లోపల్నించి గట్టిగ అరిచి చెప్పింది. లోలోపల మాత్రం తన స్నేహితురాళ్ళు అన్నటైముకే వచ్చినందుకు ఉప్పొంగిపోయింది.


    "ఇవి అరుపులు కాదు పిలుపులు...ప్రయాణ పిలుపులు. ఓ...ఇక్కడే వున్నావా! ఏంటి మంచమెక్కావ్? ఏమొచ్చింది తీపరం?" అంటు బెడ్రూమ్ లోకి వచ్చిన వందన అక్కడే వున్న బామ్మగారిని అప్పుడే చూసింది. చూస్తూనే "నమస్కారం బామ్మగారు! మీరిక్కడే వున్నారా!" అంది.


    జంటకవుల్లాగ ప్రమద, రాణి కూడ "నమస్కారం బామ్మగారు" అన్నారు.


    "సమయానికొచ్చారు అమ్మాయిలు! కూర్చోండి" అంది బామ్మగారు.


    ముగ్గురు దూరంగా కూర్చోక సుందర సుకుమారి మంచంమీదే కూర్చున్నారు.


    నాటకం రక్తి కట్టించాలంటే వీళ్ళు నటన చెయ్యాలి తప్పదు.


    వందన అడిగింది "కాళ్ళ నొప్పులా?"


    ప్రమద అంది "కడుపు నొప్పేమో!"


    రాణి అంది "జ్వరం...తలనొప్పి అయితేనే మంచం ఎక్కుతారు."


    "మీరు కాసేపు నోరు మూసుకుంటే విషయం చెబుతాను." అంది సుందర సుకుమారి.


    "నోరు మూసుకుంటాంలే! చెప్పు" అంది వందన.

 Previous Page Next Page