Previous Page Next Page 
సీతాచరితం పేజి 9


    విమర్శకుడు రచనయొక్క కేంద్రబిందువైన సందేశాన్ని కనుక్కొని, ఆ రచన యొక్క ఇతివృత్తం, ఆసందేశానికి ఎంతవరకుపకరిస్తున్నది, ఏ విధంగా దారితీస్తున్నది అనేదాన్ని గ్రహించాలి. రచయిత సృష్టించిన పాత్రలు, వాటి స్వరూప స్వభావాలు ఆ రచనకు తగినట్లుగా ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. ఆ తర్వాత ఆ రచనలోని సంఘటనలు, పాత్రపోషణకు, కథాగమనానికి, రచన లక్ష్యం చేరుకోవడానికి, ఎంత వరకు తోడ్పడుతున్నాయో గ్రహించాలి. వీటిని గురించి పరిశీలించేప్పుడు విమర్శకుడు రచనాకాలానికి పరకాయం చేయాలి. అతడు ఏ యుగపు రచనను పరిశీలిస్తున్నాడు, ఆ యుగానికి పయనించాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఎంచేతంటే సమాజం ప్రగతిశీలమైంది. అది అడుగడుగునా అభివృద్ధి చెందాల్సి వుంటుంది. సమాజం స్థిరంగా వుంటుందని, దానికి పరిమాణం లేదని అనుకొనేవాడు ప్రగతిశీల విమర్శకుడు కాడు. ముందుకు పోయిన సమాజంలో నిల్చొని, వెనక్కుపోయిన సమాజాన్ని పరిశీలిస్తూ, అందులో ఆనాటి లక్షణాలు లేవని విమర్శించడం, వెర్రికి వేయితలలు వేయడంలాంటిది. ఒక సందేశాన్ని పరిశీలించేప్పుడు అది ఆనాటి సమాజానికి ఎంతవరకు ఉపయుక్తమయింది అనే విషయం పరిశీలించడం అవసరం. అదేవిదంగా ఆ సందేశాన్ని వివరించడానికి ఆ రచయిత ఎన్నుకున్న కథావస్తువులో కూడ ఆనాటి సమాజ పరిస్తితులను బట్టి, పరిశీలించాలి. అతను ఎన్నుకున్న పాత్రలు, వాటి స్వరూప స్వభావాల్లో కూడ ఆనాటి సమాజం ప్రతిబింబింప జేస్తుంది. రచయిత సృష్టించే సంఘటనల్లో సైతం ఆనాటి సమాజ పరిస్థితులకు అనుకూలంగానే వుంటుంది కాని, అవి దాటి రాలేవు. రామాయణంలో రైలుంటుందనుకోవడం ఎంతభ్రమో, ఆధునిక జీవనంలో ఆటవిక జీవనం వుంటుందనుకోవడం అంత భ్రమ - భ్రమలకు దూరంగా వాస్తవానికి దగ్గరగా, రాగద్వేషాలకు అతీతంగా, సందేశానికి అనుగుణంగా, వ్యాఖ్యానించడం విమర్శకుని కర్తవ్యం.


    విమర్శకుడు ఆనాటి సమాజంలోని పరకాయ ప్రవేశం చేసినట్లు, ఆ రచన పరిధిలో నిలిచి, రచనను పరిశీలించాలి. వాస్తవాలను గ్రహించడం, వాటిని వ్యాఖ్యానించడం, విమర్శకుని పని. వాస్తవాలు ఎప్పుడూ ఒక రకంగా వుండవు. అవి పరిణామం చెందుతుంటాయి. కాలాన్నిబట్టి, సమాజాన్నిబట్టి, వాస్తవాలు కూడ మారుతుంటాయి. వేదకాలంలో సత్యం చెప్పడం ఒక వాస్తవం. అతనికి ఎన్ని ఆపదలు వచ్చినా సత్యం చెప్పాల్సిందే. కాని ఆ వాస్తవం స్తిరంగా అలాగే నిలిచివుండదు. "సత్యంవద" అనేది కాలక్రమేణ మారి "సత్య బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం" అనే దశకు వచ్చింది. యుద్ధం గెలవడానికి అసత్యం ఆడవచ్చు అనేదాన్ని భారతంలో ధర్మరాజు నిరూపించాడు.


    "వారి జాక్షులందు వైవాహికులందు".... అని అన్నింటికి అబద్ధ మాడవచ్చునని భాగవతం చెప్పింది. మనది అబద్దమాడటానికి అవసరమయిన సమాజం. ఈ సమాజం నుంచి సత్యం వద సమాజాన్ని పరిశీలించాలంటే మనం అక్కడికే వెళ్లాలి. పరిశీలకుడు సత్యం వధ అనే సమాజం ఎందుకుంది అని పరీక్షించవచ్చు. ఆనాడు అన్ని వ్యవహారాలు నోటిమాటమీద నడచినకాలం. కాగితాలు, పత్రం, ఈనాటిలాంటి పకడ్బందీయైన రాజకీయతంత్రం లేని రోజులు. అలాంటి రోజుల్లో మనిషి మాట తప్పితే అతని మాటలు నిరూపించగల బలమయిన న్యాయవ్యవస్థ లేదు. కాబట్టి సత్యం వద అవసరమయింది. ఈనాడు అవసరం లేకపోవచ్చు. ఈ విధంగా ఆనాటి వాస్తవాలను వ్యాఖ్యానించడం విమర్శకుని పని.


     విమర్శ సాంతం ఒక సామాజిక వ్యవస్థ పరిశీలనకు మాత్రమే పరిమితమై వుండదు. విమర్శ భాషా విషయకం కావచ్చు. వ్యాకరణ విషయకం కావచ్చు. వేదాంత విషయకం కావచ్చు. తాత్కాలిక విషయకం కావచ్చు. ఈ విధంగా విమర్శకులు అనేక విధాలు ఒక్కొక్క విమర్శకుడు తన పరిధిని ఏర్పరచుకొని, తన పరిదిలో పరిశీలన సాగిస్తాడు. ఆ పరిశీలనామృతాన్ని మనకు అందిస్తాడు. అన్ని రకాలైన పరిశోధనలు, పరిశీలనలు జరగవల్సిందే. కాని ప్రగతిశీల పరిశోధకుడు లేక విమర్శకుడు సామాజిక విషయాల మీద తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తాడు. అంటే మిగతా విషయాలు పరిశీలించడు అని అర్ధం కాదు, కాని వాటికి ప్రధానమైన సామాజిక పరిశీలనకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వచ్చు.

    
    శాశ్వతమైన రచనలు - పాత్రలు


    సమాజం శాశ్వతమైంది. కాని అది ఎప్పుడు ఒకే స్థితిలో వుండదు. పరిణామం చెందటం సమాజపు సహజ లక్షణం. ఇలాంటి పరిణామాల్లో విలువలు మారుతుంటాయి. - వాస్తవాలు పరిణామం చెందుతుంటాయి. అలాంటప్పుడు ఒక పరిణామ దశలో, సాహిత్యం ద్వారా యిచ్చిన సందేశం మరొక సమాజ దశకు పనికిరాకపోవచ్చు. అంత మాత్రంచేత ఆ సాహిత్యం పనికిరాదని అనడానికి వీలులేదు. విలువలు మారినా, వాస్తవాలు మారినా సాహిత్యం శాశ్వతంగా నిలిచి వుంటుంది. రామాయణ కాలం నాటి పరిస్థితులు, ఆనాటి సందేశం ఈనాడు విలువలేనిది కావచ్చు. అలాగే భారతంలో వున్న భాగస్వామ్య పోరాటం ఈనాటికి అనువైంది కాకపోవచ్చు. ఐనా రామాయణ, బారతాలకు శాశ్వతత్వముంటుంది. ఈ శాశ్వతత్వానికి కారణం రచయిత యొక్క ప్రతిభ. అతడు ఆ కథను ఎంత బలవత్తరంగా చెప్పాడంటే దేశ కాల పరిస్థితులు మారినా వాటికి స్థిరమైన స్థానం ఏర్పడింది.


    సాహిత్యపు శాశ్వతత్వానికి మరొక కారణం మానవ స్వభావంలో అట్టే మార్పు లేకపోవడం కావచ్చు. మానవ స్వభావాన్ని నిశితంగా పరిశీలించి గొప్ప పాత్రను సృష్టించి ఒక రచనను సమాజానికి అందించిన రచయిత దేశకాలాలతో నిమిత్తం లేకుండ శాశ్వితుడై నిలిచిపోతాడు. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కాన్ని తీసుకుంటే అందులోని సందేశం గాని, సమస్య గాని ఈ కాలానికి అనువైంది కాకపోవచ్చు. ఐనా అందులో అతడు సృష్టించిన పాత్రలు ఎంత సహజమైనవంటే అవి ఏ సమాజానికైనా వర్తిస్తాయి. ఉదాహరణకు మనలో గిరీశాలు ఎంతమంది లేరు-? అలాంటి పాత్రలే రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, శకుని మొదలైనవి. ఈ పాత్రలు మానవనైజాన్ని ప్రతిబింబిస్తుంటాయి. మానవ నైజం మారదు. కాబట్టి ఇలాంటి పాత్రలు, ఈ పాత్రగల రచనలు శాశ్వతంగా వుంటాయి. - షేక్ స్పియర్ ఎన్నుకున్న పాత్రలన్నీ సుమారు చారిత్రకములయినవే. అవి ఏవీ అతడు రచించిన నాడు లేవు. ముందు వుండబోవు. ఐనా అతడు ప్రతిభావంతంగా ఆ పాత్రలను మలిచిన తీరు అసమాన్యమైనవి. వాటిలో మనలోని గుణాలు ప్రతిబింబించేస్తుంటాయి - అందువల్ల అతని రచనలు శాశ్వతాలైనవి. రామాయణంలో రాముడు, లక్ష్మణుడు, సీత, వాలి, సుగ్రీవులు, రావణ, విభీషణులు వీరందరిని వాల్మీకి మహర్షి రచించిన తీరు అమోఘమైనది. ఈ పాత్రలు మనలో వున్నాయి వుంటాయి. మన మధ్య మసల్తుంటాయ్. అందువల్లనే రామాయణం అజరామరమైంది. కొన్నివేల సంవత్సరాల వరకు సైతం దాని ప్రభావం తగ్గలేదు. ఇది వాల్మీకి మహర్షి యొక్క అసమానమయిన ప్రతిభా వ్యుత్పత్తులకు నిదర్సనం.

    
    రామాయణ రచనా దశ


    వాల్మీకి యిచ్చిన  సందేశం ఏ కాలానికి అనువైంది? అతడు రామాయణం రచించిన కాలం ఏది? ఈ రామాయణ కాలం సమాజ పరిణామ క్రమంలో ఏ దశకు చెందింది? అనే విషయం ఆలోచిస్తే రామాయణ రచన, లేక రామాయణకాలం ఒక సంధి యుగంలో జరిగినట్లనిపిస్తుంది. ఒకవైపు ఆదిమ సమాజం అంతరిస్తున్నదశ, రెండవ వైపు భూస్వామ్యదశ ఉత్పన్నమవుతున్న దశ. ఈ దశలో రామాయణం రచించబడ్డట్టు కన్పిస్తున్నది.


    ఈ సామాజిక పరిణామం, దేశమంతట, లేక ప్రపంచమంతట ఒకేసారి ఒకే తీరుగ వచ్చినట్లు కన్పించదు. శాస్త్ర విజ్ఞానం అపరిమితంగా పెరిగిన ఈనాడు కూడ ప్రపంచ సాంతం ఒకే దశలో లేదు. ఈనాటికి ఆదిమ సమాజాలున్నాయి. భూస్వామ్య సమాజాలున్నాయి. ధనస్వామ్య సమాజాలు వున్నాయి. శ్రమస్వామ్య సమాజాలున్నాయి. అలాంటప్పుడు నాగరికత అంతగా తెలియక రామాయణంలో ఒకే రకమయిన సమాజము వుంటుందనుకోలేం. ఈ సమాజంలో ఈ సంధి యుగం విభిన్న దశలో వున్నట్లు కనిపిస్తోంది. వాలీ సుగ్రీవులు వానరజాతి, ఆదిమ దశలో వున్నట్లు కనిపిస్తూంది. యిందుకు అనేక నిదర్శనాలు వున్నాయి. వారు అడవుల్లో నివసించారు. గుహలు, గుట్టలు వారి నివాస స్థలం. చెట్టు, చేమని ఆశ్రయించి బ్రతికారు. ఆస్తిని గురించి అంతగా పట్టించుకున్నట్లు కన్పించదు. ఆడదానికి సంబంధించిన సంబంధం వరకు బహు భార్యత్వం అమలులో వుండేది. తమ్ముడు లేనప్పుడు, తమ్ముని భార్యను అన్న తెచ్చుకోవడం, వారి ఆచారం. ఈ ఆచారం ఇప్పటికి లంబాడి తెగలో వున్నట్టు కనిపిస్తుంది. వానరజాతికి లౌక్యం తెలియదు. రాముడు వాలితో యిలా అన్నాడు.   

 Previous Page Next Page