Previous Page Next Page 
సీతాచరితం పేజి 8


    కన్ను తాను చూసిన పదార్థాలను ప్రతిబింబించుకొని ఎదుటి వస్తువులను చూస్తుంది. ఆ వస్తువు రూపురేఖలను స్వరూప స్వభావాలను చక్కగా పరిశీలించగల్గుతుంది. ఆ పరిశీలన ఆ మనిషికున్న సంస్కారాన్ని బట్టి జరుగుతుంది. సంస్కారవంతుడైన వాని కన్ను చప్పున ఎదుటివాని స్వరూప స్వభావాలను పరిశీలించగలదు. సంస్కారం లేనివాడు ఎదుటి వ్యక్తిని బొమ్మను చూచినట్లు చూచి ఊరుకుంటాడు. సంస్కారం కలవాడు ఆ మనిషిలోని దుష్టత్వాన్ని మాత్రమే చూడగలడు. అలాంటిదే సాహత్య నేత్రం కూడ.  సమాజాన్ని సంస్కారనేత్రంతో చూచిన రచయిత, సమాజాన్ని సాకల్యంగా పరిశీలించి రచన చేస్తే ఆ సాహిత్యం మనకు సంస్కారయుతమైన నేత్రంలా, కన్పిస్తుంది. సంస్కారం  లేనివారు సమాజాన్ని చూసి రచన చేస్తే, కెమేరాతో ఫోటోతీసినట్లుంది. అందులో మనకు సమాజానికి సంబంధించిన బొమ్మలు మాత్రమే కన్పిస్తాయి. సాహిత్య స్వరూప స్వభావాలు కన్పించవు. ఆ కన్ను చూసిందే చూపగలదు. చూడందాన్ని చూపలేదు. కుసంస్కారం గల నేత్రంలో పరిశీలించిన రచయిత సమాజంలోని దుష్టత్వాన్ని మాత్రమే చూపించగలడు. అతడు సమాజాన్ని సంపూర్ణంగా పరిశీలించలేడు. (సంపూర్ణంగా చూపలేడు.)


    సాహిత్యాన్ని సమాజపునేత్రం అనుకోవడంలో మరొక సౌలభ్యం ఉంది. నేత్రం సజీవమైనప్పుడే అన్నింటిని చూడగల్గుతుంది. లేదా పరిశీలించుతుంది. సజీవమంటే బ్రతికున్నదనే అర్ధంకాదు. ఆయా పదార్థానికి గల గుణం సంపూర్ణంగా వున్నప్పుడు దాన్ని సజీవం అంటాం. ఒక కఠినమైన హృదయంగల వాణ్ణి చూసి గుండెలేనివాడు అంటాం. అంటే అతనికి గుండే లేదని అర్ధంకాదు. అతనికి గుండె వుంది. అది ఆడుతుంది. అతడు బతుకుతున్నాడు. ఐతే హృదయపు ప్రధానలక్షణమయిన స్పందన దానికి లేదు.


    "తేరె సీనేమె దమ్ హై ఔర దిల్ నహీ హై
    తేరా దమ్ మహఫితె గరమ్ నహీ హై"


    అంటాడు ఇక్బాల్.


    నీదు రొమ్ముతో ఊపిరేవుంది - గుండెలేదు.


    నీదు ఊపిరి మా గోష్ఠికి అర్హుడు కాదు.


    ఇక్బాల్ గుండెల స్పందనలే గోష్ఠికి పనికివస్తాయంటున్నాడు. గుండె ఆడటం బతకటానికి పనికివస్తుంది. అంతేగాని రసస్పందనకు పనికిరాదు. అలాంటపుడు ఆ గుండె ఆడుతున్నా, దాన్ని నిర్జీవమయిన సాహిత్యానికి ఆశక్తి స్తోమతలు లేవు. కన్ను వున్నట్టే ఆ సాహిత్యం వుంటుంది. కన్ను కానలేనట్టే ఆ సాహిత్యం సమాజాన్ని కానలేదు.


    సజీవ సాహిత్యం, సజీవ నేత్రంలా ఆనాటి సమాజాన్ని కని, మనకు దాని నేత్రాలను ప్రసాదిస్తుంది. ఆ సాహిత్య నేత్రలద్వారా మనం ఆనాటి సమాజ స్వరూప స్వభావాలను చూడగలం. అందును గురించి ఆలోచించగలం, దాన్ని విమర్సించగలం, వ్యాఖ్యానించగలం -

    
    సాహిత్యవిమర్శ


    'విమర్శ' అంటే తెగడటం, తిట్టడం, చండాడటం అనే అర్ధంలో వాడుతున్నాం మనం నేడు. ఒక పుస్తకాన్ని విమర్శిస్తున్నప్పుడు ఎంత ఘాటుగా చండాడగల్గుతే అంతమంచి విమర్శ అనుకుంటున్నాము మనం. ఒక్కొక్కసారి పుస్తకంలోని విషయాలను కూడా వదిలేసి, రచయితను, రచయిత వ్యక్తిగత జీవితాన్ని కూడ చండాడటం జరుగుతున్నది. విమర్శకుడు రచనలోని పాత్రలను తన యిష్టంవచ్చినట్లు వ్రాయలేదని విరుచుకుపడటం కూడ చూస్తున్నాం. ఈ విమర్శ ఆధునిక సాహిత్యం వరకు పరిమితమై వుండటంలేదు. సనాతన సాహిత్యాన్ని, విమర్శించేప్పుడు కూడ ఈనాటి పరిస్థితులు, ఆనాటి సాహిత్యంలో కనిపించడం లేదని ఘాటయిన విమర్శలు చేసినవారున్నారు. అవి చదివిన కొందరు పొంగిపోవడం కూడ జరుగుతుంది. కృష్ణుడు బుషర్టు వేసుకోలేదనీ, బెల్ బాటం వేసుకోలేదనే లంటి విమర్శలు కూడ వస్తున్నాయి. ఇది సాహిత్యానికి ఆరోగ్యలక్షణం కాదు. ఆరోగ్యకరమయిన సాహిత్యం సమాజానికి ఎంత అవసరమో, ఆరోగ్యకరమయిన విమర్శ అంతకన్న ఎక్కువ అవసరం. ఎంచేతంటే, విమర్శ కంటే సాహిత్యాన్ని పదును పెడ్తుంది. రచయిత మనస్సును కనుక్కొని వ్యాఖ్యానిస్తుంది. పాఠకునికి పండు ఒలిచి పెట్టినట్లు సాహిత్య సర్వస్వాన్ని అందిస్తుంది.


    విమర్శ అనే పదం 'మృశ్' అనే ధాతువునుండి వచ్చింది. ఇది సంస్కృత పదం. 'మృశ్' అంటే పరిశీలించుట అని అర్ధం. సాహిత్యాన్ని సాకల్యంగా పరిశీలించి రాగద్వేషాలకు అతీతంగా  సాహిత్యంలోని అర్ధాలను, సొగసులను, లోపాలను, ఎత్తిచూపడం, సాహిత్య విమర్శ అవుతుంది. సంస్కృతంలోని 'అమర్శ' అనే శబ్దం వుంది. అమర్శ అంటే పరిశీలించడం జరగాలి. పరిశీలించడమంటే తిట్టడంగాదు. ఒక వస్తువును పరిశీలించి, దానిలోని మంచిని, చెడును రెండింటిని నిర్మొహమాటంగా చెప్పడం. విమర్శ అవుతుంది. వంట చెయ్యడం ఒక ఎత్తు, రుచిచూసి, బాగుంది, లేదు అని చెప్పడం ఒకఎత్తు. బాగుంది లేదు అని చెప్పడం వ్యక్తియొక్క రుచిమీద ఆధారపడివుంటుంది. అదే వంటకం మరొకనికి రుచించవచ్చు. సాహిత్యం విషయంలో ఫలాన రచన బాగున్నది, లేనిది చదివిన ప్రతి పాఠకుడు చెప్పవచ్చు. అది విమర్శ వివరించి చెప్పడం విమర్శ అవుతుంది. అందుకు విమర్శకునికి శాస్త్రపరిజ్ఞానముండటం అవసరం. వంటకాన్ని విమర్శించటానికి పాకశాస్త్ర ప్రావీణ్యం కాకున్నా పరిజ్ఞానం అవసరం. శాస్త్ర పరిజ్ఞానం  లేకుండా చేసే విమర్శ, విమర్శ అనిపించుకోదు.


    సాహిత్యాన్ని విమర్శించడం, చాలా ప్రావీణ్యతతో కూడుకున్న పని. విమర్శకునికి రచయితకంటే ప్రావీణ్యత వుండటం అవసరం. రచయితకు పరిధులు లేవు. అతడు కళాకారుడు. ఒక రచనను కళా మయంగా సిద్దం చేయడం అతనిపని. కాని విమర్సకుడు అలాంటివాడు కాదు. అతనికి పరిధులు ఉన్నాయి. అతడు ఏ రచనను గురించి విమర్సిస్తున్నాడో ఆ రచనాకాలం ఆ కాలపు పరిస్థితులను గమనించాల్సి వున్నది. ముఖ్యంగా మానవుని ప్రగతిలో ఆ రనచ ఏ దశకు సంబంధించినదో నిర్ణయించాల్సి వుంది. అలా నిర్ణయించిన తర్వాత ఆ దశలోని సాహిత్యం, దాని స్వరూప స్వభావాలను సాకల్యంగా అర్థం చేసుకోవాలి. అలా అర్దం చేసుకున్న తర్వాత రచయిత  తన సాహిత్య సృష్టిని ఏ ప్రయోజనం సాధించడానికి చేశాడో నిర్ణయించుకోవాలి. ఆనాటి సమాజ స్వభావాన్ని బట్టి ఆ రచనను పరిశీలించడం ప్రారంభించాలి. అలా పరిశీలించి ఆ రచన ద్వారా రచయిత ఇవ్వవల్సిన సందేశాన్ని భూతద్దంపట్టి చూపాలి. సందేశం సాహిత్యానికి ప్రధాన లక్షణం. కాబట్టి ముందు ఆ రచయిత సమాజానికి ఇవ్వగల్గిన సందేశాన్ని గ్రహించాలి - అలా గ్రహించిన తర్వాత ఆ సందేశానికి బలం చేకూర్చే సంఘటనలకు ప్రాధాన్యత యివ్వాలి.  సందేశాన్ని వక్రీకరించడం విమర్శకుని కర్తవ్యం కాదు. సందేశాన్నే వక్రీకరించే ప్రమాదమున్నది. ఉన్నదాన్నే పరిశీలించడం - విమర్స లక్ష్యం. దానికి కొత్త అర్దాలు కల్పించవచ్చు. కొత్త వ్యాఖ్యానాలు చేయవచ్చు. ఆ సందేశాన్ని సమకాలానికి సమన్వయం చేయవచ్చు. కాని అసలు సందేశానికి ఎసరుపెట్టిం తర్వాత ఇక అతడు చేసిన విమర్శ, విమర్శ అనిపించుకోలేదు. అది అమర్శ అవుతుంది.

 Previous Page Next Page