Previous Page Next Page 
సీతాచరితం పేజి 10


    "ధర్మ మర్థంచ, కామం చ సమయం చాపి లౌకికమ్-"


    "అవిజ్ఞాయ కథం బాల్యాన్మా మహాద్య విగర్హసే"


    ధర్మార్థ కామాలు సమయాన్ని బట్టి మారడం లోకుల ఆచారం. అది తెలియక అజ్ఞానంతో నన్ను గర్హిస్తున్నావు.


    వాలికి ధర్మార్థకామాలు తెలుసు. కాని అవి సమయాన్ని బట్టి మారుతాయనే లౌక్యం తెలియదంటున్నాడు రాముడు. కాబట్టి లౌక్యం తెలియని ఋషులను ఆదిమ జాతికి చెందినవారని అనవచ్చు.


    రాముడు అతని కుటుంబం ఆదిమ సమాజ దశ దాటి, భూస్వామ్య దశలో అడుగుపెడ్తున్నట్లున్నారు. భూస్వామ్య సమాజంలో తండ్రి తర్వాత కొడుకు రాజు కావడం సాధారణం. కాని దశరథుడు, రాముణ్ని రాజును చేయాలనుకున్నప్పుడు సభ చేశాడు. ఆ సభకు ప్రజలు, రాజులు వచ్చారు. తాను రాముణ్ణి రాజును చేయదల్చుకున్నానని ప్రజలనడుగుతాడు దశరథుడు.


    "యదిదం మే2ను రూపార్థం మయా సాధు సుమన్త్రితమ్,
    భవన్తో మే2ను మన్యన్తాం కథంవా, కార వాణ్యహమ్"


    నేను చెప్పింది సరియైంది కాదో అవునో ఆలోచించండి. అలా కాకుంటే ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి అంటాడు దశరథుడు.


    ఇది లాంఛన ప్రాయమయిన సంప్రదాయమే కావచ్చు. ఐనా ఆదిమ సమాజంలో తెగల నాయకుణ్ణి ఎన్నుకునేందుకు ఏర్పడ్డ ఆచారం. దీని ఛాయలు దశరథుడి మాటల్లో కన్పిస్తాయి. దశరథుని రాజ్యం అంత పకడ్బందీయైందేం కాదు. రాజదండం నామమాత్రముగా వుండినట్టు కన్పిస్తున్నది. వాల్మీకి  దశరథుడు రాజ్యం చేయడం, అంతగా వర్ణించలేదు. రాముడి రాజ్యాన్ని గురించీ అంతే. కాబట్టి ఒక బలమయిన రాజకీయ వ్యవస్థ వున్నట్లు కన్పించదు.


    లంకారాజ్యంలో పూర్తి భూస్వామ్య వ్యవస్థ నెలకొన్నట్లు కన్పిస్తున్నది. లంకలో ఒక బలమయిన రాజకీయ వ్యవస్థ వుంది. రావణుడు నామమాత్రపు రాజు కాడు. అతడు గాలిని బంధించగలడు. అతని కొలువు కూటంలో అనేకమంది బానిసలుండేవారు. అతని అంతఃపురంలో ఎత్తుకువచ్చిన ఆడవాళ్ళు వందలు, వేలు. రావణుడు నిరంకుశుడు. అతనికి ఎదురు పలుకగల వారెవ్వరు లేరు. అతనికెదురు పలికిన వాడు ఒకే ఒక విభీషణుడు. అతని గతి ఏమయిందో మనకు తెల్సు. రామాయణ యుద్ధంలో ఆయుధాలతో యుద్ధాలు చేసినవారు రాక్షసులు. అంటే ఆయుధాల తయారు చేసేంత వృత్తి విభజన అప్పటికే జరిగిందని అర్థం. వానరులు చెట్టు చేమలతో యుద్ధం చేశారు.


    రాజ్యాలకు స్పష్టమైన హద్దులు కూడ వున్నట్లు కన్పించదు. ఆయా జాతులకు రాజులున్నట్లు తోస్తుంది కాని, స్పష్టమైన సరిహద్దులు రాజ్యాలకున్నట్లు కన్పించదు. బోయలకు ప్రభువు గుహుడు. వానరులకు ప్రభువు వాలి లేక సుగ్రీవుడు. రాక్షసులకు ప్రభువు రావణుడు. వానరులు ప్రపంచంలో ఎక్కడున్న తానే రాజునంటున్నాడు సుగ్రీవుడు. అంటే తెగలను బట్టి లేదా జాతిని బట్టి రాజులున్నట్లు కన్పిస్తుంది.


    యుద్ధంలో గెలిచి రాజ్యాలు గెల్చుకున్నట్లు కూడ కన్పించదు. రాముడు వాలిని ఓడించాడు. వానర రాజ్యానికి తాను రాజు కాలేదు. సుగ్రీవుని రాజును చేశాడు. అలాగే రాముడు రావణున్ని ఓడించాడు. విభీషణున్నిరాజును చేశాడు. ఏ జాతివాడిని ఆ జాతికి రాజును చేయడం ఆచారంలా కన్పిస్తుంది. కాగా ఇవి పటిష్ఠమైన రాజ్యాలుగా కన్పించవు. ఈనాడు మనకున్న స్వచ్ఛంద సంస్థల్లా కన్పిస్తాయి. స్వచ్ఛంద సంస్థలో సభ్యులు కావడానికి, రాజకీయపు హద్దులతో పనిలేదు. ఒక వృత్తివారికి అంతర్జాతీయ సమాఖ్య వుంటే ఆ సమాఖ్యలో ఏ దేశం వారైనా సభ్యులు కావచ్చు. ఈ సంబంధం పటిష్ఠమైంది కాదు. వదులైంది. ఇలాంటి సంబంధమే ఆనాడు ప్రత్యేకమైన తెగకు, ఆ రాజులకున్నట్లు కన్పిస్తుంది.


    ఇవన్నీ ఆనాడు బలమయిన భూస్వామ్య వ్యవస్థ ఏర్పడలేదనటానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇందును గురించి సంపూర్ణమైన పరిశోధన జరగవలసి వుంది.


    రామాయణ రచన - ఆవశ్యకత


    వాల్మీకి రామాయణాన్ని రచించాడంటే ఒక లక్ష్యం లేకుండ రచించివుండడు. ఊబుసుపోక రచించింది కాదు రామాయణం. వాల్మీకి  మనస్సు ఎంతో పరితపిస్తే గాని రామాయణం లాంటి కావ్యం రచించి వుండడు. వాల్మీకి కవులకు కవి. అతడొక ఛందస్సును కనుగొని, సులభ గ్రాహ్యంగా, అభిగీతమయిన గీతంగా, ఈ కావ్యాన్ని రచించాడు. వాల్మీకి కవి మాత్రమే. అతడు వ్యాసుని వలె రాజకీయాలలో దూరినట్లు కన్పించదు. రాజకీయాలకు అతీతంగా వుంటూనే, ఆనాటి రాజకీయాన్ని సూక్ష్మంగా పరిశీలించి, రామాయణ మహాకావ్యాన్ని రచించాడు.


    వాల్మీకి మనస్సు అంతగా పరితపించడానికి కారణం, ఆనాటి కుటుంబ వ్యవస్థ అయి వుంటుంది. ఆనాటి కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై ఆధారపడివుంది. ఏ వ్యవస్థకైనా, ఏ సమాజానికైనా కుటుంబము మూలము. కుటుంబములో సుఖ సంతోషాలు వెల్లివిరిసిన నాడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఆ విషయాన్ని గ్రహించిన వాల్మీకి విచ్ఛిన్నమవుతున్న కుటుంబాన్ని పటిష్ఠమయిన ప్రేమపాశంతో బంధించాలని రామాయణ మహాకావ్యాన్ని రచించి వుంటాడు. అతడు ఆదర్శవంతమైన దంపతులను, ఆదర్శవంతమైన అన్నదమ్ములను, ఆదర్శవంతులైన మిత్రులను చూపించాలని రాముని పాత్రను, సీత పాత్రను, లక్ష్మణ భరతులను, రావణ సుగ్రీవుల, విభీషణ పాత్రలను సృష్టించి వుంటాడు.


    "న సర్వే భ్రాత రస్తాతః భవన్తి భరతోప మాః
    మద్విధా వా పితుః పుత్రా సుహృదోవా భవిద్విధాః"


    భరతుని వంటి సోదరులుగాని, నా వంటి పుత్రులుగాని, నీవంటి మిత్రులుగాని వుండరు అంటున్నాడు రాముడు.


    ఒక ఆదర్స ప్రాయమైన దాంపత్యాన్ని, ఆదర్శప్రాయమైన తండ్రి కొడుకులను, ఆదర్శప్రాయమైన మిత్రులను సృష్టించి సమాజానికి ప్రేమ వేదం ప్రవచించుట వాల్మీకి ఉద్దేశ్యం. కుటుంబానికి సంబంధించినంత వరకు బల ప్రయోగం మీద అతనికి విశ్వాసం లేదు. కుటుంబంలో ప్రేమ పుట్టి, పెరిగి, ఆ ప్రేమ పాశంతో కుటుంబ సభ్యులను బంధించి, ప్రేమ ద్వారా వైరాన్ని, కలహాన్ని అంతం చేసి ఒక ఆదర్శమైన శాంతియుత సమాజాన్ని దర్శించడం వాల్మీకి లక్ష్యం అయివుండవచ్చు.


    వాల్మీకి తమసా నదికి వెళ్ళాడు. అక్కడ చెట్టు కొమ్మమీద ఉల్లాసంగా ఉన్న క్రౌంచ మిథునం కన్పించింది. అంతలో ఒక బాణం వచ్చి మగపక్షికి తగిలింది. అది గిరగిరతిరిగి, క్రిందపడి రక్తంలో పొర్లాడింది. దాన్ని చూచి ఆడపిట్ట దీనంగా విలపించింది.


    ఈ విలాపం వాల్మీకి మనస్సు క్షోభింపజేసింది. అవి పక్షులు మాత్రమే. చచ్చింది పిట్ట మాత్రమే. మరి మరో పిట్ట ఎందుకు ఏడ్వాలి. ఇంగా మగ పిట్టలు లేవా? దానికి జండ దొరకదా? మరి ఎందుకు ఏడుపు? అంటే ఆ రెంటి బంధం అలాంటిది. ఆ బంధం ఎవరూ చెప్పితే వచ్చింది కాదు. ఒకరి బలవంతంగా తెచ్చుకున్నది కాదు. అవి కొంతకాలం కల్సివున్నాయి. కల్సి వుండటం వల్ల, వాటిలో ఆత్మీయత, ప్రేమ, అనురాగం ఉద్బవించాయి. అలాంటి వాటిలో ఒకటి చనిపోయింది. అప్పుడు ఆడపిట్ట విలపించడం ప్రారంభించింది.

 Previous Page Next Page