7
ఎవరయ్యా ఎవరువారు
ఈశ్వర పద జిజ్ఞాసువు
లెవరయ్యా ఎవరంటా
ఇదివరలో ఎవరువారు?
ఉద్యోగపు ధర్మంలో
సద్యోం హశ్చర్యంలో
విటతాటపు బ్రతుకు గడిపి
రిటైరైన పోలీసులు.
నిత్య నిధువనక్రీడా
నృత్యంలో అలసిపోయి
జవసత్వా లుడిగిపోయి
సాధువైన వేశ్యామణి
నైకానోకహ విహారి
కాకంవలె దుఃఖ రాత్ర
ఘూకం వలె సంచరించు
లోక ద్వేషాగ్ని శీలి!
8
ఇంకా చెప్పాలంటే
ఎందరో మహానుభావులు
బ్రతుకునించి పారిపోయి
తమ వెనుకనె దాగువారు.
మరణ మహాసముద్రాన
జీవిత మొక ద్వీపంలా
తమపాలిటి శాపంలా
తలపోసే ఫిలోఫర్లు
ఆహా మరి యింతేనా
అందమైన మన మనుగడ
మూడునాళ్ళ వింతేనా
జగమతుకుల బొంతేనా
మెదడన్నది మనకున్నది
అది సరిగా పనిచేస్తే
విశ్వరహః పేటికా వి
పాటన జరగక తప్పదు.
9
"ప్రవక్ష్యామి గీతార్థే
న" యన్నాడు కాళిదాసు
బహుశా అంతకుమించిన
* క్థోనిజమే ఉండదేమొ
ఔను - అహింసను పోలిన
పరమో ధర్మమ్ము లేదు
(పరమో ధర్మం విరువకు
పరమ - అధర్మం అంటూ)
ఈవిల్, సిన్ మొదలైన ప
దాలను వాడేటప్పుడు
న్యాయం ధర్మం నీతీ
త్యాదుల చర్చించేప్పుడు
ఎవరికి తోచిన అర్థం
వారలు చెప్పక తప్పదు
పరమార్థం సామాజిక
సామూహిక సద్వర్తన
10
కలడు కలండనెడు వాడు
కలడో లేడో అంటూ
లోగడ ఒక ఏనుగు ఆ
లోచనలో పడిందట.
హోరా- హోరీ మకరితో
పోరి నడుం జారి తుదకు
"నాన్యదాస్తి శరణ" మనుచు
దైన్యంతో నిలిచిందట
విహ్వల నాగేంద్రుని మొర
విని - అప్పుడు కదలెనంట
ఆపన్న జనావన బిరు
దాంచితుడైనట్టి వేల్పు
చక్రంబున నక్రంబును
సంహరించి ఆ పిమ్మట
స్థల జలచరు లిరువురికీ
సాయుజ్య మొసంగెనంట
11
ఇది జరిగిన కథ కాదని
ఎవరో కల్పించిందని
ఇంచుక యోచించ గలా
డెవడైనా గ్రహిస్తాడు.
ఆ విషయ మటుండ నిచ్చి
అసలు సంగతికి వద్దాం
ఈ గజేంద్ర మోక్షణ కథ
ఏఁవిటి చెబుతుంది మనకు?
నీ శక్తికి విలువ లేదు
నీ యత్నం పనికిరాదు
దైవబలం ఉందే అది
అమేయమూ, అజేయమూ!
అందుచేత చేతులెత్తి
లొంగిపొమ్ము బేషరతుగ
అపు డాతని కృపచేత స
మస్తం సౌఖ్యాంత మగును.
12
పిరికితనం నూరిపోయు
పిట్ట కథలతో బానిస
మానసికత నగ్గించే
మన పూర్వుల నేమనాలి?
రాచరికపు రోజుల్లో
ఎగుడుదిగుడు సమాజాన
పాలక వర్గాధిక్యం
నిలబెట్టే పూనికతో
మనిషి నిలా తగ్గిస్తూ
మరోదాన్ని ఉగ్గడించి
పరమాత్ముని పేర మత
ప్రవక్తలైనారు వారు
వాళ్ళనెందు కనడంలే
ఇది మనలో జీర్జించిన
ముది తత్వం, ఈ సరికీ
వదిలిపోనీ మురికి మందు
(సశేషం)
- సంవేదన - ఏప్రియల్ - 1968