Previous Page Next Page 
ఖడ్గసృష్టి పేజి 10


                                               మహాసంకల్పం


    ఇది నా స్వాతంత్ర్యదిన
    మహా సంకల్పం.
    విధిగా వికసించే
    చరిత్రకొక కృతజ్ఞత,
    ప్రజలకు నివాళి,
    ప్రభవించిన నూతన భారత
    పతాక కభివాదం,
    భవిష్య దుజ్జ్వల
    ఖర్మయుగానికి ఆహ్వానం,
    సకల జగజ్జనులారా
    ఇదిగో నా స్వాతంత్ర్యస్వప్నం!

 

    ఏ స్వాతంత్ర్యం నిమిత్తం ఎవరెవరో ఎందరో దేశసేవా
    భాస్వంతుల్ బాలవృద్ధుల్ పతితు లధికు లప్రాజ్ఞులుత్ప్రజ్ఞులంతా
    అస్వాశల్ వీడి లాఠీహతులయి ఉరికొయ్యల్ కవుంగింట చేర్చా
    రా స్వాతంత్ర్యం లభించిందని విని హృదయం హ్లాద సంపుష్టమైతే

 

    నవోదిత స్వాధీనతానందితోత్పుల్లమైన
    రగరం జెండాల పంటలతో నవ్వుతూ పాడుతూ వుంటే
    ఉత్సాహ ప్రవాహంలో నేనూ ఒక బిందువునై
    స్వాతంత్ర్య వాయువులు పీలుస్తూ సాగిపోయా

 

    ఆ సమయంలో అందరి మనస్సు
    లావరించె నొకవ్యక్తి
    అందరిలోనూ ఆ సమయంలో
    ఆవహించె నొకశక్తి

 

    అంతట్లోకే అకస్మాత్తుగా
    జన సందోహం కరిగి
    ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే
    ఇదేం చిత్రమని చూశాను.  

 

    ఒక పెద్ద కాంస్య విగ్రహా
    నికి ప్రాణం వచ్చినట్లుగా,
    ఒకే మేఘం, గగన పథం దిగి
    మానవుడై నిలిచినట్లుగా,
    ఒక మహా వట వృక్షం
    హఠాత్తుగా నడిచినట్లుగా,
    ఒకే ఒక్క మానవమూర్తి
    నా కళ్ళముందు కనిపించాడు
    ఎంచేతో అతని ముఖం మీద
    ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వులేదు?

 

    ఆ మానవాననంలో
    ఏదో కించిద్విషాదం, కించిన్నిరాశ
    కొంచెం విరాగం, కించి దసంతృప్తి,
    ఆ మానవ వదనం అందరికీ పరిచితమే,
    అతడే నువ్వూ, నేనూ అంతమందీ వెరసి.

 

    స్వతంత్ర భరతవర్ష వాస్తవ్యు డా మానవుడు
    అర్ధనగ్నంగా ఆకాశాన్నే కప్పుకొని
    నిండని కడుపుతో మండుతూన్న కళ్ళతో
    ఇలా ఎంతకాలం నిలబడతాడా ప్రాణి?

 

    అతణ్ణి జాగ్రత్తగా చూడండి
    స్వతంత్ర భారత పౌరుడు
    అతని బాధ్యత వహిస్తామని
    అందరూ హామీ ఇవ్వండి.

 

    అతని యోగక్షేమాలకు
    అంతా పూచీ పడండి,
    అతికించండి మళ్ళీ
    అతని ముఖానికి నవ్వు!

 

    స్వాతంత్ర్యం ఒక చాలా సున్నితమైన పువ్వు,
    చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం
    స్వాతంత్ర్యం తెచ్చే వెన్నెన్నో బాధ్యతలు
    సామర్ధ్యంతో నిర్వహిస్తామని
    సంకల్పం చెప్పుకుందాం!

 

    భగవంతుని ప్రార్థించిందికి
    బహుశా ఇది సమయం కాదు,
    పాతవి గుంజాళించిందికి
    బహుశా ఇది సమయం కాదు.

 

    ఇది మనకొక దీక్షా సమయం
    ఇది మనకి పరీక్షా సమయం
    ఆవేశం ప్రకటించిందికి
    అసలే ఇది తరుణం కాదు-

 

    రా! నేస్తం, పోదాం! చూదాం
    మువ్వన్నెల జండా పండుగ,
    రా ! నేస్తం లేదాం, చూదాం!
    మన భారత జన సౌభాగ్యం.

 

    అటు చూడు సముద్రం, నేస్తం
    హర్షానికి పర్యాయపదం:,
    ఇటు చూడు విహాయసనేత్రం
    దుఃఖానికి అధ్యాహారం:,

 

    ఈ రెండింటిమధ్య నిలిస్తే
    నీ లోపల లోలో పలికే
    ఆలాపన లాలోకిస్తే
    వినపడదా ఒక సంగీతం,
    విడివడదా ఒక సందేశం,

 

    ఇదీ నా స్వాతంత్ర్యదిన
    మహా సంకల్పం.
    ఇది నా ప్రజలకు నివాళి
    స్వతంత్ర భారత పతాకాని
    కిది నా అభివాదం,

 

    భవిష్య దుజ్జ్వల
    భర్మయుగానికి ఆహ్వానం,
    సరిహద్దులు లేని
    సకల జగజ్జనులారా!

 

    మనుష్యుడే నా సంగీతం,
    మానవుడే నా సందేశం!

                                                              - అభ్యుదయ - సెప్టెంబరు, 1947

 Previous Page Next Page