Previous Page Next Page 
ఖడ్గసృష్టి పేజి 8


                            సదసత్సంశయం


    1

    ఆలోలము లాలోచన
    లేవేవో నాలోపల
    ప్రాలేయచ్ఛాయల వలె
    తారాడగ కోరాడగ

 

    పేరు పేరు వరసలతో
    పిలిచి ప్రశ్న వేస్తున్నా
    ఈ తెగని సమస్యను భే
    దించువారలెవరో అని


    
    ఎన్నో సందేహాలూ
    ఎన్నో సంతాపాలూ
    జీవితంపు చిక్కుముడులు
    విడవెంతగ సడలించిన

 

        ఈ సృష్టికి ఏమర్థం
        మానవునికి గమ్యమేది
        ఒక సకలాతీత శక్తి
        ఉన్నట్టా లేనట్టా

    
    2
    
    నిరంతరం ఘోషించే
    నీరనిధిని పిలిచినాను
    అస్తి నాస్తి రూపమైన     
    ఆకాశము నడిగినాను

 

        మహాకవుల గ్రంథాలను
        మనసుపెట్టి పఠించాను
        ప్రవ్రజితుల ముముక్షువుల
        భావాలను స్మరించాను

 

    యుగయుగాలు తరలెగాని
    ప్రశ్న ప్రశ్నలాగున్నది
    అలలు కదిసి మరచి చనగ
    శీలామాత్రం మిగిలినట్టు

 

        జగదీశ్వరు డతడెవరో
        ఆగపడితే బాగుండును
        ఏమీ యిది స్వామీ అని
        నిలవేస్తా కడిగేస్తా

 

    3

    కవి హృదయపు కనుమలలో
    గర్జించిన పర్జన్యం
    పెనుచీకటి తిరుగుబాటు
    బీభత్సపు మెరుపుదాడి

 

        కనులముందు చిత్రించే
        గతిలేని జనాల బాధ
        కడుపు తరుక్కొనిపోయే
        కన్నీళ్ళ విషాదగాథ


    
    కరువులలో వరదలలో
    కటిక దరిద్రుల అవస్థ
    కవితలోన కథలలోన
    కట్టాలని తలచినపుడు

 

        ఈ విశాల జగతినుంచి
        ఏమిటి నే కోరినాను
        ఈ జానెడు సానుభూతీ
        ఒక దోసెడు తిరుగుబాటు

                                                    - తెలుగు స్వతంత్ర వారపత్రిక - 18.9.1953


    4

    జ్ఞానుల బోధిస్తూ బ్ర    
    హ్మానంద మవాఙ్మానస
    విశదమనీ అనుభవైక
    వేద్యమనీ నుడివినారు

 

        జపంవల్ల తపంవల్ల
        ప్రపంచాన్ని మరిచిపోయి
        భగవంతుని ధ్యానంలో
        పడిపొమ్మని పలికినారు


    
    మంచి చెడ్డలను కొలిచే
    మానదండమంట దైవం
    ఈశ్వరుడొకడే సత్యం
    ఇతర సమస్తం మిథ్యట

 

        ఇంద్రియాలద్వారా మన
        కీ సత్యం తెలియదంట
        విశ్వాసం తప్ప మనకి
        వేరే సాక్ష్యం లేదట


    5

    అగుపించనిదేదో ఒక
    ఆత్మ పదార్ధం కలదట
    అన్నీ పోవచ్చుగాని
    అది మాత్రం చావదంట

 

        నిప్పుదాన్ని కాల్చలేదు
        ఛిందించిగలేదు కత్తి
        నీరు దాన్ని ముంచలేదు
        గాలి దాన్ని చెనకదంట

 

    జన్మలనీ కర్మమనీ
    చాలాదూరం వెళ్ళిన
    ఆలోచనలన్నీ ఈ
    ఆత్మచుట్టు అల్లినవే

 

        ఏతదాత్మ సర్వేషాం
        సర్వత్రా ఆవరించి
        సర్వస్వం తానే ఐ
        శాసిస్తుం దంట జగతి  


    6

    పుణ్యపాప నిర్ణేతలు
    నీత్యవినీతిజ్ఞ విజ్ఞు
    లస్తి నాస్తి విచికిత్సకు
    లంతమంది యేమన్నా

 

        ఇది మాత్రం నే నెరుగుదు
        నెంతమంది యేమన్నా
        తథ్యం ప్రాణికి మృత్యువు
        తప్పదు జీవికి వేదన

 

    జడిగొల్పే దుఃఖంతో
    తడియకుండ గొడుగులేదు
    ఆనందాలన్నీ తుద
    కంతమొందు నొక సమాధి

 

        మనుజునిలో మరణ భీతి
        మదిలో దుఃఖానుభూతి
        ఆలోచన లన్నిటికీ
        ఆంతర్యంతో పునాది

 Previous Page Next Page