Previous Page Next Page 
చెక్ పేజి 9


    "ఏం సార్ ? రాత్రి బాగా ఆలస్యమైనట్టుందే" అడిగాడు దామూ.

 

    వాడి మాటల్లో రెండు అర్థాలు గోచరించాయి నాకు.

 

    "బాగా పొద్దుపోయేవరకు ఇద్దరం కబుర్లాడుతూ గడిపాం."

 

    'అంతేనా' అన్నట్టు వాడు ముఖం తిప్పుకున్నాడు. ఎందుకో నాకు అవమానంగా అన్పించింది. గ్లాస్ లు తీసుకుని వెళ్లిపోయాడు దాము.

 

    "రాత్రి రాలేదని కోపమా?" నేనుగా మాట్లాడకపోయేసరికి కీర్తి కంగారుపడుతూ అడిగింది.

 

    "కోపం వుంది. అయితే నీమీద కాదు నా మీదే."

 

    "ఏం చేయను మదన్? భరించలేనంత భయం కల్గించే కథ చెప్పలేకపోయావ్."

 

    "అందుకే నామీద నాకే కోపం."

 

    "నిరుత్సాహ పడకు. ఇంకా అయిదు రాత్రులున్నాయి. అంటే అయిదు ఛాన్స్ లన్నమాట."

 

    "రాత్రి కథ ఎలా వుంది?"

 

    "చాలా బావుంది. అంతకు ముందే చచ్చిపోయిన వ్యక్తితో ఒక రాత్రంతా మాట్లాడుతూ కూర్చోవడం భయంకరమైన అనుభవం. అయితే కథ చివరికొచ్చేసరికి హాస్యం డామినేట్ చేసేసింది. చొక్కాలు మార్చుకున్నంత ఈజీగా అతను ఎవరో ముసలాడి శరీరాన్ని తగిలించుకుని వచ్చేయడాన్ని తలచుకుంటేనే నవ్వొస్తోంది. రాత్రి ఎంతసేపు నవ్వుకున్నానో, ఇంతకీ మీ మామయ్య ఏమయ్యాడో చెప్పవా?"

 

    "చెప్పను. ఆ రెండో కొసమెరుపు మన పెళ్ళయ్యేంతవరకు సస్పెన్స్. మొదటి రాత్రి ఏ తెల్లవారుజామో తీరిగ్గా రిలాక్స్ అవుతూ చెబుతాను సరేనా?"

 

    కీర్తి బుంగమూతి పెట్టింది. ఏ ఫీలింగ్ లోనైనా అందంగా కన్పించడం కీర్తి ప్రత్యేకత.

 

    మరో కాఫీ తాగాలనిపించింది.

 

    అనుకున్నదే తడవుగా దామూ ప్రత్యక్షం. కొంపదీసి నేననుకున్నది వీడికి తెలుస్తోందా?

 

    ముఖమంతా నవ్వును పులుముకుని "కాఫీ" అన్నాను.

 

    "అందుకే కదా సార్ వచ్చింది" అని కెటిల్ కున్న కుళాయిని తిప్పి గ్లాస్ లో కాఫీ నింపి ఇచ్చాడు.

 

    దామూ వెళ్ళిపోయాక స్నానం చేసి డ్రెస్ మార్చుకు వచ్చాను.

 

    ఇంక రాత్రికే చదరంగం బల్ల. ఇప్పట్నుంచే ఆరాటపడకూడదని స్థిమిత పడ్డాను.

 

    ఇద్దరం అలా తిరిగి రావడానికి బయల్దేరాం.

 

    రోడ్డు పక్కనున్న తురాయి చెట్లు ఎర్రటి కిరీటాలను ధరించి నట్టున్నాయి. గాలికి ఎవరో ఎనస్తీషియా ఎక్కించినట్టు తడబడుతూ మెల్లగా సాగుతోంది. మైక్ లోంచి వినిపిస్తున్న వేదం పఠనం ఆ ప్రాంతానికి తెలియని గాంభీర్యాన్ని ఆపాదించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫ్రొగన్స్ వున్న ప్లాస్టిక్ పువ్వులా వుంది. దీనికి ముందున్న రోడ్డులోని షెల్టర్ షెడ్ మా ఇద్దరి కోసమే వేసినట్టుంది.

 

    ఇద్దరం గుడి ముందున్న మెట్లమీద కూర్చున్నాం. షరతు మేరకు కీర్తి ఒకడుగు దూరంలో కూర్చున్నాను.

 

    ఏవేవో కబుర్లు. పెళ్ళయ్యాక ఎక్కడికి హనీమూన్ వెళ్ళాలో నిర్ణయించుకునేసరికి మధ్యాహ్నం రెండైంది.

 

    మధ్యలో ప్రసాదాలు తిన్నాం. నాలుగు గంటలకు కాటేజ్ కి తిరిగొచ్చి కాసేపు నిద్రపోయి (ఎవరి పోర్షన్ లో వారే సుమా) లేచాం.

 

    సాయంకాలం అద్భుతంగా వుంది. సంధ్య తన ఎర్రటి చేతులతో తిరుమలను దగ్గరకు లాక్కుంది. గాలి రకరకాల ఫీట్స్ చేస్తోంది.

 

    ఇద్దరం అలా పార్కులన్నీ తిరిగాం. అటే వెళ్లి భోజనం ముగించుకుని వచ్చాం.

 

    నేను ప్యాంట్ మార్చుకుని లుంగీలో దూరాను. పైన తెల్లటి జుబ్బా. కీర్తి గోధుమరంగులో తెల్లటి పూలున్న నైటీ వేసుకుంది. ఆ అందం నన్ను రెచ్చగొడుతూ ఉంది.

 

    ఈ రాత్రి సక్సెస్ అయితే నా కౌగిట్లో కీర్తి.

 

    ఇద్దరం వరండాలో కూర్చున్నాం. లోపల లైట్లన్నీ ఆర్పివేయడంతో అప్పుడప్పుడూ పడే ఫ్లోరోసెంట్ దీపం వెలుగు తప్ప మా కాటేజ్ వరండా అంతా చీకటిగా వుంది.

 

    "రాత్రి ఓటమిని గుర్తు పెట్టుకుని, ఈ రోజు మరింత విజృంభించి కథ చెబుతావనుకుంటా" అంది కీర్తి.

 

    చదరంగం బల్లలో తనే మొదటి బంటుని జరిపింది. తను కావాలనే నన్ను వుడికిస్తోందా?

 

    "వద్దు. ఈ రోజు నిజంగానే జడుసుకుంటావు. అలా జరిగితే నేను శీలం కోల్పోతాను. పెళ్ళయ్యేవరకు పవిత్రంగా వుండాలన్నది నా ఫీలింగ్" నవ్వుతూ అన్నాను.

 

    "నీ శీలాపహరణ ఏమీ జరగదు. అలా జరగాలనే కదా నువ్వు నీ కథలతో అదరగొడుతున్నావు."

 

    "సరే అయితే. గుర్తుంది కదా మన షరతు. భయపడి నువ్వు నా గదిలోకి వస్తే ఎందుకూ అభ్యంతరం చెప్పకూడదు."

 

    పగలబడి నవ్వింది కీర్తి.

 

    అంత నవ్వాల్సిన విషయం ఏముంది అందులో? బహుశా నా ఆతృతను చూసి నవ్వుంటుంది కీర్తి.

 

    "అంత సందేహం వద్దు. నీ రూమ్ లోకే నేను వస్తే అన్నిటికీ ఓకె." తన మాటల్లోని సీరియస్ నెస్ నా ముఖానికి తగిలింది.

 

    "మదన గోపాలరావూ! కానీ-నీ సత్తా చూపించు కీర్తి భయంతో అదిరిపోయే కథ చెప్పు."

 

    నేను కథలోకి ...

 

    అమ్మా వాళ్ళు అంతకాలం పోరుతున్నా ఆ వూరెళ్ళని నేను ఆ రోజు వెళతానంటే మా అమ్మ ఆశ్చర్యంతో ముఖాన్నంతా ఎర్రగా చేసుకుంది. 'వెళ్ళేప్పుడు తాత పటానికి నమస్కరించి వెళ్ళు, క్షేమంగా తిరిగొస్తావ్' అంది అమ్మమ్మ. 'ఆ వూర్లో నువ్వో క్షణం వుండలేవు, ఎందుకెళతావు? చార్జీలు దండగ' అన్నాడు నాన్న.

 

    పట్టణ నాగరికతకు అలవాటు పడ్డ ఏ మానవుడూ ఆ వూర్లో ఒక్కక్షణమైనా వుండలేడు.

 

    పట్టణానికి దూరంగా, నాగరికత ప్రవేశించలేని కీకారణ్యంలో వుంటుంది ఆవూరు. ఆ వూరి పేరు నిడిగుర్తి. మల్లాం నుంచి సముద్రం వైపుకు చొచ్చుకుపోతే అడవి మధ్య తల విరబోసుకున్న వన కన్యలా వుంటుందా వూరు.

 

    మల్లాం వరకు బస్సు వెళుతుంది. ఇక అక్కడ నుంచి రెండెద్దుల బండ్లో వెళ్ళాలి. బండ్లో దాదాపు ఆరు గంటలసేపు ఏక బిగిన ప్రయాణం చేయాలి. అక్కడికి సముద్రం మరీ దగ్గర. మనుష్యుల అలికిడి వినని సముద్రం నీలం ఆవేశంతో వూగిపోతూ వుంటుంది.

 

    ఆ వూర్లో మొత్తం పది రైతు కుటుంబాలున్నాయి. మిగిలిన ఆరు వందల కుటుంబాలు యానాదులే. వాళ్ళకు జీవనాధారం అడవి. సముద్రం. అడవిలోని శీకాయ, తేనె, వంట చెరకు తెచ్చి మల్లాంలో అమ్మి, డబ్బు చేసుకుంటారు. లేదంటే తాము తీసుకొచ్చినవన్నీ ఆ గ్రామంలో భుజంగానికి ఇచ్చి ఆయనిచ్చిన తృణమో, పణమో తీసుకుంటారు.

 Previous Page Next Page