మా చిన్నాన్న కూతురు గీర్వాణిని ఆ వూర్లో ఇచ్చారు. ప్రతి సంవత్సరం జాతరకు రమ్మని ఆ ఆపిల్ల ఉత్తరం రాస్తుండేది. మా ఇద్దరిదీ ఒకే వయసు కావడం వల్ల పెళ్ళికి ముందు చాలా క్లోజ్ గా వుండేవాళ్ళం. తను పెళ్ళి చేసుకొని వెళ్ళాక తనే అప్పుడప్పుడూ మా వూరికి వచ్చేది తప్ప మేమెవరమూ ఆ వూరికి వెళ్ళలేదు.
ఆ వేసవి కాలంలో యధాప్రకారం గీర్వాణి నుంచి ఉత్తరం వచ్చింది. జాతరకు వచ్చి రెండు రోజులు ఉండిపొమ్మని మరీ మరీ రాసింది. కాలేజీకి శలవులే గనుక వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను.
అడవిలో ఏం ఖర్చులుంటాయని వంద రూపాయిల కాగితాన్ని చేతిలో కుక్కాడు నాన్న. ఒట్టి చేతుల్తో వెళ్ళకు, నాయుడుపేటలో గీర్వాణికి పండ్లు, పూలు తీసుకుని వెళ్ళమని అమ్మమ్మ నాన్నకు తెలియకుండా పది రూపాయిలిచ్చింది. అంత దూరం వెళుతుంటే వంద రూపాయిలే ఇచ్చిన నాన్నను విసుక్కుంటూ అమ్మ మరో ఇరవై రూపాయిలిచ్చింది.
చివరి క్షణంలో బయల్దేరడంవల్ల బండి పంపమని గీర్వాణికి ఉత్తరం రాయలేకపోయాను. ఎలానో వెళ్ళచ్చు లెమ్మని బయల్దేరాను.
తీరా మల్లాంలో బస్సు దిగేసరికి అడవిలో అంత దూరం ఒంటరిగా వెళ్ళడం దుసాధ్యమనిపించింది.
బస్సు దిగి ఎదురుగ్గా కనిపిస్తున్న టీ పాకలో దూరాను.
మల్లాం ఇంకా టౌన్ గా ఎదగలేదు. రెండు టీ అంగళ్లు, మూడు వెచ్చాల కొట్లు, ఓ ప్రభుత్వ సారాయి దుకాణం తప్ప ఏమీ లేవు.
ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ అలానే గంటసేపు టీ అంగట్లోనే కూర్చున్నాను.
నేను వచ్చిన బస్సు నాయుడుపేటకు వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చింది.
ఓ పదిమంది జనాన్ని దింపి మళ్ళీ బయల్దేరింది. ఆ బస్సులో తిరిగి వెళ్ళి పోదామని కూడా అనిపించింది ఓ క్షణం. అయినా తమాయించుకున్నాను.
అదే క్షణంలో ఎద్దుల మువ్వల చప్పుడు ఘల్లు ఘల్లుమని విన్పించింది.
శబ్దం వచ్చినవైపు చూశాను.
ఎదురుగ్గా వున్న చింత చెట్టు నీడలోంచి ఎద్దుల బండి వస్తోంది.
ఆ బండి రకరకాల అలంకరణలతో అచ్చు రథంలా వుంది. రెండు బలిష్టమైన కోడెదూడలు కైలాసం దిగిన నందీశ్వరుల్లా వున్నాయి. ప్రథమ గణాల్లా వాటి ముందు పగ్గాలు పట్టుకుని ముగ్గురు నడిచి వస్తున్నారు.
మరి సాక్షాత్తూ ఆ శంకరుడెవరని నా కళ్లు గాలిస్తున్నాయి.
బస్సు దిగి వస్తున్న ఆయన్ను చూస్తూనే శివుడు ఆయనేనని అర్థమై పోయింది. టెరికాటన్ పంచెమీద సిల్క్ జుబ్బాలో పార్వతీపతిలా ఆయన మెరిసిపోతున్నాడు. కంఠానికి చుట్టుకున్న నల్లటి త్రాచులా మఫ్లర్ వేలాడుతూ వుంది. ఆయనకు నలభై ఏళ్ళుంటాయి.
ప్రమథ గణాలు పరుగెత్తుకు వెళ్ళి, నడుమును వంచి వినయంగా నమస్కరించాయి. వారిని చూసి ఆయన పలకరింపుగా కూడా నవ్వలేదు సరికదా కళ్ళతో ఏదో ఆజ్ఞాపించాడు.
వారు బస్సు వద్దకు పరుగెత్తుకు వెళ్ళి లోపల నుంచి రెండు పెద్ద సూట్కేసులను మోసుకొచ్చారు. వాటిని బండిలో సర్ది ఆయన దగ్గరకు వచ్చి వినయంగా నిలబడ్డారు.
మల్లాంలో వున్న వాళ్ళు సైతం ఆయనవైపు భయభక్తులతో చూడడం నేను గమనించాను. ఆ బండి ఎక్కడికి వెళుతుందో తెలుసుకుంటే అందులో వెళ్ళచ్చు. ఆయన తప్ప మరెవరూ లేరు కనుక ఆయనకూ అభ్యంతరం వుండకపోవచ్చు.
ప్రమథగణాల్లో ఒకడిని పిల్చి "ఏ వూరెళ్తుంది బండి?" అని ప్రశ్నించాను.
"నిడిగుర్తి" అతను అలా అనడంతో ఎగిరి గంతేసినంత పనయింది నాకు.
ఆయన అందుకు ఒప్పుకుంటారా?"
"నేనూ నిడిగుర్తికి కావాలి. మీ దొర నన్ను బండిలో రానిస్తారా?"
"ఏమో బాబూ! నాకా విషయం ఎలా తెలుస్తుంది? మీరు ఆయన్ను అడగండి."
అతను వెళ్ళిపోయాడు.
మేం ఇద్దరం మాట్లాడుకోవడం శివుడి మూడో కంట్లో పడింది.
నాతో మాట్లాడిన అతన్ని శివుడు చూపులతోనే దగ్గరకు పిలిచాడు.
ఎదురెళ్ళిన అతను భయంతో నిలుచున్నాడు.
ఆయన ఏదో అడిగితే, వాడేదో సమాధానం చెప్పాడు.
మరో నిముషంలో వాడు పరుగున నా దగ్గర కొచ్చి "అయ్యగారు మిమ్మల్ని బండిలో రమ్మన్నారు" అని చెప్పాడు.
ఆయనతో కూర్చోవాలంటే నాకు భయమేసింది. ఆయన దగ్గర్నుంచి వస్తున్న డబ్బువాసన అలాంటి అర్థంలేని భయాన్ని కలగచేస్తూ వుందనుకుంటా.
వెళ్ళి బండి చివరలో కాళ్ళు వేలాడేసి కూర్చున్నాను.
మరో పదినిమిషాలకు బండి కదిలింది.
తెరవెనుక నుంచి ఆయన అస్పష్టంగా కనిపిస్తున్నారు.
చాలా ఇరుకు దారంట బండి వెడుతోంది. చుట్టూ ముల్లపొదలు, గాలి మాత్రం స్వచ్చంగా వీస్తోంది. ఏవో పేరు తెలీని పిట్టలు వుండుండి కూస్తున్నాయి. వాటికి శృతి చేస్తున్నట్టు జోరీగల రొద ఆపులేకుండా విన్పిస్తోంది. బండి పై భాగం రాసుకున్నప్పుడు చెట్లనుండి రాలుతున్న పూలు నా ఒళ్ళో పడుతున్నాయి. అప్పుడప్పుడు నా ముందు నుంచి వెళ్ళే రంగు రంగుల సీతాకోక చిలుకలు నా కళ్ళకు రంగుల కళ్ళద్దాలను తగిలిస్తున్నాయి.
సాయంకాలం ఆరు గంటలకు నిడిగుర్తికి చేరుకున్నాం.
కాకులు గుంపుగా వాలినట్లు గుడిసెలు. వాటి మధ్య తెల్లటి పావురాయిలా రెండంతస్తుల మేడ. సాయంకాలం చీకట్లు మాత్రం వాటికోసం వేటగాడు విసిరిన వలలా వుంది. గాలి చేపల వాసనతో బరువెక్కి నెమ్మదిగా వీస్తోంది.
మా బండి ఊర్లోకి ప్రవేశించగానే వీథులమీద కూర్చున్న మగవాళ్ళంతా గౌరవ సూచకంగా కిందకు దిగారు. కొందరైతే కాళ్ళకున్న చెప్పులను వదలడం కూడా నాకు కనిపించింది. స్త్రీలు పైట కొంగు పూర్తిగా కప్పుకుని పక్కకు తొలిగారు.
మా బండి రెండతస్తుల మేడ ముందాగింది.
ఇంట్లోంచి దాదాపు పది మంది నౌకర్లు బిలబిల మంటూ బండి చుట్టూ మూగారు.
గుమ్మం దగ్గర ఆగి నవ్వుతున్న ఓ అమ్మాయిని చూస్తూనే నా గుండె చిన్న జర్క్ ఇచ్చింది. ఆకుపచ్చ రంగు పావడా, జాకెట్టు మీద తెల్లటి సిల్క్ ఓణీ వేసుకుంది. పావురాళ్ళని కాలక్షేపం కోసం పెంచుకుంటున్న వనకన్యలా వుందా అమ్మాయి.
అంత అందమైన అమ్మాయి ఆ ఊర్లో ఉండడం నాకే ఏదోలా అనిపించింది. పద్దెనిమిదో, పదిహేడో ఏళ్ళుండచ్చు.
"దిగండి బాబూ ! ఇదే నిడిగుర్తి" ప్రమథ గణాల్లో ఒకడు అనడంతో బండి దిగాను.
నన్ను చూసి ఆ అమ్మాయి ఒకడుగు వెనక్కు వేసింది. అంత దూరానికీ ఆమె కళ్ళు చాలా విశాలంగా కన్పించాయి.
సూట్కేసును చేతిలో పట్టుకుని నడవడం ప్రారంభించాను.
అప్పుడే పశువులు వెళ్ళాయేమో గోధూళి పైకెగురుతూ వుంది.