Previous Page Next Page 
చెక్ పేజి 8


    "మరో రెండు గంటలుండి వెళుదువులే పరంధామయ్యా. నువ్వు వెళ్లిపోతే నాకు తోచదు" అన్నాడు మామయ్య.

 

    "కుదరదు బాబూ! దయచేసి నాకు శెలవు ఇప్పించండి" అని రెండు చేతులూ జోడించాడు ఆయన.

 

    "పోనీ ఇంకో గంట వుండి వెళ్ళు" అని ఆయన చేతులు పట్టుకున్నాడు మామయ్య.

 

    పరంధామయ్య చివాలున మామయ్య చేతుల్ని తోసేసి "లేదు బాబూ! ఇంకో గంట ఆలస్యమైతే గొడవ జరిగిపోతుంది. నేను చాలా దూరం వెళ్ళాలి" అన్నాడు.

 

    ఆ మాటలకు మామయ్య షాక్ తిన్నాడు.

 

    "మీ వూరు వరదయ్యపాలెం అన్నావు కదా. చాలా దూరం వెళ్ళాలంటా వేమిటి?" మామయ్యకు ఆయనమీద సందేహం వచ్చినట్టుంది చాలా సీరియస్ గా అడిగాడు.

 

    "అదంతా నేను చెప్పలేను బాబూ! నే వెళ్ళకపోతే చాలా గొడవ అయిపోతుంది" ఆయన కళ్ళు అలజడితో ఎగిరిపడుతూ వుండడం అంత చీకట్లోనూ నేను గుర్తించగలిగాను.

 

    "గొడవేమిటి పరంధామయ్యా? అర్థమయ్యేట్టు చెప్పు" మామయ్య అంత సులభంగా ఏ విషయాన్ని వదలడు.  

 

    "నేను చెప్పలేను బాబూ! నే వెళుతున్నాను" అని లేచాడు ఆయన.

 

    "పరంధామయ్యా చెబుతున్నది నీక్కాదూ! గొడవేమిటి? మరో గంట వుండి వెళ్ళమంటుంటే వినవేం!" మామయ్య గద్దిస్తున్నట్టు మాట్లాడాడు.

 

    పరంధామయ్య ఈసారి మరింత అర్థింపుగా చెప్పాడు. "కోపం చేసుకోకు కానిస్టేబులు బాబూ! నేను వెళ్ళాలి. గొడవ సంగతి చెప్పచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఆ లోకానికి నేను కొత్త. అక్కడున్న కట్టుబాట్లేమిటో, పద్ధతులేమిటో కూడా సరిగా తెలియదు నాకు. నన్ను ఇబ్బంది పెట్టకండి. నన్ను వెళ్ళనివ్వండి."

 

    నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.

 

    "వేరే లోకమా" మామయ్య గొంతు ఆశ్చర్యంతో పూడుకుపోయింది.

 

    "అవును బాబూ ! నేనిప్పుడు మరో లోకం వెళ్ళాలి. యాక్సిడెంట్ లో చచ్చిపోయిన యువకుడ్ని నేనే. ఆ శరీరం నాదే. మీరొచ్చేలోపు దాన్ని నక్కలో, తోడేళ్ళో తినేస్తే నేనక్కడ శరీరం లేకుండా తిరగాలి.

 

    అందుకు మీరొచ్చేవరకు ఇక్కడ కాపలా వుందామనుకున్నాను. ఆ లోకంలో అప్పుడే పరిచయమైన ఓ ముసలాయన్ని అడిగి శరీరం అరువు తీసుకుని ఇక్కడకు వచ్చాను. మీరొస్తూనే వెళ్ళిపోవాల్సింది. కానీ ఇంకా ఈ లోకం మీద మమకారం చావక ఇంతసేపూ ఇక్కడే వుండిపోయాను. వెంటనే వెళ్ళి ఈ శరీరాన్ని ఆ ముసలాయనకు అప్పచెప్పాలి. రాత్రి వరకూ ముప్పై ఏళ్ళ వయసులో తిరిగిన నాకు ఈ ముసలి శరీరాన్ని వేసుకోవడం కంపరంగా వుంది. నా శరీరాన్ని జాగ్రత్తగా పూడ్చేయండి బాబూ. నేను అక్కడ తీసుకుంటాను" అని పరంధామయ్య ఒక్క ఉదుటున చీకట్లోకి పరుగెత్తాడు.

 

    నా తలమీద నుంచి చిన్నపిట్ట దూసుకెళ్లింది. ఎక్కడో నక్క అరుపు లీలగా విన్పించింది. చీకటి తెర నా కళ్ళమీద వాలినట్టు ఒక్క క్షణంపాటు ఏమీ కన్పించడం లేదు.

 

    అప్పుడు నా పరిస్థితి ఏమిటో ఇప్పుడూ చెప్పలేను.

 

    చెమటతో తడిసి ముద్దయ్యాను.

 

    నాలాగే మామయ్య కూడా భయంతో చల్లబడిపోయి నిలుచుండి పోయాడనుకున్నాను. బలవంతంగా తలతిప్పి చూశాను.

 

    అక్కడ మామయ్య లేడు.

 

    ఎటు వెళ్ళాడోనని నాలుగు వైపులకీ చూశాను.

 

    మామయ్య పరంధామయ్య వెళ్ళిన వైపు పరుగెత్తుతున్నాడు. పరంధామయ్యకు వినిపించేటట్టు ఎంతో ఆప్యాయతతో పిలుస్తున్నాడు.

 

    దెయ్యంతో ఏంపని పడి మామయ్య అలా వెళుతున్నాడో అర్థం కాలేదు. కళ్లు కూడా ఆర్పడం మాని నేను నిలబడిపోయాను.


                             *    *    *    *    *


    కథ అయిపోయింది.

 

    టైమ్ చూశాను. రేడియం డయల్ రెండు గంటలను చూపిస్తోంది. రాత్రి గడవడానికి ఇంకా మూడు గంటలుంది.

 

    అంత పెద్దపోర్షన్ లో అదీ దెయ్యం కథ విన్నాక కీర్తి ఒంటరిగా పడుకోగలదా?

 

    భయంతో నిద్రరాక నా గదిలోకి వచ్చేస్తే ... కాలాన్ని కాపలా పెట్టి సృష్టి మాధుర్యంలో మునిగిపోవచ్చు.

 

    "ఓ. కే మదన్."

 

    కీర్తి లేచింది తన పోర్షన్ లోకి వెళ్ళడానికి.

 

    ఇలాంటప్పుడు సంభాషణలకు తావివ్వకూడదు. కథ తాలూకూ టెంపో కథ అయిపోయాక కూడా కొనసాగాలి. అప్పుడే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది.

 

    "గుడ్ నైట్ కీర్తి" అన్నాను.

 

    "ఓ.కే"

 

    "తలుపు తీసే వుంచుతాను" అన్నాను.

 

    తను నవ్వడం చీకటిలో వురుకుతున్న వెలుగు జలపాతంలా వుంది. పార్క్ లోని ఫ్లోరోసెంట్ దీపం వెలుగు తనపై ఓ క్షణంపడి చెదిరింది.

 

    కీర్తి తన పోర్షన్ కి వెళ్ళి తలుపేసుకుంది.

 

    నేనూ నా పోర్షన్ లోకి వెళ్ళాను. గడిపెట్టకనే బెడ్ మీద వాలిపోయాను.

 

    "మదన్" తలుపుమీద చప్పుడు.

 

    దిగ్గున పడకమీద నుంచి లేచి బయటకొచ్చాను.

 

    "అవునూ నీ కథలో నువ్వో పాయింట్ చెప్పలేదు."

 

    నా కథ గురించే ఆలోచిస్తూ వుందన్న మాట సక్సెస్ అవుతాననే ఆశ నాలో.

 

    "ఏమిటి?"

 

    "మీ మామయ్య అరుస్తూ పరంధామయ్య వెనుక పరుగెత్తాడన్నావ్. ఆయన ఏమని పిలుస్తూ పరుగెత్తాడు? మళ్ళీ ఆయన వచ్చాడా? ఏమిటా మిస్టరీ?"

 

    "ఓహ్! అదా! చిన్న సస్పెన్స్. సస్పెన్స్ లేని హారర్ కథ వుండదు. అయినా ఆ విషయం చెప్పకపోవడంవల్ల కథ అసమగ్రంగా లేదు. కథకున్న రెండో కొసమెరుపు తరువాత చెబుతాను."

 

    "అయితే గుడ్ నైట్."

 

    కీర్తికి కోపం వచ్చిందని తెలిసిపోయింది.

 

    తను విసవిసా వెళ్ళి గడియపెట్టుకుంది.

 

    ఇక ఈ రాత్రికి రాదని తెలిసిపోయింది. అందుకేననుకుంటా నాకూ నిద్ర ముంచుకొచ్చింది.


                                                                  3


    ఉదయం నిద్ర లేచేసరికి తొమ్మిది దాటింది.

 

    అప్పటికే కీర్తి స్నానం చేసి వరండాలో దామూతో బాతాఖానీ వేస్తోంది.

 

    "గుడ్ మార్నింగ్" అంది నన్ను చూస్తూనే.

 

    "గుడ్ మార్నింగ్" కుర్చీలో కూర్చున్నాను.

 

    దామూ నాకో కాఫీ ఇచ్చాడు.

 Previous Page Next Page