ఆయన ఫోన్ పెట్టేశారు.
"వాట్ డాడీ? ఎనీథింగ్ సీరియస్?" ప్రశ్నించింది రజని.
"ఏం లేదమ్మా! ఏదో వ్యాపారపు గొడవలు" అన్నాడాయన నవ్వేస్తూ.
ఆయన అబద్ధం చెప్పాడని ఆయనకే కాక విజయకూ తెలుసు. అయితే ఆ విషయమేమీ తనకు తెలియదన్నట్టు ఆమె మౌనంగా ఉండిపోయింది.
* * * * *
స్వప్న గంటనుంచి మేకప్ చేసుకుంటోంది.
తెల్లజాకెట్, తెల్లపావడా వేసుకుంది. దానిమీద తెల్లటి జార్జెట్ ఓణీ వేసుకుంది. ముఖాన తెల్లటి బొట్టు పెట్టుకుంది. అంతకు ముందున్న నీలం స్టడ్స్ తీసివేసి, ముత్యాల దుద్దులను చెవులకు వేసుకుంది. కురులను జడవేయకుండా అలా ఫ్రీగా వదిలేసింది. మొదట్లో మాత్రం తెల్లటి రిబ్బన్ తో కట్టింది. చేతులకు తెల్లటి గాజులు వేసుకుంది.
అద్దంలో చివరిసారి చూసుకుని సంతృప్తిపడింది.
బీరువాలోనున్న పుస్తకాలను కెలికింది యద్దనపూడి శ్వేతగులాబీని చదవడం ప్రారంభించింది.
రాజా హోమ్ వర్కు చేసుకుంటున్నాడు.
శ్యామల కొడుక్కీ, కూతురికీ రెండు కప్పుల్లో కాఫీ తీసుకొచ్చింది.
ఆమె కూతురికి కప్పు అందిస్తూ "వయసుకొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందన్న మాటేగానీ ఏ పనైనా చేతులతో ముట్టుకుంటున్నావా? ఆడపిల్ల పనిపాటల్లో ఎంత ఆరితేరితే అత్తింట్లో అంత సుఖంగా ఉంటుంది" అని దెప్పి పొడిచింది.
"నేనే పని చేయను. కావాలంటే నాన్నతో చెప్పుకో" అంది గారాబాలుపోతూ స్వప్న.
ఆ మాటలకు ఎక్కడలేని నిరుత్సాహం వచ్చింది శ్యామలకు.
"ఆయన శుద్ధంగా ఉంటే మీరిద్దరూ ఇలా వాగేవాళ్ళా! బుగ్గల్ని చిలికి మరీ బుద్ధి నేర్పించేవాళ్ళు. ఆయనకెప్పుడూ నిద్రే అందరూ పడుకుని నిద్రపోతే మీ నాన్న అలా కూర్చోగానే కోడి నిద్రపోతుంటాడు. ఆయనకు ఆ దురలవాటే లేకపోతే మీ ఇద్దరి ఆటలూ ఇలా సాగేవా?" అంది నిష్టూరంగా ఆమె.
"అది నాన్నకు పట్టిన అదృష్టం. ఎంతమంది ఈ లోకంలో నిద్రలేమితో అల్లాడిపోయేవాళ్ళు. నిద్రపోవాలని మాత్రలూ, మందూ పుచ్చుకుంటూ ఉంటారు. నువు మాత్రం నిద్రపట్టక రాత్రుళ్ళు ఎంత బాధపడిపోతుంటావో నాకు తెలియదా! నాన్నకు అది దేవుడిచ్చిన వరం. కాకపోతే ఎక్కడపడితే అక్కడ నిద్రపోతాడనిగానీ లేకుంటే ఆ దురలవాటు వల్ల నాన్నకు కానీ, మనకు కానీ వచ్చే నష్టమేముంది!" స్వప్న తన తండ్రి నిద్రపోయే అలవాటుని సమర్ధించింది.
ఆ మాటలకు మరింత మండిపడింది శ్యామల.
"నష్టం లేదంటావా? జరుగుతున్న నష్టం నీకు తెలియడం లేదే. ఎప్పుడైనా నెల జీతం ఆయన ఇంటికి తెచ్చాడా? లేదే. ఏదో ఎస్.ఐ.గా వున్నాడు కాబట్టి జీతం లేకపోయినా గడిచిపోతుంది. లేదంటే అందరూ కట్టగట్టుకుని కృష్ణానదిలో దూకి చచ్చుండాలి. జేబులో జీతం ఉందికదా జాగ్రత్తగా వుండాలన్న ధ్యాసైనా లేకుండా బస్సులో ఎక్కీ ఎక్కగానే కళ్ళు మూసుకుంటే ఎవరో ఒకడు ఆ సొమ్మును ఎత్తుకుపోతున్నాడు. నిన్నటికి నిన్న బస్సులో ఎవడో జేబులోంచి పెన్ కొట్టేశాడంట. సిగ్గు లేకుండా చెప్పాడు."
"ఇక చాలించు మమ్మీ. ఎప్పుడూ మిమ్మల్ని తిట్టడమే నీకు పని" అని విసురుగా ఆమె చేతిలోని కప్పును తీసుకుంది స్వప్న. కప్పులోకి చూస్తూ "కాఫీనా?" అని అడిగింది తల్లిని.
"అవును"
"కాఫీకి ఈ డ్రస్ కి మ్యాచ్ కాదు. ఎంచక్కా పాలు తీసుకురా మ్యాచ్ అవుతుంది తాగుతాను."
ఆ మాటలకు శ్యామల నోరు తెరిచింది ఆశ్చర్యంతో.
"తెల్లబట్టల్లో ఉన్నావని పాలు కావాలా?" మెల్లగా ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ అని "ముందు ఆ కాఫీ తాగుతావా లేకపోతే వాటిని నెత్తిమీద కుమ్మరించమంటావా?" అని గద్దించింది.
"నువ్వలా కసురుకుంటే అదిగో మనింటికి ఎదురుగ్గా టైలర్ గా ఉన్నాడే ఆ కుర్రాడితో లేచిపోతా" బెదిరించింది స్వప్న.
శ్యామల పిల్లిలా అయిపోయింది. పులిలా గాండ్రించినప్పుడు తల్లిని ఎలా పిల్లిలా మార్చాలో తెలుసు స్వప్నకు. అందుకే ఆ అస్త్రం ప్రయోగించింది.
"లేదే అమ్మ, నీ డ్రస్ కు మ్యాచింగు అయ్యే పాలే తెస్తాను" అని కప్పు అందుకుని రాజా దగ్గరకు వచ్చింది.
"రేయ్ కాఫీ తాగరా."
"లంచం ఇచ్చుకో" వాడు పుస్తకంలోంచి తల ఎత్తకుండానే అన్నాడు.
మరో మూడ్ లో అయి ఉంటే వాడి చెంప అదిరేది. అయితే అంతకు ముందే స్వప్న ట్రీట్ మెంట్ ఇచ్చి ఉండడంతో పైటలో ఉంచుకున్న చాకెట్లతో ఒకటి తీసి వాడిచేతిలో పెట్టింది. మరీ అవసరమైనప్పుడు వాడికి లంచంగా ఇవ్వడానికే ప్రతిరోజూ ఉదయం చాక్లెట్లు కొని, పైట చెంగులో కట్టుకుని ఉంటుంది ఆమె.
రాజా కప్పు అందుకున్నాడు.
వంటింట్లోకి వెళ్ళి పాలగ్లాస్ ను తెచ్చి కూతురికిచ్చి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది శ్యామలమ్మ.
మరో పదినిముషాలకు తలుపు చెప్పుడౌతున్నట్టు ఆమెకు వినిపించింది.
భర్త వచ్చాడేమోనని "స్వప్నా! ఎవరో వచ్చినట్లున్నారు నాన్నగారేమో చూడు. ద్వారం దగ్గర ఇద్దరున్నారు. ఎవరో లేచివెళ్ళి తలుపు తీయండి" అరిచింది ఆమె వంటింట్లో నుంచే.
"నవల మంచి రసపట్టులో ఉంది. తమ్ముడ్ని తలుపు తెరవమను" అదే పిచ్ లో చెప్పింది స్వప్న.
"వాడు తలుపు తెరవడానికి నేను అక్కడికివచ్చి లంచంగా చాక్లెట్ ఇచ్చేదానికన్నా మరో అడుగువేసి తలుపు తీయడమే సులభం. రసం పెట్టడానికి చింతపండు కలుపుతున్నాను గానీ, లేచి తలుపు తెరువ్."
"వినే అమ్మా! నువ్విలా ఇబ్బంది పెడితే మనకు రోజూ పాలు పోస్తాడు చూడు ఆ అబ్బాయితో లేచిపోతా."
పక్కనబాంబు పడ్డట్టు ఉలిక్కిపడింది శ్యామల. గబగబా చేతుల్ని వాష్ బేసిన్ లో కడుక్కుని పైట చెంగుతో తుడుచుకుంటూ వచ్చి తలుపు తీసింది.