వచ్చింది రాళ్ళపల్లి కాదు, నరేష్.
"సార్ ఇంట్లో ఉన్నారా?" నెమ్మదిగా అడిగాడు అతను.
"లేరు నాయనా, మార్కెట్టుకి వెళ్ళారు వచ్చేస్తారు అలా కూర్చో" అంటూ వరండాలోని కుర్చీల్ని చూపించింది.
అతను అలానే అని తలవూపి కుర్చీలో కూర్చొని ఆరోజు దినపత్రికను చేతిలోకి తీసుకుంటూ ఉండగానే రాళ్ళపల్లి లోపలికొచ్చాడు.
ఆయన చేతిలో కూరగాయల సంచి బరువుగా వుంది.
"ఏమోయ్ నరేష్. కులాసానా ఏమిటిలా వచ్చావ్?" అతని పక్కనే మరో కుర్చీలో కూర్చున్నాడు రాళ్ళపల్లి.
భర్త గొంతువిని శ్యామల బయటకు వచ్చింది.
ఆయన వాలకం చూస్తే ఇప్పుడిప్పుడే అక్కడ్నుంచి లేవడనిపించి, భర్త పక్కనున్న కూరగాయల సంచిని లోపలకు తీసుకెళదామని అందుకుంది.
సంచి లోపలకు చూస్తూ "ఏమండీ కాబేజీ తెచ్చారా?" అని అడిగింది.
నరేష్ తో ఏదో మాట్లాడుతున్న రాళ్ళపల్లి భార్యవైపు తిరిగి "తెచ్చాను, లోపలుందేమో చూడు" అన్నాడు.
ఆమె సంచిలోపల అలా ఇలా కెలికి "లేదే" అని చెప్పింది.
"అయితే బస్సులో సీటు దొరకగానే ఓ కునుకు వేశాను. ఆ సమయంలో ఎవడో ఎత్తేసి ఉంటాడు" నవ్వుతూ అన్నాడాయన.
"ఇప్పుడెలా గండీ? కాబేజీ కూరకోసం అన్నీ సిద్ధం చేశాను. అయినా ఇంకా బాగా తెల్లారలేదు. అప్పుడే నిద్ర ఏమిటండీ. అదీ బస్సులో. మీకు ఇలా కాదు. రేపటి నుంచి కళ్ళల్లో అల్లం నూరి వేస్తాను. ఆ మంటకు నిద్రరాదు" కసిగా చెప్పింది.
"ఓసిపిచ్చి ముఖమా! అల్లానికే బెదిరిపోయే నిద్రకాదే నాది. బెల్లంవేసి గండు చీమలు వచ్చి కళ్ళను కొరికేస్తున్నా నిద్ర ముంచుకొస్తుందే నాకు."
"అయినా కూర్చోగానే నిద్ర వచ్చేస్తుందని చెప్పటానికి సిగ్గులేదా?" ఛీత్కారంగా అడిగింది ఆమె.
"సిగ్గు లేదని సిగ్గు లేకుండా చెబుతున్నాను. సిగ్గే ఉంటే ఈ పోలీసు ఉద్యోగం చేయగలనా? మా సర్కిల్ తిట్టే తిట్లకు సిగ్గే ఉంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని."
"ఛీ! తెల్లారి పూట అవేం మాటలండీ. అమంగళం" అంటూ తన మంగళ సూత్రాన్ని కళ్ళ కద్దుకుని కూరగాయల సంచిలో వెళ్ళిపోయిందామె.
"మధ్యలో మా ఆవిడ వచ్చి దూరేసిందోయ్. ఇంతకీ ఏం పనిమీద వచ్చావ్?" నరేష్ ని అడిగాడు రాళ్ళపల్లి.
"ఓ ఫైవ్ ఉంటే అప్పిస్తారా? మొత్తం పాత బాకీతో కలిపి నూట ఇరవై త్వరలో ఇచ్చేస్తాను" నరేష్ అర్థిస్తున్నట్టు దీనంగా ముఖంపెట్టి అడిగాడు.
"అవునోయ్. నువ్వెప్పుడూ అయిదు రూపాయలే ఎందుకడుగుతావు?"
"అంతకన్నా ఎక్కువడిగితే ఇవ్వరేమోనని సార్. అంతకంటే ఎక్కువ అడగడానికి గానీ, పుచ్చుకోవడానికి గానీ నాకేం అభ్యంతరం లేదు సార్."
రాళ్ళపల్లి పొరబోయేటట్టు నవ్వి, జేబులోంచి అయిదు రూపాయల కాగితం తీసిచ్చాడు.
"నేను వస్తాను సార్" లేచి నిలుచున్నాడు నరేష్.
అంతలో శ్యామల సుడిగాలిలా అక్కడికి దూసుకొచ్చింది. ఆమె ఏడ్వడానికి సిద్ధంగా వున్నట్టు ఆయాసపడిపోతోంది.
"ఏమిటే? ఏమైంది?" రాళ్ళపల్లి కంగారుగా అడిగాడు.
"చూశారా నీ కూతురి ఫోజులు కాలుమీద కాలేసుకుని ఎలా కూర్చుని చదువుకుంటూ ఉందో. నేను ఇంతసేపు ఉల్లిపాయలుకోసి, అన్నం వార్చడానికి వెళితే ఉడుకు గంజి అంతా చేతుల మీద పడింది. ఎలా మండిపోతుందో చూశారా. అదేమన్నా అంటే చాలు మన వీధిలోకి శనగనూనెను బండిలో తీసుకువచ్చి అమ్మేవాడితో లేచిపోతానంటుంది" ఆమె సన్నగా ఏడుస్తోంది.
"నువ్వింత అమాయకురాలు కాబట్టే స్వప్న అలా ఏడిపిస్తుంది. శనగనూనె అమ్మేవాడికి పెళ్లయి ఇద్దరు పిల్లలే" అనునయిస్తున్నట్టు అన్నాడు రాళ్ళపల్లి.
"లేచిపోవడానికి పెళ్ళయితే ఏమిటి? కాకపోతే ఏమిటి? ఆ అభ్యంతరాలన్నీ పెళ్ళి చేసుకోవడానికి. లేచిపోవడానికి కాదు."
"అయినా సరే. స్వప్న ఎవరితోనూ లేచివెళ్ళదు. నీకా అనుమానం వద్దు. ఈ మాట సంవత్సరం నుంచీ అంటూ ఉంది లేచిపోయిందా? లేదే. దానికి 'మ్యాచ్' అయ్యేవాడు ఈ భూ ప్రపంచంలో ఉండడే" నమ్మకంగా చెప్పాడాయన.
ఏదో తనలో తానే గొణుక్కుంటూ లోపలకు వెళ్ళిపోయింది శ్యామలమ్మ.
నరేష్ ఆయన దగ్గర శెలవు తీసుకుని బయటపడ్డాడు.
అతనికి ఆకలి దంచేస్తోంది. నిన్న పొద్దున వామనుడులాగా ప్రవేశించిన ఆకలి పెరిగి పెద్దదై అతన్ని తొక్కేస్తోంది. నిన్న రాత్రి ఆకలిని కాసేపైనా తొక్కిపెడదామని కాఫీ తాగాలనుకున్నాడు గానీ డబ్బు లేదు. దాంతో చిన్న ఐడియా వచ్చి కాఫీ కొట్టు దగ్గరికి వెళ్ళాడు. గదిలోనే తన మొలకున్న నల్లమొలత్రాడును కట్ చేసుకుని చేతిలో ఉంచుకున్నాడు. కాఫీ కొట్టు దగ్గర దానిని కాశీదారం అని చెప్పి రూపాయికి అమ్మాడు. ఆ డబ్బులతో కాఫీ తాగాడు. అంతే తప్ప నిన్న పొద్దుటి నుంచి ఏమీ తినకపోవటం వల్ల ఆకలి కడుపులో సముద్రంలా పొంగుతోంది.
ఎక్కడైనా ఫుల్ భోజనం తినాలని ఇందిరానగర్ కాలనీ దాటి బజారుకేసి నడిచాడు.
మామూలుగా అయితే ఇందిరానగర్ లోనే వున్న కామేశ్వరి మెస్ లో భోంచేసేవాడు. అక్కడ ప్లేటు భోజనం తప్ప ఫుల్ మీల్స్ పెట్టరు. ప్రస్తుతమున్న ఆకలికి ప్లేటు భోజనం తీసుకుంటే విస్తరతో కూడా తినేస్తాననిపించి ఫుల్ మీల్స్ పెట్టే హోటల్ కోసం బయల్దేరాడు.
నెహ్రూ వీధి మలుపు తిరగ్గానే ఉడిపి భోజన విలాస్ కనిపించింది. చూడడానికి హోటల్ పెద్దదిగానే ఉంది. భోజనం ఎంతో తెలుసుకుని తినాలని అందులోకి అడుగుపెట్టాడు.
ఎంట్రన్స్ లోనే ధరల పట్టిక బోర్డు వేలాడుతోంది.
ఫుల్ మీల్స్ అయిదురూపాయలకు అన్న అక్షరాల నుంచి అతని కళ్ళు కిందకు దిగలేదు.
తన దగ్గరున్న అయిదు రూపాయలకు ఫుల్ మీల్స్ తినచ్చని లోపలికెళ్ళి కూర్చున్నాడు.