Previous Page Next Page 
మగబుద్ధి పేజి 8


    "అవును మేడమ్" ఆమె ఎందుకు అడిగిందోననే కంగారుపట్టుకుంది అతనికి. తను అలా మాట్లాడివుండవలసింది కాదేమోననిపించింది.

 

    "నేను మగవాడు తోలే ఆటోలోగానీ, రిక్షాలోగానీ రాను బాబూ. నేను నిప్పులాంటి మనిషిని. నాకు మగవాసన కాదుగదా, మగగాలి కూడా పట్టదు. నా బట్టల్ని వుతకడానికి కూడా మగవాడ్ని అనుమతించను. అలా చేస్తే ఇంకేమైనా ఉందా! నా పాతివ్రత్యం పాడైపోదూ" గారాలు తీస్తూ చెప్పింది.

 

    ఆ కొత్త క్లర్కు మరింత గాబరా పడ్డాడు.

 

    "నా గురించి నీకు తెలియదేమోగానీ ముందు ముందు తెలుస్తుంది." అని ఓ నవ్వు అతని ముఖంమీద విసిరికొట్టి, వెళ్ళిపోయింది ఆమె.

 

    కొత్త క్లర్కు తలను విదిల్చి, తన సీట్లోకి వెళ్ళిపోయాడు.

 

    విజయ ఆఫీసులోకి ప్రవేశించింది.

 

    మగవాళ్ళు ఆమెను విష్ చేయరు. మగవాళ్ళున్న వైపు ఆమెకళ్ళు కూడా ఎత్తదు. అటెండర్ తో తప్ప మరో మగవెధవతో ఆమె మాట్లాడదు.

 

    సహా ఉద్యోగినులు మాత్రం పలకరించారు.

 

    ఆమె శ్రీనివాసరావు గది ముందుగా ఉన్న తన సీట్లో కూర్చుంది.

 

    అటెండరు అప్పారావు వచ్చి ఆమె టేబుల్ నీ, కుర్చీని తుడిచాడు. ఫైల్స్ ని దులిపి తిరిగి యధాస్థానంలో పెట్టాడు.

 

    "మేడమ్! క్యారియర్ ఇస్తారా భోజనాల గదిలో పెడతాను" అడిగాడు ముందుకు వంగి.

 

    "ఆఁ" అని తన బ్యాగ్ లోనుంచి స్టీల్ క్యారియర్ తీసి అతని చేతికిస్తూ "నా క్యారియర్ ఎక్కడ పెట్టాలో తెలుసుకదా. మగవాళ్ళ క్యారియర్ ల పక్కన నా క్యారియర్ పెట్టకు. అలాచేస్తే నా పాతివ్రత్యం పాడైపోదూ" అని దీర్ఘం తీసింది.  

 

    "తెలుసు మేడమ్" అని వెళ్ళిపోయాడు అప్పారావు.

 

    అంతలో శ్రీనివాసరావు అటెండరు వచ్చి ఆమెతో చెప్పాడు "మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు."

 

    విజయ పైటను తీసి భుజాల మీద కప్పుకుని లోపలకు వెళ్ళింది. ఆమె చేతిలో పెన్సిల్, పేపర్ ప్యాడ్ ఉన్నాయి.

 

    "గుడ్ మార్నింగ్ సార్."

 

    "గుడ్ మార్నింగ్. సిడౌన్."

 

    ఆమె ఆయన కెదురుగ్గా కూర్చుంది.

 

    ఆయన "డిక్టేషన్ తీసుకో" అన్నాడు.

 

    ఆమె సర్దుకుంది.

 

    ఆయన ముఖంపైకెత్తి లెటర్ ను డిక్టేట్ చేయడం మొదలుపెట్టాడు.

 

    చాలామంది బాసుల్లాగా ఆయన టైపిస్టు మినీస్కర్ట్ లోకీ, పర్సనల్ అసిస్టెంట్ లోనెక్ జాకెట్ లోకి చూస్తూ లెటర్ చెప్పరు. ఆయన ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్. సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే శ్రీనివాసరావు జన్మ ఎత్తాడని ఆయన్ను తెలిసిన వాళ్ళంతా అనుకుంటారు. మా బాస్ ఏకపత్నీవ్రతుడని ఆయన స్టాఫ్ అంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా పనిపడి ఆయనకు ఎదురుపడాలంటే స్త్రీలు చాలా జాగ్రత్తగా అన్నీ సర్దుకుంటారు.   

 

    "లెటర్ పూర్తయింది, టైప్ కి ఇవ్వండి."

 

    ఆమె పైకిలేచి "జస్ట్ ఫైవ్ మినిట్స్ సార్" అని బయటపడింది.

 

    లెటర్ టైప్ కి ఇచ్చి ఫైల్స్ చూస్తూ ఉండిపోయింది.

 

    టీ టైమ్ అయింది.

 

    గోడ గడియారం పదకొండున్నరను చూపిస్తోంది.

 

    స్టాఫ్ కంతా కాఫీలు పట్టుకొచ్చాడు క్యాంటీన్ కుర్రాడు.

 

    అందరికీ తలా ఓ కప్పు ఇచ్చి విజయ దగ్గరకు వచ్చాడతను.

 

    "మేడమ్! కాఫీ" అని వినపడడంతో విజయ తల పైకెత్తింది.

 

    అతను కప్పును అందివ్వబోయాడు.

 

    "అయ్యెయ్యో, నువు నాకు ఇవ్వద్దు. అప్పారావూ!" కేకేసింది ఆమె.

 

    అప్పారావు వచ్చాడు.

 

    "ఇతను యువకుడు, ఇతనినుంచి కాఫీకప్పు అందుకుంటే నా పాతివ్రత్యం పాడైపోదూ, నువు ఆ కప్పు తీసుకుని నాకివ్వు. నువ్వంటే ముసలాడివి. నీ దగ్గర్నుంచి కప్పు అందుకున్నా నా పాతివ్రత్యానికి ప్రమాదముండదు" అంది.     

       

    "అవునమ్మా. ఆ కుర్రాడి దగ్గర్నుంచి కాఫీ తీసుకుంటే మీ పాతివ్రత్యం పాడైపోదూ. ఎందుకంటే మీ పాతివ్రత్యం అంత పెళుసు మరి" అన్నాడు అప్పారావు కసిగా.

 

    అందులోని వ్యంగ్యం ఆమెకర్థం కాలేదు.

 

    "అవునవును" అంది.

 

    అప్పారావు ఆ యువకుడి చేతిలోని కప్పును తీసుకుని ఆమెకు అందించాడు.

 

    టీ బ్రేక్ అయ్యాక టైప్ నుంచి వచ్చిన కాగితాలను తీసుకుని శ్రీనివాసరావు గదిలోకి వెళ్ళింది విజయ.

 

    ఆమె వెళ్ళిన కాసేపటికి రజని వచ్చింది.

 

     టైప్ అయిన కాగితాలను సీరియస్ గా పరిశీలిస్తున్న ఆయన కూతురి రాకను గమనించలేదు.

 

    కాగితాలను చదవడం పూర్తిచేసి విజయకు అందివ్వడానికి తలపైకెత్తిన ఆయన కూతుర్ని చూసి ఆశ్చర్యంతో "నువ్వెప్పుడొచ్చావమ్మా?" అని అడిగాడు.

 

    "మీరు ఫైల్ లో తల దూర్చినప్పుడు" నవ్వుతూ అంది రజని.

 

    "ఇంకేమిటమ్మా విశేషాలు?"

 

    "ఏం లేదు డాడీ, మిమ్మల్ని చూసి పోదామని ఇటొచ్చాను. ఈ రోజు ఓ ఫ్రెండ్ కి పెళ్ళిచూపులు డాడీ. అక్కడికెళ్ళి అటే ఇంటికొచ్చేస్తాను. భోజనానికి మీరు నాకోసం చూడకండి. మీరు భోంచెయ్యండి డాడీ. నాకోసం వెయిట్ చేస్తారేమోనని చెప్పి వెళదామని వచ్చాను బై" అంటూ లేచింది వెళ్ళడానికి.  

 

    సరిగ్గా అప్పుడే ఫోన్ మ్రోగింది.

 

    శ్రీనివాసరావు రిసీవర్ అందుకుని "హలో" అన్నాడు.

 

    అవతల్నుంచి మాట్లాడుతున్నారు.

 

    వింటున్న శ్రీనివాసరావు ముఖం క్షణక్షణానికీ రంగులు మారుతోంది. ఆయన ముఖమంతా చెమట్లు పట్టాయి.

 

    ఆ ఫోన్ ఎక్కడ్నుంచో, అవతలి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో, తన బాస్ ఎందుకంత ఆందోళన పడిపోతున్నాడో తెలిసిన విజయ లోలోపలే నవ్వుకుంది.

 Previous Page Next Page