Previous Page Next Page 
జీవనయానం పేజి 8


    శివస్వామి అది చూచాడు. రుద్ర రూపం దాల్చాడు. "ఒరే! శివునికే అపచారం చేస్తావా? నీ వంశం సమూలంగా నాశనం అవుతుంది. నీ రాజ్యం నామరూపాలుండవు. నీవు కట్టించిన దేవాలయాలలో పూజ ఉండదు. శివునికి ద్రోహం చేసినావు. సర్వనాశనం అవుతావు" అని శపించాడు.

 

    శివస్వామి శివతాండవం చేశాడు.

 

    శివస్వామి రుద్రతాండవం చేశాడు.

 

    శివస్వామి శివైక్యం చెందాడు.

 

    కథ జరిగిందా, జరగలేదా? అనేది అటుంచితే మహాత్ములను మోసగించడం, వంచించడం మాత్రం క్షమించరానిది.

 

    దాశరథి:

 

    ప్రతాపరుద్రుడు పూజించే లింగం భూమిని అంటదు.ఎత్తుగా ఉంటుంది. ఒకనాడు అది నేలను అంటింది. ప్రతాపరుద్రుడు విచలితుడు అయినాడు. కారణం తెలుసుకోవలసిందని ఒక మంత్రిని నియమించాడు. లింగం యథాస్థానానికి వచ్చేవరకూ అనషనం వహించాడు.

 

    మంత్రి ఎంత మందినో అడిగాడు. మహానుభావులను సంప్రదించాడు. ఫలితం లేకపోయింది.

 

    హనుమకొండ దగ్గరిలోని "ఆత్మకూరు"కు ఎవరో సన్యాసి వచ్చాడని విన్నాడు. అక్కడికి వెళ్లాడు.

 

    ఆ వచ్చినవారు శ్రీమద్రామానుజులు. వారు వైష్ణవ ప్రచారానికి ఆంధ్రదేశం పర్యటిస్తున్నారు. ఆంద్ర దేశ రాజధాని ఓరుగల్లు దగ్గర విడిశారు.

 

    భద్రుడనే మంత్రి రామానుజుని దర్శించాడు. జరిగినది వివరించాడు. నివారణ ఉపాయం చెప్పమన్నాడు.

 

    "రేపు సాయంకాలానికి లింగం యథాస్థానంలో ఉంటుంది" అన్నారు రామానుజులు

 

    "అది సరి స్వామీ! ఇంతకు ముందు వాలడానికీ - ఇప్పుడు నిలువడానికి కారణం సెలవియ్యండి" - అడిగాడు మంత్రి.

 

    "మేము ఉన్న పరిధిలో ఇతర దేవతల బలం క్షీణిస్తుంది. రేపు మెం వెళ్ళిపోతున్నాం" అన్నారు రామానుజులు.

 

    భద్రునికి నమ్మకం కుదరలేదు. డంబాలు అనుకున్నాడు. అయినా చేయగలిగింది లేదు. వరంగల్లు చేరాడు.    

 

    రామానుజులు చెప్పిన ప్రకారం లింగం నేలమీదినుంచి లేచింది. పూర్వస్థానం చేరుకున్నది.

 

    మంత్రి ఆశ్చర్యానికి అంతులేదు. అతడు రామానుజుని ఆశ్రయించాడు. తనను శిష్యుని చేసుకొమ్మన్నాడు. వారివెంట తీసికెళ్ళమన్నాడు.

 

    రామానుజుడు మంత్రికి వైష్ణవం ఇచ్చారు. మంత్రిగానే ఉండి వైష్ణవ ప్రచారం చేయమన్నారు. ప్రతిరోజు పన్నెండు మంది వైష్ణవులకు భోజనం పెట్టకుండా మంత్రి భోజనం చేయరాదని నియమం విధించారు.

 

    మంత్రి రాచకార్యం మీద ప్రస్తుతపు హూజూర్ నగర్ ప్రాంతానికి వెళ్ళాడు. వారం పాటు సాపాటుకు వైష్ణవులు దొరకలేదు. 8 వ నాడు మంత్రి స్వయంగా ఊరిబయట స్వాముల కోసం వేచి కూర్చున్నాడు.

 

    మంత్రి అదృష్టం బాగుంది. సరిగ్గా పన్నెండు మంది వైష్ణవులు అటువస్తూ కనిపించారు. భద్రుడు వారిని ఆహ్వానించాడు. ఆరు బయట పందిళ్లు వేశారు. వంటలు అయినాయి. తిరువారాధన అయింది. స్వాములు సాపాట్లకు కూర్చున్నారు. మంత్రి బయట నిరీక్షిస్తున్నాడు. ఎంతకూ భోజనాలు పూర్తికావు. మాట వినిపించదు. సాయంకాలం అయింది.

 

    మంత్రి లోనికి పోయి చూచాడు.!

 

    పన్నెండు విగ్రహాలున్నాయి! వారు పన్నిద్దరు ఆళ్వారులు. వైష్ణవ మతానికి ఆచార్యులు పన్నెండు మంది.

 

    మంత్రి విస్మయం చెందాడు. విగ్రహాలను పట్టుకుని ఏడ్చాడు. విస్తళ్లలో వారు వదిలిన శేషం భుజించాడు.

 

    మంత్రి అక్కడ నిలువెత్తు ఆళ్వారుల విగ్రహాలకు గొప్ప దేవాలయం కట్టించాడు. అది హూజూర్ నగర్ కు దగ్గరలోని బూరుగు గడ్డలో ఉంది. ఆళ్వారులకు మాత్రం దేవాలయం ఇది ఒక్కటే. ఇప్పటికీ ఆరాధన ఉంది.

 

    నా చిన్నతనంలో బూరుగు గడ్డ వైష్ణవుల తిరుమాళగాలో త్యాగరాజు స్వామివారి వీణను ధరించుకునే భాగ్యం కలిగింది.

 

    శ్రీమద్రామానుజులు ఆంధ్రదేశంనుంచి వెళ్ళిపోతూ, వారి ప్రధాన శిష్యుడు దాశరథిని ఇక్కడ - వైష్ణవ ప్రచారానికి విడిచిపోయారు.

 

    శ్రీమద్రామానుజులు పరమపదించిన తరువాత ఆచార్యపీఠం అధిష్టించినవారు దాశరథి.

 

    మేము ఆ దాశరథి వంశీయులం. ఇళ్లపేర్లు సాధారణంగా ఊర్ల పేర్లు ఉంటాయి. ఒక ఆచార్యుల పేర ఇంటి పేరు ఉండడం అరుదు. మాకు ఆ అదృష్టం దక్కింది.   

 

    "విద్వాన్ సర్వత్ర పూజ్యతే"

 

    దాశరథివారు 'ఇంటిపేరు కస్తూరి' వారు కాలేదు. మా పితృవర్యులు దాశరథి వేంకటాచార్యులవారి వరకు అఖండ పాండిత్యంతో ఆచార్యత్వం నిర్వహించారు. మేము - అంటే మా అన్నయ్యా నేను ; ఆధునిక - అభ్యుదయ - ప్రగతి పాఠాలను ఎన్నుకున్నాం. స్వచ్ఛందంగా ఆచార్యత్వం వదులుకున్నాం. మా మార్గంలో మేము కృషి చేశాం.

 

    మా పూర్వులది భద్రాచలం. భద్రాచలంలో రామదాసు రామాలయం నిర్మించడంలో దాశరథివారి ప్రోత్సాహం ఎంతో కొంత ఉండి ఉండాలి. కంచర్ల గోపన్న అనే రామదాసు దాశరథి శతకం రచించడంతో దాశరథివారి ప్రమేయం ఉన్నధి అనడానికి ఆ శతకపు మకుటమే సాక్ష్యం.

 

    భద్రాచలం ; బ్రిటిషిండియాలో - తూర్పు గోదావారి జిల్లా లోనిది. దేవాలయం మాత్రం నిజాం రాజ్యం లోనిది. ఆంధ్రప్రదేశం ఏర్పడి భద్రాచలం ఖమ్మం జిల్లాలో చేరే వరకు కొనసాగింది.

 

    మా ప్రపితామహులు వేంకటాచార్యులవారు. వారు తర్కంలో అఖండ పాండిత్యం కలవారు. నిరాడంబరి. భద్రాది రామచంద్రుని ఉపాసకులు.

 

    ఒకసారి గద్వాల సంస్థానంలో తర్క పండితుల సభ జరిగింది. వేంకటాచార్యుల వారిని ఆహ్వానించలేదు. అయినా వెళ్ళారు. వారు సభలో చిట్ట చివరన చెప్పుల దగ్గర కూర్చున్నారు. వేదిక మీద తర్కం జరుగుతున్నది.

 

    "తర్కం తెలిసినవారే లేరా! తడకల చర్చ జరుగుతున్నది?" అన్నారు మా ప్రపితామహులు.

 

    అందరూ ఆ మాటలు అన్నవారిని చూచారు. మహారాజావారు వారిని వేదికమీది కాహ్వానించారు. వేంకటాచార్యులవారు తర్కం అంటే ఇది అన్నట్లు వాదించి, ఆంధ్రదేశపు పండితులందరినీ పరాజితులను చేశారు!

 

    మహారాజావారు వేంకటాచార్యుల వారిని ఘనంగా సత్కరించారు.

 

    "వర చేలంబులొ, మాడలో, వన్యంబులో, గోవులో
    హరులో, రత్నములో, రథంబు, తోవిమృష్టాన్నంబులో, కన్యలో
    కరులో, కాంచనమో, నికేతనములో, గ్రామంబులో, భూములో
    ధరణీఖండమొ కాక యేమడిగెదో దాత్రీ సురేంద్రోత్తమా!"

 

    శ్రీమద్భాగవతములో బలిచక్రవర్తి వామనుని అడిగినట్లు మహారాజావారు ఏది కావాలన్నా ఇస్తామన్నారు. అంత ప్రసన్నులయినారు మహారాజావారు.

 

    వేంకటాచార్యులవారు ఆశలు ఎరుగనివారు.

 

    "మహారాజా! మేము భద్రాద్రి రాముని ఛత్రచ్ఛాయలో జీవించు వారము. వారు మాకు క్షీణించని వాక్సంపద ప్రసాదించినారు. మీరు అన్నవి ఏమియు మాకు అక్కరకు వచ్చునవి కావు. నిధి కన్న రాముని సన్నిధియే సుఖకరము. నువ్వులు - బెల్లము పెట్టి మమ్ము పంపించుడు" అన్నారు.

 

    వేంకటాచార్యులవారి మాటలకు మహారాజావారు చాకితులయినారు. వస్తు వాహనములు ఇచ్చి, మా ముత్తాతగారిని భటులను ఇచ్చి పల్లకిలో భద్రాచలం పంపారు.

 

    వేంకటాచార్యులవారు వస్తువాహనాలను రామునకే సమర్పించారు!

 

    దాశరథివారికి కూనవవరంలో అనేక ఇనాం భూములుండేవి. భద్రాచలం దండకారణ్యం. కీకారణ్య ప్రాంతం. సింహాలు - పులుల వంటి జంతువులు తిరగడం సర్వసాధారణం! మార్గంలో దొంగలబెడద!!

 

    వేంకటాచార్యులవారు కౌలు డబ్బుకోసం కాలిబాటన కూనవరం వెళ్ళారు. డబ్బు అందింది. మూట కట్టుకున్నారు. అప్పుడు రూపాయినాణాలే. నోట్లు లేవు. మహారణ్యం. పాపిటలాంటి కాలి బాటలో నడిచి భద్రాచలం వస్తున్నారు. మార్గమధ్యంలో దొంగలు వెంటపడ్డారు. వారికి అందకుండా పరిగెత్తారు. ఒక హీను కనిపించింది. మంచెమీద మనుషులు కనిపించారు. వారిని చేరుకోవాలి. దొంగలు అందుబాటులో ఉన్నారు.     

 

    వేంకటాచార్యులవారు చేతికర్ర ఊతంతో కంచెమీది నుంచి ఎగిరి చేలో దూకారు. కాని తుమ్మముల్లు చీరుకొని కనుగ్రుడ్డు ఊడిపడింది! అప్పటినుంచి వారిని గ్రుడ్డి వేంకటాచార్యులు అన్నారు. అందుకు "మనమంతా గ్రుడ్డివాళ్లమే! చూపుకోసం ఆరాట పడుతున్నవాళ్ళం" అనేవారట!       

 Previous Page Next Page