హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళే నేషనల్ హైవే మీద హీరో హోండా పరుగులు తీస్తోంది.
లేత ఎండలో తార్రోడ్డు తాచుపాములా మెరుస్తోంది.
హీరో హోండా బ్యాక్ సీట్లో కూర్చున్న బేరర్ యాదగిరి దాదాపు వంద కిలోమీటర్ల స్పీడ్ తో డ్రైవ్ చేస్తున్న సూర్యవంశీని భయం భయంగా చూస్తున్నాడు.
"సార్....కొంచెం...స్పీడ్ తగ్గించండి సార్....ఎక్కడో నేను బోల్తాపడితే....మీకే నష్టం సార్..." అరుస్తున్నాడు యాదగిరి.
ఆ అరుపుల్ని రెండంగుళాల పొడవు.....విశాలమైన నుదురు....కండలుదీరిన శరీరం.... సూదిముక్కు.... తీర్చిదిద్దినట్టుండే కనుబొమలు....డేగకళ్ళు...సిమెంట్ కలర్ బ్యాగీ పేంటూ, లూజ్ బ్రౌన్ చెక్స్ షర్ట్....కాళ్ళకు స్పోర్ట్స్ స్టార్ షూస్.
నుదుటమీద పడుతున్న జుత్తుని ఎడంచేత్తో పక్కకు తోసుకుంటూ-
మరింత స్పీడు పెంచాడు.
స్పీడో మీటర్ లోని ముళ్ళు నూరు దాటింది.
అటునుంచి అదే స్పీడులో వస్తున్న లారీల్ని చూస్తుంటే యాదగిరి గుండె గుబగుబలాడిపోయింది.
"ఎక్కడో యాక్సిడెంట్ ఖాయం." గోనుక్కుని బ్యాక్ సీట్ హేండిల్ ని మరింత గట్టిగా పట్టుకున్నాడు యాదగిరి.
మధ్యాహ్నం మూడుగంటలు దాటింది.
సరిగ్గా నలభై అయిదు నిమిషాలు గడిచాయి.
హీరో హోండా స్పీడు నెమ్మదిగా తగ్గడంతో, యాదగిరి గుండెల్లోని గాభరా తగ్గుముఖం పట్టింది.
తార్రోడ్డు మీద నుంచి కుడిపక్క మలుపు తిరిగి, పది నిమిషాల సేపు కంకర రోడ్డుమీద ప్రయాణం చేసి, రోడ్డు పక్కన ఆగింది హీరో హోండా "దిగు" అన్నాడు సూర్యవంశీ.
వెంటనే కిందకు దూకాడు యాదగిరి. అప్పుడు చూసాడతను....రోడ్డుకి ఎడం పక్కన, గుడ్డల చాటున, అందంగా కన్పిస్తోందో పాతకాలపు బిల్డింగ్.
"ఈ బిల్డింగ్ లోపలికి తీసికెళ్ళి తంతాడేమో...." అసలే యాదగిరిది పిరికి గుండె. మరింత పిరికిగా కొట్టుకుంది.
"ఏంటి బాసు ఇది..." సూర్యవంశీ, వెనకే నడుస్తూ అడిగాడు.
జవాబు చెప్పలేదు సూర్యవంశీ. ఆ బిల్డింగ్ కి కొంచెం దూరంలో చెట్టుకింద, హీరో హోండాని పార్కుచేసి, ఆ బిల్డింగ్ లోకి నడవ సాగాడతను.
అతన్ని నిశ్శబ్దంగా అనుసరించాడు యాదగిరి.
* * * * *
కొండల మధ్యనున్న, నిజాం కాలం నాటి ఆ పాతకాలపు బిల్డింగ్ లోనికి వెళ్ళాకగానీ, అసలు సంగతి తెలీలేదు యాదగిరికి.
అదొక బార్ అంద్ రెస్టారెంట్.
బార్ వెనక, పార్క్ చేస్తున్న మారుతీకార్లను, లోనున్న వ్యక్తుల్ని చూడగానే అర్ధమైపోయింది....అదెలాంటి బారో.
ఎక్కువ మంది, టీనేజీ కుర్రాళ్ళే ఉన్నారందరూ.
హాల్లో అందమైన కీన్ ఫర్నిచర్.... ఆ పక్కన ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్.... టేబుల్స్ మధ్య, ఏర్పాటు చేసిన వైల్డ్ ట్రీస్.... గమ్మత్తుగా ఉంది వాతావరణం... "పట్టపగలే.... ఇక్కడ కేబెరేలు.... జరిగేటట్టుంది కదా బాసూ!" జోగ్గా అన్నాడు యాదగిరి.
సూర్యవంశీ నాలుగు వేపులా చూస్తూ, ఓ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆర్డర్ తీసుకున్న అయిదు నిమిషాల్లో సరంజామాను టేబిల్ మీద సర్దేసి, డ్రింక్ ను గ్లాసుల్లో పోసి, షోడా కలిపి వెళ్ళిపోయాడు బేరర్.
చప్పున చెయ్యి అడ్డుగా పెట్టాడు సూర్యవంశీ.
"నువ్వెన్ని పెగ్గులు తాగుతావు" సీరియస్ గా అడిగాడతను.
"మూడు... కంపెనీ వుంటే....ఆరు" టకామని జవాబు చెప్పాడు యాదగిరి.
"అంటే నువ్వు ఆరో పెగ్గు తర్వాత....నిజం చెప్తావన్నమాట" ఆ మాటకి యాదగిరి ముఖం వెలవెలబోయింది.
"సార్... ఇప్పటికి మూడుసార్లు చెప్పాను. నాకేం తెలీదు సార్..."
"అసలు స్పెషల్ పర్మిషన్ మీద ఎందుకు తీసుకొచ్చానో తెల్సా?"
"తెల్సుసార్! అక్కడుంటే నన్ను పోలీసులు చంపేస్తారని సార్ అసలు నాకు..."
"ముందు డ్రింక్ తీస్కో"
గ్లాసందుకుని, డ్రింక్ ని సిప్ చేస్తూ అన్నాడు సూర్యవంశీ.
భయంతోనో, గత నాలుగు రోజులు పోలీసుల ఇంటరాగేషన్ బాధ వల్లో, గ్లాసులోని డ్రింకుని, పూర్తిగా తాగేసాడు యాదగిరి.
"జగన్నాయకులు, ప్రెస్ క్లబ్ బార్ లోకి వచ్చిన దగ్గర్నించి.... ఆయన బైటకి వెళ్ళిన వరకూ.....ఏం జరిగిందో....డిటైల్డ్ గా చెప్పు పోలీసులకు చెప్పినట్టుగా కాదు....అండర్ స్టాండ్."
"చెప్తాను....సార్.... డిటైల్ గా చెప్తాను సార్.... అస్సలు.... ఆ రోజు డ్యూటీలో ఉండడం.... నా బుద్ది పొరపాటు సర్..... వినండి సర్" యాదగిరి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు.
సరిగ్గా అరగంట గడిచింది. యాదగిరి చెప్పడం ముగించాడు.
"మంకీ టోపీగాడు, ఆ కుర్తా పైజమా గాడు....బార్ కి అదే మొదటిసారి రావడం- అంతేనా"
"అవున్సార్..."
"వాళ్ళని బైట చూస్తే గుర్తు పట్టగలవా..."
"ఎస్... సర్..."
"ఎలా గుర్తు పడతావ్..." సూర్యవంశీ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేక పోయాడు.
రెండు నిమిషాలు గడిచాయి.
"ఆ మంకీ టోపీ గాడ్ని.... ఎక్కడ చూసినా గుర్తుపడతాను సర్"
యాదగిరి కళ్ళల్లో ఏదో ఉత్సాహం తొంగి చూసింది.
"ఎలా...." ఆత్రంగా ప్రశ్నించాడు సూర్యవంశీ.
"ఆ మంకీ టోపీగాడి, పైవరస, పళ్ళల్లో, పెద్దపన్ను కట్టుడుపన్ను సార్..."
"అంటే.... బంరారప్పన్నా"
"కాద్సార్....ప్లాస్టిక్ పన్ను సార్.... ఆపన్నుకి, పక్క పన్నుకీ మధ్య సన్నటి స్టీల్ రాడ్ మెరుస్తూ... కన్పిస్తుంది సార్..."
"ఈ విషయం....పోలీసులకు చెప్పావా...."
"లేద్సార్"
"ఏం"