"వాళ్ళడగలేద్సార్"
మరో ఇరవై నిమిషాలు గడిచాయి...
"సిటీలోని, అన్ని బార్లలోనూ వెతికితే, వాళ్ళు దొరికిపోతారుసర్" నాలుగో పెగ్గు తాగుతూ అన్నాడు యాదగిరి.
ఆ సమయంలో, సూర్యవంశి దృష్టి యాదగిరి మీద లేదు-
సరిగ్గా-
అప్పుడే బార్ లోకి ప్రవేశించిందో అమ్మాయి.
అంతవరకూ, గోల, గోలగా ఉన్న బార్ వాతావరణం, ఆ అమ్మాయి లోనికి అడుగు పెట్టడంతో, సడన్ గా మారిపోయింది.
మంత్ర ముగ్దుల్లా అందరూ ఆ అమ్మాయి వేపే చూస్తున్నారు.
రెడ్, బ్లాక్ కలర్ మిక్స్ డ్ డిజైన్ కుర్తా, పైజామా - కుర్తా మీద పొడవాటి చున్నీ....భుజాలమీంచి, కాళ్ళవరకూ పొడవాటి శాలువా వివా డ్రెస్....ఆమెకో ఇరవై ఏళ్ళుంటాయి - నల్లగా వుంది శరీరం - నేరేడు పండు లాంటి మెరుపు...నల్లగా అందంగం ఆకర్షణీయంగా ఉంది.
ఫ్యాషన్ పేరెడ్ లోంచి, నేరుగా ఆ రెస్టారెంట్ లోకి అడుగుపెట్టినట్టుగా ఉందా అమ్మాయి.
కోలముఖం.... పొడవాటి ముక్కు....ఆకుల్లాంటి కళ్ళు....భుజాల మీద నుంచి గుండెలమీద పడుతున్న నీలపు కేశాలు....మెడలో ముత్యాల దండ.....ఆరోగ్యంగా మెరుస్తున్న శరీరంలోంచి ఉబుకుతున్న అందాలు.....ఆమె బ్యూటీకి, సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ ఎక్కడుందో తెలీయడంలేదు. కళ్ళెత్తి, నాలుగు వేపులా పరకాయించి చూసిందామె.
ఆమె కళ్ళలోని గ్రేస్, నిషాతో నిండిన ఆ కులాసా ప్రపంచమ్మీద మత్తు పరదాలా క్షణకాలంలో పరచుకొంది.
ఆ సమయంలో, నగర శివార్లలో ఉన్న ఆ బార్ లోకి....ఒంటరిగా ఆ అమ్మాయి రావడం.....ఆశ్చర్యంగా ఉంది అందరికీ...
ముందుకెళ్ళి, హుందాగా ఇన్ వైట్ చెయ్యబోయిన మేనేజర్ కళ్ళల్లోకి సూటిగా చూసి-
"ఆప్ కీ పాస్.... వైన్ హై..." హుషారుగా అడిగిందా అమ్మాయి.
"వైన్.... వయిన్... ఎస్... ఎస్..... యు వాంట్.... వైన్...." కంగారుగా వెనక్కి పరుగెత్తి, లిక్కర్ కాబిన్ ల్లోంచి, గోల్కొండ వైన్ బాటిల్ తీసి ఓపెన్ చేసేటంతలో-
ఆ బాటిల్ ని లాక్కుని ఆ అమ్మాయి ముందుకు నడవడంతో, విస్తుబోయి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు మేనేజర్.
బార్ నిండా, ఊపిరి ఆగిపోయిన ఉద్రిక్తత-
"కేరీ ఆన్ ఫ్రెండ్స్..." తనవేపు కళ్ళప్పగించి చూస్తున్న జనాలవేపు చూసి, హస్కీగా నవ్వి - సూర్యవంశీ, కూర్చున్న టేబిల్ వేపు నడిచిందా ఆ అమ్మాయి.
"క్యా బాయ్.... క్యా.... దిఖారే... హై.... ఆప్" సూర్యవంశీ కళ్ళల్లోకి సూటిగా చూసి, నవ్వుతూ అనేసి-
"ఆడపిల్లకు సిటివ్వాలనే జ్ఞానం లేదా.... తూ జారే.... ఉతర్ జీ...." గదమాయించేసరికి, యాదగిరి బెంబేలెత్తిపోయి, సీటు ఖాళీచేసి, పక్క సీటుకి మారిపోయాడు.
"చూడు భాయ్....నీ ఎదురుగా బైఠాయిస్తే, కంపెనీ మంచిగుంటదని.....నచ్చిన బిడ్డవు....హీరో లెక్కనున్నవ్....ఏం చేస్తావేటి.....ఫైటింగులా....? కాసేపు కంపెనీ ఇయ్యి చాలు..." వైన్ ని గడగడా రెండు పెగ్గులు తాగి, బాటిల్ ని టేబిల్ మీద పెట్టి, ఊపిరి పీల్చుకుంది.
ఒక్కసారి తుఫాన్ లో చిక్కుకున్నట్టుగా అయిపోయింది సూర్యవంశి పరిస్థితి.
అందరి కళ్ళూ, వాళ్ళిద్దరిమీదే ఉన్నాయి.
"మీరు" ఆ బ్యూటిఫుల్ పర్సనాలిటీని....మెరిసిపోతున్న ఆమె పెదాల్ని, నిషాకళ్ళనీ....నల్లటి కనుబొమ్మల్నీ... ఆ హుషారుని చూసి, సూర్యవంశీ కంగారుపడిపోయాడు.
"మీరు... బాగానే ఉంది వరస.....ఉయార్ టేబిల్ మీట్స్.... అంటే దోస్తులన్నమాట నువ్వను పర్వాలేదు ఏం అలా....నీళ్ళు నవుల్తున్నావ్.... ఎప్పుడూ అమ్మాయిలతో ప్రోగ్రామ్స్....జరగలేదేమిటి....తీసుకో...." కొంటెగా అతని గ్లాస్ ని, చేతికందించి, తన బాటిల్ ని పైకెత్తింది. 'అయ్యబాబోయ్.....ఇదెవర్రో నాయనోయ్.... పిల్లా.... పిడుగా అగ్గా.....ఆటంబాంబా....' గ్లాసులోని డ్రింకుని గడ గడా తాగేసాడు గాభరాగా సూర్యవంశీ.
"కండలుంటే సరికాదు భాయ్.... దిల్ కావాల.... కలేజా ఉందా.... ఉంటే అడిగిందానికి ఆన్సర్ చెప్పు" ఏవడిగిందో, ఏం ఆన్సర్ చెప్పాలో, ఈ పిల్లెవరో, ఈ గోలేమిటో, ఏమిటీ అర్ధం కావడంలేదు సూర్యవంశీకి.
"అదే భాయ్- ఆడపిల్లల్తో ప్రోగ్రాములు పెట్టుకోలేదా అని" తల అడ్డంగా ఊపాడు సూర్యవంశీ.
"అయ్యో పాపం.... ఫోనీ నన్నో ప్రోగ్రామ్ పెట్టమంటావేటి....పగలు పెట్టమంటావా....రాత్రి పెట్టమంటావా..." కన్నుగొడుతూ అంది.
ఒకప్రక్క డ్రింక్ తాగుతూ, మరోపక్క ఆ అమ్మాయి మాటలు వింటున్న సూర్యవంశీ, బ్రెయిన్ ఆ అమ్మాయిని అంచనా వేస్తోంది.
హై సొసైటీలోంచి వచ్చినట్టుంది....పిచ్చ డబ్బుంటుంది.....లావిష్ గా డబ్బు ఖర్చుపెట్టడం....లగ్జరీగా బతకడం - ఇలాంటి వాళ్ళను....చాలామందిని చూసాడు తను.
"మగవాడు, మగవాడిలా ఉండడం, నా కసహ్యం....మాట్లాడు భాయ్... చూడు అందరూ మనవేపు ఎలా చూస్తున్నారో.... నీ దగ్గరకు గనక నేను రాకపోతే...నన్నెవడో ఎత్తికెళ్ళిపోతాడు అవునా.... చూడు వాళ్ళ హంగ్రీలుక్స్ చూడు...." ఆ మాటకు, నాలుగు టేబుళ్ళవేపు చూసాడు సూర్యవంశీ.... సరిగ్గా అదే సమయంలో-
ఆ అమ్మాయి లేచి నిలబడింది - గబుక్కున సూర్యవంశీ కుడి చేతిని పట్టుకుని పైకి లేపింది..... సూర్యవంశీ మరబొమ్మలా లేచి నిలబడ్డాడు. అందరివేపూ తిరిగి-
"ఏంది భాయ్.... అలా చూస్తారు....బార్లోకో భామ వచ్చిందని.... అలా కళ్ళతోనే చూసేస్తే..... ప్రోగ్రాములై పోతాయేంటి... అయిపోతాయా ఆ ప్రోగ్రాములేవో మీ గర్ల్ ఫ్రెండ్స్ తో పెట్టుకొండయ్యా....బైది బై.... ఈ ఆదిమానపు డెవరనుకున్నారు..... మా బావ.... నాక్కాబోయే మొగుడు..." సూర్యవంశీవేపు చూసి కన్నుగొట్టింది ఆ అమ్మాయి.
"ఏయ్... ఏంటది..." ఆమె చేతినుంచి, తన చేతిని విడిపించుకుంటూ తప్పించుకోబోయాడు సూర్యవంశీ.