ఒక్కసారిగా ఏ.సి.పి చాంబర్లో, గంభీరమైన వాతావరణం నెలకొంది.
"నో...నో....మిస్టర్...వంశీ..ఇట్స్ ఏ ప్లాన్డ్... అండ్ బ్రూటల్ మర్డర్....పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం...పవర్ ఫుల్....డేంజరస్... ఫెడల్ కెమికల్ బాడీలోకి ప్రవేశించడం వల్ల....జగన్నాయకులు చనిపోయారు-ఆరోజు ఆయన డ్రింక్ చేసిన గ్లాసుని, తిన్న పదార్ధాల్ని ఎనలైజ్ చేయగా... బయట పడిన విషయం అది - ఆ కెమికల్... అంత మొత్తంలో... ఆ బాడీలోకి ఎలా వెళ్ళిందో అర్ధం కావడంలేదు.." సీరియస్ గా చెప్పి, టేబుల్ డ్రాయర్లోంచి, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ని సూర్యవంశీకి, అందించాడు ఎ.సి.పి. నిరంజనరావు....
ఆ రిపోర్ట్ ని నిశితంగా పరిశీలించాడు సూర్యవంశీ.
"నాకు తెల్సినంత మట్టుకు...ఆయన్ని అంత దారుణంగా చంపే ఎనిమీస్ ఉన్నారనుకోను...." మళ్ళీ అన్నాడు ఏ.సి.పి.
"యూ...ఆర్ రాంగ్... శత్రువు లేకపోతే... అంత దారుణంగా....ఆయన చచ్చిపోరు..." అన్నాడు సూర్యవంశీ.
"మీ జర్నలిస్టులు భలే వాళ్ళయ్యా...ఆయన చచ్చిపోయిన మర్నాటినుంచే మీటింగ్ లు పెట్టారు...బంద్ లు జరిపారు...అసెంబ్లీ న్యూస్ ను, సెక్రటేరియట్ న్యూస్ ను బాయ్ కాట్ చేసారు...మా పోలీసుల్ని తిడుతూ.... జర్నలిస్ట్ కి రక్షణ లేదంటూ....ఊరేగింపులు జరిపారు....ఏంటయ్యా...ఇదంతా.
సి.ఎమ్ కి ఆయన మంచి దోస్త్.... ఆ కేస్ ని మేమెలా ఇగ్నోర్ చేస్తాం చెప్పు...." వారం రోజులుగా జరిగిన సంఘటనల్ని జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడాయన.
"మా వాళ్ళు...అడుగుతున్నది.....సి.బి.సి.ఐ.డి....ఎంక్వయిరీ కోసం...." సూర్యవంశీ అన్నాడు.
"సి.ఎం....ఇవాళో...రేపో ఆ కేస్ ని, సి.బి.సి.ఐ.డి కి అప్పగించొచ్చు. అయినా....పర్సనల్ రైవల్రీస్ కి జగన్నాయకులు బలైపోయాడని నా అనుమానం."
ఏ.సి.పి. నిరంజనరావు మాటింకా పూర్తికాలేదు.
"నో... నో.... ఐ డోంట్ ఎక్సెప్ట్ ఇట్-డోంట్ ఎక్సెప్ట్ ఇట్.... ఐ నో...జగన్నాయకులు యాజ్ ఏ మేన్... యాజ్ ఎ ప్రొఫెషనల్-ఆయన కేసుని, మసిపూసి, మారేడుకాయ చేస్తే, ప్రెస్ ఊరుకోవచ్చు. జర్నలిస్ట్ లు ఊరుకోవచ్చు... ఈ సూర్యవంశీ బతికుండగా ఊరుకోడు. దిసీజ్ మై ఛాలెంజ్, మీ పోలీస్ డిపార్ట్ మెంట్ కి చేతకాకపోతే లీవిట్..... వేసే సి.బి., సి.ఐ.డికి చేతకాకపోతే వదిలెయ్యమనండి. ఐవిల్ ఓల్ ద కేస్ ఎస్! మిస్టర్ ఏ.సి.పి. సాబ్.....ఐ బిలీవ్ దట్ ఇట్స్ ఏ...హండ్రెడ్ పర్సెంట్....పొలిటికల్ మర్డర్" ఆ మాట అంటున్నపుడు సూర్యవంశి కళ్ళల్లో చోటుచేసుకున్న ఎరుపుదనాన్ని, కోప్మతో వణుకుతున్న చేతివేళ్ళను గమనించాడు ఎ.సి.పి. నిరంజనరావు.
సూర్యవంశీ ఆగ్రహం ఎలాంటిదో నిరంజనరావుకి తెలుసు. అతని పట్టుదల, అతని కార్యదీక్ష, ఒక కేసుని టేకప్ చేసాక, ఎవర్నీ లక్ష్యపెట్టని తనం.....అతని రఫ్ నెస్, అతని సాఫ్ట్ నెస్.... అన్నీ తెల్సిన నిరంజనరావు, మౌనంగా సూర్యవంశీ ముఖ కవళికల్ని గమనిస్తున్నాడు.
"ఆ రోజు బార్లో జగన్నాయకుల్ని కల్సిన ఇద్దరు వ్యక్తుల గురించి ఎంక్వయిరీ చేస్తున్నాం ప్రత్యక్ష సాక్షి బేరర్ యాదగిరిని ఇంటరాగేట్ చేస్తున్నాం" చెప్పాడు నిరంజనరావు.
"బేరర్ యాదగిరి ఇప్పుడెక్కడున్నాడతను" ప్రశ్నించాడు సూర్యవంశీ.
"పోలీస్ కంట్రోల్ రూమ్ లో"
"నేనొకసారి అతన్తోమాట్లాడ్తాను" లేచి నిలబడ్డాడు సూర్యవంశీ.
"ఆ కేసుని ఇన్ స్పెక్టర్ అజనీష్ డీల్ చేస్తున్నాడు" ఎ.సి.పి. నిరంజనరావు మాటల్ని వినిపించుకోకుండా, స్టేషన్ లోంచి బైటికెళ్ళి హీరో హోండాని స్టార్టు చేసాడు సూర్యవంశీ.
సూర్యవంశీ బయటికెళ్ళిపోయిన మరుక్షణం ఎ.సి.పి. నిరంజనరావు చాంబర్లోకి ప్రవేశించాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ భాస్కరరెడ్డి.
* * * * *
"అతను పోలీసాఫీసరా.... పొలిటికల్ లీడరా.... ఆఫ్ట్రాల్ ఒక క్రైమ్ రిపోర్టర్... అతనికి మన పోలీస్ సర్కిల్స్ అంత రెస్పెక్ట్ ఎందుకిస్తాయో నాకర్ధం కావడంలేదు...." సర్కిల్ ఇన్ స్పెక్టర్ భాస్కరరెడ్డి మాటల్లో సూర్యవంశీ మీద కోపాన్ని వెంటనే గ్రహించాడు ఎ.సి.పి. నిరంజనరావు.
"హి ఈజ్ నాట్ ఓన్లీ జర్నలిస్ట్.... బట్ ఆల్సో.... డీసెంట్ హ్యూమన్ బీయింగ్" నిరంజనరావు తన మనసులోని భావాన్ని వెలిబుచ్చాడు.
"డీసెంట్ హ్యూమన్ బీయింగ్...." వ్యంగ్యంగా అన్నాడు భాస్కరరెడ్డి.
"నో సర్... ఐ నో హిమ్....అతనికి మిగతా జర్నలిస్ట్ లకి, ఏం తేడాలేదు....ప్యూర్ అనార్కిస్ట్... పచ్చి తాగుబోతూ.... బార్లల్లో అతను తాగు చేసే గొడవలు, కాలనీలో అతను చేసే గొడవలు.... ఏదో సూపర్ మేన్ లా... ప్రతివాడ్నీ నిలదీయడం... ఒక్కసారి అతని గురించి ఎంక్వయిరీ చెయ్యండి సార్.... మీకే తెలుస్తుంది.... వాడెంత ఇన్ హ్యూమన్ బీయింగో.... మీకే తెలుస్తుంది...." ఉక్రోషంగా అన్నాడు భాస్కరరెడ్డి.
భాస్కరరెడ్డి మాటలకు నిరంజనరావు తల పైకెత్తాడు.
"అనార్కిస్ట్.... పచ్చి తాగుబోతూ.... ఇన్ హ్యూమన్ బీయింగ్.... ఒక వ్యక్తి గుణాన్ని కొలిచే సాధనాలు ఇవ్వేవీ కావు మిస్టర్ భాస్కర్.... ఐ లైక్ హిజ్ సిన్సియార్టీ.... ప్రొఫెషనల్ సిన్సియార్టీ.....కరేజ్.... డేరింగ్...డిటర్మినేషన్.....చాలామంది పోలీస్ అఫీషియల్స్ లో లేని గుణాలు.... అతన్లో ఉన్నాయి..... కాదంటావా..."
ఎ.సి.పి. మాటలకూ బదులివ్వలేకపోయాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్....
ఎ.సి.పి. నిరంజనరావు ప్రతిసారీ, రిపోర్టర్ సూర్యవంశిని ఎందుకు వెనకేసుకొస్తాడో అర్ధం కాలేదు సర్కిల్ ఇన్ స్పెక్టర్ భాస్కరరెడ్డికి.
"చూడండి....మనమే ఎప్పుడో సూర్యవంశీని అరెస్ట్ చేసే రోజొస్తుంది..." కసిగా అన్నాడు భాస్కరరెడ్డి.
"అలాంటి రోజొచ్చినప్పుడు, నేను నా జాబ్ కి రిజైన్ చేస్తాను..." ఆ మాట అంటున్న నిరంజనరావు వేపు ఆశ్చర్యంగా చూసాడు భాస్కరరెడ్డి ఎ.సి.పి.తో మరి ఆర్గ్యూ చెయ్యలేదు భాస్కరరెడ్డి వెంటనే బయటి కొచ్చేసాడు.
సూర్యవంశీని అభిమానించే పోలీస్ ఆఫీసర్లలో ఎ.సి.పి. నిరంజనరావు ఒకడు....సూర్యవంశీని నిరంజనరావు ఎందుకు అభిమానిస్తాడో డిపార్ట్ మెంట్లో చాలా తక్కువమందికి తెల్సు.
గాఢంగా నిట్టూర్చి చేతి వాచీవేపు చూసుకున్నాడు ఎ.సి.పి. నిరంజనరావు అయిదూ....నలభై నిమిషాలు దాటింది.
చలితోపాటు...చీకటి నెమ్మదిగా పరుచుకుంటోంది.
* * * * *