Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 9


    "ఒరే వీడు తంతాడులా వుందిరా... వద్దురా..." మెల్లగా అన్నాడు.

 

    "బ్రీ బ్రేవ్..." భుజమ్మీద చెయ్యేసి, ముందుకు లాక్కెళ్ళాడు ఆనందం.

 

    "భుజంగరావుగారున్నారా?" కొంచెం ధైర్యాన్ని నటిస్తూ అన్నాడు ఆనందం.

 

    "ఆయనతో ఏం పని?" గూర్ఖా అడిగాడు కసురుకున్నట్లుగా.

 

    "ఓ రూమ్ కావాలి" పొరపాటున నోట్లోంచి వచ్చేసింది ఆంజనేయులికి.

 

    ఆ మాట వినబడలేదు గూర్ఖాకి.

 

    "ఇన్సూరెన్స్ ఆఫీసు... ఐడింటిటీ కార్డుందా..." గూర్ఖా మాటకి ఇద్దరూ తెల్లబోయారు.

 

    "ఆయన మా బాస్ కి ఫోన్ చేశారు? కావలిస్తే కనుక్కో..." దభాయించాడు ఆనందం.

 

    "ఆయనే ఫోన్ చేశారా? అయితే వుండండి" గేటు పక్కనే ఆనుకుని వున్న గదిలోకెళ్ళి, అక్కడ నుంచి లోనకు ఫోన్ చేసి, గేటు దగ్గర కొచ్చి తలుపు తీసి-

 

    "ఆయన పూజలో వున్నట్టున్నారు. ఆయనే ఫోన్ చేశారంటున్నారు గదా... వెళ్ళండి" అన్నాడు ఒకింత అనుమానంగానే.

 

    ఆంజనేయులు, ఆనందం గబగబా లోనికి నడిచారు.

 

    "ఆ భుజంగరావు ఎలాంటివాడో, ఏంటో..."

 

    "ఏం పర్వాలేదు పద" ఆనందం భరోసాతో పెద్ద అంగలు వేశాడు ఆంజనేయులు.

 

    పావు మెయిలు దూరం నడిస్తేనే గానీ పోర్టికో రాలేదు. అంత విశాలమైన ఆవరణ అది. అక్కడ నిలబడి అటూ ఇటూ దిక్కులు చూశారు.

 

    "ఆ సుబ్రమణిగాడు దీన్ని లంకంత ఇల్లన్నాడేటిరా! దేశమంతుంటేను... ఇక్కడ రూమ్ ట్రై చేయటం పెద్ద ప్రాక్టికల్ జోకేరా?" ఆంజనేయులన్నాడు ఒకింత నిరాశగా.

 

    "చిన్న కోటలా అవుట్ హౌస్ కూడా ఉందిరా."

 

    "ఈ పెద్ద మనిషిని బోల్తా కొట్టించి, రూమ్ సంపాదించావనుకో... అప్పుడప్పుడు పదో, పరకో అప్పు కూడా తీసుకోవచ్చు" ఆ లైన్లో ఆలోచిస్తున్నాడు ఆనందం.

 

    ఆ సమయంలో లోన్నించి ఆజానుబాహువు, అరవింద దళాయ తాక్షుడూ లాంటి పెద్దమనిషి బయటికి రావడం చూసి-

 

    "భుజంగరావుగారంటే, ఆయనేనేమో... రా... వినయమూ వందనమూ నటించు... డీప్ గా నటించాలి... జాగ్రత్త..." మోచేత్తో పొడిచాడు ఆంజనేయులు.

 

    అంతెత్తు మనిషి భుజంగరావు - తెల్లటి పట్టుపంచె, పట్టు లాల్చీ, నుదుటికి బొట్టు చేతిలో హేండ్ స్టిక్ తో నెమ్మదిగా వరండాలో కొచ్చాడు.

 

    "ఎవరు... ఎవరు కావాలి..." భుజంగరావు దృష్టి నేరుగా ఆంజనేయులు మీదే పడింది.

 

    "నా పేరు ఎస్. ఆంజనేయులండి. వీడు నా ఫ్రెండండి... మేం మిమ్మల్ని చూడ్డానికి వచ్చామండి..." బుద్ధిగా చేతులు కట్టుకుని చెప్పాడు ఆంజనేయులు.

 

    భుజంగరావుకో సరదా వుంది. ఎవరైనా చూడడానికొస్తే, ఆయనకు వళ్ళు పొంగిపోతుంది. కానీ ఆ కోరిక గత పదిహేనేళ్ళుగా తీరలేదు. ఆయన్ని చూడడానికి ఏ ఒక్క పురుగు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించలేదు. దానిక్కారణం వాళ్ళావిడ భువనేశ్వరీదేవి. భువనేశ్వరీ దేవికి ఎవరూ రావడం ఇష్టం వుండదు.

 

    "రండి... లోనికి రండి..." ఆ అవకాశం ఆలస్యం చేస్తే చేజారి పోతుందని గబుక్కున కుర్చీలో సెటిల్ అయిపోయారిద్దరూ.

 

    "ఊఁ చెప్పండి... మాది జమీందారుల వంశమని, ఆ వంశంలో ఆఖరువాడ్ని నేనేనని, మా పూర్వులకు చెందిన కత్తులు, డాల్ లు మొదలైనవి మా దగ్గర వున్నాయని చూడ్డానికొచ్చారా..." భుజంగరావు చెప్పడం ఆపాడు.

 

    "ఛ..... ఛ.... అలాంటిదేం లేదండీ..." అని అనబోతుండగా ఆంజనేయులు నోటిని తన చేత్తో మూసేసి-

 

    "అవున్సార్... టాంక్ బండ్ మీద కూడా మీ విగ్రహం కోసం వెతికాం సార్... లేదు సార్... ఎందుకు లేదో తెలుసుకుందామని వచ్చాం సార్" అనేశాడు ఆనందం హడావిడిగా.

 

    "టాంక్ బండ్... అంటే... అదెక్కడుందీ...?" భుజంగరావు ప్రశ్నించాడు.

 

    పదిహేనేళ్ళుగా ఆయన ఇంట్లోంచి రాకపోవడం, అంతకుపూర్వం వచ్చినా టాంక్ బండ్ వేపు వెళ్ళకపోవడమే ఆ ప్రశ్న వెయ్యటానికి గల కారణం. ఇటీవల కాలంలో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయినట్టు గానీ, వెళ్ళిపోయినట్టుగాని, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మృతులైనట్టుగాని ఇవ్వేవీ ఆయనకు తెలీవు.  

 

    అంత పెద్ద భవనంలో ఇక టీ.వీ. గానీ, ఒక రేడియోగాని లేదు... ఎందుకంటే ఆయనకు వాటిపట్ల అయిష్టత ఎక్కువ. ఆ రెండూ అబద్ధాల్ని ప్రచారంచేసే సాధనాలని ఆయన నమ్మకం. ఒకసారి స్వాతంత్ర పోరాట సమయంలో మహాత్మాగాంధీ హైదరాబాద్ వస్తున్నారని రేడియో ద్వారా విని రాజేంద్రనగర్ ఏరియాకి వెళ్ళి మూడు గంటలు గాంధీ గారి కోసం ఎదురు చూసి, ఎదురు చూసి వచ్చాడు భుజంగరావు. గాంధీ వస్తున్నట్లుగా ప్రసారం చేసిన వార్థ అబద్ధమని తేలింది. అంతే... అప్పటి నుంచి రేడియోలని నమ్మటం మానేశాడు. టీ.వీ. కూడా రేడియో 'కజిన్' కాబట్టి దాన్ని కూడా నమ్మటం మానేశాడు.

 

    ఆయన జోకేస్తున్నాడో, టెస్ట్ చేస్తున్నాడో తెలీక సూటిగా ఆయన ముఖం వేపు చూశాడు ఆంజనేయులు. అదే సమయంలో ఆంజనేయులు వేపు సూటిగా చూస్తున్నాడు భుజంగరావు.

 

    ఆంజనేయులు పొట్టీకాదు, పొడవూ కాదు. తెలుపూ కాదు- నలుపూ కాదు. ఉంగరాల జుత్తు, బలిష్టమైన శరీరం, చురుకయిన చూపులు, మాట వెనక అమాయకత్వం అన్నీ ఆకర్షించాయి భుజంగరావుని.

 

    ఆయనకు చటుక్కున కూతురు జ్ఞాపకం వచ్చింది.

 

    ఈ ఆంజనేయులు మొదటి చూపులోనే తనను ఆకర్షించాడు. వీడ్ని టెస్ట్ చేసి, తన దార్లోకి తెచ్చుకోవాలి. తెచ్చి- తన కూతుర్నిచ్చి పెళ్ళిచేస్తే? ఇల్లు కదలకుండా తనకో మంచి అల్లుడు దొరికినట్టు లెక్క. అల్లుడి కోసం తను యిల్లు కదిలి, అడ్డవైన వాళ్ళ గడపలు తొక్కే పరిస్థితి తప్పుతుంది.

 

    "చూడు ఆంజనేయులూ... ఇక్కడకు నువ్వెందుకొచ్చావో తర్వాత చెపుదువు గాని... ముందు... నేనడిగిన ప్రశ్నలకు సూటిగా, సంక్షిప్తంగా జవాబు చెప్పు...."

 

    "అలాగే సర్... అడగండి సార్..." వినయంగా అన్నాడు ఆంజనేయులు.

 

    "మొన్న నెహ్రూ చచ్చిపోయాడు కదా... లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యాడు గదా... ఆయన పూర్తి కాలం పదవిలో ఉంటాడంటావా? నీ  రాజకీయ జ్ఞానం నాకు కావాలి... ఆన్సర్ చెప్పు" జేబులోంచి పొడవాటి చుట్టతీసి వెలిగిస్తూ అన్నాడు భుజంగరావు.

 Previous Page Next Page