"మొన్న నెహ్రూ చచ్చిపోయాడా...? లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యాడా...? అసలు... వాళ్ళిద్దరూ ఎవరు సార్? అస్సలు మీరే దేశం గురించి మాట్లాడుతున్నారు సార్..." ఆ మాటన్న ఆనందం వేపు గుర్రుగా చూశాడు భుజంగరావు.
"నిన్ను కాదు నేనడుగుతున్నది" ఆంజనేయులికి కూడా గడబిడిగా వుంది.
"నెహ్రూ అంటాడు. శాస్త్రి అంటాడు. వాళ్ళ గురించి ఎక్కడా చదివినట్టు కూడా గుర్తులేదు" అని మనసులో అనుకున్నవాడై-
"శాస్త్రా సార్... వుంటాడు సార్... పూర్తికాలం పదవిలో వుంటాడు సార్... ఛస్తాడా వుండక... ఈ పరిస్థితుల్లో తప్పదు సార్..." నోటికొచ్చిందేదో చెప్పేశాడు.
"నాకు పర్సనల్ గా లాల్ బహదూర్ శాస్త్రి అంటే చాలా యిష్టవోయ్... మంచివాడు కదా... పూర్తికాలం పదవిలో వుంటాడు... నీ రాజకీయ జ్ఞానం నాకు నచ్చిందోయ్... ప్లస్ మార్క్ వేసేశాను..."
రెండో ప్రశ్న-
"రుష్యేంద్రమణి, కన్నాంబల్లో నీకెవరిష్టవోయ్..." అని అడిగాడాయన.
"అస్సలు... వీళ్ళిద్దరెవరు... వీళ్ళకీ, భుజంగరావుకీ ఏమిటి సంబంధం...?"
చకచకా ఆలోచిస్తున్నాడు ఆంజనేయులు.
ఆనందానికి కూడా అస్సలంటే అస్సలు తెలీదు. అందుకే షేక్ స్పియర్ లా మొహం పెట్టుకుని కూర్చున్నాడు.
చటుక్కున జ్ఞాపకం వచ్చింది ఆంజనేయులికి-
"మణిరత్నం అక్కడా ఆవిడ చాలా గొప్పావిడ సార్! రుష్యేంద్రమణి... దళపతి ప్రొడ్యూసర్ కూడా ఆవిడే సార్... నాకు తెలుసు... రెండో ఆవిడ కన్నాంబ. అంబిక, రాధ వాళ్ళమ్మ సర్...పాపం వాళ్ళిద్దరూ పెళ్ళయి వెళ్ళిపోయాక ఇంట్లో ఒక్కావిడా... కుమిలి కుమిలి ఏడుస్తోంది సర్... కుమిలి కుమిలి ఏడుస్తోంది సర్" తమిళ నటుడిలా ఓవర్ యాక్ట్ చేసి చెప్పాడు ఆంజనేయులు.
"ఈ మణిరత్నం ఎవడు? అంబిక, రాధలెవరు? ఏవిటో, తనకు తెలియని చాలా విషయాలు ఆంజనేయులికి తెలుసన్నమాట... వీడ్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరిన్ని ప్రశ్నలు వేసి వీడి దగ్గర తన అజ్ఞానాన్ని బయటపెట్టకూడదు" అని నిశ్చయించుకున్నవాడైన భుజంగరావు హుందాగా నవ్వి-
"ఇప్పుడు చెప్పండి... మీరెందుకొచ్చారు... మీ రాకకుగల కారణమేమి?" అని అడగ్గా-
"సార్... మాకు మీరు మనసారా 'హెల్ప్' చేస్తానని హామీ ఇస్తేనే చెప్తాం సర్?" అని అన్నాడు ఆనందం.
"చేస్తాను... మీరు నాకు నచ్చారు" అని భుజంగరావు నోటి వెంట రాగానే ఆనందం సడన్ గా లేచి "రాజా... రాజా... ధి... రాజా... పూజ... పూజా... ధి... పూజా..." అంటూ డేన్స్ చేయసాగాడు ఆనందంగా.
ఆ నృత్యాన్ని భుజంగరావు ఆనందంగా తిలకిస్తున్న సమయంలో-
"సర్... మేం నిరుద్యోగులం సార్... మాకో రూమ్ కావాలి సర్... అంతే సర్... దానికోసమే వచ్చాం సార్..." అని వినయంగా అడిగాడు ఆంజనేయులు.
"ఇదేం లాడ్జింగ్, బోర్డింగ్ హౌసనుకున్నావా... రూమ్ లు అద్దె ఇవ్వడానికి" చిరుకోపంగా అన్నాడాయన.
"సార్... ఈ ముషిరాబాద్ ఏరియాలో గనక రూమ్ దొరక్కపోతే... మా అంజిగాడి ఉద్యోగం నిలువునా వూడిపోతుంది సర్... దిక్కుతోచక వాడు సూసైడు చేసుకుంటాడు సార్... ఆ పాపం మీకే చుట్టుకుంటుంది సార్... వీడు చచ్చాక దయ్యమై యిక్కడే తిరగాల్సి వస్తుంది సార్... ఈ మంచి బిల్డింగు దెయ్యపు బిల్డింగై పోవడం నాకిష్టం లేదు సార్. ఇక్కడ 'రాజా... పిలుపు నీదేనురా' లాంటి పాటలు వినబడ్డం నాకిష్టం లేదు గాక ఇష్టం లేదు సర్" భుజంగరావు కాళ్ళు పట్టేసి అన్నాడు ఆనందం.
"రాజా పిలుపు నీదేనురా లాంటి పాటలా?! వీళ్ళకి రూమ్ యివ్వక అలాంటి పాటలెలా వినబడతాయి...?! ఆ పాటలేమిటని అడిగితే బావోదని..."
"అవుట్ హౌస్ ఖాళీగానే వుంది. మీ యిద్దరి వినయ విధేయతలూ నాకు నచ్చాయి ఆంజనేయులూ... నీకు పెళ్ళయిందా?" అనడిగాడు భుజంగరావు సడన్ గా.
అయిందని చెప్పాలో-కాలేదని చెప్పాలో తెలీక ఆనందం గింజుకుంటుండగా-
"కాలేదండి ఇప్పుడేగదండి ఉద్యోగం వచ్చింది. ఆపైన అప్పులు వున్నాయి. అవి తీరాక చేసుకుంటానండి. వీడికీ కాలేదండి. వీడి సమస్యలు ఏమిటో తెలీదండి- ఎప్పుడు చేసుకుంటాడో అంతకంటే తెలీదండి" ఆంజనేయులు ఎంతో నిజాయితీగా చెప్పేశాడు.
ఆనందం పక్కలో బాంబుపడ్డట్టు అదిరిపడ్డాడు కాలేదని నిజం చెపితే ఇల్లివ్వరేమోనని ఆనందం భయం. అందుకే గుర్రుగా ఆంజనేయులి వేపు చూశాడు.
"నేనబద్ధం చెప్పానా అలా గుర్రుగా చూస్తున్నావ్?" అంతకంటే ఉక్రోషంగా అడిగాడు ఆంజనేయులు.
ఆనందం ముఖం కళావిహీనమైపోయింది.
ఆ ఇద్దరి వ్యక్తిత్వాల్లో ఉన్న మార్పుని భుజంగరావు కనిపెట్టేశాడు క్షణాల్లో.
"నువ్వు నాకు నచ్చావోయ్" అన్నాడు భుజంగరావు ఆంజనేయులి కేసి పరిశీలనగా చూస్తూ.
ఈ రోజుల్లో నిజం చెబితే కూడా నచ్చుతారా? అని ఆనందం బిత్తరపోయాడు.
"భేష్... కాలేదన్నమాట... కానీ ఇక్కడో చిక్కొచ్చిందోయ్... ఇటీవలే నేనూ, మా ఆవిడా తోడు కోసమైనా మా అవుట్ హౌస్ ను ఎవరికైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం... 'ఫ్రీ'గానే ఇస్తాం... అద్దె అక్కరలేదు... కానీ... సదరు అవుట్ హౌస్ లో దిగే కాండిడేట్ కి పెళ్ళి ఖచ్చితంగా అయి వుండాలని మా ఆవిడ పట్టుదల... ఆవిడ్ని కాదని నేనేవీ చెయ్యలేను... అబ్బాయిలూ..."
"సార్... ఒక్కసారి అలా మీరు 'హ్యూమన్ బాంబు' పేల్చేస్తే ఎలా సార్... మీరు చాలా గొప్పవారు సర్... మీలాంటివారు మీ వంశంలో ఎవరూ లేరు సార్... ఈ ఆపద నుంచి మీరే మమ్మల్ని గట్టెక్కించాలి సర్... అలా చేసిన పక్షంలో, టాంక్ బండ్ మీద చందాలు వేసుకుని మీ విగ్రహాన్ని కట్టిస్తాం సార్..." ఆంజనేయులు కాళ్ళావేళ్ళా పడ్డాడు.
ఎవరైనా కాళ్ళావేళ్ళా పడితే ముగ్ధుడైపోతాడు భుజంగరావు. అది అతని బలహీనత!