తలుపు తీసిన వ్యక్తి లాయరు గారి టైపిస్ట్ అతని పేరు సుబ్రమణ్యం.
సుబ్రమణ్యం కూర్చోమన్నట్టుగా సంజ్ఞ చెయ్యడంతో ఆంజనేయులు, ఆనందం కిక్కురుమనకుండా కూర్చున్నారు.
ఆ లాయరుగారు మళ్ళీ కోర్టుని ఊహించుకుంటూ ఓ గంటసేపు తన వాదన చేశాడు.
చేసి ఆయాసంతో అలిసిపోయి కూర్చుంటూ-
"కోర్టులో ఏం వాదిస్తానో, ఎలా వాదిస్తానో మీకు తెల్సిపోయింది గదా... నా క్కూడా డౌట్ లేదు. కంఠస్థం వచ్చేసింది... సరిగ్గా వంటి గంటకు కోర్టుకి వచ్చేసెయ్యండి" అని చెప్పడంతో, బెంచీ మీదున్న ఆ పల్లెటూరి వ్యక్తులు లేచి-
"తమ దయ" అని బైటకెళ్ళిపోయారు.
"ఎలా వుంది సుబ్రమణీ మన ఫర్ పామెన్స్" అదిరిపోయింది గాడూ. ఇవాళ ఈ దెబ్బతో కోర్టు దద్దరిల్లి పోవాలి.
ఏం చెప్పాలో తెలీక సుబ్రమణ్యం అలా వుండిపోయాడు.
"ఇదెక్కడి లాయరో! తను కోర్టులో ఎలా వాదిస్తాడో, 'పార్టీ' ముందు రిహార్సిల్ వేసి చూపించే లాయర్ ప్రపంచంలో నువ్వొక్కడివేరా బాబూ... మధ్యలో నేను ఛస్తున్నాను" అని మనసులో అనుకుని-
"మొత్తం కంఠస్థం వచ్చేసింది గదండీ... ఇక డోకా లేదు" అని అన్నాడు బయటకు.
ఆ ఇంటి వాతావరణమే ఆంజనేయులుకి, ఆనందానికి విచిత్రంగా అనిపించింది.
అది పాత మండువా లోగిలి.
మధ్య హాల్లో వాళ్ళిప్పుడుంది.
ఆ హాలుకి కుడి వేపు ఒక గది, ఎడంవేపు ఒక గది వున్నాయి. అవి బెడ్ రూమ్స్ అనుకుంటాను... వాటికి కర్టెన్లు వేలాడుతున్నాయి.
అన్నిటికంటే విచిత్రం రెండు గదుల్లోంచి రెండు నైలాన్ రోప్స్ సీలింగ్ ని ఆనుకుంటూ వచ్చి, ఆ హాలు మధ్య వున్న ఒక గంటకు కనెక్ట్ చేసున్నాయి.
అవి చూస్తూ ఆశ్చర్యపోతున్నంతలో గంట మోగింది. వీళ్ళిద్దరూ దానికి విస్తుపోయి చూస్తుండగా జిగురుమూర్తి హడావిడిగా, భయంగా ఎడం వేపున్న గదిలోకి వెళ్ళిపోయాడు.
"ఈ గంటల గోలేమిటి గురువుగారూ?" అడిగాడు ఆంజనేయులు తికమక పడిపోతూ.
సుబ్రమణ్యం ముందో పెద్ద నిట్టూర్పు విడిచాడు.
"ఏమని చెప్పనులేండి... ప్రాక్టీసు లేకపోయినా ఇద్దరు పెళ్ళాలకు మొగుడయ్యాడు. వాళ్ళిద్దరు అక్కచెల్లెల్లే. అక్కని పెళ్ళి చేసుకొని, చెల్లితో కాలు జారాడు. దాంతో ఇద్దరికీ దొరికిపోయాడు. న్యాయం చెప్పవలసిన లాయరే అలా తప్పుచేయటం మూలంగానేమో ప్రాక్టీస్ కి గ్రహణం పట్టింది. వాళ్ళిద్దరు అక్క చెల్లెలే అయినా సవతులయ్యారు గదా? ఈ ఇంట్లో వున్న రెండు బెడ్ రూమ్స్ ని వాళ్ళు పంచేసుకొని, ఈయనకి ఈ హాలిచ్చేశారు. ఏ గంట మోగితే ఆ గదిలోకి వెళ్ళి వచ్చి నీరసపడిపోయి, ఈ హాల్లోనే పడుకుంటుంటాడు...."
సుబ్రమణ్యం చెప్పటం పూర్తి కాకుండానే అడిగాడు ఆనందం.
"ఆ గంట రోజు కెన్నిసార్లు మోగుతుంది?" అని-
సుబ్రమణ్యం, ఆనందం వేపు కోపంగా చూశాడు.
"ఎటెన్ని సార్లు మోగుతుంది?" సుబ్రమణ్యం కోపాన్ని అర్థం చేసుకోకుండానే తిరిగి అడిగాడు ఆనందం.
"ఈ గంట గురించి లెఖ్ఖలేసుకుంటూ పోతే నా ఇంటి దగ్గర గంట మాటేటి...?" చిరాగ్గా అన్నాడు ఆనందం.
అరగంటకి లాయర్ లోపల నుంచి వచ్చాడు నీరసంగా.
ఇద్దరి వేపు చూశాడు. ఆ చూపును అర్థం చేసుకున్న ఆంజనేయులు నిటారుగా నిలబడి-
"పక్క బిల్డింగ్... డిటైల్స్..." అని నసిగాడు.
ఆ మాటకు లాయర్ గారి ముఖం వికసించింది.
"చూశావా... సుబ్రమణ్యం... ఎన్నాళ్ళనుంచో ఎదురు చూస్తున్న కేసు ఇప్పుడొచ్చింది. పక్క బిల్డింగ్ మీద ఎవడో ఒకడు, ఎప్పుడో ఒకప్పుడు కేసు వేస్తాడని నాకు తెలుసు. దాన్నూహించే ఇక్కడ ఇల్లు తీసుకున్నాననే విషయం నీకు తెలీదు" తనని తనే పొగుడుకున్నాడు లాయర్.
"జిగురుమూర్తిగారూ... ఒఅక్క బిల్డింగ్ మీద కేసు వెయ్యడానికి రాలేదండి. ఆ బిల్డింగ్ ఎవరిదో, ఏమిటో కనుక్కోడానికొచ్చాం... అంతే" నెమ్మదిగా అన్నాడు ఆనందం.
ఇది కేసు కాదని తెలియడంతో 'తనని జిగురుమూర్తి' అన్నందుకు కోపం వచ్చింది లాయర్ కి.
"చూడు మిస్టర్... నా పేరు జి. గురుమూర్తి. మీకు చదవడం రాకపోతే నాది తప్పు కాదు. బైదిబై... ఇదేం ఎంక్వయిరీ ఆఫీస్ కాదు. సుబ్రమణీ వాళ్ళని బయటకు పంపించు" అన్నాడు లాయర్ కోపంగా.
"అస్సలు మీకేంటి కావాలి.." బయటికొచ్చాక అడిగాడు సుబ్రమణ్యం వాళ్ళని.
వాళ్ళకేంటి కావాలో మళ్ళీ చెప్పారు ఇద్దరూ.
"మీకు చెప్తాను... నాకేవిస్తారు..." అడిగాడతను.
"డబ్బులా..." ఆశ్చర్యంగా అడిగాడు ఆంజనేయులు.
"డబ్బులు కాకపోతే... వజ్రాలు, వైడూర్యాలూ ఏవిటోయ్..." అన్నాడతను.
ఆనందం జేబులోంచి ఓ అయిదు రూపాయలు తీసి, అతని జేబులో పెడుతూ, "ఫలం, పుష్పం, తోయం... అన్నీ ఇవ్వే."
"ఆ బిల్డింగులో భుజంగరావుగారు ఉంటున్నారు. వాళ్ళావిడ కూడా ఉంటోంది. వాళ్ళకు ఎంతమంది పిల్లలో ఏమిటో ఎక్కడుంటున్నారో కూడా తెలీదు. చుట్టాలెవరైనా ఉన్నారో లేదో కూడా తెలీదు. వాళ్ళెప్పుడూ బయటకు రావడం నేనెప్పుడూ చూడలేదు. లంకంత ఇంట్లో వాళ్ళిద్దరూ బిక్కుబిక్కు మంటూ ఎలా వుంటారో? నాకు తెల్సిందిదే" అంటూ సుబ్రమణి లోపలకెళ్ళి పోయాడు.
"మనం తల్చుకుంటే ఆ ఇంట్లో గది సంపాదించలేమా" అడిగాడు ఆంజనేయులు.
"ఏం... ఎందుకు సంపాదించలేం... బ్రహ్మాండంగా సంపాదించగలం" నొక్కి వక్కాణించాడు ఆనందం.
"అయితే ముందు గూర్ఖాగాడ్ని ముగ్గులోకి దించుదాం పద..." జయ్ దుర్యోధనా అని అనబోయి నోట్లోనే గొణుక్కున్నాడు ఆంజనేయులు.
విశాలమైన గేటు వెనక, హిందీ సిన్మా విలన్ క్రిస్టోఫర్ లాంటి గూర్ఖా నిలబడి వున్నాడు. గేటు వేపు వస్తున్న ఆ ఇద్దర్నీ పరిశీలనగా చూశాడు గూర్ఖా.
"ఎవరు కావాలి?" భీకరంగా వుంది ఆ గొంతు. ఆ గొంతు శబ్దం వినగానే సగం నీరుకారిపోయాడు ఆంజనేయులు.