Previous Page Next Page 
ఉషోదయం పేజి 9

    "కోర్టు ఆర్డరుచూసి విర్రవీగుతున్నట్టున్నావు. తీర్పు ఇంకా రాలేదని మరిచిపోకు" కసిగా అన్నాడు.
    సునీత నిర్లక్ష్యంగా నవ్వింది.
    "మర్చిపోను... తమరింక వెడితే పని చూసుకుంటాను."
    రవీంద్ర ఏం చెయ్యలేక దభాలున తలుపుమూసి కోపంగా వెళ్ళిపోయాడు.
    'రంజనీ! సారీ, ఆవిడగారు చేతిలో కోర్టు ఆర్డరు పట్టుకుని ఆడుతోంది. నీకు ఇంకో రూము అలాట్ చేయిస్తాను" రంజని భుజం మీద చెయ్యివేసి అనునయంగా అన్నాడు రవీంద్ర.
    రంజని హేళనగా చూసింది ఇంతేనా నీ పవరు అన్నట్టు.
    అది చూసి రవీంద్ర అసహనంగా "ప్లీజ్ నీవు కూడా అసహ్యంగా సీన్లు క్రియేట్ చెయ్యకు. నీవు ఇదివరకటి సీట్లో కూర్చో, ఏదో ఏర్పాటు చేసేవరకు. ప్లీజ్ వెళ్ళు, ఇప్పటికే స్టాఫ్ అంతా చూస్తున్నారు" అన్నాడు.
    రంజని మొహం మాడ్చుకుని వెళ్ళింది.
    సునీత తన పాత కస్ట్ మర్లకి, బిల్డర్స్ కి, స్నేహితులకి అందరికీ ఫోన్లు చేసి తను మళ్ళీ బిజినెస్ ఆరంభిస్తున్నట్టు ఏవైనా కొత్తప్రాజెక్టులు వస్తే తనని కాన్సిడర్ చేయమని అభ్యర్థించింది. బాగా తెలిసిన ఇద్దరు ముగ్గురు "అనవసరంగా మధ్యలో మానేసి బిజినెస్ కి దూరమయ్యావు, కాంటాక్ట్స్ పోగొట్టుకున్నావు. అవకాశాలు వదిలేశావు...." అంటూ ఓదార్పుగా అని మళ్ళీ నిలదొక్కుకోడానికి తమసాయం అందిస్తామంటూ శుభాకాంక్షలు తెలిపారు.  
    సాయంత్రం రవీంద్ర, రంజని వెళ్ళిపోయేవరకు కాచుకుని వుండి స్టాఫ్ అందరూ సునీత రూములోకి వచ్చి అభినందనలు చెప్పారు.
    "థ్యాంక్స్. మీరంతా ఇదివరకులాగే నాకు కోపరేట్ చెయ్యాలి. నేను నిలదొక్కుకోడానికి మీ సాయం కావాలి" అందరివంకా చూసి చేతులు జోడించింది.
    "ష్యూర్ మేడమ్. మేమంతా మీ వెనకే వుంటాం. మీరింత నిబ్బరంగా నిలబడి, ధ్యైర్యంగా అన్యాయాన్ని ఎదుర్కోడం మాకు సంతోషాన్నిచ్చింది. ఆ రంజని ఏమిటో దాని స్థానం ఏమిటో మీరు తెలియచెప్పాలి మేడమ్" కసిగా అన్నారంతా.
    వాళ్ళందరి సానుభూతి అంతా సునీత మీద, ఆమె పిల్లలమీద వుంది.
    బాస్ గాబట్టి రవీంద్ర గురించి చెడ్డగా అనలేకపోయారు. రంజని ఆఫీసుకొచ్చిం దగ్గరినుంచి రవీంద్ర మీద కన్నేసి ఎలా దగ్గిరైందో, దగ్గిరై తమందరిమీదా బానిజం చెలాయించడం ప్రారంభించిందో చెప్పారు. రంజనిని సహించలేని అందరూ సునీతకి సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించారు.
    వివాహ బంధంలో లోకం సానుభూతి భార్యాపిల్లల మీద వుంటుంది. ఇలాంటి సందర్భాలలో అనుకుంది సునీత అందుకే ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా భార్య ఆ స్థానం వదులుకోడానికి ఇష్టపడదు అనుకుంది సునీత.
                                                * * *
    "శారదా! సాయంత్రం ఇంట్లో వుంటావా, నీకో సర్ ప్రైజ్ ఇస్తాను" నవ్వుతూ అడిగింది సునీత ఫోన్ లో.
    "ఏమిటి విషయం.... చెప్పు... చెప్పు సాయంత్రం వరకు సస్పెన్స్ లో పెట్టేస్తే భరించలేను" శారద ఆరాటంగా అంది.
    "చెప్పేది కాదు, చూపించేది. ఒకళ్ళని తీసుకొస్తాను ఇంటికి. ఆఫీసునించి డైరెక్ట్ గా వస్తాను, మంచి టిఫిన్ చేసి వుంచు" ఫోన్ పెట్టేస్తూ అంది.
    ఎవర్ని తీసుకొస్తానంది... ఎవరు? ఎంత ఆలోచించిన తట్టక శారద కోర్టుకి వెళ్ళిపోయింది. ఉన్న రెండు కేసుల్లో ఒకటి వాయిదాపడడంతో రోజు కంటె ముందు వచ్చేసింది. "అత్తయ్యా! సాయంత్రం సునీత వస్తానంది. ఏదన్నా టిఫిన్ చెయ్యాలి ఏం చెయ్యమంటారు" సలహా అడిగింది.
    "మనింట్లో పకోడీలు బాగుంటాయంది సునీత ఒకటిరెండుసార్లు తిని. ఉల్లిపాయ కోసిపెట్టు వేడివేడిగా మీరు మాట్లాడుకుంటుంటే వేసి పెడ్తాను. కాస్త రవ్వకేసరి చేసి వుంచు" అంది సరస్వతి.
    సాయంత్రం ఆరవుతూండగా సునీత వచ్చింది.
    "శారదా! ఎవరొచ్చారో చూడు" అంది నవ్వుతూ.
    శారదా ఆశ్చర్యానందాలతో "హాయ్ సుప్రియా! నీవా? ఎన్నాళ్ళయింది చూసి. ఎక్కడ మాయమైపోయావు ఇన్నాళ్ళూ" సుప్రియని కౌగలించుకుని ఆనందంగా అంది.
    సుప్రియ మాటరానట్టు శారదని కౌగలించుకుంది. ఇద్దర్నీ చెరో చేత్తో పట్టుకుని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి "మా అత్తగారు" లోపల్నించి సత్యవతిని చూపిస్తూ అంది.
    "కూర్చోండి, కూర్చోండి" అంది ఆవిడ.
    "అత్తయ్యా, మేం ముగ్గురం స్కూలునించి కాలేజీవరకు స్నేహితులం" శారద పరిచయం చేసింది.
    "మమ్మల్ని "త్రీ ఎస్' లనేవారు అంతా. అంత స్నేహంగా వుండేవాళ్ళం.... ఇంటరయ్యాక చదువులు వేరై విడిపోయాం. శారదా, నేను పెళ్ళిళ్ళయ్యాక ఇక్కడ కలిశాం. ఇదే దూరం అయింది" సునీత అంది.
    "చాలారోజులకి కలిశారు... కూర్చుని మాట్లాడుకోండి. ఫలహారం తెస్తా" ఆవిడ లోపలకి వెళ్ళగానే... "ఏమిటే ఏమైపోయావు ఇన్నాళ్ళూ... చెప్పు నీ గురించి, గబగబా అన్నీ చెప్పు" అంది శారద సుప్రియ చెయ్యి నొక్కి.
    "సంతోషంగా చెప్పుకునే గతంకాదు నాది.... ఎదురుగా వున్న భవిష్యత్తు భూతంలా భయపెడ్తోంది...." సుప్రియ కళ్ళల్లో నీలినీడలు.
    "ఉదయం ఆఫీసుకొచ్చిన దగ్గరినించి ఇదే వరస... ఏం జరిగిందో సరిగా చెప్పదు. ముందు తనకో ఉద్యోగం వెంటనే కావాలట.... కావాలని ప్రేమించుకుని పెళ్ళాడిన రాజేష్ కథ తలుచుకోడం ఇష్టం లేదంటుంది."
    "ఏమైంది సుప్రియా, చెప్పవే బాబూ. విడిపోయారా ఇద్దరూ" ఆరాటంగా అంది శారద.
    "చెప్పవే చంపకుండా, సస్పెన్స్ చాలు" విసుగ్గా అంది సునీత.
    "ఏం చెప్పాలి! ప్రేమ అనుకుని అందరినీ ఎదిరించి చేసుకున్న పెళ్ళిలో ప్రేమ మూణ్ణెళ్ళకే ఆవిరి అయింది" నిర్వేదంగా అంది సుప్రియ.
    "ఏం, గొడవలు వచ్చాయా?" లాయరులా ఆరా తీసింది.
    "ప్రేమ, దోమ అన్నీ తిండి, సుఖాలున్నంతవరకే నిలబడతాయి. చదువులయీ అవగానే పెద్దలనెదిరించి పెళ్ళి, తర్వాత ఉద్యోగాలు దొరక్క కష్టాలపర్వం మొదలయింది. నాకేదో చిన్న స్కూల్లో ఉద్యోగం దొరికింది. రాజేష్ కి అదీ దొరకలేదు. తినీ తినక గడపడానికైనా ఆ చిన్నమొత్తం సరిపోక అరుచుకోడాలు, దెబ్బలాటలు మొదలయ్యాయి.         

 Previous Page Next Page