రాజేష్ లో అసహనం, తప్పుచేశానన్న భావం, పెద్దలని కాదని చేసుకోవడం పొరపాటని అన్నింటికి నేనే కారణం అని, పెళ్ళి పెళ్ళి అని తొందరపెట్టానని తప్పంతా నాదేనని తేల్చాడు... ఇల్లు నరకం అయింది.
ఆఖరికి ఎనిమిది నెలల తర్వాత నా ఖర్మానికి నన్ను వదిలి మాయం అయిపోయాడు. రాజేష్ పర్వం ముగిసింది. ఆ చిన్న ఉద్యోగం ఆధారంగా చావలేక బతుకుతూంటే అలా అయినా బతకనీయకుండా రకరకాల మగాళ్ళ రకరకాల వేధింపులు మధ్య బతకలేక ఇంటికెళ్ళాను. చేసిన తప్పుని ఒప్పుకుని క్షమించమని వేడుకున్నా అన్నయ్య మనసు కరగలేదు. నే వెళ్ళాక ఆరోగ్యం దెబ్బతిన్న అమ్మకి నా గతి చూశాక హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది. అమ్మా, నాన్న లేని నా బాధ్యత అన్నయ్య తీసుకోడానికి ఇష్టపడక గుమ్మం చూపించాడు.
నీవూ ఇక్కడే వున్నావని విని జనారణ్యంలో మగవాళ్ల మధ్యకి వచ్చానని ఆనందం కలిగింది. సునీతా, శారదా! తెలిసీ తెలియని వయసులో ప్రేమ అనుకున్న దాని ఫలితం బాగానే అనుభవించాను. మీరిద్దరే ఈ లోకంలో నాకు ఆప్తులు. మీరే నాకు తోవ చూపాలి" ఇద్దరి చేతుల్లో తలవాల్చి కన్నీరు కార్చింది సుప్రియ.
"ఊరుకో, ఊరుకో జరిగిందేదో జరిగింది. ఏదో ఉద్యోగం దొరికేవరకు మా ఇంట్లో ఉందువుగాని.... ఇప్పుడు నీవు, నేను ఒకే బోటులో ప్రయాణిస్తున్నాం భర్తాబాధితులం" సునీత నవ్వుతూ అంది.
"సుప్రియా! నీవేదో ప్రేమనుకుని మోసపోయానని బాధపడక్కరలేదు. కావాలని పెళ్ళి చేసుకుని పదేళ్ళు కాపురం చేసి, ఇద్దరు పిల్లల కలిగాక కూడా సునీత భర్త ఏం చేశాడో చూశావుగా. ఇటు నేనేదో చాలా హాయిగా వున్నాననుకోకు, పీతకష్టాలు పీతవి...." నవ్వుతూ అని లోపలకి వెళ్లి అత్తగారు వేడివేడిగా చేస్తున్న పకోడీలు, స్వీటు ప్లేట్లలో సర్ది పట్టుకొచ్చింది. తింటూ స్నేహితురాళ్ళు భవిష్యత్తు గురించి చర్చించుకోసాగారు.
"ప్రకాష్ తో కూడా చెప్తాను. ఆయన క్లయింట్స్ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళున్నారు. ఏదో ఉద్యోగం దొరకకపోదు" శారద అంది.
"నేనూ అదే అన్నాను. నా దగ్గరకొచ్చే డబ్బున్నవాళ్ళు చాలామందే వున్నారు. భయపడకు నీవు సెటిల్ అయ్యేవరకు నీ బాధ్యత నాది" అంది సునీత మనస్ఫూర్తిగా.
కాఫీ, పలహారాలు, కబుర్లు అయి స్నేహితురాళ్ళిద్దరూ వెళ్ళడానికి లేచేవేళకి ప్రకాష్ కారు వచ్చి ఆగింది. గుమ్మంలో ఎదురుపడ్డ అతన్ని విష్ చేసింది సునీత.
శారద "తను సుప్రియ అని మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్. ఈయన ప్రకాష్. మావారు" పరిచయం చేసింది.
నవ్వు మొహాన పులుముకుని "హాయ్" అంటూ పలకరించి లోపలకి వెళ్ళిపోయాడు.
అంతేచాలు అనుకుంది శారద.
* * *
"డాడీ! రోజుకో బ్యాంకు, ఖాతాదారులని ముంచేస్తూ మూతపడుతున్నాయి. వీటి గురించి విషయాలు సేకరించి అసలు విషయాలు, తెరవెనుక కథ నడిపిన డైరెక్టర్ల మోసాలు, బాకీలు ఎగవేసి విలాసంగా జీవిస్తున్న బడాబాబుల కథలు, చేతులు ముడుచుకుని కూర్చున్న ప్రభుత్వం, నిజాలు సేకరించి బయటపెట్టే రియల్ స్టోరీస్ వ్యాసాలని సీరియల్ గా ప్రతివారం ప్రచురిస్తే బాగుంటుందనుకుంటున్నాను.
ఎంతమంది కష్టార్జితమో పైసా పైసా కూడబెట్టి పిల్లల పెళ్ళిళ్ళకి, చదువులకి, రిటైరయ్యాక ఓ ఇల్లు కొనుక్కోడానికి దాచుకున్న డబ్బు మింగి తప్పించుకు తిరుగుతున్న ఖాతాదార్ల చరిత్ర బయటపెట్టే కథలు సేకరించి రాస్తే బాగుంటుందనుకుంటున్నాను. శ్రీనివాస్, నేను డిపాజిట్లని కలిసి వివరాలు సేకరించి, బ్యాంక్ ఉద్యోగుల సహకారంతో కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన పెద్ద మనుషుల కథలు కవర్ చేస్తాం. మీరేం అంటారు? మీరు ఎస్ అంటే మొదలు పెడతాం. సండే ఎడిషన్లో ఒక్కో వారం ఒక్కో ఎగవేతదారుని కథ రాస్తాం" చాలా ఉత్సాహంగా, ఉద్రేకంగా అంది నీరద.
శ్రీనివాస్ కూడా ఆ ఉత్సాహంలో, ఆ ప్రాజెక్టులో పాలుపంచుకుంటానన్నట్టు తల ఆడిస్తూ నారాయణమూర్తిగారివంక చూశాడు.
ఆయన ఒక నిమిషం మౌనంగావుండి పోయారు ఆలోచిస్తున్నట్టుగా.
"బాగానే వుందిగాని, అపోజిషన్ బాగా ఎదుర్కోవలసి రావచ్చు. డబ్బు, పలుకుబడితో ఇష్టారాజ్యంగా ఏలుతున్నవాళ్ళకి తమ బండారం బయటపడినప్పుడు మౌనంగా సహించి ఊరుకుంటారా? ఇవి ఆపించేందుకు అనేకరకాల ప్రెషర్స్ ఉపయోగిస్తారు. పొలిటికల్ పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఈ ఒత్తుడులు అన్నీ తట్టుకుని మనం నిలబడి ముందుకు వెళ్ళగలమా అన్నది మనం మెంటల్ గా ముందే ప్రిపేరవ్వాలి. ఇవన్నీ మనం బాగా ఆలోచించాలి" సాలోచనగా అన్నారు నారాయణమూర్తి.
"మనం లేనివి సృష్టించి రాయం కదా, నిజాలనే ప్రజలముందుకు తెస్తాం.... ఇందులో భయపడడానికి ఏముంది? ఆల్ రెడీ పేపర్లన్నీ ఈ బ్యాంక్ స్కాముల గురించి రాస్తున్నాయిగా. ఎటొచ్చీ మనం వివరంగా డిఫాల్టర్ల మోసాలు బయటపెడతాం. పేపరన్నాక నిజానిజాలు వెలికితీసి రాయాలిగదా. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం నిషేధంకాదు. పత్రికా స్వాతంత్ర్యంవుంది మనకి" నీరద తండ్రిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ అంది.
"సార్, ఇలాంటి సెన్సేషనల్స్ రాయకపోతే పేపరు పోటీకి తట్టుకుని నిలబడలేదు. చావులు, యాక్సిడెంట్లు, రాజకీయనాయకుల సిగపట్ల గురించి చప్పని వార్తలు రాస్తే, మన పేపరు ప్రత్యేకత ఏముంటుంది సార్. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు శోధించి పరిశోధించి రాయడంలో థ్రిల్ వుంటుంది."
ఒకే. మీ ఇద్దరి ఉత్సాహాన్నీ నేనెందుకు కాదనాలి... యువరక్తం మీది. గోఎ హెడ్. కానీ వార్త పేపరుకి ఎక్కేముందు ఒకటికి నాలుగుసార్లు నిజానిజాలు క్షుణ్ణంగా పరిశీలించి, వివాదంలో చిక్కుకోని విధంగా ఆర్టికల్స్ తయారు చెయ్యాలి.మరీ దూకుడుతనం వద్దు. బికేర్ ఫుల్. ఫైనల్ కంపోజింగ్ అయిన తర్వాత నాకు చూపించి ప్రొసెసింగ్ కివ్వకండి" అంటూ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారాయన.
నీరద, శ్రీను ఇద్దరూ సంతోషంగా ఒకేసారి "థ్యాంక్స్" అన్నారు.
* * *