"ఎలా కలుసుకుంటాం! స్కూటీ వుంది గదా, ఏ సాయంత్రమో రావచ్చు గదా! నాకంటె సంసారం, పిల్లాడు, క్లయింట్స్, నీకేం నీవు రావచ్చుగదా" శారద కినుకుగా అంది.
"అయ్యో రామా! అది, ఆయన ఇంటికి వచ్చేసరికి తొమ్మిదవుతుందే తల్లీ. ఆదివారం వస్తే ఇంటర్వ్యూలంటూ బయలుదేరుతుంది. ఏం పేపరో! డబ్బు రావడం మాట దేవుడెరుగు ఓ పెద్ద గుదిబండ అయింది మెడకి...." లలితమ్మ ప్లేటుల్లో రావ్వలడ్డూ, కారప్పూస తీసుకొచ్చి అందరికీ ఇచ్చి కాఫీకలపడానికి వెళ్ళింది. అందరూ కాసేపు రాజకీయాలు, పేపర్లు, వార్తలు లోకాభి రామాయణంలోపడ్డారు.
"అక్కా.... నీ దగ్గరకు వచ్చే కేసుల్లో ఏమయినా ఇంట్రెస్టింగ్ కేసులుంటే చెప్పకూడదూ. వారం వారం ఆదివారం పత్రికలో ఓ వార్తా కథనంలా రాస్తాను..." నీరద ఉత్సాహంగా అడిగింది.
"వాటికేం భాగ్యం... ఆడవాళ్ళు కేసులు కదిలిస్తే ప్రతి ఒకటీ ఒక కథ అవుతుంది. ఇంకా బయటకి రానివి ఎన్నో. కిరసనాయిలు పోసి తగలెట్టినా, ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పే పతివ్రతలు మనవాళ్ళు. కన్నీళ్ళచాటున దాచుకునే కడగండ్లు ఎన్నో... నూటికి ఒక్కరుకూడా కోర్టుకి ఎక్కరు. ఒకోసారి వాళ్ళని చూస్తుంటే కోపం వస్తుంది. ఎందుకంత మూర్ఖంగా ఆలోచిస్తారు, ధైర్యంగా నిలబడి పోరాడి వాళ్ళ హక్కులు ఎందుకు సాధించుకోరు అనిపిస్తుంది. వారి నిస్సహాయతకి కోపమూ వస్తుంది. వారిననీ లాభంలేదు. లాయర్లచుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే స్తోమత ఎంతమందికి వుంది? ఏళ్ళ తరబడి నడిచే కేసుల తీర్పుకోసం ఓపిగ్గా పోరాడేశక్తి ఎంతమందికి వుంటుంది?
ఇలాంటి కేసులకి సత్వర పరిష్కారం న్యాయం జరిగినట్టు సమూలంగా చట్టాలు మారిస్తేతప్ప ఆడవాళ్ళ బతుకులు ఇంతే మనదేశంలో" ఆవేశంగా అంది శారద.
"పుణ్యభూమి నా దేశం నమో నమామి" వ్వుతూ పాట హమ్ చేస్తూ "అమ్మా, వంటకి సాయంకావాలా" అంటూ వంటింటివైపు వెడుతూ "వాసూ, నీ భోజనం ఇక్కడే. వెళ్ళిపోకు. అక్కని దిగబెట్టాలి" అంది చనువుగా.
"ఈ శ్రీనివాస్ వచ్చాక నా పనిభారం కాస్త తగ్గిందమ్మా. నీరద, ఇతను కలిసి పనులు పంచుకుని నాకు కాస్త ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కల్పించారు" నారాయణమూర్తిగారు శ్రీనివాస్ వంక వాత్సల్యంగా చూశారు.
రాత్రి భోజనాలయ్యేసరికి తొమ్మిది అయింది. స్కూటర్ మీద శ్రీనివాస్ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసరికి తొమ్మిదిన్నర అయింది.
"థ్యాంక్స్ బాబూ, నీకనవసరంగా శ్రమ ఇచ్చాను" అంది శారద.
"ఇట్స్ ఎ ప్లెజర్.... మిమ్మల్ని అక్కా అనచ్చా" అన్నాడు శ్రీనివాస్.
శారద సంతోషంగా "ఆఫ్ కోర్స్! అందులో అడగడానికేముంది. అయితే నేనూ నిన్ను శీనూ అని పిలుస్తా" అతని భుజంమీద చెయ్యివేసి ఆప్యాయంగా అంది. "గుడ్ నైట్ శీనూ! రాత్రయింది జాగ్రత్తగా వెళ్ళు. ఎప్పుడైనా ఇటుపక్కకి వస్తే వచ్చి వెళ్తూండు" అంటూ లోపలికి వెళ్ళింది.
అప్పటికే ప్రకాష్ వచ్చి డ్రాయింగ్ రూములో టీ.వీ. చూస్తూ కూర్చున్నాడు. ఆమె వచ్చింది గమనించనట్టే అటు చూడలేదు. "ఇవాళ తొందరగా వచ్చారా.... తెలిస్తే అటు రమ్మనేదాన్ని, నాన్నకూడా అన్నారు ఎన్నాళ్ళయిందే చూసి అని..." అపాలజిటిక్ గా అంది.
రాహుల్ తండ్రి పక్కన చేరి టీ.వీ చూడసాగాడు.
"భోంచేశారా!" ప్రకాష్ మాట్లాడకపోవడంతో మళ్ళీ కల్పించుకుని అడిగింది.
"చేశాడులే అమ్మా, నీవెళ్ళి బట్టలు మార్చుకో" కొడుకు ధోరణి నచ్చక సత్యవతి అంది కలుగజేసుకుని.
* * *
మర్నాడు పిల్లలని స్కూల్ కి పంపి, ఇంటిపని గబగబా పూర్తిచేసి ఆఫీసు కెళ్ళింది సునీత. అప్పటికే రవీంద్ర వెళ్ళిపోయాడు. సునీత ఆఫీసులో తన ఛాంబరువైపువెళ్లేసరికి రంజని ఆ సీటులో కూర్చుని పనిచేసుకుంటోంది.
సునీతని చూసి తెల్లబోయి తొట్రుపడి లేచి నిల్చుంది.
సునీత ఆమె వంక సూటిగా చూసి "ఎక్స్ క్యూజ్ మీ.... ప్లీజ్ వెకేట్ దిస్ సీట్ అండ్ ద రూమ్.." అంది కటువుగా.
రంజని నల్లబడ్డ మొహంతో ఏదో అనబోతూంటే సునీత గంభీరంగా "నో ఆర్గ్యుమెంట్స్" అంటూ వేలుతో తలుపువైపు చూపింది. రంజని ఎర్రబడ్డ మొహంతో ఆవేశంగా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రవీంద్ర రూమువైపు విసవిసా వెళ్ళింది.
దూకుడుగా గదిలోకి వచ్చిన రంజనిని చూసి "ఏమిటి, ఏమైంది" అన్నాడు.
మాటలు తడబడుతుండగా, మొహం ఎర్రబరుచుకుని "సునీత... సునీత వచ్చింది. నన్ను రూములోంచి పొమ్మంది" ఉక్రోషంగా చిన్నపిల్లలా ఫిర్యాదు చేసింది.
సునీత వచ్చింది, అలా అంది అనగానే రవీంద్ర తొట్రుపడి "అలా అందా" అన్నాడు అపనమ్మకంగా.
"ఏం, నేను అబద్ధం చెప్పాననా? కావలిస్తే వెళ్ళిచూడు. నన్ను కుర్చీ ఖాళీచేసి గదిలోంచి పొమ్మని ఆర్డరు వేసింది. నన్నింత అవమానం చేస్తుందా! చూడు వెళ్ళి చూడు కావలస్తే.... వెళ్ళి అడుగు. రవీ, నాకింత అవమానం జరిగితే నీకేం అనిపించడంలేదా" ఏడుపు గొంతుతో అంది.
రవీంద్ర ఒక్కక్షణం అలోచించి చరచరా సునీత గదివైపు వెళ్ళాడు.
సునీత అప్పటికే ఆ టేబిల్ మీద కాగితాలు, ఫైల్స్ అన్నీ ప్యూన్ చేత తీయిస్తోంది.
"సునీతా, ఏమిటిది? రంజని సీటు అది. ఖాళీ చెయ్యమనడం ఏమిటి? ఎవరి నడిగి ఈ కాగితాలన్నీ తీయిస్తున్నావు" కోపంగా అడిగాడు.
"ఎవరినీ అడగాల్సిన అవసరం నాకు లేదు..... నా ఆఫీసురూములో అడ్డమైన వాళ్ళూ వచ్చి కూర్చుంటే చూస్తూ ఊరుకోడానికి నేనేం చేతకాని దద్దమ్మనికాదు" పౌరుషంగా అంది సునీత.
"నేనే అక్కడ కూర్చోమన్నాను. నీవెప్పుడో ఆఫీసు మానేశావు... ఇంకా నీ సీటు ఏమిటి? ఇలా ఆఫీసుకొచ్చి అల్లరిచెయ్యడం..... ఏమిటి నీ ఉద్దేశం..."
"అల్లరి చేయడానికి రాలేదు. ఆఫీసు పని చేసుకోడానికి వచ్చాను. నౌ, లీవ్ మి ఎలోన్. నాకు పనుంది" సూటిగా చూస్తూ కుర్చీలో కూర్చుంది సునీత.
"ఆఫీసు పని చేసుకోవాలంటే ఇంకో రూములో కూర్చోవచ్చు. దానికి రంజనిని అవమానించక్కరలేదు" నిర్లక్ష్యానికి మండిపడ్తూ అన్నాడు.
"ఆవిణ్ణే ఇంకో రూములో కూర్చోమనండి... లేదంటే మీ రూములో కూర్చోపెట్టుకోండి. ఇద్దరూ కల్సి ఆడుతూపాడుతూ పనిచేసుకోవచ్చు" వ్యంగ్యంగా అంది.