Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 9

   'ఆ నవ్వు చూసిన జ్యోతికి మండిపోయింది.
    ఈ మొహానికి సరసం ఒకటా?' అనుకుని చిరాగ్గా నుదురు చిట్లించింది.
    భోజనాలపుడు ఎవరెంత చెప్పినా జ్యోతి ససేమిరా ఎంగిలి తినలేదు.
    అతను మాత్రం చనువుగా జ్యోతి విస్తట్లో మిఠాయివుండ తీసుకుని తినేశాడు.
    గంధం వూయమంటే విసురుగా వూసేది. గుమ్మందగ్గర పేర్లు చెప్పిస్తూంటే పావుగంట మూతిబిగించి ఆఖరికి తల్లి గట్టిగా హెచ్చరిస్తున్నట్లు పిలిచేసరికి విసురుగా పేరు చెప్పింది.
    "అమ్మబాబోయ్! మీ ఆవిడకి చాలా మొండితనంరోయ్- ఎలా వేగుతావో?" అంది ఆడపడుచు హాస్యంగా అంటున్నట్లు. చూస్తున్న అందరికి అదే అన్పించింది.
    కొత్తపెళ్ళికూతురికి సిగ్గుకాదని, ముభావన అని ఎవరూ చెప్పకపోయినా ప్రతి ఒక్కరికీ తట్టింది. జానకి చాటుగా కూతుర్ని ఓసారి హెచ్చరించింది.
    "ఏమిటే మొహం అలా పెట్టావు? విషం మింగుతున్నట్లు. పెళ్ళి వారేం అనుకుంటారు? ఏమిటసలు నీ ఉద్దేశ్యం?" తీక్షణంగా అంది.
    "నా ఉద్దేశం నీకు తెలియనట్లు క్రొత్తగా అడుగుతావేం?" అంది చురచుర చూసి.
    జానక్కి కూతురి ప్రవర్తనకి వళ్ళు మండింది.
    "ఒసేవ్! వళ్ళు దగ్గరపెట్టుకుని ప్రవర్తించు. తెలివితక్కువగా ప్రవర్తించావంటే బతుకంతా బాధపడతావు జాగ్రత్త" అంది తీవ్రంగా.
    పెళ్ళిలో జ్యోతి ప్రవర్తన సుబ్బారావు ఉత్సాహాన్ని సగం చంపేసింది. ఎప్పుడు చూపు కలిపినా నుదురు చిట్లించేది. కొత్త పెళ్ళాంతో ఏదన్నా మాట కలపబోతే మూతి బిగించేది. నవ్వకుండా మొహం గంటుపెట్టుకుని అతి సీరియస్ గా వున్న జ్యోతిని చూసి అతను మనసులో చిన్నబోయాడు.
    జ్యోతి మనస్తత్వం ఏమిటో అతను గ్రహించలేకపోయాడు.
                  *            *           *           *
    మొదటి రాత్రి సుబ్బారావు అడిగిన మొదటి ప్రశ్న అదే. తలుపు నానుకుని నిల్చున్న జ్యోతిని ఒక్కక్షణం చూశాడు.
    తెల్లచీర, జడనిండా విరిసిన జాజులు, గదినిండా ఆవరించిన సెంటు, అగరవత్తుల పరిమళాలు అన్నీకలిసి అతను పడిన ఆందోళనను కాస్త తగ్గించాయి.
    మొహం ముడుచుకుని నిల్చున్న జ్యోతిని చూసి తనదంతా అనవసర అవమానమేమో! నిజంగా సిగ్గేమో! కొందరు ఆట్టే మాట్లాడరు. ఆమె తీరే అంతేమో! అనుకుంటూ నమ్మించుకున్నాడు.
    నెమ్మదిగా జ్యోతి దగ్గరకి వెళ్ళి "జ్యోతీ!" అన్నాడు మృదువుగా భుజాలమీద చెయ్యివేసి.
    జ్యోతి అతనినుంచి దూరంగా జరిగి ముడుచుకుపోయింది.
    సుబ్బారావు నవ్వి "అంతా సిగ్గేనా జ్యోతీ?" అన్నాడు లాలనగా భుజంచుట్టూ చెయ్యివేసి.
    జ్యోతి మరోసారి వదిలించుకుని చేయి తోసేసింది.
    సుబ్బారావు కాస్త హర్ట్ అయినా ఆభావం కనబడనీయకుండా నవ్వేస్తూ "నీ సిగ్గు నేను వదిలిస్తాను రా! ఎంతసేపు అలా నిలబడతావు? రా, కూర్చో" అన్నాడు చేయిపట్టి లాగుతూ కూర్చోబెట్టబోయాడు.
    "నన్ను వదలండి" జ్యోతి విసురుగా చేయి లాక్కుంది.
    "ఈ రోజు నీవు వదలమన్నంత మాత్రాన ఎవరైనా వదులుతారా?" అన్నాడు.
    స్పోర్టివ్ గా నవ్వి హాస్యంగా అన్నాడు.
    "వదలడానికా ఈ గదిలోకి వచ్చాను?" అన్నాడు కొంటెగా.
    అతని కొంటెచూపులు, చిలిపిమాటలూ ఆమె కలల్లోని హీరోలాంటి వాడు అంటే అందంగా వుండును.
    కాని సుబ్బారావు నోట అవి వింటూంటే జ్యోతి మనసు జుగుప్సతో నిండిపోయింది.
    "చాలా పెద్ద అందగాడిని అనుకుంటూ, మహా కొంటెగా కవ్విస్తున్నానానుకొంటున్నాడు గాబోలు" తిరస్కారంగా అనుకుంది.
    ఆమె తిరస్కారం ఆ కళ్ళలోనే కన్పించింది. భార్య ముఖం చూస్తూ-
    "జ్యోతీ! ఒక ప్రశ్న అడుగుతాను- సమాధానం చెపుతావా?" అన్నాడు సుబ్బారావు కాస్త సీరియస్ గా.
    అంతవరకు సరదాగా మాట్లాడుతూ హఠాత్తుగా సీరియస్ అయిన అతన్ని చూసి మనసులో కాస్త జంకింది జ్యోతి.
    గదిలోకి పంపే ముందు జానకి చాటుగా మరీ మరీ హెచ్చరించింది కూతుర్ని.
    "జ్యోతీ! నీ జీవితం నరకం చేసుకుంటావో, స్వర్గం చేసుకుంటావో నీ చేతిలో వుంది. ఈ రాత్రి నీ జీవితాన్ని కొత్తమలుపు తిప్పుతుంది. పెళ్ళిలో నీ వరస బాగాలేదు. వ్యక్తత వచ్చినదానవు, ఇంతకంటే చెప్పను. అతన్ని నువ్వు ద్వేషిస్తే నష్టపడేది అతను కాదు, నువ్వు" అని నొక్కి చెప్పింది.
    ఆ మాటలు విన్నా ఆమెకి తెలియకుండానే సుబ్బారావుని హేళనగానే చూసింది. అతని స్పర్శ తగలగానే ముడుచుకుపోయింది.
    కాని అతను సీరియస్ గా అయ్యేసరికి తల్లి మాటలు గుర్తువచ్చి కాస్త జంకింది.
    "జ్యోతీ! నీకీ పెళ్ళి ఇష్టంలేదా?" అన్నాడు సుబ్బారావు జ్యోతి కళ్ళలోకి సూటిగా చూస్తూ.
    జ్యోతి గతుక్కుమంది. తన మనసులో మాట అతనికి తెలియడంతో, ఏం చెప్పాలో అర్థంకాక తడబడి చూపు మరల్చుకుంది.
    "చెప్పు జ్యోతీ! నీకు ఈ పెళ్ళి ఇష్టంలేదా? ఎవరన్నా బలవంతం చేశారా?" మరోసారి అడిగాడు.
    జ్యోతి తలవంచుకుంది.
    సుబ్బారావు మనసు బాధగా మూలిగింది. ఈ రాత్రి ఎంతో ఆనందంగాగడపవలసిన రాత్రి.                      

 Previous Page Next Page