జ్యోతి ప్రవర్తనలో అతని ఉత్సాహం సగం నీరుకారిపోయింది. సిగ్గుకి, అయిష్టతకి తేడా ఆమాత్రం ఎవరన్నా గుర్తించగలరు, మొదట సిగ్గు అని ఎంత సరిపెట్టుకున్నా. ఆ మాట అతనికే నమ్మబుద్ధి వేయనంత అయిష్టత జ్యోతి చూపులలో, చేష్టలలో కనిపిస్తుంటే అతను హర్ట్ అయ్యాడు.
వ్యక్తత వచ్చినది, చదువుకున్నది, ఆమె ఈ ప్రవర్తనకి అర్థం ఏమిటో అతనికి బోధపడలేదు.
జ్యోతి ఎంతకీ జవాబు చెప్పకపోవడంతో అతనికి కాస్త కోపం వచ్చింది.
"జ్యోతీ! జవాబు చెప్పు. ఈ ప్రశ్నకి నాకు జవాబు కావాలి. ఈ ప్రశ్న అడగవలసింది ఈ రోజు కాదు- కాని పెళ్ళికి ముందు అడిగే వీలు, అవకాశం మన దేశంలోలేదు.
రెండు రోజులుగా నిన్ను చూస్తుంటే నీకీ పెళ్ళి బలవంతంగా చేశారేమోనన్న అనుమానం వస్తుంది నాకు. అదే నిజమైతే...." అతను ఆగిపోయాడు.
అది నిజమైతే ఏం చేస్తాడు? ఏం చేయగలడు?
జ్యోతి ఆందోళనగా చూసింది. ఏంచేస్తాడు? ఏంచేస్తానంటాడు? కలవరపాటుగా చూసింది.
"నువ్వు చదువుకున్నదానివి నీకిష్టంలేకుండా మూర్ఖంగా ప్రవర్తించే హీనుడిని కాదు. పళ్ళిలో నిన్ను చూసిన ఎవరికన్నా ఇదే అన్పించింది. చెప్పు- నీకిష్టం లేదంటే తక్షణం ఈ గదిలోంచి వెళ్ళిపోతాను" ఆమె కళ్ళలో బెదురు గుర్తించి కాస్త తీవ్రంగా అన్నాడు.
జ్యోతి భయపడిపోయింది.
'అమ్మో....! ఈ గదిలోంచి అతను వెళ్ళిపోతే అమ్మా, నాన్నా అంతా తిడ్తారు. అంతా ఏమనుకుంటారు? అందరికీ ఈ విషయంతెలిస్తే.... ఎలా?'
సుబ్బారావు జ్యోతి గడ్డంక్రింద చేయివేసి, మొహం పైకెత్తి-
"భయంలేదు- చెప్పు. నేనేం అనను" అన్నాడు మృదువుగా.
జ్యోతికి చప్పున ఎందుకో కళ్ళనీరు తిరిగింది. తల ఆడించింది. అవునో, కాదో ఆమెకే అర్థంకాలేదు.
"అలా కాదు నోటితో చెప్పాలి" సుబ్బారావు సౌమ్యంగా అన్నాడు.
"ఎందుకలా వున్నావో చెప్పు?" లాలనగా అడిగాడు.
"నాకు.... నేను.... నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి ఇష్టంలేదు. బి.ఏ. అవలేదు అయ్యాక సరదాగా కొన్నాళ్ళు ఉద్యోగం చేయాలనుకున్నాను నా మాట వినకుండా మా వాళ్ళు పెళ్ళి చేసేశారు. అందుకే వాళ్ళమీద కోపంగా వుంది నాకు" అస్పష్టంగా గొణుగుతూ అంది.
ఆ కారణం వినగానే సుబ్బారావు మనసు ఏదో బండరాయి తీసినట్టు తేలిక పడింది.... చటుక్కున జ్యోతి భుజాలు పట్టుకుని దగ్గరకి లాక్కుని, కౌగిలించుకొని-
"ఇంతేనా! ఇంకా ఏమిటో అనుకున్నాను- అయితే మధ్య నేనేం పాపం చేశానని నామీద కోపం? సిల్లీ గర్ల్! చదువేగా దానికేం భాగ్యం? ప్రైవేటుగా బి.ఏ. కట్టచ్చులే.
ఏదీ నవ్వు- అమ్మయ్యా! నిన్ను చూసి ఎంత భయపడిపోయానో తెలుసా? ఏదీ ఇటు చూడు...." అంటూ జ్యోతి కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసి చటుక్కున పెదవుల మీద ముద్దు పెట్టుకుని-
"ఇంక అమ్మాయిగారి కోపతాపాలు పనిచేయవు. మరి నవ్వాలి" అంటూ గుండెలకి హత్తుకున్నాడు.
జ్యోతికింకేం చేయాలో, ఎలా తప్పించుకోవాలో అర్థంకాలేదు. ఏమంటే అతనికి కోపం వస్తుందో అని ఎదురు తిరుగుతున్న మనసుని అదిమిపెట్టి అలాగే కదలక, మెదలక అతని కౌగిలిలో వుండిపోయింది.
అదేం గుర్తించలేదు సుబ్బారావు.
* * * *
"వెల్ కమ్ మైడియర్....! నా హృదయసామ్రాజ్యం ఎప్పుడో అంకితం చేసాను. ఇప్పుడీ గృహసామ్రాహ్యం నీ చేతిలో పెడుతున్నాను. ఇవిగో తాళాలు. ఈ రోజునించి ఈ ఇంటికి రాణివి" అంటూ సుబ్బారావు కొత్త భార్యని గృహప్రవేశం చేయించి, ఆ తాళాలు చేతిలో పెట్టేసాడు నవ్వుతూ.
హైదరాబాద్ లో చిక్కడపల్లిలో ఓ ఇంట్లో ఒక పోర్షన్ అది. రెండు గదులు. అంతకన్న చిన్న వంటిల్లు. రెండున్నర గదుల వాటా అది....
పెరట్లో పంపు, బాత్ రూము, లావట్రీ వేరే వున్నాయి. మరొక్క అలాంటి పోర్షన్ మరోటి. క్రింద రెండు పోర్షన్ లు కలిపి మేడమీద పెద్ద వాటా మరోటి.
జ్యోతి ఇల్లంతా తిరిగి ఒకసారి చూసింది. ముందు గదిలో ఓ టేబిల్, ఓ మడతకుర్చీ, మరో కొయ్యకుర్చీ.
రెండో గదిలో ఓ మంచం, బట్టలస్టాండు, సుబ్బారావు పెట్టె. వంట గదిలో ప్లాస్టిక్ బాల్చి, చిన్న కిరోసిన్ స్టవ్, కాఫీకెటిల్, అలమరలో కాఫీ, పంచదారడబ్బాలు, ఓ స్టీలు క్యారియర్. ఇంటి మొత్తంమీద వున్న సామాను అది,
"ఇంతే నా ఇల్లు" అంది జ్యోతి అసంతృప్తిగా.
"మరింకెంత కావాలోయ్! అమ్మాయి ఇది హైదరాబాదని, దీనికే నూట ఏభై అద్దెని మరిచిపోకు...." సుబ్బారావు సామాను చేరస్తూ అన్నాడు.
"మహాగొప్ప సామ్రాజ్యమే!" జ్యోతి తన అసంతృప్తి దాచుకోలేక నవ్వుతూ అన్నట్టే అంది.
ఆమె కన్న కలలకీ, యధార్థాలకీ ఒక్క విషయంలోనూ పొత్తుకుదరలేదు. సుబ్బారావు ఆమె కోరుకున్న హీరోలా లేకపోయినా, కనీసం ఇల్లయినా ఆమె కోరుకున్న తీరునలేదు.
"ఇంతేనా సామాను. ఇంకేం కొనలేదూ?" మరోసారి అసంతృప్తిగా అడిగింది.
సుబ్బారావు సామాన్లు లోపలపెట్టి కుర్చీలో కూలబడ్డాడు. జ్యోతి మోహంలో భావం గమనించి కొద్దిగా సిగ్గుపడ్డాడు.... అయినా తేరుకుని నవ్వుతూ