Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 8

    లేకపోతే పెళ్ళే చేయరట. బి.ఏ. కాగానే ఇంట్లోంచి పోవాలట అలా అంటే భయపడి లొంగి వస్తానని గాబోలు" ఉక్రోషంగా, కసిగా అనుకుని విసురుగా లేచి తల్లివంక చురచుర చూసి లోపల గదిలోకి వెళ్ళింది.
    లోపల గదిలో అన్న, తమ్ముడు, చెల్లెలు గుసగుసలాడుకుంటున్నారు. జ్యోతి రాగానే ఆరాటంగా ఆమెవంక చూసారు.
    "ఏమయిందే?" అడిగాడు అన్న.
    "వినలేదేమిటి.... తెలియనట్లడుగుతున్నారు? గయ్ మంది జ్యోతి.
    "విన్నాంకాని నువ్వేం అంటావు అని అడుగుతున్నాను. అయినా అతనికేమైందని నచ్చలేదే? నామట్టుకు నాకు బాగానే వున్నాడు...." కృష్ణ అన్నాడు.
    "ఆ.... వున్నాడులే కోతిలా.... పొట్టిగా నల్లగా...." కసిగా అంది జ్యోతి.
    "ఓ అబ్బో - నువ్వు మహా బాగున్నావనుకుంటున్నావేమిటి.... అతన్ని ఎంచుతున్నావు? నలుపేంగాదు, చామనచాయగా వున్నాడు.... నీకంటే ఓ చాయ తక్కువ, అంతే!
    పొట్టి అంటే, అసలు మన తెలుగువాళ్ళల్లో ఎంతమంది పొడుగు వాళ్ళున్నారు? 5,6 వుంటాడు. మనందరం అంతకంటే పొడుగా, అంత కంటె అందంగా వున్నామా?"
    కృష్ణ కూడా అలా అనేసరికి జ్యోతికి ఉక్రోషం వచ్చి మొహం ఎర్రపరుచుకుంది.
    "నీ సులోచనారాణి హీరోలాంటివాడెవరో ఓ ఫైన్ మార్నింగ్ అమాంతంగా వచ్చేస్తాడనుకుంటున్నావు కాబోలు, అదంతా ఊహలు. దిసీజ్ లైఫ్ మై డియర్ సిస్టర్" హేళనగా అన్నాడు. పద్మా, గోపి పక పక నవ్వారు.
    జ్యోతి కోపంగా "మీరెవరూ నన్నేం దెప్పక్కరలేదు. నోరుమూసుకోండి" కసిరింది.
    "పోవే! పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని శుభ్రంగా వప్పుకో. బ్యాంక్ ఉద్యోగాలు బాగుంటాయి. మంచి జీతాలిస్తున్నారు. పెద్దటెక్కు చేస్తున్నావు అతను నచ్చిందంటే - అతను ఎంతో సరదాగా మాట్లాడాడు. మంచివాడిలా కనిపించాడు."
    "నీ సలహాలేం అక్కరలేదు. నేనసలు పెళ్ళే చేసుకోను. ఉద్యోగం చేస్తాను -"
    "అయితే నీఖర్మ. ఇలా వచ్చిన మంచిఛాన్సులు పోగొట్టుకుంటే ఆఖరికి విచారించేది నీవే. పెద్ద ఉద్యోగంచేస్తాను, ఓ రెండు వేలిచ్చేస్తారనుకుంటున్నావా? ఆ జీతం షొకులకీ, చీరలకి, సినిమాలకీ చాలదు అని తెలుసుకో" అన్నాడు ఆరిందలా కృష్ణ .
    జ్యోతి ఏం అనలేదుగాని, మనసులో అలజడి ఆరంభమయింది. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. తండ్రి మాటలు భయపెట్టాయి. కృష్ణ మాటలతో ఏమూలో వివేకం మేల్కొంది.
    కాస్త తనీ పెళ్ళి వద్దంటే తండ్రి నిజంగా ఇంక పెళ్ళిమాట ఎత్తడేమో? ఉద్యోగం దొరకుతుందా తనకి? దొరికినా ఆ రెండు మూడు వందలతో తనకేం సరిపోతుంది? తను ఆశించిందంతా కలలేనా? అదంతా జరగదా?
    తను తండ్రి తెచ్చిన సంబంధంతో సరిపెట్టుకోవలసిందేనా? ఇక్కడ ఎలాగో కాదు, కనీసం పెళ్ళయ్యాక అయినా హాయిగా ఫ్రీగా లైఫ్ ఎంజాయ్ చెయ్యాలనుకున్న తన ఆశ అడియాసేనా?
    తను ఆశించిన బ్రతుకు లభించనపుడు, ఇలా ఇక్కడ వీళ్ళచేత మాటలుపడుతూ బతకడమో, ఏ ఉద్యోగమో చేసుకుంటూ వంటరిగా బతికేకంటే ఈ పెళ్ళే నయమేమో?
    జ్యోతి మనసు ఎటూ చెప్పలేకపోయింది! సందిగ్ధతతో కొట్టుకుపోయింది ఆ రాత్రంతా. ఆఖరికి ఇంతకంటే గత్యంతరం లేదనుకోగానే జ్యోతికి ఏదో నిరుత్సాహం, నిర్లిప్తత ప్రవేశించాయి....
    ఉదయం జ్యోతి ఏదన్నా చెపుతుందని ఎదురుచూసింది జానకి.
    జ్యోతి ఏమీ చెప్పకపోవడంతో సాయంత్రం "ఏమే మీ నాన్న అడుగుతున్నారు. వాళ్ళకి ఏం రాయమన్నావు?" అంది.
    జ్యోతి ఉదాసీనంగా "అంతా మీరు నిర్ణయించాక నన్ను అడిగేది ఏముంది? మీ ఇష్టం" అంది ఎటూ తేలకుండా.
    "ఒసేవ్! చెప్పేది సరిగా చెప్పు. నీ నాన్చుడు వద్దు. తరువాత నాకు ఇష్టంలేని పెళ్ళిచేశారని గొడవ చేస్తావు" కరుకుగా అంది జానకి.
    "మీ ఇష్టం అన్నాగా - ఇంకా నన్ను చంపకు" విసుగ్గా అంది,
    "అయితే వాళ్ళకి రాయమంటాను" అంటూ జానకి జ్యోతి మొహంలోకి చూసింది. జ్యోతి తలవూపి అక్కడనించి వెళ్ళిపోయింది.
                      *          *          *          *
    పెళ్ళిలో జ్యోతి ముభావత సిగ్గుగా సరిపెట్టుకున్నాడు సుబ్బారావు. శుభమా అని పెళ్ళి జరుగుతూంటే ఎంతో ఆనందంగా వుండాల్సింది మొహం గంటుపెట్టుకుని మూతిబిగించి కూర్చునేది జ్యోతి. స్నేహితురాళ్ళ హాస్యానికి నవ్వకపోతే బాగుండదన్నట్టు బలవంతాన ఓ నవ్వు నవ్వేది. సుబ్బారావుతో చూపు కలిసినపుడల్లా విసురుగా మొహం తిప్పుకునేది.
    ఎవ్వరేం అడిగినా పెడసరంగా సమాధానం చెప్పేది. పెళ్ళయ్యాక ఓసారి సుబ్బారావు జ్యోతితో యధాలాపంగా ఏదో అడిగాడు చుట్టూ ఎవరూ లేకుండా చూసి.
    ఆ మాట విననట్లు మొహం తిప్పుకుంది జ్యోతి. పెళ్ళిచూపులప్పుడు అంత బాగా చూడలేదుకాని పెళ్ళిలో దగ్గిరగా చూసిన జ్యోతికి సుబ్బారావు పట్ల విముఖత మరింత పెరిగింది.
    మొహానికి పసుపు రాసారేమో ఆ నలుపుమీద పసుపు అసహ్యంగా వుంది. బుగ్గన చుక్క, కంటికి కాటుక, మేడలో గొలుసు. ఛీ! అనుకుంది జ్యోతి మనసులో.
    అతను తన చిటికెనవేలు పట్టుకుని తిరుగుతుంటే కంపరమెత్తినట్లు వదిలించుకోవాలని చిన్నగా లాక్కుంది చెయ్యి.
    అతను అది గమనించనట్టే జ్యోతివంక చిలిపిగా చూసి వేలువదిలి చేయి గట్టిగా బిగించాడు.                      

 Previous Page Next Page