ఆ నవ్వులో జీవం లేదని గంగాధరరావుకి తెలుసు.
"ముందు నిమ్మరసం తాగు బాబూ!" గంగాధరరావు మరలా వత్తిడి చేశాడు.
మాధుర్ నిమ్మరసాన్ని బలవంతాన తాగుతున్నాడు ఒక్కో గుక్కె.
"ఇంతకీ ఏం చదువుకున్నావు బాబూ?"
నిమ్మరసం పూర్తిగా తాగేసి గ్లాసు కిందపెడుతూ "ఏం లాభం? పెద్ద చదువు చదివానంటే ఈ దేశం గుర్తిస్తుందా? ఉద్యోగం చూపిస్తుందా? అన్నం పెడుతుందా? బట్టలిస్తుందా? అయినా పెద్దవాళ్ళు- అడిగారు గనుక చెబుతున్నాను. ఎమ్.బి.ఎ. చేశాను. అయినా నో యూజ్.....ప్చ్..." నిస్పృహగా పెదవి విరుస్తూ అన్నాడు.
అంతలో కెవ్వున కేక ఒకటి వినిపించింది. గంగాధరరావు ఉలిక్కిపడి ఇంట్లోకి పరిగెత్తితే మాధుర్ ఆశ్చర్యపోతూ లేచి నిలుచున్నాడు.
కొద్దిక్షణాల వరకు ఇల్లంతా నిశ్శబ్దం. మాధుర్ కి లోపల ఏం జరిగిందో అర్ధం కాలేదు. ఆసక్తిని అణుచుకోలేక చిన్నగా అడుగులో అడుగువేసుకుంటూ ఇంటి వెనక్కు వెళ్ళాడు.
అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి మాధుర్ మనస్సు కలుక్కుమంది.
ఇంటి వెనుక పెరట్లో, మసక వెలుతుర్లో తడిసిపోయిన బట్టలతో ఓ యువతి మోకాళ్ళ మధ్య తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తుంటే, ఆమెను పొదివి పట్టుకొని ఓ మధ్య వయస్కురాలు కళ్ళు వత్తుకుంటోం. ఆ ప్రక్కనే గంగాధరరావు నేలలోకి తలదించుకు కూర్చున్నాడు. వారికి పక్కగా నూతి గోడ కనిపిస్తోంది. గోడకు కొద్దిదూరంలో ఓ యువకుడు తడిసిన బట్టలతో నించుని ఎటో చూస్తున్నాడు.
జరిగిన సంఘటనను క్షణాల్లో వూహించగలిగాడు మాధుర్.
కొద్దిసేపు తటపటాయించిన మాధుర్ చిన్నగా వారివద్దకు వెళ్ళాడు.
"గంగాధరరావుగారూ...."
ఆయన చప్పున తలెత్తాడు. అతని కళ్ళు ఎర్రగా ఉబ్బి, తడిదేరి వున్నాయి.
"మరోలా భావించకుంటే, ఏం జరిగిందో చెప్పరా?" మాధుర్ గొంతుతో అనునయం.
"నా కన్నబిడ్డ నాకు బరువు లేకుండా చేయాలని తాను కడతేరి పోవాలనుకుంది బాబూ...." అతని కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.
ఆ నిశీధిచ్చాయలో నలుగురూ బాధలకు, భయాలకు, శోకానికి ప్రతినిధుల్లా వున్నారు. వారి బాధను ఎంతో కొంతయినా పంచుకోవాలనుంది మాధుర్ కి కాని ఎలా!
తాను తప్ప తాగి శివాలయం దగ్గర పడిపోతే, ఎంతో దయతో ఇంటికి తీసుకొచ్చి దుమ్ము, ధూళితో కొట్టుకుపోయిన తన శరీరాన్ని తుడిచి తన వంటిమీద బట్టలు మార్చి, వేరే పొడిబట్టలు తొడిగి, తను స్పృహలోకి వచ్చేవరకు కాచుకు కూర్చుని, తనకు నిమ్మరసం ఏం సంబంధం వుందని ఇచ్చారు? తనెవరని ఆదుకున్నారు?
అదే సంబంధాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ బాధను కొంతయినా పంచుకోవాలి. ఆ నిర్ణయానికి రాగానే మరో రెండడుగులు ముందుకేసి-"అసలేం జరిగిందో చెప్పకూడదా?" నిష్టూరంగా అడిగాడు మాధుర్.
అప్పటికా మధ్య వయస్కురాలు తలెత్తింది.
"ఏముంది బాబూ... ఉన్న డబ్బంతా ఊడ్చి ఏదో వ్యాపారం పెట్టాం! అందులో దెబ్బతిన్నాం. ఆస్తులన్నీ తాకట్టులోకి వెళ్ళాయి. ఇప్పుడు నడిరోడ్డు మీదున్నాం. అన్నీ వున్నప్పుడు కుదుర్చుకున్న సంబంధం ఇప్పుడు చిట్లిపోయింది. ఆ అవకాశాన్ని భరించలేక, మాకు గుండెల మీద కుంపటిలా మిగలలేక మా చిట్టితల్లి కడదారి చూసుకుంది..." ఆమె ఏడుస్తూనే చెప్పింది.
మాధుర్ ఎం మాట్లాడలేకపోయాడు.
అతని గుండె చిక్కబట్టినట్లయింది. అందరూ నిశ్శబ్దంగా ఇంట్లోకి వెళ్ళిపోయారు.
అర్దరాత్రి ఏదో శబ్దమయింది.
మాధుర్ కి మెలకువ వచ్చి లేచి కూర్చున్నాడు. వళ్ళంతా నెప్పులుగా వుంది. నోరంతా వెగటుగా వుంది. రాత్రి తను వెళతానన్నా ఇంకా నీరసంగా వున్నావు, ప్రొద్దుటే వెళుదూగాని అని ఆపేశారు.
తాము పీకలవరకు కష్టాల్లో మునిగి కూడా మరొకర్ని ఓదార్చి, సేదతీర్చే ఈ కుటుంబ సభ్యులు నిజంగా మానవత్వం వున్న మనుష్యులు, తాగి ఇళ్ళు, వళ్ళు ఎందుకు గుల్లచేసుకుంటావు బాబు అని ఒక్కమాట అనవచ్చు. కానీ ఇప్పటివరకూ అనలేదు. చిన్నసాయం చేసి పెద్ద సలహా నిచ్చే మనుష్యుల మధ్యే వీళ్ళూ వున్నారు.
కష్టాల్ని పెనవేసుకొని, నష్టాన్ని దిగమింగుకుని, కాలాన్ని నెట్టుకొస్తున్నారు.
వీళ్ళ కష్టానికి డబ్బే కారణం....
తనను తన వదిన చులకనగా చూడటానికి డబ్బే కారణం....
వ్యక్తిత్వమున్న తన అన్న నోరులేని వాడిగా మారటానికి ఆ డబ్బే కారణం.
తన తల్లిదండ్రులు ఆత్మాభిమానాన్ని చంపుకొని వదిన నీడ బ్రతుకుతున్నది ఆ డబ్బు లేకనే....
ఆ డబ్బు సంపాదించటం నిజంగా అంత కష్టమా?
తన తండ్రి అప్పుడప్పుడు అంటుంటాడు..... కడుపులు కాలుతూనే వుంటాయి. గుండెలు పగులుతూనే వుంటాయి. వరదలు, భూకంపాలు, పేదరికాలు, చిత్రమైన జాడ్యాలు, క్షామాలు క్షోభిల్లుతూనే వుంటాయి... కాని మేల్కోరు మనుష్యులు మానవుని మేధస్సుని మించిన శక్తీ లేదు అని గుర్తించరు.
దట్టమైన చీకటి...
నిశీధిలో పెనవేసుకున్న నిశ్శబ్దం ఏ మూలో భగ్నమవుతోంది.
చెవులు రిక్కించి విన్నాడు...?
అవును... ఆ డబ్బే తిరిగి ఆ కుటుంబ సభ్యుల్ని క్షోభిళ్ళజేస్తోంది. ఏడిపిస్తోంది. వెక్కిళ్ళు తెప్పిస్తోంది.
ఎందుకో ఇంకా పైన ఒక్కక్షణం వుండలేకపోయాడు.
ఆ చీకట్లోనే దిగ్గున లేచాడు. నిశ్శబ్దంగా తలుపులు తెరిచి నిశీధిలోకి నడిచాడు. కాని ఆ క్షణం నుంచే అతని మనస్సు ఎన్నో మనోవ్యధలకు హేతువైన డబ్బు గురించి ఆలోచించటం ఆరంభించింది.
అతని ఎదుగుదలకు అదే ఆరంభం అని అతనికీ.....అతను తెలిసిన ఆప్తులకు..... అతను తెలీని అన్యులకీ..... ఎవరికీ తెలీదు.
* * * * *
మాధుర్ జ్వరం తగ్గినా నీరసం తగ్గలేదు.
క్రితం రాత్రి గంగాధరరావు ఇంటినుంచి సరాసరి తనింటికి రాగా బయట గేటుకే లోపలివేపు తాళం వేసుండటం కనిపించింది.
ఆ చలిలో అలాగే ఇంటికెదురుగా వున్న సిటీ బస్ స్టాప్ షెల్టర్ లో వున్న సిమెంట్ బెంచీపై పడుకున్నాడు.
ఉదయం లేస్తూనే సిమెంట్ బెంచ్ కి ప్రక్కగా నిలుచున్నా అన్నను చూసి ఉలిక్కిపడ్డాడు.
"ఎందుకు నాన్నా, ఇలా దిక్కు మొక్కు లేనివాడిలా అయిపోయావ్....? నీ తెలివితేటలన్నీ ఏమయిపోయాయి?" అతని కంఠంలో తొంగిచూసిన బాధను మాధుర్ గుర్తించాడు.
"నువ్వెందుకన్నయ్యా ఇంత అసమర్దుడిగా మారిపోయావు...? డబ్బున్న భార్య, అధికారం వున్న భార్య వచ్చిందనా?"
చెళ్ళున కొరడాతో కొట్టినట్లనిపించిందతనికి.
తమ్ముడన్నది నిజం కనుకే అతను మౌనంగా వుండిపోయాడు.
ఇద్దరి మధ్యా కొద్ది క్షణాలు నిశ్శబ్దం పేరుకుంది.
ఇప్పుడు అన్నదమ్ములిద్దరి అస్థిత్వం ప్రశ్నయి కూర్చుంది.
కొద్దిసేపటికి నటరాజ్ తేరుకుని తమ్ముడి చేతిని పట్టుకుని ఇంట్లోకి నడిపించుకెళ్ళాడు.
కన్నకొడుకు కళ్ళముందు నాశనమయిపోతుంటే కుళ్ళిపోవడం తప్ప మరేమీ చేయలేకపోతున్న ఆ ముసలిదంపతులు ఒకరు బాత్ రూమ్ లో నీళ్ళు పెడితే, మరొకరు టిఫిన్ రెడీ చేయటంలో నిమగ్నమయి పోయారు.
ఆ ఇంటికి సింహస్వప్నమయిన అధికారిణి ఇంకా నిద్రలేవలేదు.
ఆమె నిద్ర లేచేలోపే కొడుక్కి టిఫిన్ పెట్టేయాలని ఆ ముసలి తల్లి ఆరాటం.
మాధుర్ స్నానం స్నానంచేసి, బట్టలేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
తల్లి హడావుడిగా టిఫిన్ తయారుచేసి ప్లేట్ లో సర్దుకుని కొడుకు దగ్గరకు వచ్చింది. తన తల్లి తన తమ్ముడిపట్ల పడే ఆరాటాన్ని, తన తండ్రి పడే ఆవేదనను మౌనంగా చూస్తుండిపోయాడు నటరాజ్.
తల్లి వృద్దాప్యంతో వణుకుతున్న చేతుల్ని నియంత్రించుకుంటూ ప్లేట్ లోని ఉప్మాని ముద్దలా చేసి ఆప్యాయంగా కొడుక్కేసి చూస్తూ చేతిని నోటి దగ్గరకు తెచ్చింది.
రెండురోజులుగా తిండిలేక, ఆరోగ్యం సరిలేక, నరాల నిండా ప్రవహిస్తున్న ఆల్కహాలిక్ హేంగోవర్ తో నీరసంగా వున్న మాధుర్ ఆశగా నోరు తెరిచి తల్లి చేతిని తన నోటి దగ్గరకు తీసుకుంటుండగా ఒక్కసారిగా అక్కడ పేరుకున్న నిశ్శబ్దం బ్రద్దలయింది.