Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 8

 

    ఒక నటుడు తన నటనని అమ్ముకుంటాడు.
   
    రచయిత తన రచనల్ని అమ్ముకుంటాడు.
   
    రాజకీయవేత్త తన కుయుక్తుల్ని అమ్ముకుంటాడు.       
   
    డాక్టర్ తన వైద్యశాస్త్ర పరిజ్ఞానాన్ని అమ్ముకుంటాడు.
   
    ఇలా ప్రతి ఒక్కరు తనలో వున్నది, తనకు సంబంధించినది ఏదో ఒకటి అమ్ముకోగలిగితేనే బ్రతగ్గలిగేది.
   
    నేను ఎన్నుకున్న బ్యాగ్రవుండ్ ఏమిటో మీకిప్పుడు అర్ధమయి వుంటుంది. సృజనాత్మకత వుంటే బ్రతకటం గురించి భయపడక్కర్లేదు- మరో నలుగుర్ని కూడా బ్రతికించవచ్చు.
   
    బ్రతికేందుకు ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రోది చేసుకోవచ్చనే విషయం గురించే నేనీ నవల రాస్తున్నది.
   
    బలహీనతలతో ఆడుకునేందుకు కాదని విజ్ఞ్గులైన పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
   
    నిరాశా, నిస్పృహలతో క్రుంగిపోతున్న యువత తను మెదళ్ళకు పదును పెట్టండి. మానవ అవసరాన్ని, అనుభూతుల్ని, బలహీనతల్ని, బరువు బాద్యతల్ని, ఆచార వ్యవహారాల్ని, సంస్క్రుతిని, సాంప్రదాయాల్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకోగలిగితే ఒక వస్తువును ఎలా అమ్మవచ్చో, లేక అమ్మిపెట్టివచ్చో ఇట్టే అర్ధమయిపోతుంది.
   
    అది అర్ధమయితే నిరాశా, నిస్ప్రుహలు వాటంతటవే దూరంగా పారిపోతాయి.
   
                                                                                                                                                                         -రచయిత
   
                                  *    *    *    *    *

   
    మౌనిక జె.జె. ఇండస్ట్రియల్ మెగాలిత్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన మొదటి నెలలోనే ఓటమి సంభవించటం ఆమెకు బాధగా వుంది.
   
    అలా అని ఆమె నిరుత్సాహపడలేదు, నీరుగారి పోలేదు. ఆ ఓటమినే విజయంగా మార్చాలనే పట్టుదల ఆమెలో ఇప్పుడు బలంగా వేళ్ళూనుకుంది.
   
    డిపార్ట్ మెంట్స్ హెడ్స్ అందరూ తక్షణం తన ఛాంబర్ కి రావాలని ఆర్డర్స్ పాస్ చేసింది.
   
    ప్రాణాలరిచేతుల్లో పెట్టుకొని జె.జె. ఎంఫైర్ ఎగ్జిక్యూటివ్స్ అంతా మౌనిక చాంబర్ కి హడావిడిగా బయలుదేరారు.
   
                                *    *    *    *    *

   
    మాథుర్ ఆ రాత్రంతా చలిలో వుండడం మూలంగా, ఆపైన ఆహారం కూడా ఏం తీసుకోక పోవడంతో బాగా నీరసించి పోవడమే కాకుండా జ్వరం కూడా వచ్చింది.
   
    వదిన ఆఫీసుకి వెళ్ళేవరకు తనకు ఇంట్లోకి ప్రవేశం వుండదని భావించి అతను అటునుంచి అటే బయటికెళ్ళిపోయాడు.
   
    అలా అతను గమ్యం లేకుండా కాలుతున్న కడుపుతో, మండుతున్న శరీరంతో రోజంతా పిచ్చిగా తిరిగి శివాలయం కోనేటి ప్రక్కన స్పృహ తప్పిపడిపోయాడు.
   
    సరిగ్గా అదే టైమ్ కి జె.జె. ఎంఫైర్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌనిక రూమ్ లో అతని గురించి చర్చ నడుస్తోంది.
   
    జె.జె. కంపెనీలో తన ఇరవయ్యో ఏట ఉద్యోగిగా చేరి నిజాయితీపరుడిగా, స్వామిభక్తిగల ఉద్యోగిగా పేరు తెచ్చుకొని రిటైర్ అయి కూడా అదే కంపెనీకి సలహాదారుడిగా పనిచేస్తున్న రమణయ్య అనే అరవై ఐదేండ్ల వృద్దుడు ఇప్పుడు మౌనికకు ఎదురుకూర్చున్నాడు.
   
    "చెప్పండి రమణయ్యగారు! ఆటోమోబైల్ ఇండస్ట్రీలో ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఇటలీ ఫియట్ కంపెనీ కొలాబరేషన్ తో వ్యాన్ తయారుచేసినా ఎందుకు ఫెయిలయింది....?" ఆమె సూటిగా అడిగింది.
   
    అతను కొంచెం యిబ్బందిగా కదిలాడాడే తప్ప సమాధానం యివ్వలేదు.
       
    "ఫర్వాలేదు చెప్పండి.... మీకొచ్చే నష్టమేమీ వుండదు."
   
    ఆమె భరోసా యిచ్చింది.
   
    "మన మార్కెటింగ్ డైరెక్టర్ సింఘానియా నిర్లక్ష్యం వల్లనే మన వ్యాన్ మార్కెట్ లోకి ఎక్కలేదమ్మా. అతనికి అహం బాగా వుంది. తన క్రిందవాళ్ళు మంచి సలహా యిచ్చినా మితిమీరిన ఈగోతో దాన్ని తిప్పి కొడతాడు...."
   
    "ఎవరు మంచి సలహా యిచ్చారు....?" ఆమె నోటి నుంచి రివ్వున వచ్చిందా ప్రశ్న.
   
    "మాథుర్... మాథుర్ అనే కుర్రాడు ఈ మధ్యనే మన మార్కెటింగ్ సెక్షన్ లో సేల్స్ మేనేజర్ గా అపాయింటయ్యాడు. వయస్సులో చిన్నవాడైనా మహా తెలివికలవాడు. అతనికున్న అద్భుతమైన తెలివితేటల్ని చాలా తక్కువ మందిలో చూశా.... నా అనుభవంలో అతనప్పుడు అంటుండేవాడు... మార్కెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దేన్ ప్రొడక్షన్.... అని..." ఆ వృద్దుడు చెప్పడం ఆపాడు.
   
    "ఇప్పుడు తను ఏమయ్యాడు?"
   
    "రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అదీ ఆ సింఘానియా బాధపడలేకే అని నా అనుమానం."
   
    "అతనేదన్నా మంచి సలహా యిచ్చాడా?" ఆమె మరింత లోతుకు వెళుతోంది.
   
    "ఇచ్చాడట. కానదేమిటో.... ఆ ఫైల్ ఎక్కడుందో ఎవరికీ తెలీడం లేదు. బహుశా అతను తనతోటే దాన్ని తీసుకెళ్ళి ఉండవచ్చు."
       
    "ఇప్పుడతనెక్కడున్నాడు?"   
   
    "తెలీదమ్మా... బహుశా తాగి రోడ్లెంట తిరుగుతుండవచ్చు."
   
    "అతను తాగుతాడా?" ఆమె రవ్వంత ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
   
    "బాగా తాగుతాడు."
   
    ఆమె కొద్దిసేపు మౌనంగా వుండి అంది...."అతనికి మనం కంపెనీలో మరలా జాబ్ ఇస్తే...."
   
    "లాభం లేదమ్మా.... అతను మహామొండి మనిషి అతను వెళ్తూ వెళ్తూ ఓ మాటని వెళ్ళాడు."
   
    "ఏమిటది?"
   
    "అవతలి వ్యక్తిలోని సామర్ధ్యాన్ని గుర్తించడానికి కొద్దిపాటి బుర్రకాయుండాలి.... అదీ...." రమణయ్య మధ్యలో సందేహంగా ఆగిపోయాడు.
   
    "ఫర్వాలేదు చెప్పండి" అంది మౌనిక అతనేదో చెప్పడానికి సందేహిస్తున్నాడని గ్రహించి.
   
    "అది జె.జె. ఎంఫైర్ లో ఎవరికీ లేదు. ఒక్క జె.జె.కి తప్ప మరెవరికీ లేదు. కనీసం జె.జె. వారసురాలికైనా వుందా? ఏమో అనుమానమే! రాజుల సొమ్ము రాళ్ళపాలు....అంటూ బయటకెళ్ళిపోయాడు. కనీసం ఆ నెలకి రావాల్సిన జీతం కూడా తీసుకోలేదు."   
   
    ఆ మాటల్ని ఆమె ఎదుటే చెప్పవలసి రావడంతో ఒకింత ఇబ్బంది పడ్డాడు రమణయ్య.
   
    ఆమెలో పట్టుదల పెరిగింది.
   
    "అతన్నెలాగైనా కలవాలి. ఎలా?"
   
    రమణయ్య బిత్తరపోయాడు ఆమె నిర్ణయానికి.
   
    "చెప్పండి. ఎలా కలవాలతన్ని?"
   
    "చాలా కష్టమమ్మా!"
   
    "కలవడమా?"
   
    "కలవడం తేలికే. మీరెవరో తెలిసిన మరుక్షణం అతను బేడ్ గా రియాక్టుకావచ్చు. అసలే మీరంటే తేలిక భావంతో వున్నాడు. అసమర్దుల్ని పోషిస్తున్నారని మీమీద తక్కువ అభిప్రాయంతో వున్నాడు." రమణయ్య కావాలనే, ఆమెలో పట్టుదల రేకెత్తించాలానే అలా వున్నది వున్నట్లు మాట్లాడుతున్నాడన్నది ఆమె వూహకందని విషయం.
   
    ఆమె అప్పటికప్పుడే ఒక నిర్ణయానికొచ్చింది.
   
                                       *    *    *    *    *
   
    మాధుర్ కళ్ళు తెరిచేసరికి పరిసరాలన్నీ అతనికి కొత్తగా కనిపించాయి.
   
    అప్పుడే చీకటి పడుతున్నట్లుగా వుంది. ఆ గదిలోని గోడకున్న వాల్ క్లాక్ సరిగ్గా ఆరుగంటలు కొట్టింది. మాధుర్ వులిక్కిపడి లేచి కూర్చున్నాడు.
   
    ఎదురుగా ఓ యాభైఏండ్ల వ్యక్తి వున్నాడు. అతని చేతిలో ఓ గ్లాసుంది. అతనికి గడ్డం పెరిగింది. ముఖంలో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది.
   
    మాధుర్ ప్రశ్నార్ధకంగా చూశాడు అతనికేసి.
   
    "నా పేరు గంగాధరరావు. మిగతా వివరాలు తరువాత చెబుతాను. చాలా బలహీనంగా వున్నావు... ఈ నిమ్మరసం తాగు బాబూ!"
   
    మాధుర్ అర్ధంకానట్లు చూశాడు.
   
    "నువ్వెవరో తెలుసుకోవచ్చా?" అంటూ అతనా గ్లాసును మాధుర్ కి అందించాడు.
   
    మాధుర్ దాన్నందుకుంటూ-
   
    "నేనెవరో నాకూ తెలియడం లేదు. నా అనుకున్న వాళ్ళకు తెలీడం లేదు. ఏమని చెప్పమంటారు? పేరు చెప్పగానే గుర్తుపట్టడానికి నేనేం గాంధీనీ, బోసునీ కాదుగా! ప్రస్తుతానికి ఒక త్రాగుబోతుని... ఒక నిరుద్యోగిని. తెలివితేటలున్నా వుపయోగించుకోలేకపోతున్న ఈ దేశ రాజకీయ వ్యవస్థకి ఓ ప్రశ్నని... అర్ధమయిందా? అవునూ.... ఈ నిమ్మరసం కన్నా నాటుసారా బాగుంటుంది. మీ దగ్గరుందా?" వేదాంతిలా నవ్వుతూ అడిగాడు.

 Previous Page Next Page