Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 10

   

    ఆమె కాళికలా బెడ్ రూమ్ ద్వారం దగ్గర నిలుచుని వుంది.
   
    "ఆత్మాభిమానంలేని పౌరుష హీనులకి ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఏం ప్రయోజనం?"
   
    భయంతో కూడుకున్న నిశ్శబ్దం ఆవహించుకుందక్కడ.
   
    "మేం ఒకప్పుడు బాగా బ్రతికినవాళ్ళమేనమ్మా... మా రాత బాగోలేక..." మాధుర్ తండ్రి ఆవేదన, అభిమానం గొంతు కడ్డుపడుతుండగా మెల్లగా అన్నాడు.
   
    అంత జరిగినా ఆ ముసలితల్లి కొడుకు ఆకలిని తలుచుకుని తల్లడిల్లిపోతూ చేతిని తిరిగి కొడుకు నోటి దగ్గరకు తీసుకెళుతుండగా-
   
    "ఎందుకింత పనికిమాలిన వాళ్ళను కనటం....?" ఒక్కసారి మనస్సు చివుక్కుమంది మాధుర్ కి. చటుక్కున లేచి నించున్నాడు.
   
    ముసలి దంపతుల కళ్ళల్లో నీళ్ళు.
   
    "మా కొడుకు మాకు బరువుకాదుగా.... ఇంతకాలం పెంచినవాళ్ళం ఇంకొన్నాళ్ళు పెంచుకోలేక పోతామా? వయస్సు మీదపడి వయోభారం నన్ను కృంగదీస్తోంది కానీ, లేదంటే, నీ పంచన చేరేవాళ్ళం కాదు. ఇంటికి పెద్దకొడుకని, ఇక్కడే కడతేరి నీ మొగుడితో తలకొరివి పెట్టించుకుందామని ఆశపడ్డాం. డబ్బు లేకపోయినా బ్రతకొచ్చమ్మా... కానీ మానవత్వం లేకపోతే..." మాధుర్ తండ్రికి మాటలు తడబడుతున్నాయి. లేని ఓపికని తెచ్చుకుంటూ... "ఆకలితో వున్న మనిషి నోటి దగ్గర అన్నం తీసేయటం అంత మహాపాపం మరొకటుండదు. నా కొడుకులు అసమర్ధులేనమ్మా.... అసమర్దులు కాకపోతే పెద్దకొడుకు పెళ్ళాం మాటకు దడిచే పిరికివాడెలా అవుతాడు? పెద్ద పెద్ద చదువులు చదివినా ఎందుకు పనికిరాకుండా నా చిన్న కొడుకెందుకు తయారవుతాడు? పదవే వెళదాం. వయస్సు ఉడిగిపోయినా పౌరుషం ఉడిగిపోలేదు. చేతనైతే వాడ్ని బ్రతికించుకుందాం. లేదంటే ముగ్గురం కట్టకట్టుకుని ఏట్లో దూకుదాం. ఆ విషాన్ని మాత్రం వాడికి పెట్టకు." సర్దుకుపోయే మనస్తత్వమున్న ఆ వృద్దుడు అదే తొలిసారి మనసువిప్పి మాట్లాడటం, తిరగబడి మనస్సులో వున్నది కక్కేయడం. ముసలితల్లి చేతిలోని టిఫిన్ ని విసిరికొట్టింది ప్లేట్ లోకి. పైట చెంగుకి చేయి తుడుచుకుంటూ "పదండి వెళ్దాం" అంది తెగింపుగా.
   
    నటరాజ్ కి గుండె చిక్కబట్టినట్లయింది.
   
    ముసలి తల్లిదండ్రులు, తమ్ముడు అవమానంతో, ఆకలితో నిరాశగా బయటకెళుతుంటే నిస్సహాయంగా చూస్తుండిపోయాడే తప్ప నోరు తెరిచి ఒక్క మాటనలేకపోయాడు.
   
                                                 *    *    *    *    *
   
    మాధుర్ మానసికంగా పూర్తిగా దెబ్బతిన్నాడు. ఆపైన వళ్ళు తెలీని జ్వరం!
   
    రైల్వేస్టేషన్ ప్రక్కనున్న రేకుల షెడ్డు కిందే ఇప్పుడు వాళ్ళ కాపురం.
   
    తల్లి తడిగుడ్డతో మాధుర్ నుదుట మీద అద్దుతుంటే, తండ్రి వణుకుతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ లారీలోకి అట్టపెట్టెల్ని ఎత్తుతున్నాడు. ఒకప్పుడు మహారాజులా బ్రతికిన ఆయన ఇప్పుడు రోజు కూలి.
   
    ఒక రోజంతా అలాగే గడిచిపోయింది.
   
    సాయంత్రానికి చేతిలోపడ్డ పదిహేను రూపాయల్ని తీసుకుని భార్య, కొడుకున్న దగ్గరకు వచ్చాడు.
   
    "ఎన్నెన్ని ఆశల్ని గుండెల నిండా నింపుకుని వీడ్ని చదివించాను" ఆయన నిట్టూరుస్తూ కొడుకు పక్కనే కూచుండిపోయాడు.
   
    ఆమె ఓసారి తలెత్తి భర్తవేపు చూసి చప్పున తల దించుకుంది. ఆమె అప్పటికే గుండె పగిలేలా ఏడ్చింధని ఆ వృద్దుడు వూహించలేక పోయాడు.
   
    మరో మూడు రోజులు గడిచాయి..... మాధుర్ కి కొంత స్వస్థత చేకూరింది.
   
    పరిస్థితులన్నీ ఒక్కొక్కటీ అతనికి గుర్తుకు రాసాగాయి.
   
    స్పృహ లేకుండా పడివున్న తనను కంటికి రెప్పలా తన తల్లి కాచుకుని, పాతికేండ్ల వయస్సు పైబడ్డ తను అపస్మారక స్థితిలో వుండగా తన తల్లే అన్ని సపర్యలు చేసిందని, ఆ సపర్యలు తనకు ఒకటి రెండు సంవత్సరాల వయస్సున్నప్పుడు చేసినవీ, అప్పుడు మాత్రమే చేయాల్సినవని తెలుసుకున్న మరుక్షణం అప్రయత్నంగానే అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
   
    సరిగ్గా అప్పుడే ఆ ప్రాంతానికేసి పోలీసు జీపులు వేగంగా దూసుకు రాసాగాయి.
   
    "అమ్మా..." మాధుర్ శిధిలమైన మట్టిగోడకు తలవాల్చి సేద తీరుతున్న తల్లిని తట్టి పిల్చాడు.
   
    ఆమె ఉలిక్కిపది లేచి ఆందోళనగా అంది మాధుర్ కేసి చూసి, "ఏం నాన్నా... ఏం కావాలి?"
   
    మాధుర్ "నాన్న ఏడీ?" అంటూ అడిగిన మాటలు పోలీస్ సైరన్స్, విజిల్స్ మధ్య ఆమెకు వినిపించలేదు.
   
    ఒక్కసారే అన్ని పోలీసు వాహనాలు అటుకేసి ఎందుకొచ్చాయో అర్ధంగాక ఆ చుట్టుపక్కల ప్రజలంతా కంగారుపడుతుండగా మాధుర్ తిరిగి "నాన్నేడమ్మా?" అని అడిగాడు.
   
    మూడురోజుల తర్వాత స్పృహలోకొచ్చిన కొడుకును చూసి ఆమె పరమానందభరితురాలైంది.
   
    "వస్తారు బాబు... వచ్చే వేళయింది" అంటూ సత్తుగ్లాసులో మిగిలివున్న పాలను మాధుర్ కి అందించింది వణికే చేతులతో.
   
    అస్తిపంజరానికి చర్మం కప్పినట్లుంది తన తల్లి కళ్ళు లోతుకుపోయి దైన్యంగా చూస్తోంది తనకేసే మానసిక వ్యధతో ముగ్గుబుట్టలా మారిన జుత్తు, పుల్లల్లా వున్న చేతులు.....
   
    ఒకప్పుడు కాలు క్రింద పెట్టకుండా పెరిగిందామె అంటే ఎవరూ నమ్మలేరేమో.
   
    ఎందుకు... తన తల్లిలా ఎందుకు మారిపోయింది? కట్టుబట్టలతో బయటకొచ్చినట్లు తనకు బాగా గుర్తు. మరీ మూడ్రోజులు ఎలా గడిచాయి? అంటే నాన్న... నాన్న ఈ వయసులో చెళ్ళున వీపుమీద చరిచినట్లయింది.
   
    దిగ్గున లేచి నిలుచున్నాడు.
   
    తిరిగి... తిరిగి.... వీటన్నిటికి ఆ డబ్బే కారణం....
   
    "ఎక్కడమ్మా నాన్నా...?" అతని కంఠంలో స్థిరత్వం ధ్వనించింది.
   
    ఆమెకేం చెప్పాలో కొద్దిక్షణాలు పాలుపోలేదు.
   
    అంతలో పెద్ద కలకలం చెలరేగింది ఆ చుట్టుప్రక్కల. రైల్వేస్టేషన్ చుట్టుప్రక్కల న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ చిల్లర దొంగతనాలు చేస్తున్నారంటూ కంప్లయింట్ వెళ్ళడంతో పోలీసులు తన సహజ ధోరణిలో మాబ్ ఎటాక్ చేయటం మొదలుపెట్టారు.
   
    అందినవాళ్ళను అందినట్లు నిర్దాక్షిణ్యంగా బాదేస్తున్నారు.
   
    అసలు దొంగతనం చేయించిన పెద్దమనిషి ఖరీదైన బంగ్లాలో ఉంటే, చేసిన చిన్న మనుష్యులు బార్స్ లో వుంటే, ఏమీ తెలియని బడుగుజీవులు శిక్ష అనుభవిస్తున్నారు.
   
    దీనికి డబ్బే కారణం!
   
    "నాన్నా....!" తల్లి కంఠంలో తొంగిచూసిన ఆందోళనను పసిగట్టి చటుక్కున తలతిప్పి తల్లివేపు చూసాడు ప్రశ్నార్ధకంగా.
   
    "నాన్నగారు ఈ గొడవలో యిరుక్కుంటారేమో.... వెళ్ళి తీసుకువస్తావా?"
   
    "ఇప్పుడయినా చెప్పమ్మా! నాన్నగారెక్కడ?" ఆమెకి చెప్పక తప్ప లేదు.
   
    "ఆ ఎదురుగా కనిపించే ట్రాన్స్ పోర్టు ఆఫీస్ దగ్గర వుంటారు బాబు."
   
    తల్లి మాటలు పూర్తవుతూనే వడివడిగా అటుకేసి సాగిపోయాడు.
   
    మాధుర్ అక్కడికి చేరుకుంటూనే కదలిపోయాడొక్కసారి.
   
    "ముఫ్ఫై మూటలు మోస్తే పదిహేను రూపాయలిస్తానన్నారు. ఇప్పుడేమో పదే చేతిలో పెడుతున్నారు."
   
    తండ్రి లారీ ప్రక్కనే వున్న వ్యక్తిని ప్రాధేయపడుతున్నాడు.
   
    తనను చూసే అవకాశం లేదు తండ్రికి.
   
    "అంతే... అంతే.... వెళ్ళెళ్ళు" ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా అన్నాడు.
   
    "అలా తీసేయకు బాబు... నా కొడుకు మూసినా కన్ను తెరవడం లేదు. నా భార్య ఆకలితో అలమటించిపోతోంది. కనికరించి ఆ అయిదు కూడా ఇప్పించండి బాబు..." తండ్రి దాదాపు ఏడుస్తున్నట్టుగా అర్ధించాడతన్ని.
   
    మాధుర్ గుండెని పిండినట్టయింది.
   
    "వెళతావా, నాలుగు తగిలించమంటావా?" ఆ వ్యక్తి విసురుగా అన్నాడు.
   
    తండ్రి చటుక్కున కూలబడిపోయి ఆ వ్యక్తి కాళ్ళు పట్టుకున్నాడు.
   
    ముందా దృశ్యాన్నిఉ నమ్మలేకపోయాడు.
   
    కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు. తన తండ్రి ఒకప్పుడు జమిందార్ లా బ్రతికిన తన తండ్రి.... కేవలం తనని దక్కించుకోవడం కోసం ఒక బ్రోకర్ కాళ్ళు పట్టుకున్నాడా? మనస్సుపై చెళ్ళున ఒక కమ్చీ దెబ్బ తగిలినట్టు ఉలిక్కిపడి "నాన్నా" అంటూ వేగంగా వెళ్ళి తండ్రిని, అస్థిపంజరంలాంటి తన తండ్రిని గుండెల్లోకి పొదుపుకున్నాడు.

 Previous Page Next Page