ఆ భవనానికి ఒకపుడు సక్రమమైన రాచబాట వుండేది. ప్రస్తుతం అది పూర్తిగా కనుమరుగు అయిపోయింది.
పర్లాకిమిడి భవనంలో అడుగుపెట్టారు ఇందుమతి, ముత్యాలనాయుడు, అప్పటి సమయం.
సరిగ్గా సాయంత్రం ఐదుగంటలు...
ఎక్కడా నరసంచారం లేదు. వాతావరణం చూస్తుంటే ఎవ్వరూ ఉన్నట్టు కనిపించలేదు.
కటకటాల తలుపు వద్దకు వెళ్ళి సందేహిస్తూ నిలబడిపోయింది ఇందుమతి.
"ఏమండీ" నెమ్మదిగా పిలిచింది... అట్నుంచి ఏమాత్రం జవాబు లేదు.
"ఎవ్వరూ ఉన్నట్టు లేరమ్మా?" ప్రక్కనే నిలబడి చూస్తున్న ముత్యాలనాయుడు అన్నాడు.
మళ్ళీ పిలిచింది.
ఈసారి కూడా జవాబు లేదు...
"దయ్యాల కొంపలాగా ఉంది... వెళ్ళిపోదామా" నిరాశగా అంది ఇందుమతి.
అపుడు చూశాడు ముత్యాలనాయుడు లోపల హల్లో స్థంభానికి కట్టబడి వున్న కుక్కని.
"కుక్క వుంటే మనిషి ఉన్నట్లేనమ్మా" అని ముందుకు వచ్చి.
"ఎవరు ఇంట్లో" పెద్దగా అరిచాడు ముత్యాలనాయుడు.
ఒరియా భాషలో "ఎవరూ..." అనుకుంటూ ఒకావిడ గదిలోంచి బయటకువచ్చింది.
"విశ్వరూపశర్మగారున్నారా?"
ఆ మాట అడుగుతున్న ఇందుమతి వైపు తేరిపారా చూసింది ఆవిడ.
"ఏం కావాలి?"
"విశ్వరూపశర్మగారి కోసం వచ్చాము. ఆయన్ని కలవాలి..." చెప్పింది ఇందుమతి.
ఆవిడ మాట్లాడలేదు లోనికెళ్ళిపోయింది. కనీసం కూర్చోమన్నా కూర్చోమనలేదు తనే చొరవగా హాల్లోకి అడుగుపెట్టి కర్రబెంచ్ మీద కూర్చుంది ఇందుమతి. దూరంగా నేలమీద చతికిలపడ్డాడు ముత్యాల నాయుడు.
పావుగంట... అరగంట... గంట...
మనిషి అలికిడి లేకపోవడం, వెళ్ళిన ఆడమనిషి బైటకు రాకపోవటం ఏదో సందేహం తలెత్తింది ముత్యాలనాయుడులో.
"అమ్మా... ఇందూ... ఇందాక వచ్చిన ఆడమనిషి కాళ్ళవైపు ఏవైన చూసారా తల్లి."
"దెయ్యం అనా... నీకు అన్నీ అలాంటి అనుమానాలే ముత్యాలు" అంత టెన్షన్ లోనూ నవ్వు వచ్చింది ఇందుమతికి.
వెలుగు నెమ్మదిగా మాయం అయిపోయి... చీకట్లు కమ్ముకుంటున్నాయి.
విసుగ్గా ఉంది ఇందుమతికి... ఆయన బ్రతికే ఉన్నారా? బ్రతికుంటే బయటకు రావటానికి ఇంతసేపా? సముద్రపు హోరు రాక్షసి కేకలాగా వినిపిస్తోంది. దూరంగా సముద్రంలో లంగరు వేసి వున్న ఓడల్లోని మిణుకు... మిణుకుమంటున్న దీపాల్లా ఇందుమతిలోని ఆశ రెపరెపలాడుతోంది. ఆయన చనిపోయి వుంటే నిధికి దారి మూసుకుపోయినట్లే... ఎలా..? ఆ సమయంలో ఆడమనిషి బైటకు వచ్చి "లోనికి రండి" అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇందుమతిలోని ఆశ ఒకింత ఊపిరి పోసుకుంది బ్రతికున్నా ఆరోగ్యంగా ఉన్నారా...? జ్ఞాపకశక్తి మిగిలే ఉందా? ఏమో... లోపల పెద్ద వసారా తర్వాత నాలుగు ఇళ్ళ చావిడీ...
ఆ తర్వాత పెద్ద గది... అక్కడక్కడ మసకమసకగా వెలుగుతున్న దీపాలు. ఏదో దెయ్యాల గుహలోనికి ప్రవేశిస్తున్నట్లుగా వుంది ఇందుమతికి.
"ఎవరు మీరు? ఏం కావాలి..." ఆడా, మగా కానీ గొంతులా వుంది.
ఆ స్వరం విన్పించిన వైపు లోనికి తొంగిచూసింది ఇందుమతి.
పాతకాలపు పట్టె మంచం. గదినిండుగా పుస్తకాలు... ఏవో రాగి వస్తువులు... తాటాకు గ్రంథాలు... గోడలకు ఏవేవో మ్యాపులు.
సన్నగా, పొడుగ్గా మౌంట్ బాటన్ లో చిక్కి శల్యమైపోయి ఉన్నాడు.
"నా పేరు ఇందుమతిదేవి మిమ్మల్ని కలవటానికి వచ్చాను..."
"పనేంటో చెప్పకుండా పేరేందుకు?"
పరాగ్గా ఏదో పుస్తకం తిరగేస్తూ అన్నాడాయన.
ఆయనే విశ్వరూపశర్మ. ఎస్... ఆయనే, ఆయన బ్రతికే ఉన్నాడు. ఒక్కసారి వెయ్యి ఏనుగుల బలం వంట్లోకి ప్రవేశించినట్లయింది ఇందుమతికి, ముత్యాలుకి.
"ఎవడీ మనిషి... వీడెందుకు వచ్చాడు" చిరాగ్గా అన్నాడాయన తిరిగి.
"అయ్యా నా పేరు ముత్యాలనాయుడు. మా వూరు దేవులపల్లికోట. వీరు ఇందుమతిదేవి"
"దేవులపల్లి కోటా?" ఆలోచనల్లో పడ్డాడు విశ్వరూపశర్మ.
"దేవులపల్లి కోట. చాలారోజులకు వింటున్నాను ఆ వూరి మాట. పాపం... కోటలు, పేటలు పోయాయి. రాజులు మసైపోయారు. రత్న గర్భాలూ పోయాయి... One by one back in the closest lays..." తనలో తాను గొణుక్కుంటున్నట్లుగా అనుకుని-
"అసలెందుకు వచ్చారో చెప్పలేదు..." ఇందుమతి వైపు చూస్తూ అడిగాడాయన.
ఇందుమతి మాట్లాడకుండా తన హేండ్ బాగ్ లోంచి ఉత్తరాన్ని తీసి ఆయనకు అందించింది.
"ఏమిటిది..." అంటూ కళ్ళజోడు అందుకుని సవరించుకుని బైటికే చదవటం మొదలుపెట్టాడాయన. ఉత్తరం చదవటం పూర్తిచేసి- "ఎక్కడ దొరికిందీ ఉత్తరం..." అనుమానంగా ముత్యాలనాయుడు వైపు చూసాడు.
"దొరకలేదు దొరా... కోటలో..." ఏదో చెప్పబోయాడు ముత్యాలు.
అంతలో పాతకాలపు గడియారం ఏడుగంటలు కొట్టింది.
ఆయన శారీరకస్థితి, ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే ఇందుమతికి భయమేసింది. ఏ క్షణంలోనైనా మృత్యువును ఆహ్వానించే వాడిలా ఉన్నాడు. శుష్కించి పోయినట్లున్నా ఆయనలో చదవగలిగే శక్తి, మాట్లాడగలిగే శక్తి, గ్రహణశక్తి కదలగల ఓపికా ఇంకా మిగిలి వున్నందుకు గుండెలనిండా ఊపిరి తీసుకుంది ఇందుమతి.
"దేవులపల్లికోట... ఒకనాడు ఉచ్ఛదశలో వుండేది... నిజాం నవాబులు సామంతులుగా వుండేవారు... ఆ మహారాజు మా స్నేహితులు. ఎప్పటి జ్ఞాపకాలివి. కౌశికభూపతి... యువరాజు... దురదృష్టవంతుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో, నెహ్రూతోనూ, ముఖ్యంగా వల్లభాయ్ పటేల్ తో సత్ సంబంధాలు కొనసాగించి వుంటే విశాలమైన రాజ్యం మట్టిపాలు అయ్యేది కాదు. పాపం కౌశిక భూపతి మోసపోయాడు. స్వంత కొడుకులే మోసం చేసారు పిచ్చివాడై పోయి ఎటో వెళ్ళిపోయాడు" తనకు తెలిసిన విషయాలు గడగడా చెప్పేస్తుంటే నిరుత్తరులై వింటున్నారు ఇందుమతి, ముత్యాలు.
"రెండు, మూడుసార్లు ఉత్తరాలు వ్రాసాను జవాబులేదు. ఒకప్పుడు అష్టఐశ్వర్యాలతో వెలిగిన రాజ్యం..." నెమ్మదిగా అన్నాడు మళ్ళీ.
విశ్వరూపశర్మ మూడ్ ని కనిపెట్టేసాడు ముత్యాలనాయుడు.
"పెద్ద రాజాగారు నిధిని నిక్షేపితం చేసారని జనం అనుకుంటూ వుంటారు నిజమేనా అయ్యా..." అడిగాడు ముత్యాలనాయుడు. అసలు విషయంలోకి త్వరగా రావటం మంచిదని.
"ఒక్క దేవులపల్లి కోటలోనే కాదు... కార్యశూరత్వంతో అన్వేషిస్తే విజయనగరకోట, బొబ్బిలికోట, పెద్దాపురంకోట, వెంకటగిరికోట, గోల్కొండ కోట... అన్నీ కోటల్లోనూ నిధినిక్షేపాలు బయటపడతాయి. ప్రతికోటకూ దేవీశక్తిని ఉపాసించటం ఎంత ముఖ్యమో... నిధుల్ని నిక్షేపితం చేయటం కూడా అంతే ముఖ్యం" చెప్పాడు విశ్వరూపశర్మ.
ఆ మాటతో ఇందుమతి ముఖం కాంతితో వెలిగిపోయింది. ముత్యాలనాయుడిలో కొండంత ఉత్సాహం చోటుచేసుకుంది.
"దేవులపల్లి కోటలో..." ఏదో చెప్పబోయింది ఇందుమతి.
"నువ్వు ఆర్కియాలజీ స్టూడెంట్ వా?" అడిగాడు విశ్వరూపశర్మ.
కాదన్నట్లు తలవూపింది ఇందుమతి.
అంతలో లోపలనుంచి ఆడమనిషి వచ్చి, వారి ఇద్దరివైపూ చూస్తూ-
"ఆయనకు విశ్రాంతి తీసుకునే టైం... రేపు మాట్లాడుదురుగాని" అని నిర్మొహమాటంగా చెప్పేసింది.
దాంతో ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు ఇందుమతి, ముత్యాలనాయుడు.
అక్కడనుంచి ఇందుమతి లేవటానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆ ఆడమనిషి విస్కీబాటిల్, ఒక గ్లాసు తెచ్చి విశ్వరూపశర్మ ముందు పెట్టింది.
బాటిల్ లోంచి డ్రింక్ ను గ్లాసులో పోసుకుని ప్రక్కన ఇంకో గ్లాసులో ఉన్న నీళ్ళను కలుపుకుని గబగబా ఒక గ్రుక్క త్రాగేసి ఏదో పుస్తకాన్ని అందుకున్నాడాయన.
మరో ఇద్దరు అక్కడ వున్నారన్న సంగతే మర్చిపోయాడు.
"ఆయన మరి మాట్లాడరు..." మళ్ళీ లోపల్నుంచి వచ్చిన ఆడమనిషి చెప్పెయ్యటంతో మరి ఏం చేసేది లేక తానూ నిలబడ్డాడు ముత్యాలనాయుడు.
"పదమ్మా ఇందూ... నాన్నగారి దగ్గర నుంచి మనం ఉత్తరం తెస్తే బాగుండేది... మర్చిపోయాం" అన్నాడు ముత్యాలనాయుడు నిస్పృహగా.
రెండో పెగ్గు తాగడానికి గ్లాసు ఎత్తిపట్టుకున్న విశ్వరూప శర్మకు మాటలు చాలా స్పష్టంగా వినిపించాయి.
"నాన్నగారంటున్నారు... ఎవరు ఆయన...!" అడిగాడు ఆయన.
"ఇంకెవరండీ... కౌశిక భూపతిరాజావారు" అన్నాడు ముత్యాలనాయుడు.
ఆ మాటతో కళ్ళు చిట్లించి, వారిద్దరివైపు చూసి, లోపలకు రమ్మన్నట్లుగా సైగ చేశాడు.
"కూర్చోండి..." అని గ్లాసులోని డ్రింకును త్రాగటం పూర్తిచేసి-
"కౌశిక భూపతి బాగానే వున్నారా? ఆస్థి పోయేసరికి పిచ్చివాడై పోయి... ఎటో వెళ్ళిపోయాడన్నారే...?" మళ్ళీ అడిగాడు విశ్వరూపశర్మ.
"ఆస్థీ, అంతస్తూ పోయినా మహారాజంటే మహారాజులాగా వున్నారు. ఆయనే మమ్మల్ని మీ దగ్గరకు వెళ్ళమన్నారు..." చెప్పాడు ముత్యాలనాయుడు.
"ఇక్కడిక్కడికే కమ్యూనికేషన్ గాప్... ఈ గాప్ లేకుండా చూసుకోగలరు కాబట్టే దొరలు మనకు రూలర్స్ అయ్యారు"
"ఇంతకీ నువ్వు కౌశిక భూపతికి ఏమౌతావమ్మా?"
"ఆ రూపురేఖలు చూసి గుర్తుపడతారనుకున్నాను బాబూ... వీరెవరో కాదు. మా చిన్నరాణిగారు... ఇందుమతమ్మగారు" అత్యుత్సాహంగా చెప్పాడు ముత్యాలనాయుడు.
"అంటే కౌశికభూపతి కూతురు... దేవీబాల?!" ఆశ్చర్యంతో అడిగాడు విశ్వరూపశర్మ.
"అవును" అన్నట్లు తల వూపింది ఇందుమతి.