Previous Page Next Page 
సాహసి పేజి 8


    "నన్నేం చేయమంటారు-" స్థిరమైన నిశ్చయానికి వచ్చిన దానిలా అంది ఇందుమతి.

    "ఏం చేయమని అడుగుతావేమిటమ్మా- నిధి అన్వేషణకు స్వీకారం చుట్టు. నీ ఆస్తిని నువ్వు సంపాదించుకోడానికి నడుం కట్టు. నీ వెనుక నేనుంటాను" ఉప్పొంగిన ఉత్సాహంతో అన్నాడు ముత్యాలనాయుడు.

    "ముత్యాలు గురించి నీకు తెలీదమ్మా... అసాధ్యుడు" కౌశిక భూపతి అన్నాడు ఉత్సాహంగా.

    "చిన్నమా- రేపు ఉదయం మన ఫూల్ బాగ్ ప్యాలెస్ కు వెళుతున్నాం" అన్నాడు ముత్యాలనాయుడు స్థిరంగా.


                  *    *    *    *


    ఫూల్ బాగ్ ప్యాలెస్-

    విశాలమైన తోట మధ్యలో రెండువందల సంవత్సరాల క్రితం కట్టించిన భవనం అది. దాని వైభవం ఎప్పుడో కోల్పోయింది. ఒకప్పుడది మహారాజుల విశ్రాంతి భవనం. యుద్ధాల నుంచీ నిత్యరాజరికపాలనా సమస్యలనుంచీ, కొన్నిరోజులు సేదతీరటానికి ఉపయోగపడేది ఆ భవనం.

    ప్రస్తుతం ఆ భవనం ఎండకు ఎండి, వానకు తడిచి, నివాసానికి పనికి రాకుండా పోయి రాచరికానికి శిధిల చిహ్నంగా మిగిలి వుంది.

    ఉదయం...

    సరిగ్గా ఏడుగంటలు-

    ముందు కౌశికభూపతి, ఇందుమతి చివరగా ముత్యాలనాయుడు ఫూల్ బాగ్ ప్యాలెస్ లోనికి ప్రవేశించారు. పాలరాతి శిల్పాలు, అంతెత్తున నీటిని పువ్వుల్లా చిమ్మే పాలరాతి ఫౌంటేన్... తామర పువ్వులతో కలకలలాడే కొలను వుండేవి. ఇప్పుడు పాలరాతి ఫౌంటేన్ తప్ప మరే గుర్తులూ లేవు. ప్రహరీ గోడలు పూర్తిగా పడిపోయాయి.

    అక్కడ, ఆ ప్యాలెస్ ఉందన్న మాటేకానీ, ఎప్పుడూ అక్కడకు రాలేదు ఇందుమతి.

    చేతికర్ర సాయంతో, ఆ ప్యాలెస్ చుట్టూ ఒకసారి తిరిగి, ఆయాసంతో ఒక చెట్టు మొదట్లో కూర్చుండిపోయారు కౌశికభూపతి.

    రెండు క్షణాలు కళ్ళు మూసుకుని, అంతలోనే కళ్ళు విప్పి

    "అమ్మ ఇందూ! నీ ప్రయత్నాన్ని నువ్వు మరో ఆలోచన లేకుండా ప్రారంభించొచ్చమ్మా- ప్రారంభించవచ్చు" స్థిరంగా గంభీరంగా అన్నాడాయన.

    "ఏమైనా జ్ఞాపకం వచ్చిందా" ఆత్రుతగా ప్రశ్నించింది ఇందుమతి.

    "అవునమ్మా ఇందూ- కోటలోని దర్బారు హాలులోంచి ఈ ఫూల్ బాగ్ ప్యాలెస్ కు రహస్య మార్గం వుంది. ఫూల్ బాగ్ ప్యాలెస్ నుంచి ఎక్కడో అడవిలో వున్న సూర్య దేవాలయానికి కూడా ఒక రహస్య మార్గం వుంది. కోటలోని దర్బారు హాలు నుంచి ఫూల్ బాగ్ కి వున్న రహస్య మార్గం గుండా ప్రయాణించాను కాని- ఫూల్ బాగ్ నుంచి సూర్యదేవాలయానికి వున్న మార్గం గుండా ప్రయాణించలేదు. ఓరోజు తండ్రిగారితో నేను అక్కడకు వెళ్ళింది ఆ మార్గం వెంబడే. తండ్రిగారూ... మాతోపాటు మరో వ్యక్తి ఉన్నారు. ఆయన ఒక్క క్షణం ఆగాడాయన. ఆయన జ్ఞాపకాల అరల్లో చిన్న కదలిక "ఆయన పేరు... విశ్వరూపకర్మ... ఇప్పటికీ బాగా జ్ఞాపకం వుంది. నలభై ఏళ్ల క్రిందటి మాట. విశ్వరూపుడికి బహుశా నలభై ఏండ్లు ఉండవచ్చు. అప్పటికే అతను బ్రిటీషు దొరల దగ్గర ఆర్కియాలజీ విభాగంలో పనిచేసేవాడు. మొదట కలకత్తా ప్రాంతంలో ఉండేవాడు. ఆ తర్వాత మన కళింగ ప్రాంతానికి వచ్చాడు. మంచివాడు.

    కానీ దొరలకు మద్దతుగా ఈ ప్రాంతాల్లో వున్న నిధి నిక్షేపాలను కనుక్కోవటానికి వచ్చినవాడు కావటంవల్ల మొదట్లో ఏ హిందూ రాజు విశ్వరూపుడిని నమ్మలేదు కానీ విశ్వరూపుడు రాళ్ళ విషయంలో అందె వేసిన చెయ్యి... ఏ పచ్చ ఎంత ఖరీదు చేస్తుందో, ఏ రాయి ఎంత పురాతనమైనదో ఇట్టే చెప్పేసేవాడు. అందుకే ఆయన్ని చేరదీసి ఉంటారనుకుంటాను. మన ప్రాంతపు కోట, పేటల మీద, గిరిజన ప్రాంతాల మీద మంచి అదుపు వున్న వ్యక్తి..." నెమ్మదిగా ఒక్కొక్క విషయం చెప్పాడు కౌశికభూపతి.

    "ఇప్పుడాయన బ్రతికే వున్నారా నాన్నగారు" ఆసక్తిగా అడిగింది ఇందుమతి.

    "నాకు పాతికేండ్లు వచ్చేసరికి అతనికి నలభై ఏండ్ల వయస్సుంది. బహుశా కాస్త అటూ ఇటూగా అతనికి మన ముత్యాలంత వయస్సుంటుంది బ్రతికున్నది, లేనిదీ చెప్పలేం"

    "అవును... రాజావారూ... నాకు బాగా జ్ఞాపకం ఉంది... సన్నగా... అచ్చు దొరలాగానే వుండేవాడు విశ్వరూపుడు..." తనూ జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు ముత్యాలనాయుడు.

    "అయినా ఇప్పుడాయనతో అవసరం ఏమిటి నాన్నగారూ?" ఇందుమతి తిరిగి ప్రశ్నించింది ఆసక్తిగా.

    "ఉంది. చాలా ఉంది. ఆ రోజు దర్బారు హాలు నుంచి ఈ ఫూల్ బాగ్ కి ఉన్న రహస్య మార్గం గుండా మా తండ్రిగారు, నేను, విశ్వరూపుడు వెళ్తున్నప్పుడు అనుకోకుండా మా సంభాషణ నిధుల మీదకు మరలింది.

    అప్పటికే విశ్వరూపుడు బ్రిటిషు దొరల ప్రభావం నుంచి బయటపడ్డాడు. బ్రిటిషు దొరలు విశ్వరూపుడ్ని నిధుల అన్వేషణకు ఉపయోగించుకొని, తగిన ప్రతిఫలం ముట్టజెప్పలేదు.

    దాంతో విశ్వరూపుడిలో మార్పు వచ్చింది. వ్రతం చెడినా ఫలితం దక్కనప్పుడు, వ్రతం తప్పి హిందూ రాజులకు ఎందుకు శతృవుని కావాలని హిందూ రాజుల్నే అప్పటి నుంచి నమ్ముకుని బ్రతకసాగాడు. అది మా తండ్రిగారికి తెలుసు.

    కనుకే మన నిధి గురించి పరోక్షంగా విశ్వరూపుడితో చెప్పారు. అది నాకిప్పటికి జ్ఞాపకం ఉండటం నా చిట్టితల్లి అదృష్టమే.

    ఆ రోజే మా రాజవంశానికి వెలకట్టలేని నిధి ఒకటి ఉందని రూఢీగా తెలుసుకున్నాను.

    నిధుల గురించి నాకు పెద్దగా అవగాహనలేదు. అందుకే ఆరోజు మా తండ్రిగారు, విశ్వరూపుడు మాట్లాడుకున్న విషయాలేమీ నా కర్ధం కాలేదు. నేనూ ఆ పైన పట్టించుకోలేదు. అతడ్ని ఎలాగయినా పట్టుకోగలిగితే నిధి అన్వేషణ ఫలించవచ్చు. మన అదృష్టం బాగుంటే అతను బ్రతికే ఉండవచ్చు. అతడ్ని వెంటనే వెతికి పట్టుకోవటం అత్యవసరం" అన్నాడు కౌశిక భూపతి తనలో రేగుతున్న ఆరాటాన్ని కప్పిపుచ్చుకుంటూ.

    అప్పటికి తమ రాజకుటుంబానికి ఒక నిధి ఉన్నదన్న విషయాన్ని పూర్తిగా నమ్మింది ఇందుమతి.

    "ఆయన్నెలా పట్టుకోవటం ఎక్కడుంటాడో... ఏ వూరో తెలీకుండా ఎలా నాన్నగారు?" ఇందుమతిలో క్రమంగా పట్టుదల ఊపిరి పోసుకోసాగింది.

    "ఉద్యమేనహి, సిద్ధ్యంతికార్యాణి... అన్నాడు ఆర్యకారుడు. దొరక్క ఏమవుతాడు? బ్రతికుంటే... అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు విశ్వరూపుడు... తర్వాత, తర్వాత ఉత్తరాలు రావటం తగ్గిపోయాయి. బట్వాడా అంతా ట్రంక్ పెట్టెలో పెట్టినట్లు జ్ఞాపకం" అన్నాడు కౌశికభూపతి.

    అప్పటికప్పుడే ఇందుమతి, ఒక స్థిరమైన నిశ్చయానికి వచ్చింది. రాజవంశం సాహసానికి ప్రతీక... ఆ వంశంలో పుట్టిన ఇందుమతికి చిన్నతనం నుంచీ సాహసం చెయ్యటం అంటే ఇష్టం- తన కోసం తను ఇప్పుడు సాహసం చేయాలి. పోగొట్టుకున్న దానిని తిరిగి పొందాలి... దృఢంగా ఒక నిర్ణయానికి వచ్చింది ఇందుమతి.


                                       *    *    *    *


    కొట్టుగదిలో ఓ మూల పెద్ద భోషాణం పెట్టె... ఆ ప్రక్కన చిందర వందరగా కొన్ని గోనెసంచులు... ఆ ప్రక్క కొన్ని ట్రంకుపెట్టెలు... ఒక్కొక్క ట్రంకు పెట్టెనూ తెరుస్తోంది ఇందుమతి. సాటి రాజులు, సామంతులు ముఖ్ మల్ క్లాత్ లో చుట్టి పంపిన ఉత్తరాల దగ్గర నుంచి... ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చిన ఉత్తరాల దాకా అందులో ఉన్నాయి. ఒక్కొక్క ఉత్తరం తీసి చూస్తోంది... ఆమెకి సహాయంగా ముత్యాలు.

    రెండు రోజులు గడిచాయి.

    ఇందుమతి శ్రమ వృధా కాలేదు. తన తండ్రి కౌశికభూపతికి విశ్వరూపశర్మ స్వయంగా రాసిన ఉత్తరం దొరికింది.

    మాన్య మహారాజులు శ్రీశ్రీ కౌశికభూపతుల వారికి!

    తమ ఆప్తుడు విశ్వరూపశర్మ అనేక నమస్కారములతో వ్రాసుకుంటున్న లేఖార్థములు.

    ఇతఃపూర్వము ఏవయినా విలువైన వజ్రహారాదులు నా దృష్టికి వచ్చినచో మనవి చేయమని తమరు నాతో చెప్పివున్న మాటను జ్ఞాపకం చేయుచున్న వాడను-

    ఒక డచ్ దేశస్థుడు తమ దేశము వెళ్ళిపోతూ తమ దగ్గర వున్న అతి విలువైన పగడాల హారమును అమ్మకమునకు పెట్టితిరి. ఆ పగడముల హారము అతి విలువైనదే కాకుండా అతి ప్రాచీనమైనది కూడా... తాము చూచుటకు ఇష్టపడిన ఎడల, ఆ డచ్ దంపతులతోపాటు నేనున్నూ తమ దర్శనమునకు వత్తునని మనవి చేసుకుంటున్న వాడను... ఏ విషయమూ వర్తమానము పంపిన యెడల తమ సమక్షములో నండువాడను.

                                                                           భవదీయుడు
                                                                          - విశ్వరూపుడు

    విలాసం : కందివేముల విశ్వరూపశర్మ... పర్లాకిమిడి భవనము.

    సాగరతీరము... వాల్తేరు.

    ఆ ఉత్తరాన్ని పట్టుకుని గబుక్కున తండ్రి దగ్గరకు వచ్చింది ఇందుమతి. అన్ని వివరాలూ ఉత్తరంలో ఉన్నా ఏ సంవత్సరము ఆ ఉత్తరము వచ్చిందీ తేదీ లేదు... ఆ విషయాన్నే తండ్రిని అడిగింది ఇందుమతి.

    "బహుశా మూడు పుష్కరాలు దాటి వుండవచ్చు..." ఉత్తరాన్ని పరికించి చెప్పాడాయన.

    "వాల్తేరు వెళితే ఆయన్ను కల్సుకోడానికి వీలుంటుందంటారా?" అంది.

    "కార్యరంగంలోకి దూకేవారికి ప్రశ్నలుండకూడదమ్మా..." అన్నాడు ప్రక్కనే వున్న ముత్యాలనాయుడు.

    "రేపు నేను, ముత్యాలనాయుడు వాల్తేరు వెళుతున్నాం..." స్థిర నిశ్చయంతో అంది ఇందుమతి వెంటనే.


                  *    *    *    *


    ఎనభై ఏళ్ళక్రితం విశాఖపట్టణం అందమైన విహార కేంద్రం. అందుకే మహారాజులూ, జమిందార్లూ అక్కడ సముద్రపు ఒడ్డున వేసవి విశ్రాంతి మందిరాలు కట్టించుకున్నారు.

    డచ్, పోర్చుగీసువారు మాత్రం ఇంకా ముందుకు వెళ్ళి, భీముని పట్టణపు ప్రాంతాన్ని ఎంచుకుని దానిని తమ స్థావరంగా మార్చుకుని, సముద్ర తీరాన్ని రేవు తీరంగా అభివృద్ధి చేసి, వ్యాపార స్థలంగా మార్చేశారు.

    విశాఖపట్టణానికీ, భీముని పట్టణానికి మధ్యలో సరుగుడు తోటలో వుంది కర్ర కట్టడపు పర్లాకిమిడి ప్యాలెస్...

    పూర్తిగా ఒరిస్సా సాంప్రదాయంతో కట్టిన కట్టడం అది... కట్టడం చుట్టూ రాతి గోడలు.

    దూరంగా సముద్రం... ఆ పక్కన జాలరి గుడిసెలు.

 Previous Page Next Page