Previous Page Next Page 
సాహసి పేజి 10


    "అయ్యో చిట్టితల్లీ... నువ్వేనా అమ్మా నీకు దేవిబాల ఇందుమతి దేవి పేరు పెట్టింది ఎవరనుకున్నావ్.... నేనే... నెలల పిల్లగా చూసాను నేను. ఎంత పెద్దదానివైపోయావు..." ఆయన కళ్ళు చెమర్చాయి ఆనందంతో.

    "ఇలారా- ఇలా వచ్చి నా ప్రక్కన కూర్చో" అన్నాడాయన ఆప్యాయంగా. ఇందుమతి లేచివెళ్ళి ఆయన ప్రక్కన మంచంమీద కూర్చుంది. ఇందుమతి భుజాలమీద చెయ్యివేసి రెండుచేతులతో ముఖాన్ని తడిమి, రాచరికపు తేజస్సుతో వెలిగిపోతున్న ఆమె కళ్ళవైపు చూస్తూ-

    "మీ వంశంలోని వారికి కళ్ళు కాంతివంతమైన ఆయుధాలు తల్లీ! ఆ కళ్ళ నైశిత్యం నాకు తెలుసు"

    ఉబ్బితబ్బిబ్బవుతూ అన్నాడు విశ్వరూపశర్మ.

    ఒక్క అయిదు నిమిషాలసేపు ఆయన ఏమీ మాట్లాడలేకపోయాడు.

    ఇందుమతి నిండు విగ్రహాన్ని చూస్తూ వుండిపోయాడు.

    ఆరోగ్యంగా, బలంగా వున్న శరీరం... విశాలమైన కళ్ళు... నునుపైన కంఠం - వత్తుగా పొడవయిన జుట్టు... ముచ్చటగా వున్న మోము.

    మొనాలిసాను భారతీయ వనితలా మారిస్తే ఎలా వుంటుందో అలా వుంటుందనిపించింది ఇందుమతి విశ్వరూపశర్మ కళ్ళకు.

    "చూడు..." అంటూ గది గుమ్మంవైపు చూసి పిలిచాడు.

    లోపల్నుంచి ఆడమనిషి వచ్చింది.

    "ఈ అమ్మాయి ఎవరనుకున్నావ్... మన కౌశికభూపతి కూతురు అపుడపుడు చెపుతుంటాను... చూసావా దేవులపల్లి కోట... వీరిదే-" గర్వంగా చెప్పారాయన.

    "ఈవిడ... మా ఆవిడ- పరంజ్యోతి-" పరిచయం చేశాడు ఆయన.

    "ఎప్పుడూ మీ సంస్థానం గురించే చెబుతుంటారు. ఇన్నాళ్ళకు మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది" దేవలోకం నుంచి దిగివచ్చిన అప్సరసను చూస్తున్నట్లుగా ఇందుమతివైపు చూస్తూ భయభక్తులతో అంది ఆవిడ.

    "వచ్చిన అతిధులు మామూలువాళ్ళు కాదు ఈ రాత్రికి వీరు ఇక్కడే వుంటారు. భోజనం ఏర్పాట్లు చెయ్యి" విశ్వరూపశర్మ భార్యకి చెప్పాడు.

    ఆవిడ లోపలకు వెళ్ళిపోయాక-

    "నువ్వు ముత్యాలనాయుడివి కదూ?" ప్రేమగా అడిగాడు విశ్వరూపశర్మ. 

    "మీరు గుర్తుపట్టారనుకున్నాను" సంతోషం వ్యక్తం చేస్తూ అన్నాడు ముత్యాలనాయుడు.

    "వృద్ధాప్యం... శరీరానికే. మనస్సుకూ, ఆలోచనకూ కాదు..." మరో పెగ్గును పూర్తిచేస్తూ అన్నాడాయన. ఆ తరువాత ఆయన ఇద్దరు సర్వెంట్స్ సహకారంతో బాత్ రూమ్ కి వెళ్ళారు.


                                         *    *    *    *


    "ముసలాయన ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇవాళో రేపో అన్నట్లుగా- వున్నాడు. నాదీ ఆయన వయసే అయినా కుస్తీ పట్లు పట్టిన శరీరం కనుక ఆరోగ్యంగా వున్నాను. లేదంటే నేనూ అలాగే అయి వుండేవాడ్ని. దొరలతో తిరిగాడు గదా ఆ అలవాట్లు వచ్చాయి. అందుకే ఆరోగ్యం అలా అయింది. ఏది ఏమైనా సాధ్యమైనంత త్వరలో ఆయన్నుంచి నిధికి దారి తెలుసుకోవటం చాలా మంచిది" అన్నాడు ముత్యాలు ఒకింత ఆందోళనతో, అవునన్నట్లుగా తల వూపింది ఇందుమతి.
 
    భోజనాలు అయ్యాక అందరూ నాలుగిళ్ళ చావడిలో కూర్చున్నారు.

    "చెప్పమ్మా ఇందుమతీ... ఏ పనిమీద వచ్చావ్" అడిగాడు విశ్వరూపశర్మ ఆప్యాయంగా.

    "ఏం చెప్పమంటారు బాబూ- సంస్థానం మొత్తం మట్టి కొట్టుకు పోయింది. మహారాజు కౌశికభూపతులవారు మట్టిబొమ్మలా అయిపోయారు. మగపిల్లలు ముందు జాగ్రత్తగా నగలూ- నజరానా పట్టుకుపోయారు. ఒక్కగానొక్క ఆడపిల్లకు ఉలకని, పలకని కోట మిగిలింది. అన్నీ తెలిసిన మీకు చెప్పటానికేం- చిన్నమ్మగారు ఆర్థిక పరిస్థితివల్ల చదువు మధ్యలో ఆపేసారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో చిట్టితల్లినీ, సంస్థానాన్నీ మీరే రక్షించాలి బాబూ- దేవులపల్లి కోటకు సంబంధించి... నిదినిక్షేపాల విషయం- తమరు తెలిపితే-" అని ఆగిపోయాడు ముత్యాలు.

    విశ్వరూపశర్మ కొద్ది క్షణాలు ఆలోచనలో పడ్డాడు.

    "నా బ్రతుకూ అంతా నిధుల అన్వేషణలోనే గడిచిపోయింది. నిధుల అన్వేషణ వెనుక ఎంత ప్రయోజనం వుంటుందో అంత ప్రమాదం కూడా దాగి వుంటుంది. It in a dangerous sport, as well as a dngerous adventure... ప్రాణాలను బలికోరే అడ్వంచర్ అది. ఆధునికులు నమ్మరు కానీ, దుష్టశక్తుల వలయం నిధుల అన్వేషణ.

    అతి విలువైన వజ్రవైఢూర్యాది ధనరాసులను పొంది ధనవంతులు కావాలని దురాశపడేవారు కొందరయితే... నాగరికత, ఆచార సాంప్రదాయాలు, మానవజీవన సరళిని తెల్సుకోవటానికి ప్రయత్నించేవారు కొందరు. ఇందులో రెండో దానికోసం చాలా తక్కువమంది ప్రయత్నిస్తారు ధన పిశాచం ప్రభావానికి లోనయి వెళ్ళే వాళ్ళే ఎక్కువయింది. నేను చాలాకాలం రెండోవర్గం వాడిగానే కృషి చేసాను. యూరోపియన్ల ప్రభావం కారణంగా మొదటి వర్గం వాడిలాగా మారాను. అక్కడే నిధి తెల్లదొరల రూపంలో దెబ్బతీసింది. ఎప్పుడైతే ధనకాంక్ష మొదలయ్యిందో అప్పుడే విచక్షణ కూడా పోయింది. పాతికేళ్ళ విలువైన కాలాన్నీ, ప్రేమాస్పదురాలైన నా మొదటి భార్యనూ కోల్పోయాను. నా బిడ్డలు నాకు దూరమయ్యారు. నేనేం వారికి సంపాదించి పెట్టలేదని నామీద వాళ్ళకు కోపం. వారి కోపం సమర్ధించదగ్గదే. స్వార్ధంతో కూడుకున్నదైనా స్వధర్మమే గొప్పదని కృష్ణభగవానుడు గీతలో చెప్పలేదూ...? తమ సుఖం కోసం, స్వార్ధం కోసం పిల్లల్ని కని, గొప్ప కోసం ఆస్తుల్ని పరులకు దానాలు చేసి, ఔదార్యం ప్రదర్శించుకోవడం కోసం పరుల అప్పులకు అడ్డు ఉండి ఆస్తుల్ని పోగొట్టుకుంటే- కన్నబిడ్డలు ఎదిగొచ్చేసరికి ఏమీలేని స్థితి వస్తుంది. అలాంటి తల్లిదండ్రులు క్షమార్హులుకాదు. వారని ఉరితీసినా పాపం లేదు.

    పరుల గొప్పకోసమే బ్రతకాలనుకున్నప్పుడు పిల్లల్ని కని, వార్ని గతిలేని వార్ని చేయటం ఎందుకు? అలాంటివారి బిడ్డల్ని ఆదుకొని, ఉద్దరించడానికి ఇక్కడెవరు సిద్ధంగా ఉంటారు? దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ మహాత్ముడి పిల్లల్ని ఆడుకోవటంలో ఔచిత్యం ఉంది. సుఖదేవ్, భగత్ సింగ్, బోస్ కి తోడబుట్టిన వాళ్ళను ఆడుకోవటంలో గొప్పతనం ఉంది.

    కాని మాలాంటి బాధ్యతలేని తల్లిదండ్రుల పిల్లల్ని ఆదుకోక పోవటంలోనే ఔచిత్యం వుంటుంది.

    ఇలా చేసేవేం అని మా బంధువులడిగితే- కేవలం మాటకోసం, మంచికోసం నమ్మి మోసపోయానని సిగ్గులేకుండా అవివేకంతో కూడిన ఆత్మవంచన చేసుకున్నాను.

    ఇక నన్నెలా నా పిల్లలు క్షమిస్తారు? క్షమించలేదు. అందుకే ఎవరి దారులు వారు వెతుక్కొని దూరమైపోయారు. చివరకు నా భార్యా నన్ను క్షమించలేదు మనోవ్యాధితో మంచమెక్కి చనిపోయింది. ఇప్పుడు నా మనవళ్ళకు, మనుమరాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. అయినా నేనిలా ఒంటరిగా ఈ సముద్రపు ఒడ్డున మిగిలిపోయాను.

    Now I am counting my last days.

    నా రెండవ భార్యకీ- నాకు తిరిగి పిల్లలు పుట్టారు. వాళ్ళ పరిస్థితీ అంతే-

    కట్టుకున్న భార్యని, కన్నబిడ్డల్ని సుఖ పెట్టగలిగినవాడే- వారికి మంచి భవిష్యత్ ని చూపించగలిగినవాడే పెళ్ళికి అర్హుడు. అనే చట్టం తేవాలి.

    అప్పుడే నాలాంటి బుద్ధిహీనులు మేల్కొనేది. బ్రిటీష్ దొరలతో తిరిగినా వార్ని చూసి ఏమీ నేర్చుకోలేకపోయాను.

    నా జీవితం మీదే నా భార్య పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలిసినా- అప్పట్లోనే లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నా నా లైఫ్ ఇన్సూర్ చేసుకోలేదు.

    ఇప్పటికీ నాలాంటి దౌర్భాగ్యులున్నారు. ఎవరో పోరాడితే, మొక్కుబడికి కొన్నాళ్ళు ప్రీమియమ్ కట్టి- ఆ తరువాత మానేస్తారు. ఆ తరువాత పుటుక్కున ఛస్తారు. వాడిదేం పోయింది- చచ్చి సుఖపడతాడు- వాడి పాలిటబడ్డ భార్యా, బిడ్డలే గతిలేనివాళ్ళవుతారు. ఇన్సూరెన్స్ కట్టడానికీ, నీకు దాయటానికీ నా దగ్గర అంత డబ్బులేదని మా పిల్లలతో అన్నాను. దానికి వాళ్ళేమన్నారో తెలుసా? కడుపు కట్టుకొని దాయాలన్నారు. నాకేం అవసరం అన్నాను- అదే మా తాతగారు అనుకుని వుంటే నువ్వేమయ్యేవాడివని నిలదీసారు. మా తాత ఆస్తి ఏం చేసావన్నారు- అమ్మి వ్యాపారం చేసి నష్టపోతూ వచ్చానన్నాను. ఆ వ్యాపారంలో నష్టం వస్తుంటే ఆ వ్యాపారాన్నే ఎందుకు కొనసాగించావ్? ఎవర్ని ఉద్ధరించడానికన్నారు ఎలాగూ వ్యాపారంలో నష్టం వస్తున్నప్పుడు- నష్టంలో నష్టం అనుకొని కొంత తీసి మా భవిష్యత్ కోసం ఎందుకు దాయలేదన్నారు. అల్లోపతికి జబ్బు తగ్గకపోతే హోమియోపతి- దానితోనూ తగ్గకపోతే ఆయుర్వేదం- అక్కడికీ తగ్గకపోతే యునాని- అయినా తగ్గకపోతే యోగా మెడిటేషన్- జబ్బులు తగ్గటం కోసం ఇలా మార్పుని ఆహ్వానించినప్పుడు జీవన విధానాన్ని ఎందుకు మార్చుకోలేదని అడిగారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్.    

    ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానో తెలుసా? నిధుల కోసం వేటాడినందు వల్లే ఈ ఒంటరి దౌర్భాగ్యం నాకు చుట్టుకుందని చెప్పటానికి.

    కొందరు అక్కడికక్కడే నెత్తురు కక్కుకుని చనిపోతే- మరికొందరు ఆయుష్షు గట్టిదయితే) బ్రతికుండి ఇలాంటి నరకం అనుభవిస్తారు.

    మన హిందూరాజుల నిధుల్ని స్వార్ధపరులైన తెల్లదొరలకు దోచిపెట్టే ప్రయత్నాలు చేసాను గనుకే నా బతుకిలా అయిపోయింది" దుఃఖ భాజకమైన జ్ఞాపకాలు ఏ గుండెలోతుల్లో తగిలాయో ఒకింతసేపు మౌనంగా వుండిపోయారు. తడిదేరిన కళ్ళను తుడుచుకుని దీర్ఘంగా నిట్టూర్చి తిరిగి చెప్పటం ప్రారంభించాడు విశ్వరూపశర్మ.

    ఏ నిధినయినా పూర్తిగా పొందటం అంత సులభం కాదు. ఒక జీవితకాలం అంతా అన్వేషణలోనే గడిచిపోవచ్చు ఒక్కోసారి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన 'అటోచా' నిధిని పొందటానికి మెల్ ఫిషరీ అనే సాహసి తన పూర్తి జీవితాన్నే అంకితం చేశాడు.

    ఈజిప్ట్ ఎల్ గిజా ఇసుక మైదానాల్లో కూరుకుపోయిన, వెలకట్టలేని టుటాంఖమెన్ నిధి (పిరమిడ్) కోసం హోవర్డ్ కార్టర్ అనే సాహసికుడు 30  ఏళ్ళపాటు నిర్విరామంగా, ఎన్నో ఇబ్బందుల్ని, హత్యా ప్రయత్నాల్ని ఎదుర్కొని అన్వేషణ జరిపాడు. అప్పటికిగాని ఆ నిధి ఆయనకు దొరకలేదు.

    ప్రపంచానికి తెలీని అద్భుత సత్యాలు నాగరికత నిధుల అన్వేషణలో బైటపడతాయి. నిధుల అన్వేషణ ఒకప్పుడు ఖరీదైనా గాంబ్లింగ్ లాగా చలామణి అయ్యింది.
   
    ఎల్ డూరాడో పేరు వినే వుంటారు. ఒకప్పుడు ఆ పేరుమీద బంగారు పట్టణం ఉండేది. దాన్ని సాధించాలని కొన్ని వందల ఏళ్ళక్రితం ఎంతోమంది ట్రెజర్ హంటర్స్ ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ బంగారు పట్టణం ఒకప్పుడు ఉన్నట్లు ఆనవాళ్ళు మాత్రమే సాధించగలిగారు వాళ్ళు.

    రోమ్, బ్రిటన్ తదితర రాజ్యాల పరిధుల్లోనే కాదు. భారతదేశంలో కూడా ఈ నిధుల కోసం అన్వేషణలు జరుగాయి. ఒకప్పుడు జైపూర్ లో సంవత్సరాలపాటు త్రవ్వకాలు జరిగాయి. గోల్కొండ కోటలో త్రవ్వకాలు జరిగాయి. ఎక్కడైనా శాస్త్రీయ పద్ధతుల్లో అన్వేషణ జరిపితే అనూహ్యమైన నిధులు బైటపడతాయి. ఇందులో అనువంశిక నిధులు మాత్రమే ఆయా వంశాల్లోని వారసులకు లభ్యం అవుతాయి. మిగతా నిధులు... తరతరాల గుప్తనిధులు- కొందరు అదృష్టవంతులకు మాత్రమే లభ్యం అవుతాయి. లేకపోతే వీటిలో 'బలి' తప్పనిసరి. చాలా నిధులు నరబలుల్ని కోరతాయి- ఆయాసంతో కొన్ని క్షణాలాగారాయన.

 Previous Page Next Page