Previous Page Next Page 
జనవరి 5 పేజి 9

 

      "అదీ కాదు సార్!"
   
    "మరేమిటి...?" చిరాకుపడుతూ అడిగాడు అచ్యుత్.
   
    "ఎవరో ఒక ఆడపిల్ల వచ్చి వాళ్ళ నాయకుడితో ఏదో అంది.....అతనేదో చెప్పబోయాడు. అయినా ఆమె అతని మాటలు వినకుండా మరేదో అంది. దాంతో చూస్తుండగానే అతను ఇక్కడి నుండి తప్పుకుంటూ తనవాళ్ళకు సంజ్ఞ చేశాడు. దాంతో అందరూ అదృశ్యమైపోయారు" ఆన్నాడొకతను భయపడుతూ.
   
    "ఎవరా అమ్మాయి?"
   
    "తెలీదు సార్! మేం ఎపుడూ చూడలేదు."
   
    "ఎలా వుంటుంది?"
   
    "దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలా వుంది సార్!"
   
    "అసలెక్కడ గొడవ మొదలైంది?"
   
    "మేఖలా రెడీమేడ్ షాప్ లో అదిగో అదేసార్... ఆ బట్టల షాపు" అంటూ కేతువు వేలెట్టి ఆ షాపు వేపు చూపించాడు. అచ్యుత్ ఆ షాపువేపు చూసి తల పంకించాడు.
   
    ఆ షాపు తలుపులు తెరిచే ఉన్నాయి.
   
    కానీ మనుష్యులెవరూ లేరు.
   
    "అందులోని బట్టలన్నీ తెచ్చి రోడ్ మీద గుట్టపోసి తగలెట్టండి" అరిచాడు అచ్యుత్.
   
    కొత్తగా వచ్చిన వ్యక్తుల్లో నలుగురు ఆ పని చేసేందుకు ఆ షాపు వేపుకి దూసుకుపోయారు.
   
    "ఎవరో మనల్ని దెబ్బకొట్టారు. మధ్యలో దెబ్బలు తిన్నా చివరకు మనదే పైచేయి అయితేనే ఈ ఊరిలో మనకు పరువు దక్కేది. మన పట్టు సడలకుండా ఉండేది. విజయాన్ని చేజిక్కించుకొని పరాజయాన్ని ఎదుర్కో వలసి వస్తుందని మాయమై పోయారు కానీ వార్త ఊరంతా ఈ పాటికే తెలిసిపోయే ఉంటుంది. ఇపుడు మనం చెప్పినా జనాలు నమ్ముతారా? భయపడతారా? లేదు లేనపుడు మన అధికారం, సంపాదనా, పలుకుబడిల మాటేమిటి.....?" అచ్యుత్ చిందులు తొక్కాడు.
   
    అందరూ భయంతో మౌనంగా ఉండిపోయారు.
   
    ఈలోపు బట్టలషాపు వేపు వెళ్ళిన నలుగురు ఆ షాప్ లోని బట్టల్ని రోడ్ మీదకు విసిరేయటం మొదలుపెట్టారు.
   
    ఎవరా ఆడపిల్ల...?
   
    తన ముఠానే ఎదుర్కొన్న సింహపు పిల్లను ఎలా నియంత్రించ గలిగింది? ఎలా మంత్రించగలిగింది?
   
    ముందు ఆమెవరో తెలుసుకోవాలి.
   
    నా పట్టు ఈ ఊరి మీద సడల లేదని నిరూపించుకోవాలి. తప్పదు యుద్దమూ తప్పదు - వాడి చావూ తప్పదు.
   
                     *    *    *    *    *
   
    ఇంటికొచ్చిన తరువాత పావుగంట వరకు ఎవరూ తేరుకోలేక పోయారు. అప్పటి వరకు తమ దృష్టికి రాని విషయాలు చాలా ఉన్నాయని అరుణాచలం దంపతులు గుర్తించారు.
   
    ఒకటి కేవలం చదువూ సంధ్యలూ లేక తమ కొడుకు జులాయిగానే తిరుగుతున్నాడనుకున్నారు గానీ మానసికంగా ఎంతో ధైర్యాన్ని, మొండితనాన్ని శారీరకంగా బలాన్ని ప్రోదిచేసుకోగలిగాడని ఊహించలేదు.
   
    ఒకరిద్దరు ఫ్రెండ్సే వుండి వుంటారని ఊహించారుగానీ, తన కనుసన్నల్లో కదిలే సుక్షితులైన సైనికుల్లాంటి అనుచరులు పదుల సంఖ్యలో ఉంటారని భావించలేదు.
   
    చదువు రాలేదు లోకజ్ఞానం అబ్బలేదు, బాధ్యతలసలు తెలీవనుకున్నారు. కానీ నగర ప్రజల పౌర జీవనంపై ఓ నిర్దుష్టమైన అవగాహన ఉండి ఉంటుందని కలలో కూడా అనుకోలేదు.
   
    నగర ప్రజల్ని, పోలీసు డిపార్ట్ మెంట్ ని చిన్న చిన్న రౌడీ ముఠాల్ని గజగజ లాడించగల నరరూప రాక్షసుడైన ముఫ్ఫై యేండ్ల ఘోటక బ్రహ్మచారి అచ్యుత్ ముఠాని వెనకా ముందూ చూసుకోకుండా అతి సునాయాసంగా ఎదుర్కొన్నాడు....?
   
    వీటన్నింటిని మించి అద్భుతం మరొకటుంది.
   
    కన్నతల్లిని లెక్కచేయలేదు.
   
    పెంచి పెద్దచేసిన తండ్రిని పట్టించుకోలేదు.
   
    కానీ తోడబుట్టిన అక్కని, తన కన్నా రెండేళ్ళు పెద్దదైన మేఖల శాసనాన్ని అమలు పర్చాడు చూస్తుండగానే చిరుతపులి లాంటివాడు పిల్లిలా మారిపోయాడు.
   
    అక్కా తమ్ముళ్ళ మధ్య అంతటి అవగాహన ఉందా?
   
    ఆ నలుగురు ఇంటి మధ్యహాల్లో కూర్చున్నా ఎవరూ మాట్లాడటం లేదు. మౌనంగా చూపుల్ని వేరే దిక్కులకి మరల్చి శిలా ప్రతిమల్లా ఉండిపోయారు.
   
    ఆలోచనల్నుంచి ముందుగా తేరుకున అరుణాచలం భయపడ్డాడు. ఇంత జరిగాక అచ్యుత్ అభిరామ్ ని అంత తేలిగ్గా వదిలేస్తాడా? వెంటాడు తాడు, వేటాడుతాడు, ఇంటిల్లి పాదిని వేధిస్తాడు, అతని బారినుండి తమను కాపాడేందుకు పోలీసులే రారు. ఇక సివిలియన్స్ ఎలా రాగలరు?
   
    "అక్క రోజుకో ఉద్యోగం వదిలేసి వస్తుంది. అదేం అంటే మనుష్యుల ప్రవర్తన నేరుగా ఉండటం లేదంటుంది. తమ్ముడు ఇంతవరకు చదువురాని వాడని భావించానుగానీ ఇంత పెద్ద రౌడీగా మాకు తెలీకుండానే రూపాంతరం చెందుతాడని ఊహించలేదు. ఇది మిమ్మల్ని కని మీకు జన్మనిచ్చి మేం చేసిన తప్పా? మా పెంపకంలో లోపం ఉందా?" ఆదిలక్ష్మి అపరకాళికలా తన సంతానంపై విరుచుకుపడింది.
   
    మేఖల మౌనంగా లేచి లోపలకు వెళ్ళి డెట్టాల్ సీసా, కాటన్ తో బయటకు వచ్చి అభిరామ్ ఒంటిమీద అంటుకుపోయిన రక్తాన్ని తుడవ సాగింది నెమ్మదిగా.
   
    నిజానికి తనే ముందా పని చేయవల్సింది. పిల్లలు తప్పుదారిన వెళ్తున్నారేమోనన్న ఆందోళనా, భయంతో ఆదిలక్ష్మి ఓ క్షణం బాధపడింది.
   
    చిన్న చిన్న గాయాలు రక్తాన్ని స్రవించి ఎండిపోయాయి. ఆ ప్రాంతంలో చొక్కా అంటుకుపోయింది అభిరామ్ శరీరానికి మేఖల మరలా లోపలకు వెళ్ళి సిజర్ తీసుకొని వచ్చి వీలైన చోటల్లా చొక్కాని కత్తిరించసాగింది.
   
    "నా మానాన నేను ఇలా లొడలొడా వాగుతూనే వున్నాను. మీ మానాన మీరు మౌనంగా దెయ్యం పట్టిన వాళ్ళలా బిగుసుకుపోయారు. పిచ్చిదాన్నను కుంటున్నారా? సమాధానం చెప్పరేం?"
   
    తల్లిది కరుకు స్వభావం అని తెలుసు కానీ ఆ సమయంలో కూడా అంత దారుణంగా మాట్లాడుతుందని ఊహించలేదు మేఖల.
   
    "ఏం మాట్లాడాలి...? నీకు లొడ లొడా సందర్భం లేకుండా మాట్లాడటం అలవాటని నువ్వే చెప్పావు. మీ అమ్మ నీకు వసపోసింది గానీ నువ్వు మాకు పొయ్యటం మర్చిపోయావు. అందుకే మేం తక్కువ మాట్లాడతాం అయినా ఇపుడు నీతో మాట్లాడటం కన్నా తమ్ముడి గాయాలకు మందు రాయటం ముఖ్యం" అంది మేఖల తల తిప్పకుండా తమ్ముడికి శుశ్రూష చేస్తూ.
   
    ఆదిలక్ష్మి భద్రకాళిలా లేచింది. ఉక్రోషం, నిస్సహాయత ఆమెను నిలువెల్లా ఊపివేశాయి. విసురుగా ఓ అడుగు ముందుకేసి స్టూల్ మీద ఉన్న డెట్టాల్ సీసాను చేతిలోకి తీసుకొని విసురుగా గోడకేసి విసిరింది.
   
    అది భళ్ళున పగిలి డెట్టాల్ ఆ ప్రాంతమంతా చిందిపోయింది.
   
    ఆ పరిణామాన్ని ఎవరూ ఊహించలేదు.
   
    తల్లి ఉన్మాధపు చర్యకు అభిరామ్, మేఖల విస్తుపోయారు. అరుణాచలానికైతే మతిపోయింది.
   
    మేఖల కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
   
    అభిరామ్ తల్లికేసి చూస్తూ పళ్ళు పటపటా కొరికాడు.
   
    "క్షతగాత్రుడైన వ్యక్తి శత్రువైనా కళ్ళెదుట ఉంటే గాయాలకు మందు రాయాలనే మానవత్వమున్న ఖర్మభూమి మనది. కన్నతల్లివై ఉండి ఇంత నిర్దయగా ఎలా ప్రవర్తించావమ్మా?" కళ్ళనీళ్ళ పర్యంత మవుతూ ప్రశ్నించింది మేఖల.
   
    "ముందు వాడు చేసింది తప్పని మీ ఇద్దరూ ఒప్పుకోండి" అంది కోపంగా ఆదిలక్ష్మి.
   
    "నేను చేసింది తప్పుకాదు" విసురుగా అన్నాడు అభిరామ్.
   
    "నువ్వాగు తమ్ముడూ... తమ్ముడు చేసింది ముమ్మాటికి తప్పుకాదు. ఎవరో రౌడీ వెధవలు దౌర్జన్యంగా చందాలు వసూళ్ళు చేయడానికి రావటమే అసలు తప్పు.....అలాంటి పరిస్థితుల్లో, పౌరుషం, ఆత్మాభిమానం ఉన్న ఎవరైనా తమ్ముడు చేసిన పనినే చేసేవాళ్ళు అసలలా చేయకుండా వస్తేనే తమ్ముడు తప్పు చేసినట్లయ్యేది" మేఖల విసురుగా లేచి నించుంటూ అంది.
   
    భార్యా బిడ్డల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరగటం అరుణాచలానికి మనస్తాపం కలిగించింది. అలా అని వారి మధ్యకెళ్ళి అడ్డుకోలేని నిస్సహాయత కూడా అతన్ని ఆవరించింది.
   
    "మనమెంత? మన స్థాయి ఎంత? మనం అలాంటివాళ్ళతో విరోధం పెంచుకోవచ్చా?"

 Previous Page Next Page